బారక్ ఒబామా: మనం బడా టెర్రరిస్టులని తుడిచి పెట్టాం. అరబ్ ప్రజాస్వామిక ఉద్యమాలు పెరగడానికి సాయపడ్డాం. ఇరాక్ కి ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనీ ప్రసాదించాం…
అమెరికా పౌరుడు: గుడ్ జాబ్. మారి నా ఉద్యోగం సంగతేంటి?
అదీ సంగతి! పాకిస్ధాన్ అనుమతి లేకుండా, ఆ దేశం గగనతలం లోకి జొరబడి, ఒసామా బిన్ లాడెన్ ని చంపేశామని చెప్పిన ఒబామా ఇంతవరకూ అతని శవాన్ని కూడా చూపలేదు. తమ అనుకూల ఎన్.జి.ఒ సంస్ధల సాయంతో నియంతృత్వం ప్రభుత్వాలపై తిరగబడ్డ అరబ్ ప్రజల తిరుగుబాట్లను పక్కదారి పట్టించడంలో సఫలం అయ్యింది అమెరికా. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో పాత సైనిక నియంతలు, రాజకీయ నాయకులే అక్కడ ఇంకా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ అరబ్ ప్రజాస్వామిక ఉద్యమాలు తమ పుణ్యమేనని చెప్పుకోవడానికి అమెరికా సాహసిస్తోంది. తమ కార్పోరేట్ పత్రికలతో అబద్ధాలను ప్రచారం చేసి తిమ్మిని బమ్మిని చేయగలమన్నది అమెరికా ధైర్యం. ఇరాక్ ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించి దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చారు.
రెండు దురాక్రమణ యుద్ధాలు, మరిన్ని కుట్రలు, కుతంత్రాలు వెరసి అమెరికా ప్రజలకు దక్కింది కుంగిపోయిన ఆర్ధిక వ్యవస్ధ మాత్రమే. సంక్షోభం నుండి కోలుకోలేక కుంటుతూ, మూలుగుతున్న ఆర్ధిక వ్యవస్ధలో అమెరికన్లు నిరుద్యోగం, ఇళ్ల వేలం, కార్లలో కాపురాలు, ఉద్యోగాల రద్దు, వేతనాల కోత మున్నగు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి బదులు మరిన్ని విదేశీ కుట్రలు, కిరాయి తిరుగుబాట్లలో అక్కడి పాలకులు మునిగి తేలుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం తలెత్తిన ‘ఆకుపై ఉద్యమాలను’ అణచివేయడనికే మొగ్గు చూపుతున్నారు.

అమెరికాదే చట్టం, న్యాయం, ధర్మం. ఈ ప్రపంచం అమెరికాది. పాలకుల దొంగ నాటకాలు కొనసాగినంతకాలం (వీటిని) భరించాలి. లేదా నిలదీయాలి. (నిలదీయడంలో) లాటిన్ అమెరికా దేశాలు మనకి ఆదర్శం కావాలి.
americaye chattam nyayam dhramam. ee prapancham americade. paalakuladonganatakaalu konasaaginantakaalam bharichaali. leda niladeeyali. latinamericadesaalu manaki aadrsamkavaali..
(ఇంగ్లీషు అక్షరాలలో ఉన్న మిత్రుడి కామెంట్ ని తెలుగులోకి మార్చడం జరిగింది -విశేఖర్)