మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
గూండా పాలనను అంతం చేస్తానంటూ ముఖ్య మంత్రి పదవి అధిష్టించిన ‘యువ ముఖ్య మంత్రి’ అఖిలేష్ యాదవ్ అసలు ఉద్దేశ్యాలు వేరే ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తున్నది. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో నెగ్గుతున్న వార్తలు వస్తుండగానే రాష్ట్రంలో అనేక చోట్ల ప్రత్యర్ధులపై దాడులకు, కాల్పులకు దిగిన సమాజ్ వాదీ పార్టీ నేతలు గూండాయిజాన్ని ఎలా నిర్మూలిస్తారో తమ చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు.
రింకు సింగ్ రాహి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి గా పని చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ స్కీములలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుటోందని ఆయన ఆరోపిస్తున్నాడు. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన సోమవారం నుండి లక్నో లో అసెంబ్లీ ముందు ‘ఆమరణ నిరాహార దీక్ష’ ప్రారంభించాడు. ఆయనకు రక్త పోటు పడిపోయిందని చెబుతూ పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ప్రకటించి పట్టుకు పోయారు. దానికి బదులుగా వివిధ ఆసుపత్రులలో సైకియాట్రిక్ వార్డులలో చేర్చడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ డాక్టర్లు నిరాకరించడంతో అతని సొంత పట్టణం ఆలీ ఘర్ కు తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.
“నిర్దిష్ట కుంభ కోణాలను బయట పెట్టడానికి నేను ప్రయత్నించాను. అందుకని వారు నా నోరు మూయించాలనుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఆదేశాలతోనే ఇది జరిగింది. నన్ను చేర్చు కోవడానికి డాక్టర్లు స్పష్టంగా నిరాకరించారు. నన్ను చేర్చుకోవలసిన అవసరం లేదని వారు చెప్పారు. పక్కా పధకంతో వారీ పని చేశారు” అని రాహి ఎన్.డి.టి.వి కి తెలిపాడు. గతంలో మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధపడిన డి.ఐ.జి స్ధాయి పోలీసు అధికారిని కూడా ఇలాగే మెంటల్ వార్డ్ లోకి చేర్చే ప్రయత్నాలు జరిగాయని ఎన్.డి.టి.వి తెలిపింది.
మార్చి 2009 నెలలో, స్ధానిక మాఫియా గ్యాంగు రింకు సింగ్ ను కాల్చి చంపడానికి ప్రయత్నించింది. ఆరు బుల్లెట్లు అతని శరీరంలోకి దిగాయి. కాల్పుల వల్ల రింకు సింగ్ ఒక కన్ను కూడా కోల్పోయాడు. లెక్కల్లో రు. 40 కోట్లు గల్లంతయ్యాయని రింకూ సింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై మాఫియా గ్యాంగులు దాడి చేశాయి. తన డిపార్ట్ మెంటు అధికారుల అవినీతిని బహిరంగ పరచాలని ప్రయత్నించడంతో వారే ఈ దాడి చేయించారని రింకు ఆరోపించాడు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ జరిగి రింకు ఆరోపణలను ధృవ పరిచాయి. సాంఘిక సంక్షేమ శాఖ కు కేటాయించబడిన నిధులను అయిదు సంవత్సరాల పాటు లెక్కలు లేకుండా గల్లంతు చేసినట్లుగా విచారణలో తేలింది.
రింకు సింగ్ పై దాడి చేసినవారికి నాయకత్వం వహించన వ్యక్తి పేరు ముకేష్ చౌదరి అని ఎన్.డి.టి.వి తెలిపింది. ఈయన ముజఫర్ నగర్ జిల్లాలోని చార్టవాల్ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ నుండి పోటీ చేసిన వ్యక్తి. సాంఘిక సంక్షేమ శాఖ లో జరుగుతున్న అవినీతి వల్ల లబ్ది పొందుతున్న వారిలో చౌదరి ప్రధముడని ఎన్.డి.టి.వి తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున తన డిమాండ్లను అఖిలేష్ ప్రభుత్వం ఐనా పరిశీలిస్తుందని రింకు సింగ్ ఆశించాడనీ, ప్రభుత్వం మారినా తన పరిస్ధితి అలానే కొనసాగడంతో ఆయన ఖిన్నుడయ్యాడనీ ఎన్.డి.టి.వి తెలిపింది.
