అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్


Kazmi arestఇజ్రాయెల్ ఎంబసీ కారుపై బాంబు దాడి జరిగిన కేసులో నిందితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ ‘మొస్సాద్’  అనుమతించారన్న ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. “అనుమానితుడు మనిషి, ఆస్తి కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిందితుడిని విచారించినవారి జాబితాను తన ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితుడిపై జరిపిన విచారణపై తక్షణం ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ స్ధాయికి తగ్గని పోలీసు అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. “ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పందిగా నిందితుడిని మార్చారన్న” డిఫెన్స్ లాయర్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది.

ఢిల్లీ పోలీసులతో పాటు ఇజ్రాయెల్ అధికారులు (ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, మొస్సాద్ మొ.వి) ప్రతిరోజూ తనను వరుసపెట్టి విచారిస్తున్నారనీ, తామెవరో తెలియకుండా ఉండడానికి వారెవరూ యూనిఫారంలో లేరనీ కేసులో అనుమానితుడిగా అరెస్టయిన కజ్మీ మేజిస్ట్రేట్ కి తెలిపాడు. దానికి మేజిస్ట్రేట్ వినోద్ యాదవ్ స్పందించాడు.  “విచారణాధికారులు యూనిఫారం ధరించకపోవడం గురించి, పేర్లను సూచించే బ్యాడ్జి ధరించకపోవడం గురించీ, (బాంబు కేసు విచారణకి నియమించబడిన) స్పెషల్ సెల్ మౌనంగా ఉంది. వివరాలతో కూడిన సమాధానం ఫైల్ చేయండి” అని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించాడు. “కజ్మీ ని ఇంటరాగేట్ చేస్తున్న అధికారులకి సంబంధించి రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లయితే దాన్ని కోర్టులో ప్రవేశ పెట్టండి. లేదా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు తక్కువగాని పోలీసు అధికారి అఫిడవిట్ ద్వారా నిజాలేవిటో చెప్పాలి” అని మేజిస్ట్రేట్ ఆదేశించాడు. “అతను మనిషి. ఆస్తి కాదు” అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించాడు.

ఫిబ్రవరి 13 తేదీన ఢిల్లీలో ప్రధాని నివాసానికి అత్యంత చేరువగా బాంబు పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్ ఎంబసీ అధికారి ఒకరు ప్రయాణిస్తున్న కారుకు బైక్ పై వస్తున్న ఆగంతకులు తగిలించిన ‘అయస్కాంత బాంబు’ పేలడం వల్ల ఆ పేలుడు జరిగింది. అదే సమయంలో జార్జియా, ధాయిలాండ్ లలో కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి. ధాయిలాండ్ బాంబు పేలుడు వెనుక ఇరానియన్లు ఉన్నారని తెలియడంతో ఢిల్లీ బాంబు పేలుడులో కూడా ఇరానియన్లు ఉన్నారన్న అనుమానాలు తలెత్తాయి. ఇరానియన్ల హస్తం ఉందనదానికి ఆధారాలు లేవని భారత ప్రబ్బుత్వం ప్రకటించినప్పటికీ “పేలుడు వెనుక ఇరానియన్లు ఉన్నారని భారత ప్రభుత్వం తమతో చెప్పిందని” ఇజ్రాయెల్ ప్రకటించి భారత ప్రభుత్వం పరువు తీసింది. ఇరాన్ తో రాయబార సంబంధాలు చెడకుండా ఉండడానికి భారత దేశం పాటించిన సున్నితత్వాన్ని గౌరవించాలన్న కనీస మర్యాదను ఇజ్రాయెల్ పాటించలేదు.

బాంబు పేలుడు కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు ‘సయ్యద్ మహమ్మద్ అహ్మద్ కజ్మీ’ ని అరెస్టు చేశారు. బాంబు పేలుడుకి పాల్పడ్డాడని భావిస్తున్న అనుమానితుడితో కజ్మీ సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఒక ఇరానియన్ ప్రచురణ సంస్ధకు పని చేస్తున్న కజ్మీ ని ఢిల్లీ లో ప్రత్యేక సెల్ కి చెందిన పోలీసులు, అనుమానంతో అరెస్టు చేశారు. మార్చి 27 వరకు పోలీసు కస్టడీకి కజ్మీని తరలించాలని మేజేస్ట్రేట్ ఆదేశించాడు. గురువారం మేజిస్ట్రేట్ వద్దకు హాజరు పరిచిన సందర్భంగా కజ్మీ ‘తనను చిత్ర హింసలు పెడుతున్నారని’ మేజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర దేశాల విచారణాధికారులు కూడా ప్రతి రోజూ తనను విచారిస్తున్నారని తెలిపాడు. ప్రతిరోజూ తనను కొత్త కొత్తవారు విచారిస్తున్నారని తెలిపాడు. తాను ఎన్నడూ చేయని నేరానికి పాల్పడ్డట్టుగా ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని తెలిపాడు.

