14 వ సారి పేలిపోయిన ఈజిప్టు-ఇజ్రాయెల్ ఆయిల్ పైప్ లైను


Egypt-Israel gas pipelineఈజిప్టు ప్రజలు మరోసారి తమ దేశం నుండి ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా చేసే పైప్ లైన్ ను పేల్చేశారు. అమెరికా బలవంతంతో మార్కెట్ ధరల కంటే తక్కువకు తమ బద్ధ శత్రువుకి ఆయిల్ సరఫరా చేయడాన్ని వారు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామిక తిరుగుబాటు ఫలితంగా నియంత హోస్నీ ముబారక్ గద్దె దిగాక ఇప్పటికీ 13 సార్లు ఆయిల్ పైప్ లైన్ ను పేల్చేశారు. హోస్నీ బుమారక్ ను గద్దె  దింపినప్పటికీ అమెరికా కు అనుకూలమైన మిలట్రీ ప్రభుత్వమే ఈజిప్టులో ఇంకా పెత్తనం సాగిస్తోంది. దానితో ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా చేయరాదన్న ఈజిప్టు ప్రజల కోరిక నెరవేరలేదు.

ఈజిప్టు కు చెందిన సినాయి ద్వీప కల్పం గుండా వెళ్ళే ఆయిల్ పైపు ద్వారా ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా అవుతుంది. మధ్యధరా సముద్రం ముఖద్వారం లో ఉండే కోస్తా పట్నం ‘ఆల్-ఆరిష్’ లో పైప్ లైన్ ను పేల్చేశారు. ఫిబ్రవరి 5 న ఇదే చోట పైప్ లైన్ ను పేల్చారు. గత వారంలోనే దానికి మరమ్మతులు పూర్తి చేసి ఆయిల్ సరఫరాను పునరుద్ధరించారు. ఈలోగానే మరొకసారి ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా ఆగిపోయింది. పేలుడుకు బాధ్యులుగా ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.

గత సంవత్సరం అక్టోబరులో ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా చేయడంపై ఈజిప్టులో సర్వే జరిగింది. ప్రెస్ టి.వి తరపున సినోవేట్ సంస్ధ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో అత్యధిక శాతం ప్రజలు ఇజ్రాయెల్ ఆయిల్ ఒప్పందాన్ని తిరస్కరించారు. అసమాన నిబంధనలతో కుదిరిన ఒప్పందం తమకు సమ్మతం కాదని మెజారిటీ ప్రజలు తెలిపారు. ఇజ్రాయెల్ కి గ్యాస్/ఆయిల్ ఎగుమతులు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని 73 శాతం ప్రజలు చెప్పగా కేవలం 9 శాతం మాత్రమే సమర్ధిస్తున్నట్లు తెలిపారు. 12 శాతం మంది ఏ అభిప్రాయమూ చెప్పలేదు.

ఇజ్రాయెల్ కి గ్యాస్, ఆయిల్ సరఫరా చేయడం అన్నది ఈజిప్టు ప్రజలకు భాగోద్వేగాలతో కూడుకున్న అంశం. తమ అరబ్ సోదరులను గాజా లో అష్ట కష్టాలు పెడుతున్న ఇజ్రాయెల్ కి తక్కువ ధరకు తమ ఆయిల్ అమ్మడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. పాలస్తీనా అరబ్బుల భూభాగాన్ని లాక్కొని వారిని చుట్టూ పక్కల దేశాలకు తరిమి కొట్టిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని వ్యతిరేకించడం మాని చౌకగా తమ సహజ వనరును ఇవ్వడం తమకు సమ్మతం కాదని అనేకసార్లు ఆందోళనల ద్వారా తెలిపినప్పటికీ వాటిని హోస్నీ ముబారక్ కర్కశంగా అణచివేశాడు.

1967 అరబ్ యుద్ధంలో ఈజిప్టు భూభాగం ‘సినాయ్’ ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈజిప్టు ఇజ్రాయెల్ ల మధ్య వినాశకరమైన శాంతి ఒప్పందం కుదిరింది. ఇది పూర్తిగా అసమాన ఒప్పందం. ఈజిప్టు ప్రజల హక్కు అయిన ఆయిల్ వనరులను ఇజ్రాయెల్ కి చౌకగా కట్టబెడుతూ జరిగిన ఒప్పందం హోస్నీ ముబారక్ నియంతృత్వ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సహాయం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కి చౌకగా ఆయిల్ ఇవ్వాలని అమెరికా నిర్దేశించింది. ఈజిప్టు ఇజ్రాయెల్ సంబంధాలలో, ఈజిప్టు ప్రజలకు సంబంధించి, ఈ ఒప్పందం ఇప్పటికీ అత్యంత వివాదాస్పదమయినదిగా స్ధిరపడింది. అరబ్ భూభాగాలను ఆక్రమించుకుని, అమెరికా, బ్రిటన్ లు ఏర్పరచిన ఇజ్రాయెల్ దేశాన్ని తమ ఆజన్మ శత్రువుగా అరబ్ దేశాల ప్రజలు భావిస్తారు. కానీ అమెరికా అడుగులకు మడుగులోత్తే అరబ్ లోంగుబాటు పాలకులు తమ ప్రజల ఆకాంక్షలకు పూర్తి భిన్నంగా జాత్యహంకార ఇజ్రాయెల్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు.

వ్యాఖ్యానించండి