చైనా అధ్యక్షుడు హు జీంటావో భారత దేశం సందర్శించడాన్ని నిరసిస్తూ టిబెట్ జాతీయుడొకరు న్యూఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. తనకు తాను నిప్పంటించుకున్న జాన్ఫెల్ యేషి హు సందర్శనను వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ యాభై మీటర్లు పరిగెత్తాడు. దానితో వెంటనే మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. శరీరం ఎంతవరకు కాలిందీ వివరాలు తెలియలేదని పత్రికలు చెప్పాయి.
టిబెట్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ గత రెండు సంవత్సరాలుగా టిబెట్ లో ముప్ఫై మంది వరకూ ఆత్మాహుతికి పాల్పడ్డారు. వీరిలో ఇరవై మంది వరకూ చనిపోయారు. టిబెట్ కి బయట ఈ విధంగా ఆత్మాహుతికి పాల్పడడం ఇదే ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని తెలుస్తోంది. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇండియాలో నలభై యేళ్లుగా రాజకీయ ఆశ్రయం పొందుతున్నాడు. దలైలామా నివాసం విషయంలో చైనా, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి కొనసాగుతున్నాయి.
అయితే, ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం టిబెటన్ల స్వతంత్ర పోరాటం విషయంలో తన అవగాహనను సవరించుకుంది. టిబెట్ ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు భారత దేశం ప్రకటించింది. దలైలామాకి ఆశ్రయం కల్పిస్తున్నంత మాత్రాన టిబెటన్ల పోరాటాన్ని సమర్ధిస్తున్నట్లు కాదని ప్రకటించింది. తన భూభాగంపై టిబెటన్లు స్వతంత్ర పోరాటం నిర్వహించడానికి అనుమతించబోనని కూడా ప్రకటించింది. హు జింటావో త్వరలో ఢిల్లీ వచ్చినపుడు టిబెట్ విషయం కూడా చర్చకు రావచ్చునని భావిస్తున్నారు. చర్చల అనంతరం భారత ప్రభుత్వం మరొకసారి తన అవగాహనను నిర్ధారించవచ్చునని భావిస్తున్నారు.
కాశ్మీరు విషయంలో కూడా చైనా, ఇండియాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాశ్మీరు విషయమై చైనా పాకిస్ధాన్ కి గట్టి మద్దతుదారుగా ముద్ర పడినప్పటికీ అది నిజం కాదని ఇటీవలి కాలంలో చైనా వాదిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీరులో తాము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన అది కాశ్మీరుపై పాకిస్ధాన్ హక్కును గుర్తించినట్లు కాదని చైనా అధికారులు చెబుతున్నారు. చైనా సందర్శించే పాక్ ఆక్రమిత కాశ్మీరీలకు చైనా ప్రభుత్వం సాధారణ వీసాలు కాకుండా ఫొటో జతపరిచిన కాగితాలను వాడడం భారత దేశానికి ఆగ్రహ కారణంగా ఉంది. హు జింటావో ఇండియా సందర్శనలో టిబెట్, కాశ్మీరు అంశాలపై తామెలా భావిస్తున్నదీ ఇరు దేశాలు ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.
ఇరు దేశాల అవగాహనను ఎలా ఉన్నప్పటికీ టిబెటన్లు ఈ విధంగా ఆత్మాహుతులకు పాల్పడడం వారి లక్ష్యాలకు తోడ్పడదని వారు గుర్తించవలసి ఉంది. తమ లక్ష్య సాధనకు వివిధ పోరాట మార్గాలను ఎంచు కోవాలి తప్ప ఆత్మాహుతులు పాలకులను కదిలించవని వారు గుర్తెరగాలి. మూడు వందలకు పైగా తెలంగాణ యువకులు ఆత్మాహుతులు చేసుకున్నప్పటికీ కేవలం ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సైతం భారత పాలకులు అంగీకరించలేదు. అలాంటిది ప్రత్యేక దేశం ఏర్పడడానికి చైనా పాలకులు అంగీకరించే సమస్య లేదు. ఆత్మాహుతులు, నిరాహారదీక్షలు, సత్యాగ్రహాలు పాలకుల రోజువారీ విధానాలకు ప్రమాదం వాటిల్లకుండా ఉండడానికే తప్ప నిరసనకారుల డిమాండ్లు నెరవేరడానికి ఉద్దేశించినవి కావు.