‘అవినీతి వ్యతిరేకత’ అన్నది ఎన్నికల్లో ఓట్ల కోసమే తప్ప ప్రభుత్వంలోకి వస్తే ఆచరించడానికి కాదని’ ఇప్పుడయినా రింకు సింగ్ కి అర్ధం అయి ఉండాలి. రెండేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్ లో ప్రప్రధమ దళిత ముఖ్య మంత్రిగా నీరాజనాలు అందుకున్న మాయావతి ముఖ్య మంత్రిగా ఉన్నది. ఆమె ప్రభుత్వంలో కూడా ‘సాంఘిక సంక్షేమ శాఖ’ లో అవినీతిపై పోరాటం చేశానని రింకు చెప్పడం బట్టి దళిత ముఖ్యమంత్రి పాలనలో సైతం సంక్షేమ శాఖ నిధులు దళితులకు కాకుండా అవినీతి మార్గంలో ఆగ్ర కులాలకు చేరినట్లు స్పష్టం అవుతోంది. ఇక దళితులు ముఖ్య మంత్రులుగా అధిష్టించి దళితులకు ఒనరూగే ప్రయోజనం ఏమిటి?
నిజానికి లోపం వ్యవస్ధలోనే ఉంది. ప్రభుత్వాలు ప్రధానంగా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉంది తప్ప పేద వర్గాల చేతుల్లోనో లేదా శ్రామిక వర్గాల చేతుల్లోనో లేదు. ధనిక వర్గాల చేతిలో ప్రభుత్వాలు, కోర్టులు, సైన్యం, పోలీసులు ఉన్నంతకాలం ఎంతటి నిజాయితీ పరులు అధికారులయినా, ఒకరిద్దరు నిజాయితీ రాజకీయవేత్తలు అధికారం చేపట్టినా వారు సాధించగలదేమీ ఉండదు. రింకు సింగ్ చేసిన ప్రయత్నాలు అందుకు చక్కటి ఉదాహరణ. అవినీతి కొనసాగడానికి అవసరమైన పరిస్ధితులన్నీ కొనసాగుతుండగా, ఒకరిద్దరు నిజాయితీ పరులు అవినీతికి పాల్పడకపోతేనో, అవినీతికి వ్యతిరేకంగా కృషి చేస్తేనో రావలసిన ఫలితాలు రాజాలవు.
అవినీతిని పెంచి పోషిస్తున్నవారు తమ ఉన్నత స్ధానాలోని తమ అవినీతిని కప్పి పుచ్చుకోవడానికై ప్రతి అంగంలోనూ, ప్రతి స్ధాయిలోనూ అవినీతిని వ్యాపింపంచేశారు. వారి ఆధిపత్యం నుండి వ్యవస్ధ ను తప్పించకుండా అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఎ స్ధాయిలో జరిగినా విఫలం కాక తప్పదు. దేశ స్ధాయిలోనే అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించిన అన్నా బృందంపై కేంద్ర నాయకుల ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగిన సంగతి మనం చూశాం. ఇప్పుడు అవినీత్కిపై చర్య తీసుకోమని కోరిన ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిని ఏకంగా పిచ్చివాడుగా చేయడానికి కూడా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం సిద్ధపడ్డాన్ని చూస్తున్నాం. నిజాయితీ పరులంతా ఐక్యంగా రాజకీయ కార్యాచరణ చేపట్టనిదే, అవినీతితో పాటు వ్యవస్ధలోని చెడుగులన్నింటికీ మూలాధారమైనదేమిటో కనిపెట్టి దానిని మట్టుపెట్టనిదే అవినీతిని అంతం చేయడం దుస్సాధ్యం. దానార్ధం అసలే కృషి చేయవద్దని కాదు. అటువంటి కృషిని సరైన విధంగా చానలైజ్ చేయవలసిన అవసరాన్ని తప్పనిసరిగా గుర్తించాలి.
“మాయావతి…… ప్రభుత్వంలో కూడా ‘సాంఘిక సంక్షేమ శాఖ’ లో అవినీతిపై పోరాటం చేశానని రింకు చెప్పడం బట్టి దళిత ముఖ్యమంత్రి పాలనలో సైతం సంక్షేమ శాఖ నిధులు దళితులకు కాకుండా అవినీతి మార్గంలో ఆగ్ర కులాలకు చేరినట్లు స్పష్టం అవుతోంది. ఇక దళితులు ముఖ్య మంత్రులుగా అధిష్టించి దళితులకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి?”