ఢిల్లీ పోలీసులు ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టం ప్రకారమే అనుమానితుడిని విచారిస్తున్నామని తెలిపారు. హింశిస్తున్నామన్న ఆరోపణలు తిరస్కరించారు. ఆరోపణలు నిజం కాదని వ్రాత పూర్వకంగా మేజిస్ట్రేట్ కి తెలిపారు. “విచారణ చాలా ప్రారంభ దశలో ఉంది. కీలక దశలో ఉంది. కనుక విచారణను కేటాయించబడిన అధికారి మాత్రమే చేస్తున్నాడు. ఏ విదేశీ సంస్ధా విచారణలో పాల్గొనడం లేదు” అని ఢిల్లీ పోలీసులు తెలిపారని ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది.

కజ్మీని ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియజేసే ‘అరెస్టు మేమో’ ను కజ్మీకి అందజేశారో లేదో రాత పూర్వకంగా తనకు చెప్పాలని కూడా మేజిస్ట్రేట్ ఆదేశించాడు. కజ్మీని విచారిస్తున్న సందర్భంగా తాను అక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వాలన్న డిఫెన్స్ లాయర్ కోరికను మేజిస్ట్రేట్ అనుమతించాడు. కజ్మీ లాయర్ ఉనికి తమ విచారణకు ఆటంకం అన్న పోలీసుల వాదనను తిరస్కరించాడు. లాయర్ సమక్షంలో విచారణ సాగడానికి తగిన ఏర్పాట్లు ఎలా చేస్తారో తనకు చెప్పాలని పోలీసులను కోరాడు.

భారత దేశంలో బ్రాహ్మణులను దేవుడికీ, భక్తులకూ అనుసంధాన కర్తలుగా భావిస్తున్నట్లుగా, ప్రపంచ క్రైస్తవులు కూడా తమను అలాగే భావించాలని యూదులు భావిస్తారు. ఇతర ప్రజానీకం కంటే తాము ఉన్నత జాతిగా ప్రపంచం అంతా పరిగణించాలని వారు కోరుతున్నట్లుగా వారి మాటలు ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఇలాంటి భావాలను వివిధ సందర్భాలలో వ్యక్తం చేస్తుంటుంది. మానవులంతా సమానమే నన్న ‘విశ్వ మానవ సౌభ్రాతృత్వ’ సూక్తిని వారు నమ్ముతున్నట్లు ఏ కోశానా కనిపించదు. ముఖ్యంగా అరబ్బు జాతి ప్రజలను చాలా హీనంగా పరిగణిస్తారు. పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా పాలస్తీనా ప్రజలకు నిత్యం నరకాన్ని చూపుతోంది ఇజ్రాయెల్. దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వ లాగానే ఇజ్రాయెల్ రోడ్లను ఉపయోగించడానికి పాలస్తీనా ప్రజలను అక్కడి ప్రభుత్వం అంగీకరించదు. పాలస్తీనీయులపై పచ్చిగా జాత్యహంకారాన్ని అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి మౌన ప్రేక్షకులుగా ఉంటున్నాయి.

పశ్చిమాసియాలో ఆయిల్ వనరులున్న అరబ్ దేశాలపై అదుపు కొనసాగించడానికి తన సామంత దేశంగా అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ ను బలవంతంగా ఏర్పాటు చేశాయి. పాలస్తీనా ప్రజలను వారి ఇండ్లనుండి తరిమి కొట్టి హత్యాకాండ జరిపి అరవై యేళ్ళ క్రితం ఇజ్రాయెల్ ను అవి ఏర్పరిచాయి. అప్పటినుండీ పాలస్తీనీయులు నిలవ నీడ లేకుండా గడుపుతున్నారు. చుట్టుపక్కల అరబ్బు దేశాల్లో శరణార్ధి శిబిరాల్లో వారు గడుపుతున్నారు. తిరిగి తమ దేశం వెళ్ళడానికి వారు అరవై యేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. అనేక అకృత్యాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా, యూరప్ లు పూర్తి మద్దతు నిస్తున్నాయి. అమెరికా అండ చూసుకుని తమ జాత్యహంకారాన్ని ఇజ్రాయెల్ ప్రపంచం అంతా అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అమెరికాలాగే తమకు కూడా అన్నీ దేశాల్లో ఆధిక్యత తో కూడిన ప్రవేశం ఉండాలని కోరుతున్నట్లుగా దాని ప్రకటనలు ఉంటాయి.

