వివాదాస్పద టాట్రా (మిలట్రీ) ట్రక్కులు ఖజానాకు బహు భారం


Tatraఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ సంచల రీతిలో చేసిన అవినీతి ఆరోపణలతో టాట్రా ట్రక్కులు వార్తలకెక్కాయి. ఈ ట్రక్కులను గత ముప్ఫై యేళ్ళుగా భారత ఆర్మీ కొనుగోలు చేసున్నదని ఆర్మీ చీఫ్ ‘ది హిందూ’ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటి వరకు 7,000 కు పైగా టాట్రా ట్రక్కులను ఆర్మీ కోనుగోలు చేసిందని ఆయన తెలిపాడు. వీటిని ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్ధితి ఆర్మీకి ఏర్పడిందని చెప్పాడు. అంతకంటే సామర్ధ్యం కలిగిన ట్రక్కులు తక్కువ ధరలో లభ్యం అవుతుండడంతో ‘కాంపిటీటివ్ బిడ్డింగ్’ నిర్వహించి మెరుగైన ట్రక్కులను కొనుగోలు చేయాలని ఆర్మీ చీఫ్ నిర్ణయించడంతో అసలు కధ మొదలయిందని అర్ధమవుతోంది.

టాట్రా ట్రక్కులను చెక్ దేశానికి చెందిన ‘టాట్రా అండ్ వెట్రా’ కంపెనీ తయారు చేస్తోంది. మిసైళ్ళు, ఆయుధాలతో పాటు సైనికులను రవాణా చేయడానికి ఈ ట్రక్కులు ఉద్దేశించపడ్డాయి. ఒక్కో ట్రక్కు ఖరీదు భారీ మొత్తంలోనే ఉంది. ఉదాహరణకి 4×4 ట్రక్కు ఖరీదు యూరప్ లో రు. 40 నుండి రు. 50 లక్షల వరకూ ఉంది. టాట్రా కంపెనీ నుండి భారత ప్రభుత్వ సంస్ధ బి.ఇ.ఎం.ఎల్ (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) విడి భాగాలుగా కొనుగోలు చేసి ఇండియాలో అసెంబుల్ చేసి ఆర్మీకి అమ్ముతోంది. ఒక్కో ట్రక్కుకు ఆర్మీ కోటి రూపాయలకు పైనే చెల్లిస్తోంది.

భారత దేశంలో ఇలాంటి ట్రక్కులు తయారు చేసే కంపెనీలు లేకపోలేదు. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ కంపెనీలు ఇదే తరహా ట్రక్కులు తయారు చేస్తున్నాయి. వాటి ఖరీదు రు. 16 నుండి రు. 18 లక్షల వరకూ ఉందని ఎన్.డి.టి.వి తెలిపింది. టాట్రా ట్రక్కులకు విడి భాగాలు అవసరమైనా భారీ ధరలు చెల్లించవలసిందే. ఉదాహరణకు టాట్రా తరహా భారీ వాహనాలకు వినియోగించే జాకీ లు ఇండియాలో రు. 3000 కు లభ్యమయితే టాట్రా కంపెనీ జాకీలను ఆర్మీ తరపున బి.ఇ.ఏం.ఎల్ రు. 30,000 పెట్టి కొనుగోలు చేస్తున్నది.

ఇంత పెట్టి కొన్నా టాట్రా ట్రక్కుల పనితనం ధరకు తగినట్లు లేదని ఎన్.డి.టి.వి తెలిపింది. భారత ఆర్మీకి డిఫెన్స్ కాంట్రాక్టర్ గా ఉన్న అనీల్ బక్షి కి టాట్రా ట్రక్కులతో అనుభవం ఉంది. ఇతను టాట్రా ట్రక్కుల పనితనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడని ఎన్.డి.వి తెలిపింది. ఆర్మీ కూడా ఈ ట్రక్కుల పట్ల అసంతృప్తి తో ఉన్నదని ఆయన తెలిపాడు. 2009 లో 45 ట్రక్కుల కొనుగోలును అనీల్ బక్షి నిర్వహించాడు. పాడైపోయిన టైర్లతో, పాత బ్యాటరీలతో ఉన్న ట్రక్కులు తన వద్దకు క్లియరెన్స్ కోసం వచ్చాయని అనీల్ తెలిపాడు. అయితే అవి ఆర్మీ వినియోగానికి అనువుగా లేవని తాను తిరస్కరించానని అనీల్ ఎన్.డి.టి.వి కి తెలిపాడు. టాట్రా ట్రక్కులకు విడి భాగాలు అంత తేలికగా దొరకవని ఇతర నిపుణులు తెలిపినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. విడి భాగం సరఫరా చేయడానికి బి.ఇ.ఏం.ఎల్ రెండు సంవత్సరాల వరకూ తీసుకుంటుందని తెలిపింది.

