చపల చిత్తమా, సృజన చిత్తమా ఈ కళాకృతులు? -ఫొటోలు


“బ్రెజిల్ కళాకారుడు ‘హెన్రిక్ ఒలివీరా’ కి తన కళను ప్రదర్శించే గ్యాలరీల గోడలంటే ఏ మాత్రం గౌరవం లేనట్టుంది. లేకుంటే తన బుర్రను చీల్చుకు వచ్చిన అవుడియాల కోసం ఈ రకంగా గోడల్ని చీల్చేస్తాడా? తన చిత్తానికి తగ్గట్లు మెలికలు తిరుగుతూ నేలనీ, గోడల్నీ, పై కప్పుల్నీ తొలిచేలా  చెట్లను శాసించడానికి ఈయనకి మానవతీత శక్తులేవో ఉన్నట్లున్నాయి మరి.”

ఒలివీరా ‘సావొ పోలో’ లో విద్యార్ధిగా ఉన్నపుడు తన గది బయట ప్లై వుడ్ తో చేసిన కంచె ఉండేదిట. రోజులు గడిచిన కొద్దీ అది పొరలు పొరలుగా చీలిపోయి తనదైన రంగులతో కనిపించేదిట. అదిగో ఆ అనుభవాన్ని ఇలా రంగరించేశాడు. ప్లై వుడ్ కంచెని కూల్చేశాక వాటిని తెచ్చి ఇలా గ్యాలరీని నింపాడు. ప్లై వుడ్ పొరలతో పి.వి.సి పైపులను చుట్టి తనకు కావలసిన షేపుల్ని తయారు చేసుకున్నాడు. అప్పటికే చిట్లిపోయి, చీలి పోయి క్షీణ దశలో ఉన్న ‘వుడ్’ ని, క్షీణ దశలో ఉన్న నగర జీవితానికి ప్రతీకాత్మకంగా ఉపయోగించాడు.

నేటి నగర జీవనం సారం కోల్పోవడం గమనిస్తూనే ఉన్నాం. అది తన భావోద్వేగాలను అంగట్లో సరుకుగా మార్చుకుంది. కర స్పర్శలతో, నవ్వులతో, ఏడ్పులతో, అలకలతో, హామీలతో మానవ సంబంధాల్ని సజీవం చేసుకోవలసి ఉండగా… ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య భూమికి దూరంగా గాల్లో తేలి వచ్చే బిట్లు గా మార్చుకుంది. ఇంకేముంది? నవ్వొచ్చినా  ఏడుపొచ్చినా, కోపగించాలన్నా అలిగి సాధించాలన్నా అన్నింటినీ బిట్లూ, బైట్లుగా విడగొట్టి గాల్లోకి ఎగరేయాల్సిందే.

వ్యాఖ్యానించండి