ఈ నేపధ్యంలో చూసినపుడు భారత దేశంలో ఒక నేరంలో అరెస్టయిన అనుమానితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచారులు సిద్ధపడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అయితే దానికి భారత ప్రభుత్వం అనుమతించడమే ఆందోళనకరం. భారత దేశంలో టెర్రరిస్టు చర్యలకు దిగి వందల మందిని చంపిన కేసులో నిందితులు రాణా, డేవిడ్ హ్యాడ్లీ లు అమెరికాలో బందీలుగా ఉన్నారు. వారిని విచారించడానికి భారత ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞాప్తి చేసినప్పటికీ అమెరికా అంగీకరించలేదు. నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం వారిని భారత దేశానికి అమెరికా అప్పగించవలసి ఉంది. అప్పగించకపోయినా కనీసం అమెరికా వచ్చి విచారించుకుంటామని కోరినా అమెరికా ఒప్పుకోలేదు. అలాంటిది కేవలం అనుమానితుడు మాత్రమే అయిన కజ్మీని విచారించడానికి ఏకంగా ఇజ్రాయెల్ గూఢచారులనే అనుమతించడం తీవ్ర తప్పిదం. భారత దేశానికి సంబంధించి రాయబార పరమైన సున్నితాంశాలను ఏ మాత్రం గౌరవించని ఇజ్రాయెల్ కి అలాంటి అవకాశం కల్పించడం అసలు అంగీకరించలేము.

అహ్మద్ కజ్మీ ఉర్దూ జర్నలిస్టు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకీంచే వ్యక్తి. ఇజ్రాయెల్ జాత్యహంకారాన్ని విమర్శించే వ్యక్తి. ‘ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్’ బైట ఉండగా అతన్ని ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అతన్ని ఎందుకు అరెస్టు చేస్తున్నదీ కూడా పోలీసులు అతనికి చెప్పలేదు. గత ఇరవై సంవత్సరాలలో ఆయన దూర దర్శన్ కోసం వార్తలను సేకరించాడు. బి.బి.సి కోసం కూడా పని చేశాడు. ఇంకా అనేక ఇతర వార్తా సంస్ధలకు ఆయన పని చేశాడు. ఉర్దూ దినపత్రికలకు పని చేశాడు.

స్పెషల్ సెల్ కి చెందిన ఢిల్లీ పోలీసులు మార్చి 6 న సివిల్ అడ్రస్ లో వచ్చి కజ్మీని కారులో బలవంతంగా ఎక్కించుకుపోయారు. ఆ రోజు రాత్రి అతని ఇంటికి వెళ్ళి అతని కుమారుడి చేత ‘అరెస్టు మేమో’ ఇచ్చినట్లుగా బలవంతంగా సంతకం పెట్టించుకుని వెళ్లారు. నిజానికి కజ్మీకి అరెస్టు మేమో అంధజేసి సంతకం తీసుకోవలసి ఉండగా ఆలాజరగలేదు. ‘తీవ్ర పరిణామాలుంటాయని’ హెచ్చరించి అతని కొడుకు చేత సంతకం తీసుకున్నారు. అందుకే కజ్మీ కి ‘అరెస్టు మెమో’ ఇచ్చినట్లు రాతపూర్వకంగా పోలీసులు చెప్పాలని మేజేస్ట్రేట్ కోరాడు. కజ్మీ అరెస్టు అనంతరం ఢిల్లీ పోలీసులు చెప్పిన కధనాలనే భారత కార్పొరేట్ పత్రికలు ప్రచారంలో పెట్టాయి. వాస్తవాలు విచారించాలన్న నియమాన్ని వారు పాటించలేదు. అరెస్టు అయిన దగ్గర్నుండీ కజ్మీని కలుసుకోవడానికి ఆయన కుటుంబ సభ్యులను ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.

