రష్యన్ నేవీ కి చెందిన యుద్ధ నౌక సిరియా ఓడ రేవు కి బయలుదేరినట్లు రష్యా మిలట్రీ అధికారులు తెలిపారు. గత వారాంతంలో నల్ల సముద్రంలోని సేవాస్టోపోల్ స్ధావరాన్ని డిస్ట్రాయర్ వదిలి వెళ్లిందని వారు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని సిరియా ఓడరేవు ‘టార్టస్’ కు అది మరి కొద్ది రోజుల్లో చేరుకుంటుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ‘మిలట్రీ డ్రిల్లు’ లో ‘డిస్ట్రాయర్’ పాల్గొంటుందని రష్యా మిలట్రీ ని ఉటంకిస్తూ ‘డి డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది.
సిరియాలో టార్టస్ రెండవ పెద్ద ఓడ రేవు. మధ్యధరా సముద్రంలో ఈ ఒక్క ఓడరేవును మాత్రమే రష్యా వినియోగిస్తుంది. గత జనవరిలో డిస్ట్రాయర్ ద్వారానే సిరియా ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేసిందని వార్తలు వచ్చాయి. టార్టస్ ఓడరేవును రష్యా లీజుకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
“ఇది కేవలం సాంకేతికమే. మధ్యధరా సముద్రంలో మిలట్రీ డ్రిల్లు నిర్వహించే దాదాపు అన్నీ యుద్ధ నౌకలూ ఇలా టార్టస్ కి వెళ్ళి వస్తుంటాయి” అని రష్యన్ నేవీ అధికారి చెప్పాడని ప్రెస్ టి.వి తెలిపింది. ‘డిస్ట్రాయర్’ ప్రయాణపు ప్రాముఖ్యతను తక్కువ చేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది.
అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు ప్రవాస సిరియన్ నాయకుల సాయంతో సిరియాలో కిరాయి తిరుగుబాటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ సభ్య దేశాలైన ఆరు గల్ఫ్ దేశాలు వారికి సహకరిస్తున్నాయి. అమెరికా, యూరప్ ల ప్రయత్నాలను రష్యా, చైనాలు వ్యతిరేకిస్తున్నాయి. సిరియా ఆ రెండు దేశాలకు మిత్ర దేశం కావడమే దానికి కారణం. లిబియాపై హంతకదాడులను సమర్ధించిన రష్యా, చైనాలు గడ్డాఫీ హత్య తరువాత లిబియాలో వ్యాపార, వ్యూహాత్మక ప్రయోజనాలు కోల్పోయాయి. దానితో సిరియా జోక్యానికి అవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
సిరియాను దురాక్రమించి తమ కీలు బొమ్మలను నిలపడంలో అమెరికా, యూరప్ లు సఫలం అయినట్లయితే రష్యా, చైనాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో వారికిక పుట్టగతులు ఉండడకపోవచ్చు. చైనా ఆర్ధిక వృద్ధికీ, ఆయిల్ ప్రయోజనాలకూ తీవ్ర ఆటకం ఏర్పడుతుంది. అందువల్లనే సిరియా ను కాపాడుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి.
అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ఆర్ధిక ప్రచ్చన్న యుద్ధంలో సిరియాకు వ్యూహాత్మకంగా ప్రముఖ స్ధానం ఉంది. చైనా ఆర్ధిక వృద్ధి ని ఆటంకపరచడానికి ప్రచ్చన్న యుద్ధానికి అమెరికా తెర తీసింది. మిలట్రీ బలం లేని చైనా, తన ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలపై కేంద్రీకరించినంతగా మిలట్రీ బలం పెంచుకోవడంలో కేంద్రీకరించలేదు. అమెరికా ప్రారంభించిన ‘చైనా వ్యతిరేక ఆర్ధిక ప్రచ్చన్న యుద్ధం’ లో చైనాకు సిరియా మొదటి పరీక్షగా భావించవచ్చు. చైనా చుట్టూ ఉన్న అమెరికా సైనిక స్ధావరాలు చైనా వ్యాపార ప్రయోజనాలను ఆటంకపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.