2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50,285.90 కోట్ల విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి – కాగ్) జరిపిన ఆడిట్ లో తేలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల దాడి నుండి తప్పించుకోవడానికి, పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్ధలో ప్రజా వ్యతిరేక అవినీతి చర్యలను స్క్రూటినీ చేసేందుకు అసెంబ్లీకి గల శక్తిని నిర్వీర్యం చేస్తూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల చివరి రోజుల కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది.
ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాపితంగా 50 వేల కోట్ల విలువ గల భూములు అన్యాక్రాంతం అయ్యాయని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇందులో కడప జిల్లాల్లో అత్యధికంగా రు. 16.388 వేల కోట్ల భూములు గల్లంతు కాగా, అనంతపూర్ జిల్లా రు. 10,853 కోట్ల భూముల గల్లంతుతో రెండవ స్ధానంలో ఉండి. గుంటూరు, రంగా రెడ్డి, నెల్లూరు, శ్రీకాకుళం తదితర జిల్లాలలో కూడా వేల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అయ్యాయి.
కాగ్ ఆడిట్ జరిపిన ఐదు సంవత్సరాలలో 2006 – 2009 మధ్య కాలంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, 2009 సెప్టెంబరు నుండి నవంబరు 2010 వరకు 15 నెలలపాటు రోశయ్య ముఖ్య మంత్రిగా పాలించాడు. అప్పటినుండీ ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాం కొనసాగుతూ వచ్చింది. ఈ ముగ్గురి పాలనలోనూ భూ కేటాయింపులలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. భూముల కేటాయింపులు ప్రధానంగా రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగినప్పటికీ అప్పటి నిర్ణయాలను తదుపరి ముఖ్యమంత్రులు కొనసాగించారు. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమ కేటాయింపులను రద్దు చేయడానికి గానీ, సరి చేయడానికి గానీ వారు పూనుకోలేదు.
కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఆర్ధిక పరమైన ఆస్తులకు సంబంధించిన చట్టాలను, నిర్దేశిత విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో పూర్తిగా విస్మరించిందని తలంటింది. భూముల అన్యాక్రాంతంలో తీవ్రస్ధాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ తేల్చింది. తాత్కాలిక ప్రాతిపదికన, యధేచ్చగా, విచ్చలవిడిగా ప్రవేటు వ్యక్తులకు, ప్రవేటు సంస్ధలకు, అత్యంత తక్కువ ధరలకు భూములు పందేరం పెట్టారని వెల్లడించింది. భూముల పందేరంలో రాష్ట్ర ప్రజల ఆర్ధిక భావితవ్యాన్నీ, సామాజికార్ధిక ప్రయోజనాలను పరి రక్షించడంలో విఫలం అయ్యారని పేర్కొన్నది.
ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న 88,492 ఎకరాల భూములను అప్పనంగా పంచి పెట్టిందని కాగ్ నివేదిక తెలిపింది. 1,027 మంది ప్రవేటు వ్యక్తులకు, సంస్ధలకు వివిధ కారణాలతో భూములు అప్పగించిందని తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధి, పోర్టుల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం మున్నగు పేర్లతో ఈ కేటాయింపులు జరిపిందని తెలిపింది. 11 జిల్లాలలో 60 కేసులను శాంపిల్ గా చెక్ చేయగా ఆ కేసుల్లో 2,559 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వానికి చెల్లించబడలేదని కాగ్ తెలిపింది. ఇందులో ఒక్క హైద్రాబాద్ కి సంబంధించిన కొద్ది కేసుల్లోనే రు. 1,183 కోట్లు రాబట్టడంలో విఫలమయ్యారని తెలిపింది. మిగిలిన 967 కేసుల్లో ఇంకెంత ప్రభుత్వ సొమ్ము గోల్ మాల్ అయిందో రాష్ట్ర ప్రజలకు తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల సంస్ధ ఏ.పి.ఐ.ఐ.సి ని కూడా కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. దీని ద్వారా 34,000 వేల ఎకరాల భూముని పరిశ్రమల అభివృద్ధి పేరుతో ప్రవేటు వ్యక్తులు, సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని కాగ్ వెల్లడించింది. పరిశ్రమల అభివృద్ధి కోసమని భూములు కేటాయించినప్పటికీ వాస్తవంగా పరిశ్రమలు నెలకొల్పేలా చేయడంలో ఏ.పి.ఐ.ఐ.సి విఫలమయిందని పేర్కొంది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను ప్రవేటు వ్యక్తులు, సంస్ధలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ఏ.పి.ఐ.ఐ.సి అనుమతి ఇచ్చిందని కాగ్ దుయ్యబట్టింది. ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మౌలిక సౌకర్యాలు నిర్మించి ఉపాధి సౌకర్యాలు పెంచాలన్న దాని ప్రకటిత లక్ష్యాన్ని తానే అపహాస్యం చేసిందని నిందించింది.
వందల ఎకరాల భూములను స్పెషల్ ఎకనామిక్ జోంలకూ, ఐ.టి/పారిశ్రామిక పార్కులకు కేటాయించినప్పటికీ సదరు కేటాయయింపుల లక్ష్యం ఎక్కడా నెరవేరలేదని కాగ్ తెలిపింది. 11 సెజ్ లు / ఐ.టి పార్కులు అసలే ఉపాధి కల్పించలేదని తెలిపింది. 5.93 లక్షల ఉద్యోగాలు సమకూరుతాయని చెప్పిన నాలుగు సెజ్ ల వల్ల ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఎత్తి చూపింది. 7 సెజ్ లు కేవలం 0.26 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించాయని తెలిపింది.