విచారణాధికారులు కజ్మీ గురించి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇరాన్ నుండి వచ్చిన ‘మాడ్యూలు’ పేలుడుకి పాల్పడిందనీ, వారికి కజ్మీ ‘లాజిస్టికల్ సపోర్టు’ అంధించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ రాయబారులను పేల్చివేసే అంతర్జాతీయ కుట్రకు కజ్మీ పాల్పడ్డాడని వారు ఆరోపిస్తున్నారు. జర్నలిస్టుగా కజ్మీ అనేక అరబ్ దేశాలు పర్యటించాడు. ఇరాన్, సిరియా తదితర పశ్చిమాసియా దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలనే పోలీసులు ఇప్పుడు సాక్ష్యాలుగా చూపుతున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికీ, ఇజ్రాయెల్ జాత్యహంకారానికీ వ్యతిరేకంగా కజ్మీకి ఉన్న వ్యతిరేకత నూ, అనేక అరబ్బు దేశాల భాషలలో అతనికి ఉన్న తెలివిడినీ పోలీసులు సాక్ష్యంగా చూపుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాలపై అభిప్రాయాలూ కలిగి ఉండడమే నేరమన్నట్లుగా ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. కజ్మీ అరెస్టును ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్’ కూడా కజ్మీ అరెస్టు ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

కజ్మీకి వ్యతిరేకంగా ఆధారాలేవీ లేకపోయినా మేజిస్ట్రేట్ అతన్ని 20 రోజుల కస్టడీకి అనుమతించాడు. కజ్మీ అరెస్టు సందర్భంగా పోలీసులు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లు ఫోర్జరీవని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. పోలీసులు కేస్ డెయిరీ ప్రవేశపెట్టాలన్న నిబంధనను పాటించలేదు. పౌర దుస్తుల్లో వచ్చి అరెస్టు చేసినందున ‘అక్రమ అరెస్టు’ కిందకి వస్తుంది. కజ్మీకి వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లేకపోయినా ‘అసలు నిందితులు’ తప్పించుకుంటారన్న సాకు చూపి సాక్ష్యాలు వెల్లడించడానికి పోలీసులు తిరస్కరించారు. ఎక్కడో ధర్నాలో ఉండగా అరెస్టు చేశామని కూడా పోలీసులు అబద్ధాలు చెప్పినట్లు తెలుస్తోంది.

అరెస్టుకి కొద్ది రోజుల ముందు ఎన్.డి.టి.వి లో మాట్లాడుతూ కజ్మీ ఇరాన్ పై అమెరికా సాగిస్తున్న యుద్ధ ప్రయత్నాలను వ్యతిరేకించాడు. ఢిల్లీ పోలీసులకు ఇది అవకాశంగా దొరికింది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమిని పల్లెత్తు మాట అనలేని భారత ప్రభుత్వం ఆ కూటమిని సంతృప్తి పరచడానికి సంబంధలేని వ్యక్తిని నిర్బంధించడమే కాక, తన పౌరుడిని పరాయి దేశ పోలీసులు విచారించడానికి కూడా అనుమతించింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన గూఢచారులు కజ్మీని విచారిస్తున్నట్లు అనేక పత్రికలు వెల్లడించినప్పటికీ భారత ప్రభుత్వం ఆ విషయమై ఏమీ మాట్లాడలేదు.

4 thoughts on “అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్

  1. కజ్మీని ఇజ్రాయిల్ విచారణాధికారులు దర్యాప్తు చేయడం అసమంజసమన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

