ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం


An illegal Israeli settlement in Shilo, the occupied West Bankపాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్ మెంట్ల పై విచారణ చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఆమోదించింది. ఒక్క అమెరికా తప్ప ఇతర సభ్యులందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్ లో పాల్గొనకపోవడమో చేశారు. ఇజ్రాయెల్ సాగించే అక్రమ వలస పాలనకూ, పాలస్తీనీయులపై అది సాగించే దౌర్జన్యాలకూ నిరంతరం వత్తాసు వచ్చే అమెరికా, మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్ష పాతంగా కూడి ఉందని హాస్యాస్పద ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పాలస్తీనీయుల ఆస్తులను కాపాడాలని తీర్మానం కోరింది. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెలీ సెటిలర్ల హింసాత్మక దాడులను నివారించాలనీ, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని తీర్మానం కోరింది.

47 మంది సభ్యులు గల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధలో తీర్మానానికి అనుకూలంగా 36 దేశాలు ఓటు వేయగా, పది దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. అమెరికా ఒక్కటే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. మానవ హక్కులను హరించడంలోనూ, దారుణమైన యుద్ధ నేరాలకు (వార్ క్రైమ్స్) పాల్పడడంలోనూ, మానవతా వ్యతిరేక నేరాలు (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) సాగించడంలోనూ తిరుగు లేని రికార్డు ఉన్న అమెరికా, అటువంటి నేరాల్లో అమెరికాకు జూనియర్ పార్టనర్ గా ఉన్న ఇజ్రాయెల్ కు వత్తాసుగా రావడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఇజ్రాయెల్ సెటిల్ మెంట్లు నిర్మించడం ఆపేస్తే తప్ప పాలస్తీనా సమస్య పరిష్కారం సాధ్యం కాదని ప్రకటించిన ఒబామా, సదరు సెటిల్ మెంట్ల నిర్మాణాన్ని అరికట్టడంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా లేడని అమెరికా వ్యతిరేక ఓటు ద్వారా స్పష్టం అవుతోంది.

1967 లో జరిగిన అరబ్ యుద్ధంలో ఇజ్రాయెల్ పాలస్తీనా ను ఆక్రమించింది. అమెరికా, యూరప్ దేశాలు అందజేసిన అత్యాధునిక ఆయుధాల సాయంతో పాలస్తీనాను ఆక్రమించుకోవడమే కాక చుట్టుపక్కల ఉన్న సిరియా, ఈజిప్టు, జోర్డాన్, లెబనాన్ దేశాల భూభాగాలను కూడా ఆక్రమించుకుంది. పాలస్తీనీయుల ఇండ్లను బలవంతంగా లాక్కుని, వాటిని నేలమట్టం చేసి అక్రమంగా సెటిల్ మెంట్లు నిర్మిస్తోంది. పాలస్తీనీయుల భూభాగాలపై ఇప్పటివరకూ వందకు పైగా ఇజ్రాయెల్ సెటిల్ మెంట్లు నిర్మించింది. యూరప్ తో పాటు ఇతర దేశాల నుండి రప్పించిన యూదులను సెటిల్ మెంట్లలో ఉంచుతూ పాలస్తీనీయులను పొరుగు అరబ్ దేశాలకు తరిమివేస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ నిర్మించిన అక్రమ సెటిల్ మెంట్లలో ఐదు లక్షలకు పైగా యూదులు నివసిస్తున్నారు.

పాలస్తీనీయులకు కనీస అవసరాలు తీరకుండా ఇజ్రాయెల్ అనేక అడ్డంకులు సృష్టిస్తోంది.  తాగునీరు, సాగు నీరు అందకుండా అడ్డుకుంటోంది. పాలస్తీనాలో ప్రధాన నీటి వనరు నీటి కుంటలు, సరస్సులే. ఈ నీటి వనరుల వద్దకు పాలస్తీనీయులు రాకుండా ఇజ్రాయెలీ సెటిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నీటి కుంటలు, సరస్సులను టూరిస్టు కేంద్రాలుగా మారుస్తున్నారు. దానితో పాలస్తీనీయులు పొలాలు పండడం గగనం అవుతోంది. వారి పొలాలన్నీ బీళ్ళుగా మారిపోతున్నాయి. ఆయుధాలు ధరించిన యూదు తీవ్రవాదులు పాలస్తీనీయులపై దాడులు చేస్తూ వారి ఇండ్ల నుండి తరిమి కొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. వారికి ఇజ్రాయెల్ పోలీసులు, సైన్యం సహాయంగా వస్తుంటారు. వీరి దుర్మార్గాలను ప్రశ్నించే వారిని అరెస్టు చేసి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కుతున్నారు. 

ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ దురన్యాయాలను అంతర్జాతీయ సమాజం గత యాభై సంవత్సరాలుగా చూస్తూ కూడా మౌనం పాటిస్తూ వచ్చింది. సిరియాలో లేని తిరుగుబాట్లను కిరాయి ఇచ్చి నడుపుతున్న అమెరికా, యూరప్ లు యాభై యేళ్ళ నుండి సాగుతున్న ఇజ్రాయెల్ వలస పాలననూ, మానవ హక్కుల ఉల్లంఘననూ, పాలస్తీనీయులపై సాగుతున్న దమనకాండనూ అంతం చేయడానికి ప్రయత్నించలేదు. తాము ప్రయత్నించకపోవడమే కాక ఇతరులు చేసిన ప్రయత్నాలను అవి నీరు గారుస్తూ వచ్చాయి.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ యధావిధిగా మానవ హక్కుల సంస్ధ తీర్మానంపై విషం కక్కాడు. “మానవ హక్కుల సంస్ధ తన తీర్మానానికి తానే సిగ్గు పడాలి” అని హుంకరించాడు. “మానవ హక్కుల సంస్ధ ఆటోమేటిక్ గా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా శత్రు భావన కలిగి ఉంది” అని నిందించాడు. సమితిలో పాకిస్ధాన్ రాయబారి జమీర్ అక్రమ్ తీర్మానంపై హర్షం వ్యక్తం చేశాడు. “అంతర్జాతీయ మానవతా, మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ తూర్పు జెరూసలేం తో పాటు తాను ఆక్రమించిన పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ అక్రమంగా సెటిల్ మెంట్లు నిర్మిస్తోంది” అని ప్రకటించాడు.

One thought on “ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

వ్యాఖ్యానించండి