ఖమ్మం స్కూల్ బస్ కాలవలో పడి 14 మంది పిల్లల మృతి


ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. స్కూల్ బస్సు కాలవలో పడిపోవడంతో 14 మంది స్కూల్ పిల్లలు చనిపోయారని ఎన్.డి.టి.వి తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొత్తం 40 మంది పిల్లలు దుర్ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.

కొత్త గూడెం మండలం లో ఎల్.వి.రెడ్డి స్కూల్ కి చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి కాల్వలో బోల్తా పడిందని ఎన్.డి.టి.వి తెలిపింది. గాయపడిన 18 మంది పిల్లలను ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన ఎనిమిది మంది పిల్లల సంగతి ఏమిటన్నది తెలియరాలేదు.

అయితే 25 మంది పిల్లలు గాయపడ్డారనీ, వారీనందరినీ ఆసుపత్రిలో చేర్చారనీ టి.వి 9 చెబుతోంది. ఒకటి నుండి ఏడవ తరగతి లోపు పిల్లలు బస్సులో ప్రత్యానిస్తున్నారని టి.వి 9 తెలిపింది. కొత్తగూడెం మండలం రాఘవాపురం గ్రామంలో దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుర్ఘటనకి కారణం ఏమిటన్నదీ తెలియలేదని ఏ.బి.ఎన్ టి.వి తెలిపింది. స్కూల్ బస్సులు ప్రాణాంతకంగా మారాయని టి.వి. 9 ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యాలు స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సులు కండిషన్ లో ఉండేలా శ్రద్ధ తీసుకోవడం లేదని ఆరోపించింది.

ప్రమాదం పట్ల ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన స్ధలానికి వెళ్ళి సహాయక చర్యలు స్వయంగా చేపట్టాలని కలెక్టర్ ని ఆదేశించాడు.

గత ఫిబ్రవరి నెలలో తూర్పు గోదావరి జిల్లాలో ఇలాగే స్కూల్ బస్సు కాల్వలో పడి నలుగురు పిల్లలు చనిపోయారు. నలభై మంది పిల్లలు గాయపడ్డారు. వారంతా కిండర్ గార్టెన్ చదువుతున్నవారే. india-education

చీప్ గా వస్తాయని స్కూల్ యాజమాన్యాలు సెకండ్ హ్యాండ్, ధర్డ్ హ్యాండ్ బస్సులు కొనుగోలు చేసి అందులో స్కూల్ పిల్లలను చేరవేస్తుంటాయి. చదువు చెప్పడం కూడా వ్యాపారంగా మారిపోయాక కాస్త ఆర్ధిక బలిమి ఉన్నవారు సైతం పాఠశాలలు నిర్వహిస్తున్న పరిస్ధితి దేశంలో నెలకొని ఉంది. వీరు ప్రధానంగా పిల్లలకు ఏ విధంగానైనా మార్కులు తెప్పించాలనే దృష్టి తప్ప స్కూల్ పిల్లలకు అందించవలసిన ఇతర సౌకర్యాలను పట్టించుకోవడం లేదు. ఆట స్ధలాలు, సైన్స్ లేబొరేటరీలు లాంటి సౌకర్యాలు ఉండవు. పేరుకు రెండు మూడు కంప్యూటర్లు పెట్టుకుని కంప్యూటర్ విద్యను ఎల్.కె.జి నుండే చెబుతామని ప్రచారం కూడా చేస్తుంటాయి. నిపుణులయిన టీచర్లను నియమించకుండా అరా కొర జీతాలిచ్చి ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారితో నెట్టుకొస్తుంటాయి. వీరి ప్రధాన దృష్టి ఆదాయమే తప్ప చదువు చెప్పడం కాదు. కనుక పిల్లల ఫీజులతో లాభదాయకత కోసం మాత్రమే చూస్తాయి.

ప్రభుత్వం విద్యా సౌకర్యం కల్పించవలసిన బాధ్యత నుండి తప్పుకోవడం వల్ల ఏర్పడిన దుష్పరిణాలివి.

వ్యాఖ్యానించండి