    కానీ యూదుల్నీ, మన దేశపు బ్రాహ్మణుల్నీ పోల్చడం సరికాదు. ఈ మధ్యకాలంలో సమానంగా ద్వేషించబడడం మినహాయిస్తే ఈ రెండు జాతులకీ పెద్దగా పోలికల్లేవు మొదట్నుంచీ ! యూదులు క్రైస్తవులకి ప్రమాణం కారు. కానీ ఇండియాలో బ్రాహ్మణులు (కనీసం ప్రాచీన బ్రాహ్మణులు), వారు రచించిన గ్రంథాలూ 90 కోట్లమంది హిందువులందరికీ ఈనాటికీ పరమప్రమాణం. యూదులు క్రైస్తవప్రపంచంలో ఎప్పుడూ ఏ విధమైన గౌరవానికీ నోచుకోలేదు. కానీ బ్రాహ్మణుల పరిస్థితి అది కాదు. మన దేశస్థులు బ్రాహ్మణుల్ని దేవుడి కన్నా ఎక్కువగా నెత్తిన పె ట్టుకున్నారు. యూదులు తరతరాలుగా వ్యాపారస్థులూ, సంపన్నులూ ! వారు ఇతరులకి ఉపాధి కల్పించగలరు. బ్రాహ్మణులకి అందులో ఓనమాలు రాకపోవడమే కాక చాలా పేదకులంగా పేరుమోశారు. ఇతరుల కింద పనిచేయడమొక్కటే బ్రాహ్మణులకి తెలుసు. వారు ఎవరినీ పోషించే పరిస్థితి లేదు.

    యూదుల విషయానికొస్తే – ఏ ఇతరజాతి కన్నా మరీ ఎక్కువ ఆత్మాభిమానమేమీ వారికి లేదు. వారు ఇతరుల నుంచి గౌరవాలాశించిన దాఖలా లేదు. కానీ ఇతరులే వారిని నిష్కారణంగా నీచంగా హింసిన, అవమానించిన, చంపిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కనీస మానవత్వ హుందాతనాన్ని కూడా వారికెవరూ ఇవ్వలేదు. వారిని క్రైస్తవులూ, మహ్మదీయులూ ద్వేషించడానికి గల అసలుకారణం – వారు క్రీస్తుని దేవుని కుమారుడుగా, ప్రవక్తగా ఆంగీకరించకపోవడమే. అయితే అంతమాత్రాన ఇప్పుడు ఇజ్రాయిల్ ఒడిగడుతున్న ఓవర్ యాక్షన్ని నేను సమర్థిస్తున్నానని భావించవద్దు.

  2. నేను పోల్చింది యూదుల్ని, బ్రాహ్మణుల్ని కాదు. వారి పట్ల వారున్న సమాజాల్లో ఉన్న అభిప్రాయాలను పోల్చాను.

    నిజం చెప్పాలంటే పోల్చడం నా అభిమతం కాదు. యూదులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకున్నవారితో నేను కొన్ని సార్లు చర్చించాను. ఇంటర్నెట్ లోనే యూదు జాత్యహంకారాన్ని వ్యక్తం చేసే కొన్ని బ్లాగుల్లో ఆ చర్చలు జరిపాను. ఆ చర్చల్లో వారు వ్యక్తం చేసిన అవగాహనను నేనిక్కడ చెప్పదలిచాను. మనకు పరిచయం ఉన్న ఒక సామాజిక పరిస్ధితిని ఉదాహరణగా చూపిస్తే చదువరులకు తేలికగా, త్వరగా అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది గనక పై విధంగా చెప్పాను.

    యూదులకి ఇతరులు, ముఖ్యంగా క్రైస్తవులు గౌరవం ఇచ్చే విషయంలో మీరు చెప్పినదానిలో వాస్తవాలున్నాయి. అయితే నేను చెప్పదలుచుకున్నది అది కాదు. యూదులు తమ పట్ల ప్రపంచం ఎలా భావించాలని కోరుకుంటున్నారన్న విషయం చెప్పదలిచాను. యూదులందరూ నేను చెప్పినట్లే భావించకపోవచ్చు. వారిలో జాత్యహంకారాన్ని వ్యతిరేకించేవారితో కూడా నేను చర్చించాను. సాధారణంగా యూదులు తమ గురించి తాము ఎలా భావించేదీ, ఇతరులు తమ గురించి ఎలా భావించాలో కోరుకుంటున్నదీ నేను జరిపిన చర్చల ఆధారంగా పైన ప్రస్తావించాను. మీరు కోరుతున్న దాఖలా ఏమిటో నాకు తెలియదు.

