నా లేఖ లీక్ చేయడం మహా ద్రోహం -ఆర్మీ చీఫ్


Gen. V. K. Singhప్రధానికి రాసిన లేఖను తానే లీక్ చేశాడని ఆరోపిస్తూ, ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ని పదవి నుండి తప్పించాలని ప్రతి పక్ష పార్టీలు ఓ వైపు డిమాండ్ చేస్తుండగానే ‘తన లేఖను లీక్’ చేసినవారిని జాలి, దయ లేకుండా శిక్షించాలని వి.కె.సింగ్ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపాడు. ప్రధాన మంత్రికి అత్యంత రహస్యంగా తాను రాసిన లేఖను లీక్ చేయడం ‘మహా ద్రోహం’ (high treason) గా వి.కె.సింగ్ అభివర్ణించాడు.

“లేఖను లీక్ చేయడాన్ని మహా ద్రోహంగా పరిగణించాలి. నా ప్రతిష్టపై మచ్చ వేయడానికి చేస్తున్న సిగ్గు మాలిన ప్రయత్నాలు వెంటనే ఆపాలి. లీక్ చేసినవారిని పట్టుకుని జాలి లేకుండా శిక్షించాలి” అని ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ప్రకటించాడు. రక్షణ మంత్రి ‘టాప్ సీక్రెట్’ గా అభివర్ణించిన లేఖను డి.ఎన్.ఏ పత్రిక బుధవారం ప్రచురించింది. ఉపయోగం లేని ట్రక్కులు కోనడానికి అనుమతి ఇవ్వాలంటూ రిటైర్డ్ ఆర్మీ అధికారి తేజీందర్ సింగ్ తనకు రు. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడంటూ ‘ది హిందూ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించిన వి.కె.సింగ్ తాను ప్రధానికి రాసిన లేఖను పత్రికలకు లీక్ చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయనను పదవి నుండి తప్పించాలని సమాజ్ వాదీ పార్టీ, జనతా దళ్ (యు), ఆర్.జె.డి తదితర పార్టీలు బుధవారం పార్లమెంటులో డిమాండ్ చేశాయి.

జనరల్ వి.కె.సింగ్ పత్రికకు ఇంటవ్యూ ఇచ్చిన రోజు నుండి ట్రక్కుల అవినీతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తన పుట్టిన రోజు నమోదు లో జరిగిన పొరబాటు ను సరిదిద్దించడానికి వి.కె.సింగ్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లనే జనరల్ వి.కె.సింగ్ ప్రభుత్వంతో తగాదా పడుతున్నాడన్న ప్రచారం పత్రికల్లో జరుగుతోంది. ప్రమోషన్లు పొందే సమయంలో పొరబాటు తేదీనే వినియోగించినందున ఇప్పుడు తేదీని సవరించడానికి ప్రభుత్వం నిరాకరించింది. వి.కె.సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయనకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెబుతూ ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని వి.కె.సింగ్ కు సలహా ఇచ్చింది. దానికి వి.కె.సింగ్ అంగీకరించాడు. పుట్టిన తేదీ వివాదం అప్పటితో ముగిసిందని వి.కె.సింగ్ చెప్పినప్పటికీ ఆయన అవినీతి ఆరోపణ చేయడానికి కారణం ఆ వివాదమేనన్న ప్రచారం జరుగుతోంది.

రిటర్డ్ ఆర్మీ అధికారి లంచం ఇవ్వజూపినప్పటి సంభాషణ ఉన్న టేప్ లు తమకు చేరాయని సి.బి.ఐ ప్రకటించింది. మరో పక్క లంచం విషయం సంవత్సరం క్రితం తనకు చెప్పినపుడే లిఖిత పూర్వక ఫిర్యాదు చేయాలని ఆర్మీ చీఫ్ కి తాను చెప్పాననీ, అయినా దానికాయన ఆసక్తి చూపలేదనీ రక్షణ మంత్రి ఆంటోనీ పార్లమెంటుకు తెలిపాడు. అది జరిగిన రెండు రోజులకే ‘ఆర్మీ వద్ద ఉన్న ఆయుధాలు కాలం చెల్లిపోయాయని’ చెబుతూ వి.కె.సింగ్ ప్రధాని కి రాసిన లేఖ పత్రికలకు లీక్ అయింది. పార్లమెంటులో వి.కె.సింగ్ ని తప్పు పట్టే విధంగా ఆంటోనీ మాట్లాడినందునే ప్రతీకారంతో వి.కె.సింగ్ ప్రధానికి రాసిన లేఖను లీక్ చేశాడని ప్రతి పక్ష పార్టీల నాయకులు లాలూ ప్రసాద్, శరద్ యాదవ్ లాంటి నాయకులు ఆరోపించారు. వి.కె.సింగ్ ను వెంటనే పదవి నుండి తప్పించాలని వారు పార్లమెంటులో గొడవ ప్రారంభించారు.

ఈ నేపధ్యంలో వి.కె.సింగ్ ప్రకటన వెలువడింది. లేఖ లీక్ చేసిందెవరో విచారీంచి కఠినంగా శిక్షించాలని వి.కె.సింగ్ డిమాండ్ చేస్తుండడాన్ని బట్టి ఆర్మీ చీఫ్ కాదని భావించవలసి వస్తోంది.

వ్యాఖ్యానించండి