స్పెయిన్ లో కొత్తగా ఎన్నికయిన కన్జర్వేటివ్ పార్టీల ప్రభుత్వం విద్యార్ధుల ‘చదువు’ కి సంకెళ్లు వేయడం ద్వారా చైతన్యాన్ని అరికట్టాలని చూస్తోంది. అప్పులు చేసి కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లను ప్రజలనుండి వసూలు చేయడానికి దుర్మార్గమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేస్తుండడంతో స్పెయిన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. కార్మికులు, ఉద్యోగుల వేతనాల రూపంలో ప్రజలపై పెడుతున్న ఖర్చులో అక్కడి ప్రభుత్వం ఏకంగా 27 బిలియన్ యూరోలు (36 బిలియన్ డాలర్లు) కోతపెడుతూ రెండు రోజుల క్రితమే బడ్జెట్ ఆమోదించింది. రుణ సంక్షోభంలో ఉన్న స్పెయిన్ కి సాయం చేస్తున్న పేరుతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించిన విషమ షరతుల వల్ల ఈ కోతలు అమలవుతున్నాయి.
ఈ నేపధ్యంలో స్పెయిన్ లో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పొదుపు విధానాలకు వ్యతిరేకంగా గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రజల సమస్యలను ఆలకించడానికి బదులు ప్రభుత్వం వారిపై క్రూర నిర్బంధం అమలు చేస్తోంది. లాఠీచార్జీ, అరెస్టులు నిత్యకృత్యం అయ్యాయి. నిర్బంధ చట్టాలు ప్రయోగించి జైళ్లలో కుక్కుతోంది. ఇవన్నీ చాలక విద్యారంగంలో విద్యార్ధుల చైతన్యంపై ఉక్కుపాదం మోపుతోంది. హైస్కూల్ సిలబస్ లో మానవ హక్కులు, మానవ సంబంధాలు మున్నగు అంశాలను బోధించే ‘సిటిజన్ షిప్ ఎడ్యుకేషన్’ అనే సబ్జెక్టును పూర్తిగా రద్దు చేసేసింది. ఆందోళలనలో విద్యార్ధుల పాత్ర అంతకంతకూ పెరుగుతుండడంతో వారి విజ్ఞానాన్ని కత్తిరించడానికి పూనుకుంటోంది.
‘సిటిజన్ ఎడ్యుకేషన్’ సబ్జెక్టు ను రద్దు చేయడానికి నిరసనగా, వెలన్షియా పట్టణంలో విద్యార్ధుల ప్రదర్శనలపై పోలీసుల నిర్భంధాన్ని వ్యతిరేకిస్తూ స్పెయిన్ వీధి చిత్రకారుడు ఎక్సిఫ్ గీసిన వీధి చిత్రమిది.
–