    యూదులు జాత్యాభిమానం ఏ స్ధాయిలో ఉన్నదీ తెలియడానికి ఏమిటి కొలబద్ద? ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు పరికిస్తే ఆ విషయంపై ఒక అవగాహనకు రావచ్చని నా అవగాహన. ఇజ్రాయెల్ దేశంలో అనేకసార్లు మితవాదులే అధికారం చెలాయించారు. ఇప్పటి నెతన్యాహూ ప్రభుత్వం కూడా మితవాద ప్రభుత్వమే. ఈ మితవాద పార్టీల అభిప్రాయం ప్రకారం: ఇజ్రాయెల్ పూర్తిగా యూదు దేశం. యూదులు మాత్రమే ఉండవలసిన దేశం. ప్రపంచంలో ఉత్కృష్టమైన జాతి యూదు జాతి. శాస్త్ర, సాంకేతిక రంగంలో అనేక ఆవిష్కరణలు యూదులు చేశారు. యూదు జాతి లేకుండా ఈ శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు సాధ్యం అయి ఉండేవి కావు. పాలస్తీనీయులు, అరబ్బులు మొరటువాళ్లు. వారు యూదు జాతికి లొంగి ఉండవలసినవారు. మానవాళిని ముందుండి నడిపించే బాధ్యత యెహోవా దేవుడు యూదు జాతికి అప్పజెప్పాడు. ఆ పవిత్ర కర్తవ్యాన్ని యూదు జాతి నిర్వహిస్తోంది. కనుక వారు పరమోన్నత మానవులు.

    బహుశా హిట్లర్ కాలంలో యూదులపై జరిపిన హింసాకాండ గురించి చెబుతున్నారనుకుంటా. నిజానికి యూదులను తరిమేయాలని యూరోపియన్ దేశాల పాలకవర్గాలన్నీ భావించాయి. తమ తమ దేశాల్లో వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి సంపదలు కూడబెట్టడమే వారి కంటగింపుకు ప్రధాన కారణం. వారిని తరిమేసి వారు కూడబెట్టిన సంపదలను తమ వశం చేసుకునే కుట్రలో భాగంగా యూదులపై జాతి విద్వేషాల్ని రెచ్చగొట్టారు. జర్మనీయే కాక బ్రిటన్, ఫ్రాన్సు వివిధ స్ధాయిల్లో యూదు వ్యతిరేక కుట్రలకి దిగారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది గనక ఒక్క జర్మనీయే యూదు వ్యతిరేక కుట్రలకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. బ్రిటన్, ఫ్రాన్సు, పోలండ్ తదితర దేశాల్లో యూదులపై జరిగిన హింసలకు కూడా జర్మనీ (హిట్లర్)యే కారణంగా ప్రచారం జరిగింది.

    తమ తమ దేశాల నుండి యూదులను తరిమివేసి వారి సంపదలను వశం చేసుకునే కుట్రలో భాగంగానే బ్రిటన్ నేతృత్వంలో యూరప్ దేశాలు ఇజ్రాయెల్ సృష్టికి పధకం పన్నాయి. ఆయిల్ సంపదలున్న మధ్య ప్రాచ్యంలో (పశ్చిమాసియా) తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడుకోవడం కూడా ఇజ్రాయెల్ సృష్టి కోసం యూరప్, అమెరికాలు పన్నిన పన్నాగానికి ప్రధాన కారణం. యూదులకు ఒక స్వంత దేశం కావలన్న ప్రచారం మొదలు పెట్టి వారిని బాధితులుగా ప్రచారం చేశాయి. ఒక భూభాగం లేకపోవడం వల్లనే వారు బాధలకు గురవుతున్నట్లు ప్రచారం చేసాయి. పాలస్తీనాను యూదుల జన్మస్ధలంగా బైబిల్ ఆధారంగా ప్రచారం చేసి పాలస్తీనీయులను అక్కడి నుండి తరిమివేసి యూరప్ దేశాల నుండి యూదులను అక్కడికి తరలించాయి. యూదుల సమస్యను పరిష్కరించే పేరుతో పాలస్తీనా సమస్యకు శ్రీకారం చుట్టాయి.

    ఈ విషయాలు నేను కనిపెట్టినవి కావు. తెలుసుకున్నవి మాత్రమే.

    బ్రాహ్మణుల గురించి మీరు చెప్పినవి వాస్తవాలుగా నాకు కనిపించడం లేదు. అన్ని కులాల్లో పేదలున్నట్లే వారిలోనూ పేదలున్నారు. భారత దేశంలో పేద కులాలు ఎస్.సి, ఎస్.టిలుగా గుర్తించబడ్డారన్న సంగతి మీకు తెలియదనుకోవాలా? తర తరాలుగా సామాజిక, ఆర్ధిక అణచివేతలకు గురికాబడిన ఎస్.సి, ఎస్.టి లు కాకుండా, అవే తరాలుగా సమాజంలో ఉన్నత స్ధితిలో ఉన్న బ్రాహ్మణులను పేద కులంగా చెప్పడం ఏమిటో నాకు బోధపడలేదు.

