వ్యభిచారం స్కాండల్ లో ఒబామా సెక్యూరిటీ సిబ్బంది


Obamaఒబామా భద్రత కోసం విదేశాల్లో విధులు నిర్వహించడానికి పోయి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒబామా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహారం ఇది. శని, ఆదివారాల్లో కొలంబియాలోని కార్టాజినా నగరంలో అమెరికా రాజ్యాల సంస్ధ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్ -ఓ.ఏ.ఎస్) సమావేశాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన ముప్ఫైకి పైగా దేశాల ప్రధాన మంత్రులు, అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు. వారిలో ఒబామా ఒకరు. ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. దానితో 12 మంది సిబ్బందిని అమెరికాకి తిరిగి పంపించేశారు.

అమెరికా అధ్యక్షుడు విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నపుడు, అసలు పర్యటనకి చాలా ముందుగానే భద్రతా సిబ్బంది అక్కడికి వెళ్లిపోతారు. తమ అధ్యక్షుడి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపైన అక్కడ దేశాల భద్రతా వ్యవస్ధలతో కలిసి పని చేస్తారు. అలా కొలంబియాకి వెళ్ళినవారిలో పన్నెండు మందిని అమెరికాకి తిప్పి పంపేశారు. సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలోనే వ్యభిచార స్త్రీలతో వ్యవహారం నడుపుతూ దొరికిపోవడంతో వెనక్కి పంపారని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ‘వ్యక్తిగత దుష్ప్రవర్తన’ కారణంగా ఒబామా భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారని ‘గార్డియన్’ పత్రిక తెలిపింది.

అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్ధ వ్యభిచార ఆరోపణలను తిరస్కరించలేదని ‘అసోసియేటెడ్ ప్రెస్’ తెలిపింది. ఎంతమందిని వెనక్కి పంపారన్నదీ ఈ సంస్ధ చెప్పలేదు. కానీ ఒక అమెరికా అధికారి డజను మంది అని  చెప్పినట్లు ‘గార్డియన్’ తెలిపింది. పన్నెండు మంది స్ధానంలో వేరే సిబ్బందిని రప్పించామనీ, ఈ వ్యవహారం వల్ల భద్రతకేమీ ముప్పు లేదనీ అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్ధ ప్రతినిధి ఎడ్విన్ డొనోవాన్ తెలిపాడు. అమెరికా ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ ఆడ్లర్ ప్రకారం పన్నెండు మందిలో కనీసం ఒకరు కార్టాజినా వ్యభిచార స్త్రీలతో దొరికినట్లు తెలిపాడని ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు రాయబారులు జోక్యం చేసుకోవలసినంత తీవ్రమైనవిగా ఫాక్స్ న్యూస్ ద్వారా తెలుస్తోంది.

ఒ.ఎ.ఎస్ సమావేశాల్లో ఒబామా ఆత్మ రక్షణ లో పడవచ్చని గార్డియన్ తెలిపింది. దానికి కారణం సెక్యూరిటీ సిబ్బంది వ్యవహారం కాదు. సదస్సులో చర్చించనున్న అంశాలకు సంబంధించి ఒబామా ఆత్మ రక్షణలో పడనున్నాడని ఆ పత్రిక తెలిపింది. దానికి కారణం డ్రగ్స్ సేవనాన్ని చట్టబద్ధం చేయడానికి ఒబామా ప్రతిపాదించడమేనట. ఒబామా ప్రతిపాదనను ఆయన పాలనా వ్యవస్ధ వ్యతిరేకిస్తున్నదని పత్రిక తెలిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు పత్రిక చెప్పలేదు. ఈ అంశంతో పాటు ఒ.ఎ.ఎస్ సదస్సు నుండి క్యూబాను మినహాయించాలని అమెరికా ఒత్తిడి చేస్తుండడం, అర్జెంటీనాకు సమీపంలోని ఫాక్ ల్యాండ్స్ ద్వీప కల్పం తమదేనన్న బ్రిటన్ అసంబద్ధ వాదనలను అమెరికా మద్దతు ఇస్తుండడం, బ్రిటన్ వాదనలను దాదాపు లాటిన్ అమెరికా దేశాలన్నీ వ్యతిరేకించడం… ఒబామా ఆత్మ రక్షణలో పడనుండడానికి కారణాలని గార్డియన్ తెలిపింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s