ఈ నేపధ్యంలో మిలట్రీ ట్రక్కుల కొనుగోలు ‘కాంపిటీటివ్ బిడ్డింగ్’ ద్వారా కొనుగోలు చేయాలని వి.కె.సింగ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దానితో టాట్రా ట్రక్కుల కొనుగోలు ఆగిపోయింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి జనరల్ తేజీందర్ సింగ్ టాట్రా తరపున లాబీయింగ్ జరపడానికి ఆర్మీ చీఫ్ వద్దకు వచ్చాడని పత్రికల ద్వారా అర్ధమవుతోంది. తాజా విడత కొనుగోలుకు క్లియరెన్స్ ఇవ్వడానికి వీలుగా తనకు రు.14 కోట్లు లంచం ఇవ్వ జూపాడని వి.కె.సింగ్ ఆరోపించిన సంగతి విదితమే. లంచం ఇవ్వజూపిన ఆర్మీ అధికారి పేరు వి.కె.సింగ్ చెప్పనప్పటికీ మార్చి 3 న ఆర్మీ చేసిన పత్రికా ప్రకటనను బట్టి సదరు అధికారి తేజీందర్ సింగ్ అని అర్ధం అవుతోంది. రక్షణ మంత్రి ఆంటోనీ కూడా అధికారి తేజీందర్ సింగ్ అని పార్లమెంటులో ప్రకటించాడు.

2 thoughts on “వివాదాస్పద టాట్రా (మిలట్రీ) ట్రక్కులు ఖజానాకు బహు భారం

  1. దేశంలో ఏ సంస్థకూ, విభాగానికీ లేని పవిత్రతను సైన్యానికి ఆపాదించి అరవై ఏళ్లుగా మన భద్రలోగ్ మేధావులు భారతీయ సైనిక వ్యవస్థకు కట్టబెట్టిన కుహనా గౌరవం సాక్షాత్తూ భారత ఆర్మీ ఛీప్ లేఖలు, ప్రకటనల ద్వారా నిలువునా కూలిపోయింది. ఈ కుహనా పవిత్రత, గౌరవాల కారణంగానే దేశం నలుమూలలా మన సైనిక బలగాలు చేస్తున్న దారుణాలను ప్రశ్నించడానికే వీలులేనంత కృత్రిమ రక్షణ కవచం ఆవరించుకుని ఉన్న స్థితి సైనికాధికారి ద్వారానే తొలగిపోయింది.

    దేశ రాజకీయ, పాలనా, ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కూలిపోయాయట. ఒక్క మిలటరీ, న్యాయవ్యవస్థలు మాత్రమే పరమ పవిత్రంగా అలరారుతున్నాయట. ఈ గొప్ప అసత్యాలను ప్రచారం చేయడానికి, ప్రజలను మాయ చేయడానికి మీడియా దశాబ్దాలుగా ఎన్ని పాట్లు పడిందో…

    సైన్యం లోపలినుంచే వచ్చిన ఒకే ఒక్క లేఖ.. మన సైనిక రంగ పవిత్రతను తూట్లు పొడిచేసింది. మన సైనిక వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంలో ఉందో, మన సైనికాధికారులు ఎంత అవినీతిపరులో పదేళ్లక్రితమే బయటపడినప్పటికీ ఈ సారి వికె సింగ్ ద్వారా తగిలిన దెబ్బను మూసిపెట్టడం, పూత మందు పూయడం సాధ్యం కాదు. దేశం లోపల మింగేవారు కొందరయితే, దేశ సరిహద్దుల్లో మింగేవారు కొందరు. ఆహా .. ఎంత గొప్ప వ్యవస్థలు మనవి.

  2. ఇరవై లక్షలు ధర చేసే లారీ కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టడం అంటే టీ కాచుకోవడానికి గంధపు చెక్కలు తగలబెట్టడమే.

వ్యాఖ్యానించండి