ప్రభుత్వ భూములు అనేకం ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదప లేదని కాగ్ తెలిపింది. అక్రమ ఆక్రమణలను అరికట్టడానికి తగిన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం 14,878 ఎకరాల అక్రమ ఆక్రమణలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా తానే ఆక్రమణలను ప్రోత్సహించిందని కాగ్ దుయ్యబట్టింది. 21 లక్షల చదరపు అడుగుల స్ధలాలను రెగ్యులరైజ్ చేసి కేవలం రు.63.71 కోట్ల రెవిన్యూ మాత్రమే రాబట్టిందని తెలిపింది.
రాష్ట్ర ప్రబ్బుత్వమ్ జరిపిన భారీ అక్రమ కేటాయయింపులలో బ్రహ్మణి ఇండస్ట్రీస్ ప్రవేట్ లిమిటెడ్ కి జరిగిన 10,760.66 ఎకరాల కేటాయింపు అని కాగ్ తెలిపింది. ఓబులాపురం ఇనుప గనులను బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కోసమే రాజశేఖర రెడ్డి, గాలి జనార్ధనరెడ్డికి అప్పజెప్పిన సంగతి తెలిసిందే. బ్రహ్మణి స్టీల్ కోసమే ఓబుళాపురం ఇనుపఖనిజాన్ని వినియోగించవలసి ఉండగా గాలి జనార్ధన రెడ్డి విలువయిన సహజ వనరును విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. అనుమతులు సంపాదించేటపుడు కాప్టివ్ (నిర్దేశిత అవసారం కోసమే వినియోగించాలన్న నిబంధనను ఈ పదం సూచిస్తుంది) అన్న పదాన్ని ఉంచినప్పటికీ గనులను కేటాయిస్తూ జారీ చేసిన జి.ఓ లో మాత్రం ఆ పదాన్ని తొలగించడం ద్వారా రాజశేఖర రెడ్డి అక్రమానికి పాల్పడ్డాడు. కాప్టివ్ పదం లేకపోవడంతో గాలి జనార్ధన రెడ్డి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేశాడు. ఆ పని చేసినందుకు గాలి నుండి జగన్ కంపెనీలు లబ్ది పొందాయని సి.బి.ఐ ఆరోపిస్తున్నది. ఈ అక్రమంలో ‘కాప్టివ్’ పదం లేకుండా జి.ఓ జారీ చేయడంలో రాజశేఖర రెడ్డికి సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీలక్ష్మి సహరించిందని సి.బి.ఐ ఆరోపించింది. గ్రీన్ ఫీల్డ్ ఇంటెగ్రెటేడ్ స్టీల్ ప్లాంట్ స్ధాపన కోసం కేటాయించిన పది వేల ఎకరాల భూమిలో ఫ్యాక్టరీ స్ధాపన కోసం ఏ మాత్రం కృషి జరగలేదు. కనీస యంత్ర సామగ్రి కూడా అక్కడ లేదని పత్రికలు అనేకసార్లు వెల్లడించాయి. స్టీల్ ఫ్యాక్టరీ కోసం 674.58 ఎకరాల నీటివనరులున్న భూములు అక్రమంగా అన్యాక్రాంతం అయ్యాయని కాగ్ వెల్లడించింది. గండికోట రిజర్వాయర్ నుండి 2 టి.ఎం.సి ల నీటిని బ్రహ్మణికి కేటాయయించారని కాగ్ తెలిపింది.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో అనంతపురం జిల్లాలో 8,844.01 ఎకరాల భూముని ఏ.పి.ఐ.ఐ.సి అక్రమంగా కేటాయయించిందని కాగ్ వెల్లడించింది. నాలెడ్జి హబ్ కి సంబంధించిన మౌలిక సౌకర్యాలు ఏమీ కల్పించక ముందే అమ్మకపు పత్రాలను ఏ.పి.ఐ.ఐ.సి అక్రమంగా జారీ చేసిందని తెలిపింది. ఫలితంగా లేపాక్షి నాలెడ్జి హబ్ 4,397 ఎకరాలను తనఖా పెట్టి బ్యాంకుల నుండి రు.790 కోట్లు రుణంగా పొందిందని కాగ్ తెలిపింది. ఇది కాక రంగా రెడ్డి జిల్లా, మామిడిపల్లి గ్రామంలో 881.32 కోట్ల రూపాయల భూములను అన్యాక్రాంతం చేసి రు.874.03 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ.పి.ఐ.ఐ.సి నష్టం తెచ్చిందని కాగ్ తెలిపింది.
కాగ్ వెల్లడించిన అక్రమాలు నిజానికి ఇప్పటికే పత్రికల్లో అనేకసార్లు వెల్లడయ్యాయి. పత్రికల వార్తలు అక్షర సత్యాలని కాగ్ నివేదిక నిర్ద్వంద్వంగా రుజువు చేస్తున్నది. ఈ అక్రమాలలో ప్రధాన లబ్దిదారుగా ఉన్న వై.ఎస్.జగన్ పైన సి.బి.ఐ విచారణ జరుగుతున్నప్పటికీ ఆయన ఇంతవరకు అరెస్టు కాలేదు. విచ్చలవిడి అవినీతితో రాత్రికి రాత్రి బిలియనీర్ గా మారిన జగన్ కి రాష్ట్ర ప్రజానీకం ఎన్నికల్లో విజయాలు కట్టబెడుతుండడం ఒక వైపరీత్యం. అక్రమ పద్ధతుల్లోనైనా సరే ఆస్తులు సంపాదించినవారికి ఆదరణ పెరుగుతుండడం సామాజిక విలువల పతనంగానే చూడవలసి ఉంది.
Evaru marchaleru janalani…..who makes more corruption are becoming heros(MAHA NETHALU) …..