స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే లోకంగా సమాధానం చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల చెంతకు చేరడాన్ని వారేమీ సిగ్గుపడక, తల్లిదండ్రులతో సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అమెరికా యువకులు చెబుతున్నారని “ప్యూ రీసెర్చ్ సెంటర్” జరిపిన సర్వే లో వెల్లడయింది.
అమెరికా ఆర్ధిక మాంధ్యం వల్ల అమెరికా యువత తమ ‘యౌవనావస్ధను’ (adolescence) కొనసాగించడానికీ, ‘పెద్దరికాన్ని’ (adulthood) ని వాయిదా వేసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారని సర్వే తెలిపింది. ప్రతి 10 మంది యౌవన పెద్దల్లో (young adults) ముగ్గురు వివాహాన్నీ, కొత్తగా కుటుంబ జీవనాన్ని ప్రారంభించడాన్నీ, లేదా రెండింటినీ వాయిదా వేస్తున్నారని సర్వే తెలిపింది. వీరంతా తల్లిదండ్రులను వదిలి వెళ్లడాన్ని వాయిదా వేయడానికో లేదా బైటకి వెళ్ళినవారు తిరిగి తల్లిదండ్రులతో కలవడానికో నిశ్చయించుకున్నారని సర్వే తెలిపింది. 1950 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో యౌవన పెద్దలు తల్లిదండ్రులతో గడపడానికి నిశ్చయించుకోవడం ఇదే మొదటిసారని ప్యూ సర్వే తెలిపింది. మిగిలినవారిలో మరో ముగ్గురు మళ్ళీ చదువులో చేరడానికి ప్రయత్నించగా, మిగిలినవారు ఎంత హీనమైనా చేతికి అందిన ఉద్యోగంతోనో లేక నిరుద్యోగంతోనో సెటిల్ అవుతున్నారని తెలిపింది.
1980 లో యౌవన పెద్దల్లో (25-34 మధ్య వయస్కులు) 11 శాతం మంది తల్లిదండ్రులు, తాతా నాయనమ్మలతో కలిసి జీవిస్తుండగా, 2011 ముగిసేనాటికి వీరి సంఖ్య 29 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది. 18-24 మధ్య వయసు యౌవనుల్లో 53 శాతం మంది తల్లిదండ్రులతో నివసిస్తున్నారని తేలింది. అమెరికా ఆర్ధిక మాంద్యం తెచ్చిన కష్టాలే దీనికి కారణంగా ప్యూ సర్వే తెలిపింది. తీవ్రమవుతున్న నిరుద్యోగం, అతి తక్కువ వేతనాలు, ఖరీదయిన విధ్య మున్నగు కారణాలవల్ల తల్లిదండ్రుల సహాయం, తోడు లేనిదే జీవన నౌకను తీరం చేర్చలేకపోతున్నారని సర్వే వెల్లడించింది. వీరిని ‘బూమరాంగ్ కిడ్స్’ గా ప్యూ నివేదిక అభివర్ణించింది.
‘బూమరాంగ్ కిడ్స్’ లో 78 శాతం మంది తాము ఒంటరిగా ఉన్నప్పటి కంటే సంతోషంగా సౌకర్యవంతంగా ఉంటున్నామని ప్యూ సర్వే లో తెలిపారు. అవసరంతో కూడిన ఈ పరిస్ధితులు తల్లిదండ్రులతో తమ సంబంధాలను మెరుగుపరిచాయని 24 శాతం తెలిపారు. అంటే వీరు తిరిగి తల్లిదండ్రుల సహాయం అర్ఢించాల్సి వచ్చినప్పటికీ అందుకు చింతిస్తున్న స్ధితిలో లేరని ప్యూ విశ్లేషించింది. నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చడంతో అనేక మంది ఉద్యోగాల వెతుకులాటను మానేస్తున్నారు. చాలామంది తక్కువ వేతనాల ఉద్యోగాల్తోనే సంతృప్తి పడుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ భృతి (unemployment benefits) కోసం, ఉద్యోగాల కోసం ప్రభుత్వాలకు దరఖాస్తు చేయడం మానేశారు. ఇంకా అనేకులు దీర్ఘ కాల నిరుద్యోగం వల్ల నిరుద్యోగ భృతి పొందే అర్హత కోల్పోతున్నారు. ఫలితంగా నిరుద్యోగ సమస్య తగ్గినట్లు కృత్రిమంగా కనిపిస్తోందని ఆర్ధిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.