గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి వచ్చింది. ప్రభుత్వంతో చర్చించకుండా నేరుగా తానే ‘ఒక అత్యున్నత మిలట్రీ అధికారి’ పై విచారణ చేయాలని సి.బి.ఐ ని కోరడం ద్వారా ఆర్మీ చీఫ్ ప్రోటోకాల్ ఉల్లంఘించాడని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది.
తృణమూల్ ఎం.పి ఫిర్యాదు
దీనంతటికీ ఆధారం తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి అంబికా బెనర్జీ మే 2011 లో ఆర్మీ చీఫ్ కి రాసిన లేఖ. టిబెటన్ ప్రవాసులతో కూడిన రహస్య “స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్” (ఎస్.ఎఫ్.ఎఫ్) కు ఇన్స్ పెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్న కాలంలో లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఆర్మీ కొనుగోళ్ళలో విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడంటూ అంబికా బెనర్జీ, ఆర్మీ చీఫ్ కి లేఖ రాశారు. ఆ లేఖను సి.బి.ఐ కి పంపుతూ, వి.కె.సింగ్, దల్బీర్ సింగ్ సుహాగ్ పై వచ్చిన ఆరోపణలను విచారించవలసింగా కోరాడు. ఎస్.ఎఫ్.ఎఫ్ కు ఇన్స్ పెక్టర్ జనరల్ గా సేవలందించాక దల్బీర్ సింగ్ 3 కార్ప్స్ కమాండర్ గా ప్రమోట్ అయ్యాడు. ఈ ప్రమోషన్ ని వి.కె.సింగ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
ఎస్.ఎఫ్.ఎఫ్ 1962 లో ఏర్పాటు చేయబడిన రహస్య పారా మిలట్రీ విభాగం. టిబెట్ నుండి వలస వచ్చిన వారితో దీనిని ఏర్పాటు చేశారు. ఇది భారత విదేశీ గూఢచార సంస్ధ “రా” (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఆధ్వర్యంలో పని చేస్తుంది. 1962 లో చైనాతో యుద్ధం ముగిశాక, మరొక సారి ఆ దేశంతో యుద్ధం తలెత్తినట్లయితే, చైనాలో జొరబడి రహస్య ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారని ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. ఎస్.ఎఫ్.ఎఫ్ ను ‘ఎస్టాబ్లిష్ మెంట్ 22’ అని కూడా పిలుస్తారు.
ఎస్.ఎఫ్.ఎఫ్ కు ఇన్స్ పెక్టర్ జనరల్ గా దల్బీర్ సింగ్ పని చేస్తున్న కాలంలో ఆర్మీ కొనుగోళ్ళలో అవినీతికి పాల్పడ్డాడని వి.కె.సింగ్ సి.బి.ఐ కి రాసిన లేఖలో పేర్కొన్నాడని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రిక తెలిపింది. ఆయుధాలు, పారాచూట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, నైట్-విజన్ (రాత్రిపూట చీకటిలో చూడడానికి వినియోగించేవి) పరికరాలు మొదలయినవాటి కొనుగోళ్లలో దల్బీర్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చినట్లు సింగ్ తెలిపాడు. అంబికా బెనర్జీ ఫిర్యాదు లేఖకు కవరింగ్ లెటర్ జత చేస్తూ సి.బి.ఐ కి రాసినట్లు ఆ పత్రిక తెలిపింది. బెనర్జీ ఫిర్యాదు చేసిన సంవత్సరం తర్వాత మాత్రమే సి.బి.ఐ విచారణకి ఆదేశించడంపై వి.కె.సింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
దల్బీర్ వ్యవహారం
వి.కె.సింగ్ తర్వాత ఆర్మీ చీఫ్ పదవి చేపట్టనున్న వారిలో, లెఫ్టినెంట్ జనరల్ బిక్రం సింగ్ తర్వాత, దల్బీర్ సింగ్ రెండవ స్ధానంలో ఉన్నాడు. ఈ స్ధానానికి దల్బీర్ సింగ్ ని ప్రమోట్ చేయడాన్ని కూడా ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ ఆర్మీ అధికారి కి చెందిన సర్వీసు రికార్డు (ఏ.సి.ఆర్ – ఎన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్) ను దల్బీర్ సింగ్ అనవసరంగా ఖరాబు చేశాడని వి.కె.సింగ్ కి దల్బీర్ సింగ్ పై ఉన్న అభ్యంతరంగా తెలుస్తోంది. పారాచ్యూట్ తయారు చేసే కంపెనీల కార్టెల్ ఒత్తిళ్లకు సదరి సీనియర్ అధికారి లొంగకపోవడం వల్లనే ఆయన సర్వీసు రికార్డును ఖరాబు చేసి ఎస్.ఎఫ్.ఎఫ్ కు డిప్యుటేషన్ పై పంపినట్లు వి.కె.సింగ్ ప్రభుత్వానికి తెలిపాడు. ఆ మేరకు సీనియర్ అధికారి నుండి తనకు ఫిర్యాదు అందిందని వి.కె.సింగ్ ప్రభుత్వానికి తెలిపాడు.
