చూడబోతే వీళ్లకి మన హోళీ పండగే స్ఫూర్తి లాగుంది. ఎక్కడంటే అక్కడ స్కేటింగ్ చేసేస్తూ అందులో రంగుల్ని మిళితం చేశారు. నిజానికి ఇక్కడ స్కేటింగ్ అన్నది అప్రధానం. రంగుల హోళీ యే ప్రధానం. ఒంటి నిండా పొడి రంగులు నిలవ చేసుకుని ఎత్తు పల్లాల దగ్గర స్కేటింగ్ చేయడం ద్వారా ఆ రంగుల్ని గాలిలోకి వెదజల్లుతూ హోళీని స్ఫురింప జేశారు. వీరు చేస్తున్నది హోళీయో కాదో తెలియదు గానీ మనకు తెలిసింది అదే గనుక ‘హోళీ’ అనే అనుకుందాం. ప్రకృతిలో వివిధ సమయాల్లో ఏర్పడే వెలుతురు రంగులతో హోళీ రంగులని సింక్రనైజ్ చేసిన విధానం అద్భుతంగా కనిపిస్తోంది ఈ వీడియోలో. సముద్రంలో లేదా నీళ్లలో వివిధ చోట్ల ఉండే రంగుల తేడాలను కూడా వీళ్లు తమ రంగుల సంబరంతో పోటీ పెట్టారు. నీరెండ, సాయం సంధ్య లాంటి ప్రకృతి దృశ్యాలతో కూడా వీరి సంబరం పోటీ పడుతోంది. వీడియోను ఆసాంతం చూస్తే ఈ సంగతి అర్ధం అవుతుంది. వీడియోకి విజర్డ్ స్మోక్ అని పేరు పెట్టడమే పెద్దగా నప్పలేదు. మన హోళీ పండగతో పోల్చుకోవడం వల్ల నప్పలేదేమో లెండి.
–