మీరు ఇక్కడ కులపరమైన అంశాన్ని మాత్రమే ప్రధానంగా చూస్తూ వర్గపరంగా ఈ దళిత ముఖ్యమంత్రుల, దళిత అధికారుల స్వభావం ప్రాధాన్యతను పలుచన చేస్తున్నారనిపిస్తోంది. దోపిడీ వ్యవస్థలో, ఆర్థిక దోపిడీలో భాగం పుచ్చుకుని బలుస్తున్న క్రీమీలేయర్ లోకి మారిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రుల, అధికారుల ‘దళిత’ స్వభావం పునాది ఏమిటి? దళితులు, వెనుకబడిన వర్గాలు సంపాదించుకోకూడదని, ఆస్తులు కూడబెట్టుకోవద్దని కాదిక్కడ అర్థం. కాని తమ సంపాదనల ద్వారా, ఆస్తుల కూడిక ద్వారా వీళ్లు మన దేశంలో దేనికి ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఖచ్చితంగా తేల్చుకోవాల్సిన అవసరముంది.
పాలకవర్గంలో ఉండి కూడా దళితులు కులపరంగా ఎదుర్కొంటున్న వివక్షతను ఎవరూ విస్మరించకూడదు కాని వర్గంగా ప్రజలనుండి వీడిపోయాక, వేరుపడిపోయాక కులం ట్రంప్ కార్డును ఉపయోగించడంలో మాత్రమే ప్రతిభ చూపుతున్న వీరి పాలక స్వభావం నుంచి పీడిత కులాలు, వర్గాలు తమను తాము డీమార్కేట్ చేసుకోక తప్పదేమో.. కంచ ఐలయ్య గారు ఇప్పటికీ మాయావతిని వీర విప్లవ దళిత నేతగా ఆకాశానికెత్తేస్తున్నారు. ‘దళిత ముఖ్యమంత్రి పాలనలో సైతం’ అనే మీ వాక్యంలో ఆ ధోరణి స్పష్టాస్పష్టంగా కనిపించి ఇలా రాస్తున్నాను.
అఖిలేష్ యాధవులూ, దళిత ముఖ్యమంత్రులూ కూడా ఈ దేశ ప్రజల పాలిట గుదిబండలే అనే విషయంపై మనం మరింత స్పష్టతతో ఉండాలేమో. కులాన్ని కూడగట్టడం గొప్ప విషయం అయితే ఈ దేశంలో అన్ని కుల సంఘాల నేతలూ ఆ పనిని బ్రహ్మాండంగా చేస్తూనే ఉన్నారు.
అపార్థం చేసుకోరనే ఆశిస్తున్నాను.
రాజశేఖర రాజు గారూ,
మీరు చెప్పిన అంశాన్నే నేనూ చెప్పదలిచాను. దళిత ముఖ్యమంత్రిత్వంలో సైతం దళితులకు అన్యాయాలు కొనసాగుతున్నాయని ఎత్తి చూపడం ద్వారా ‘దళిత కార్డు’ వాస్తవంలో వర్గ పాలనకు అనువుగా ఉపయోగపడుతున్నదే తప్ప దళితులకు న్యాయం జరగడానికి ఉపయోగపడడం లేదని నేను చెప్పదలిచాను. ధనికవర్గ పాలనలో దళితులు ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు అయినా వారు ధనికవర్గాలకు సేవ చేస్తారే తప్ప పేద వర్గాలయిన దళితులకు కాదని నేను చెప్పదలిచాను. పై ఆర్టికల్ పరిధిలో ఈ అంశం లేనందున దాన్ని వివరించడానికి నేను పూనుకోలేదు.
దళితుల్లో మేధావులు అనుకుంటున్నవారు, మధ్య తరగతి బుద్ది జీవులు, ఇప్పటి సమాజంలో దళితులు ఉన్నత స్ధానాలకు చేరుకుంటె దళితులకు న్యాయం జరుగుతుందని భ్రమిస్తున్నారు. యు.పిలో బి.జె.పి తో స్నేహం కట్టి బి.ఎస్.పి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాక, మాయావతి ముఖ్యమంత్రి అయ్యాక దేశవ్యాపితంగా దళితుల్లో ఈ భ్రమలు బాగా పెరిగిపోయాయి. ఆ పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని పై వ్యాఖ్య చేశాను. దళితులు ముఖ్యమంత్రి అయినప్పటికీ, మొత్తం ప్రభుత్వ విధానాల విషయం పక్కన పెట్టినా, కనీసం దళితులకోసం కేటాయించబడ్డ నిధులు సైతం మాయావతి ప్రభుత్వంలో దళితులు చేరలేదని చెప్పడమే నా వ్యాఖ్య ఉద్దేశ్యం.