ఎన్నికల సంవత్సరంలో బారక్ ఒబామాకి నిరుద్యోగులకీ, అభిమానులకీ తేడా తెలియడం లేదు. భారత దేశంలో లాగానే పశ్చిమ దేశాల్లో కూడా ఎన్నికలు దగ్గర్లో ఉన్నపుడు కంపెనీలకు అనుకూలమైన విధానాలు మానేసినట్లూ, ప్రజల ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉన్నట్లూ పాలకులు నాటకాలాడతారు. నిన్నటిదాకా సిరియాలో జోక్యం కోసం ఉవ్విళ్లూరిన ఒబామా అర్జెంటుగా కోఫీ అన్నన్ ని పంపి సిరియా అధ్యక్షుడు అస్సాద్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది అందుకే. ఇరాన్ విషయంలో ‘ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ ది టేబుల్’ అంటూ యుద్ధానికి కాలుదువ్వి ఇప్పుడు ఐ.ఎ.ఇ.ఎ లో చర్చించుతానంటున్నాడు. కొద్ది నెలలుగా అమెరికా నిరుద్యోగం హఠాత్తుగా తగ్గుముఖం పట్టడం కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నవారూ లేకపోలేదు.
గత ఆగస్టులో 9.1 శాతం నిరుద్యోగం ఉంటే ఫిబ్రవరి 2012 లో 8.3 కి తగ్గిందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. అంటే మొత్తం 1.28 కోట్లు అమెరికాలో నిరుద్యోగులుగా ఉన్నారు. పాక్షిక నిరుద్యోగులు, ఉద్యోగాలు దొరక్క తక్కువవేతనాలతో సరిపెట్టుకుంటున్న వారూ ఇందులో లేరు. పురుషుల్లో 7.7% స్త్రీలలో 7.7% నిరుద్యోగం ఉంటే టీనేజర్లలో 23.8% నిరుద్యోగం ఉంది. తెల్లవారిలో తక్కువగా 7.3% నల్లవారిలో అందరికంటే ఎక్కువగా 14.1%, హిస్పానిక్కుల్లో 10.7% నిరుద్యోగులు ఉండగా ఆసియన్లలో 6.3 శాతం నిరుద్యోగం ఉంది. దీర్ఘ కాలంగా (27 వారాల పైన) నిరుద్యోగులుగా ఉన్నవారి సంఖ్య 54 లక్షల పై చిలుకు. నిరుద్యోగుల్లో వీరి భాగం 42.6 శాతం.
