మాజీ రిటైర్డ్ ఆర్మీ అధికారి తనకు రు. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణల వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. లంచం విషయం తనకు చెప్పినపుడే చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ కి సూచించాననీ, అయినా చర్యలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనీ, “ఆ విషయంలో మరింత ముందుకెళ్ళాలనుకోవడం లేద”ని ఆర్మీ చీఫ్ తనతో అన్నాడనీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని రాజ్య సభలో ప్రకటించాడు. ఆ సమయంలో లంచం విషయంలో మరింత ముందుకు వెళ్లడానికి ఆర్మీ చీఫ్ ఎందుకు నిరాకరించిందీ తనకు తెలియదనీ ఆంటోని సభకు తెలిపాడు. ఆర్మీ చీఫ్ ఆరోపణలపై సి.బి.ఐ విచారణకు ఆదేశించినట్లు ఆంటోనీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
పనికి రాని వాహనాల కొనుగోలుకు ఒప్పుకోవాలని కోరుతూ తనకు రిటైర్డ్ ఆర్మీ చీఫ్ అధికారి జనరల్ తేజీందర్ సింగ్ తనకు లంచం ఇవ్వజూపాడని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ ‘ది హిందూ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం ఆరోపించాడు. ఇంటర్యూ వివరాలని పత్రిక సోమవారం ప్రచురించింది. దానితో పార్లమెంటులో ఈ విషయమై గందరగోళం చెలరేగింది. ‘ది హిందూ’ పత్రికలను చూపుతూ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లో అలజడి సృస్టించారు. ఆర్మీ చీఫ్ స్వయంగా తనకు లంచం ఇవ్వ జూపారని నేరుగా రక్షణ మంత్రికి చెప్పి సంవత్సరన్నర గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు మంగళవారం రాజ్య సభలో ఆంటోని సమాధానం ఇచ్చాడు. “ఇది జరిగి సంవత్సరం పైనే అవుతోంది. నాకు అంతవరకు గుర్తుంది. సరిగ్గా ఏ తేదీన జరిగిందో వారికే (ఆర్మీ అధికారులకు) తెలియాలి. ఎందుకంటే అపాయింట్ మెంట్ లేకుండా ఆర్మీ చీఫ్ ని ఎవరూ కలవలేరు” అని ఆంటోని తెలిపాడు. రిటైర్డ్ మిలట్రీ అధికారి తేజీందర్ సింగ్ తనకు రు. 14 కోట్లు లంచం ఆఫర్ ఇచ్చాడని వి.కె.సింగ్ తనతో చెప్పాడని మంత్రి తెలిపాడు. “నేను షాక్ తిన్నాను. షాక్ నుండి తేరుకోవడానికి నాకు రెండు నిమిషాలు పట్టింది. అనంతరం చర్య తీసుకోవాలని ఆర్మీ చీఫ్ తో చెప్పాను. కానీ ఆ విషయంలో ముందుకెళ్ళాలని లేదని ఆయన నాతో అన్నాడు. ఆయన అలా ఎందుకు అనుకున్నాడో నాకు తెలియదు” అని ఆంటోని సభకు తెలిపాడు.
నేరస్ధులు ఎంత శక్తివంతులైనా తప్పనిసరిగా చర్య తీసుకుంటామని రక్షణ మంత్రి సభకు హామీ ఇచ్చాడు. “నేను చర్య తీసుకుంటాను. ఎవరినీ వదలను. ఎవరైనా నేరస్ధులని తేలితే, వారెవరైనా, ఎంతటి శక్తివంతులైనా, చర్య తీసుకుంటాను. నా తీర్పు ప్రకారం నేను వ్యవహరించాను. నేను తప్పు చేసినట్లయితే నన్ను శిక్షించవచ్చు. నా పరిధి మేరకు సరైన చర్యే తీసుకున్నానని భావిస్తున్నాను” అని ఆంటోని అన్నాడు. తనకు ఆకాశ రామన్న ఉత్తరాల ద్వారా ఫిర్యాదు అందినా చర్య తీసుకున్నానని ఆయన తెలిపాడు. ఆర్మీ చీఫ్ తనకు లంచం గురించి చెప్పినపుడే చర్య తీసుకోవాల్సిందని అంగీకరిస్తూ ఆంటోనీ, తనకు లిఖిత పూర్వకమైన ఫిర్యాదు లేకుండా తానేమీ చేయలేనని తెలిపాడు. తనకు ఏ దశలోనూ లిఖిత ఫిర్యాదు అందలేదని తెలిపాడు. సి.బి.ఐ విచారణకి ఆదేశించినందున అన్నీ వివరాలనూ అది పరిశీలిస్తుందని తెలిపాడు.
రక్షణ మంత్రికి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వడానికి తాను ఎందుకు ఇష్టపడనిదీ ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ఇప్పుడు సమాధానం చెప్పవలసి ఉంది.