ఈ నేపధ్యంలో దల్బీర్ సింగ్ పై సి.బి.ఐ విధారణకి ఆదేశిస్తూ వి.కె.సింగ్ మరొక సంచలనం రేపాడు. అత్యున్నత పదవిలో ఉంటూ వరుస సంచలనాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నందుకు వి.కె.సింగ్ ను ప్రభుత్వం పదవి నుండి తప్పించవచ్చని పత్రికలు ఊహాగానాలు చేస్తున్నాయి. మరిన్ని రోజులు పదవిలో కొనసాగనిస్తే ఇంకేం తంటా తెస్తాడోనని ప్రభుత్వ పెద్దలు భావించవచ్చని వీరు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే వి.కె.సింగ్ లక్ష్యం అయితే ఆ పని రిటైర్డ్ ఆర్మీ చీఫ్ గా కూడా చేయవచ్చన్న సంగతిని వీరు విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.
అవినీతి వల్లనే రక్షణకు ప్రమాదం, అవినీతి వెల్లడి వల్ల కాదు
ఆర్మీ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని బట్ట బయలు చేస్తున్న సంగతిని వదిలి, వి.కె.సింగ్ పుట్టిన రోజు వివాదాన్ని ఆయనకు అనుకూలంగా పరిష్కరించకపోవడం వల్లనే వరుస సంచలనాలకు తెర తీసినట్లుగా పత్రికలు చెప్పడం తీవ్ర బాధ్యతా రాహిత్యం. మొత్తం విషయాన్ని అవి ఆర్మీ చీఫ్, ప్రభుత్వాల మధ్య వివాదంగా కుదించివేస్తున్నాయి. దేశంలోని అన్నీ వ్యవస్ధలలో, ప్రతి స్ధాయిలోనూ వేళ్ళూనుకున్న అవినీతి భూతాన్ని ఎండగట్టం మాని ‘పుట్టిన రోజు తగాదా’ గా ‘ఆర్మీ అవినీతి సమస్య’ ను కుదించడం సమర్ధనీయం కాదు. నిన్న మొన్నటి వరకూ అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమాన్ని అప్పుడే పత్రికలు మర్చిపోయినట్లు కనిపిస్తోంది. దేశ రక్షణ వ్యవస్ధలో కూడా అవినీతి చోటు చేసుకోవడం వల్ల దేశ రక్షణ ప్రమాదంలో పడుతుందన్న సంగతిని మరిచి ఆర్మీ చీఫ్ అవినీతిని వెల్లడిస్తున్నందువల్ల రక్షణ ప్రమాదంలో పడుతోందన్న తప్పుడు అభిప్రాయాన్ని పత్రికా సంస్ధలు కలిగించడం సరికాదు.
ఆర్మీ చీఫ్ వెల్లడిస్తున్న ఆర్మీ అవినీతి వల్ల మంత్రులు, బ్యూరోక్రసీ పాల్పడుతున్న అవినీతి అంశం తిరిగి ప్రముఖ స్ధానం ఆక్రమించే అవకాశం ఏర్పడుతోంది. గత సంవత్సర కాలంగా అన్నా బృందాన్ని అప్రతిష్ట పాలు చేయడంలోనూ, తద్వారా అవినీతి వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడంలోనూ విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్మీ అవినీతి ఆరోపణలతో మళ్ళీ తనకు ఇబ్బంది కరమైన పరిస్ధితులు ఏర్పడవచ్చని భయపడడం సహజం. మరొకసారి లోక్ పాల్ చట్టం కోసం అన్నా బృందం నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్న తరుణంలో ఆర్మీ చీఫ్ ఆరోపణలు అన్నా బృందానికి మందుగుండుగా పని చేస్తాయని కేంద్ర ప్రభుత్వం భావించవచ్చు. ఈ నేపధ్యంలో కూడా ఆర్మీ చీఫ్ ని పదవి నుండి తొలగించాలని ప్రభుత్వం భావించే అవకాఆశాలు ఉన్నాయి. కానీ అటువంటి ప్రయత్నాలకు పత్రికలనుండి మద్దతు రావడం సమర్ధనీయం కాదు. పార్లమెంటులో ప్రతిపక్షాల ధోరణి చూసినట్లయితే ఆర్మీ అవినీతి ఆరోపణల పట్ల అవి కూడా దిగులు పడ్డట్లు కనిపిస్తోంది. పార్లమెంటు సభ్యులపై అన్నా బృందం ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ పాలక ప్రతిపక్షాలు ఇటీవల ఒక తీర్మానాన్ని ఏక గ్రీవంగా ఆమోదించాయి. అంటే తమ అవినీతిని కొనసాగించడానికి పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయన్న మాట. వారి కుట్రలను పత్రికలే సమర్ధవంతంగా వెల్లడించి ప్రజలను మేల్కొలపవలసి ఉంది. ఈ కోణంలో నుండే అవి ఆర్మీ చీఫ్ బట్టబయలు చేస్తున్న ఆర్మీ అవినీతిని చూడాల్సి ఉంది.