కొరియా స్లమ్ డాగ్ సింగర్ -వీడియో


చొయి సంగ్ బాంగ్. ఇప్పుడొక ఇంటర్నేషనల్ సెన్సేషన్. ‘కొరియాస్ గాట్ టాలెంట్’ షో లో అద్బుత ప్రతిభ కనబరిచి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన యువకుడు. నైట్ క్లబ్ లో పాటలు విని స్ఫూర్తి పొంది తనకు తాను పాడడం నేర్చుకున్నాడు. కష్టం చేసి సంపాదించిన డబ్బుతో అప్పుడప్పుడూ మ్యూజిక్ క్లాసులకు హాజరయ్యి తన ప్రతిభకు సాన పెట్టుకున్నాడు. టాలెంట్ షో లో ఫైనల్స్ చేరుకుని రెండవ స్ధానం సంపాదించాడు. అనాధగా తీవ్ర కష్టాల్లో పెరిగిన నేపధ్యం ఉన్నప్పటికీ అద్భుత ప్రతిభ కనబరచి కొరియాలో సంచలనం రేపాడు.  ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ఇంటర్నెట్ లో పోస్టయిన ఈ వీడియో అతనికి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది.

మూడేళ్ల వయసులోనే అతని తల్లిదండ్రులు అనాధాశ్రమంలో చేర్చారనీ, ఆశ్రమంలో కొడుతుండడంతో పారిపోయి వచ్చాననీ చొయి చెప్పాడు. చూయింగ్ గమ్, డ్రింక్సు అమ్ముతూ పది సంవత్సరాలు పొట్ట పోసుకున్నాననీ పని చేసుకుంటూ చదువుకున్నాననీ, పబ్లిక్ లెట్రిన్ లలో మాన్యువల్ లేబర్ చేస్తూ పోటీల్లో పాల్గొంటున్నాననీ చెప్పాడు. ఈ వీడియో చూశాక జాతీయ, అంతర్జాతీయ పత్రికలు అతని గతాన్ని ఆరా తీసాయి. ప్రఖ్యాత పత్రికలు అతని ఇంటర్వ్యూలు ప్రచురించాయి.

జపాన్ తర్వాత ఆ స్ధాయిలో అభివృద్ధి చెందిన చిన్న దేశంగా పేరు సంపాదించిన దక్షిణ కొరియాలో ఇంకెంత మంది చొయి లు ఉన్నారో తెలియదు. సంగీత ప్రతిభతో చొయి సంగ్ బాంగ్ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించాడు. రెక్కల కష్టం తప్ప ఏ ప్రతిభా లేకుండా కష్టాల్లోనే బతుకుతూ చస్తున్న కోట్లాది ‘చొయి’ లకు వ్యవస్ధలు ఏ సమాధానం చెబుతాయి?  దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తూ అత్యంత తక్కువ ఖరీదుకి పని చేసే కోట్లాది ‘చొయి’ లే సంపదల సృష్టికి మూలం అన్నది నిర్వివివాదాంశం.

వ్యాఖ్యానించండి