మార్చి 12 తెల్లవారు ఝామున, కాందహార్ సమీప గ్రామాల్లో ఆఫ్ఘనిస్ధాన్ పౌరులపై జరిపిన హత్యాకాండలో 20 మంది వరకూ అమెరికా సైనికులు పాల్గొన్నారని ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటరీ విచారణా కమిటీ తేల్చింది. ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటు సభ్యులతో ఏర్పడిన పార్లమెంటరీ విచారణ కమిటీ హత్యా కాండ బాధిత గ్రామాలను సందర్శించి వాస్తవాలు సేకరించింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది.
హామీద్జాయ్ లాలి, అబ్దుల్ రహీమ్ ఆయుబి, షకీబా హష్మి, సయ్యద్ మహమ్మద్ ఆఖుండ్, బిస్మిల్లా ఆఫ్ఘన్మాల్, షకీలా హష్మి (వీరంతా కాందహార్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు), అబ్దుల్ లతీఫ్ పద్రామ్ (ఉత్తర బదక్షాన్ రాష్ట్రం), మీర్బడ్ మంగల్ (ఖోస్ట్ రాష్ట్రం), ముహమ్మద్ సర్వార్ ఉస్మాని (ఫరా రాష్ట్రం) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారని ‘ఔట్ లుక్ ఆఫ్ఘనిస్ధాన్’ పత్రిక, ప్రెస్ టి.వి ప్రకటించాయి.సయ్యద్ ఇషాక్ జిలానీ ఈ కమిటీకి నాయకత్వం వహించాడు.
కమిటీ సభ్యులా బృందం రెండు రోజులపాటు విచారణ జరిపింది. బాధిత కుటుంబాలను, గిరిజన పెద్దలను, గాయపడినవారిని కలిసి వివరాలు సేకరించింది. పంజ్వాయ్ జిల్లాలోని బాధిత గ్రామాలు తిరిగి సాక్ష్యాలు సేకరించింది. 15 నుండి 20 మంది వరకు అమెరికా సైనికులు హత్యాకాండలో పాల్గొన్నట్లుగా తమ విచారణలో తేలిందని కమిటీ సభ్యుడు హామీద్జాయ్ లాలి తెలిపినట్లుగా ‘పఝ్వోక్ ఆఫ్ఘన్ న్యూస్’ పత్రిక తెలిపింది.
“హత్యాకాండ జరిగిన ప్రాంతాన్ని దగ్గర్నుండి పరిశీలించాము. కుటుంబ సభ్యులను కోల్పోయినవారితో మాట్లాడాము. గాయపడినవారితోనూ మాట్లాడాము. గిరిజన పెద్దలను కలిసాము” అని హామీద్జాయ్ తెలిపాడు. గంటపాటు హత్యాకాండ సాగిందని ఆయన తెలిపాడు. రెండు గ్రూపులుగా అమెరికా సైనికులు హత్యాకాండలో పాల్గొన్నారని తెలిపాడు. “గ్రామస్ధులు అమెరికా మిలట్రీ స్ధావారానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉన్నారు. ఒకే సైనికుడు రెండు గ్రామాలలో ఉన్న ఇళ్ళలో జొరబడి ఒకేసారి అంతమందిని చంపడం సాధ్యం కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. 16 మంది గ్రామస్ధులను రెండు గ్రూపులుగా వచ్చిన అమెరికా సైనికులు చంపేశారు. పిల్లలను స్త్రీలు అని కూడా చూడకుండా చంపడం దారుణం” అని హామీద్జాయ్ తెలిపాడు.
అమెరికన్ హంతకులను ఆఫ్ఘనిస్ధాన్ లోనే శిక్షించబడేలా ఆఫ్ఘన్ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని హామీద్జాయ్ కోరాడు. ప్రధాన నిందితుడిని అప్పుడే దేశం బైటికి తరలించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధ్యులైన సైనికులను శిక్షించనట్లయితే, విదేశీ సైన్యాలు (2001 బాన్ కాన్ఫరెన్స్ ద్వారా) ఆఫ్ఘనిస్ధాన్ లో తిష్టవేయడానికి అంగీకరించిన ఆఫ్ఘన్ నాయకులపై ఉద్యమం చేపడతామని గ్రామస్ధులు హెచ్చరించారని ఆయన తెలిపాడు. హంతకులను శిక్షించేవరకూ గిరిజన జీర్గా (సంఘం) శాంతించబోదని హెచ్చరించారని తెలిపాడు. రష్యాన్ల లాగానే అమెరికా సైనికులు కూడా ఆక్రమిత సైన్యంగా ప్రకటించవచ్చని హామీద్జాయ్ హెచ్చరించాడు.
ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ విచారణలో తేలిన అంశాలను పశ్చిమ దేశాల పత్రికలు అసలు పరిగణించడం లేదు. అమెరికా, నాటో అధిపతులు చెప్పిన ‘ఏకైనా సైనికుడు’ కధను అవి అదే పనిగా ప్రచారంలో పెట్టాయి. సదరు సైనికుడికి ఇరాక్ యుద్ధంలో తలకు గాయమయిందనీ, అందువల్లనే అతను పిచ్చిపట్టినట్లు ప్రవర్తించాడనీ ప్రచారం చేస్తున్నాయి. అతన్ని అనేకసార్లు యుద్ధాని వెళ్ళే డ్యూటీ వేయడంతోనే హత్యాకాండకి పాల్పడ్డాడని సూచిస్తున్నాయి.