బి.జె.పి ఎమ్మెల్యేల నీలి లీలలు: మొన్న కర్ణాటక, ఇపుడు గుజరాత్


Gujarat porn scandal 3కర్ణాటక అసెంబ్లీ లో బి.జె.పి ఎమ్మెల్యేల నీలి భాగోతం మర్చిపోక ముందే గుజరాత్ బి.జె.పి ఎమ్మేల్యేలు తాజాగా ‘నీలి’ వీధికెక్కారు. ప్రజాస్వామ్య కేంద్రాలు అని పాలక వర్గ పార్టీలు ఎంతో గొప్పగా చెప్పుకునే అసెంబ్లీ లంటే తమకు లెక్కే లేదని తేల్చేశారు. ఓ వైపు అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతుండగానే, తాము వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లో నీలి చిత్రాలు వీక్షించి తరించారు. తమ తలలపైనే ఉన్న జర్నలిస్టులు గమనించి స్పీకర్ కి ఫిర్యాదు చేశాక ‘అదేం లేదని’ బొంకుతున్నారు. హిందూ మతస్ధులు ఎంతో గొప్పగా చెప్పుకునే ‘స్వామీ వివేకానంద ఫోటోల’ మాటున నీలి చిత్రాలు వీక్షిస్తున్నారని జనలిస్టు చేసిన ఫిర్యాదును ‘కాంగ్రెస్ పార్టీ కుట్ర’ గా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎమ్మేల్యేలు శంకర్ చౌదరి, జేతా ధార్వాడ్ లు అసెంబ్లీలో వెనక వరసలో కూర్చుని ఐప్యాడ్ చూడడంలో మునిగిపోయారనీ, అందులో అసభ్య చిత్రాలు చూస్తున్నారనీ సీనియర్ జర్నలిస్టు ఒకరు స్పీకర్ అసిస్టెంటు కి ఫిర్యాదు చేశాడు. ఇద్దరు ఎమ్మెల్యేలూ మీడియా గ్యాలరీ కిందనే కూర్చోవడంతో వారి ఘన కార్యం జర్నలిస్టుల కంట బడింది. జర్నలిస్టు వెంటనే ఐ ప్యాడ్ క్లిప్పింగ్ ను తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ఫిర్యాదు మేరకు తమ ఐ ప్యాడ్ తీసుకుని వెంటనే అసెంబ్లీ వదిలి వెళ్లాలని స్పీకర్ ఆదేశించాడు. నీలి చిత్రాలను స్వామి వివేకానంద చిత్రాలతో కప్పి ఉంచారని ‘టైమ్స్ నౌ’ టి.వి ఛానెల్ తో మాట్లాడుతో ఒక జర్నలిస్టు చెప్పాడు.

ఘటనపై కాంగ్రెస్ ఎమ్మేల్యేలు గొడవ చేయడంతో అస్సెంబ్లీ గంట పాటు వాయిదా పడింది. ప్రజాస్వామ్య దేవాలయాలని బి.జె.పి ఎమ్మేల్యేలు అపవిత్రం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ వాపోయాడు. “బి.జె.పి పాలిత రాష్ట్రాలు ప్రజా స్వామ్య దేవాలయాలను ఉల్లంఘిస్తున్నారు” అని మనీష్ తివారీ స్పందించాడు. “ఇదే వారి నిజ రూపం” అని తేల్చేశాడు. హౌస్ కమిటీ వేసి విచారణ జరపాలని గుజరాత్ కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత అర్జున్ మోధ్వాడియా డిమాండ్ చేశాడు.

“కర్ణాటక అసెంబ్లీలో నీలి చిత్రాలు చూసినపుడే బి.జె.పి నిజ స్వరూపం బట్టబయలయింది. గుజరాత్ అసెంబ్లీ లో కూడా వారు నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారు. హౌస్ కమిటీ దీనిపై విచారణ జరపాలి” అని అర్జున్ డిమాండ్ చేశాడని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. బి.జె.పి సంస్కృతి, గుణ గణాలు దారుణంగా దిగజారాయని ఈ ఘటన చెబుతోందని గుజరాత్ కాంగ్రెస్ నాయకులు అభివర్ణించారు. పార్లమెంటులో ఓటుకి నోటు వసూలు చేయడం దగ్గర్నుండి, కర్ణాటక నీలి భాగోతం మీదుగా వారి ప్రయాణం పతనం దిశగా వెళ్తోందని వారు పత్రికలతో అన్నారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.

ఆరోపణలు నిజమని తేలితే కర్ణాటకలో చర్యలు తీసుకున్నట్లుగానే ఇక్కడా చర్యలు తీసుకుంటామని బి.జె.పి నాయకులు ప్రకటించారు. అయితే కర్ణాటక లో మంత్రులుగా రాజీనామా చేశారు తప్ప ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలన్న డిమాండ్ ని వారు అంగీకరించలేదు. కర్ణాటకలో దొరికింది ముగ్గురే అయినా పది మంది పైనే నీలి వీడియో వీక్షించారని అసెంబ్లీ విచారణ కమిటీ తేల్చింది. చివరికి సాక్ష్యాలు లేవని ఇపుడు అదే కమిటీ చెబుతోంది. కనుక కర్ణాటకలో విచారణ తంతు నడిపి వదిలి పెట్టినట్లే గుజరాత్ లో కూడా తంతు నడిపి ఏమీ లేదని తేల్చేస్తామని గుజరాత్ బి.జె.పి అంతరార్ధమా?

బి.జె.పి ఎమ్మెల్యేలే ఇటువంటి నీచ సంస్కృతిలో దొర్లుతూ దొరుకుతున్నారు. జర్నలిస్టులకు అడ్డంగా దొరికిపోయి కూడా బొంకుతున్నారు. భారతీయ సంస్కృతి కోడిగడుతోందని వాపోయే వీరు సంస్కృతీ వినాశనంలో యధా శక్తి పాలు పంచుకుంటున్నారు. అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని ఇలా పతన విలువలకు ప్రతీకలుగా మారుస్తున్నారు.

వ్యాఖ్యానించండి