    భారత దేశ అధికార వర్గంలో (ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ లాంటి సివిల్ సర్వీసులు, గ్రూప్ వన్ లాంటి రాష్ట్రాల ఉన్నత సర్వీసుల ద్వారా ఎన్నికయినవారు) డెబ్భై శాతం బ్రాహ్మణులేనని 1990 ల్లో ప్రభుత్వం జరిపిన సర్వేలో తేలినట్లు నేను చదివాను. ఎల్.ఐ.సి, బ్యాంకులు భారత దేశ ద్రవ్య రంగంలో అతి పెద్ద సంస్ధలు. ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అధిక శాతం ఇవే సమకూరుస్తాయి. ఇవి రెండింటిలోనూ బ్రాహ్మణులదే ఆధిపత్యం అని అందరూ అంగీకరించే సత్యం. ఒక్క రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు సంపాదించినవారు తప్ప ఇతరుల్లో అత్యధికులు బ్రాహ్మణులే అక్కడ ఉన్నారు. యూనియన్లలో కూడా వారే ఉన్నతస్ధానాలు ఆక్రమించి ప్రమోషన్లలో అధిక స్ధానాలు సంపాదించడంలో ప్రముఖ పాత్ర్ర పోషిస్తున్నారు. ఉదాహరణకి నేను ఎల్.ఐ.సి లో పని చేస్తున్నాను. నేను పని చేస్తున్న బ్రాంచి ఆఫీసుకు గత పాతిక సంవత్సరాలుగా బ్రాహ్మణులే మేనేజర్లుగా వస్తున్నారు. మధ్యలో రెండు సంవత్సరాలు వైశ్యకులానికి చెందిన ఒక వ్యక్తి మేనేజర్ గా వచ్చారంతే. మిగిలినకాలం అంతా బ్రాహ్మణులే, ఇప్పుడు కూడా. బ్యాంకుల్లోనూ ఇదే పరిస్ధితి.

    ఒక పేద కులానికి ఇదేలా సాధ్యం?

    నిజానికి పేదలు అన్ని కులాల్లోనూ ఉన్నారు. కాని కుల పరంగా ధనిక పేదలను గుర్తించాలంటే బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాలనే ధనిక కులాలుగా గుర్తించవలసి ఉంటుంది. గత పాతికేళ్లుగా వస్తున్న పరిణామాల వల్ల, భూములపైనా, పరిశ్రమలపైనా ఆధిపత్యం క్రమేపీ పెరగడం వల్ల ఇతర అగ్రకులాలవారు కూడా ధనికులుగా మారారు. కాని ఎస్.సి, ఎస్.టి ల పరిస్ధితి దాదాపుగా అదే విధంగా కొనసాగుతోంది. రిజర్వేషన్లవల్ల కొందరు ఉద్యోగాలు సంపాదించి మధ్యతరగతిగా మారారు గానీ ధనికులుగా మాత్రం మారలేదు. అంటే దేశంలోని ప్రధాన ఉత్పత్తి సాధనాలైన భూమి, పరిశ్రమలపైన ఆధిపత్యం ఉన్న వర్గాలలో ఎస్.సి, ఎస్.టి కులాలవారిని దుర్భిణీ వేసి వెతకవలసిందే కదా.

    ఈ మధ్య బ్రాహ్మణ సంఘం వారు టి.విలో మాట్లాడుతుండగా విన్నాను. మరే ఇతర కులంవారికి లేనంత బుద్ధిబలం వారికి మాత్రమే ఉన్నదని వారు చెప్పారు. అలాంటి బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం లేదని వారు వాపోయారు. బ్రాహ్మణులుగనక రాజకీయాల్లో అధిపత్యం వహిస్తే అవినీతి జరిగే అవకాశమే లేదని వారు చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు తెలియని కులం గనుక రాజకీయాల్లో గూండాయిజానికీ, అణచివేతకీ తావు ఉండదనీ చెప్పారు. దేశం సుభిక్షంగా ఉంచడం వారికే సాధ్యమని వారు చెప్పారు.

    ఇది అహంకారం కాదా? అన్ని కులాల కంటే తమకే ఎక్కువ తెలివితేటలున్నాయని చెప్పడానికే వారు తమకు ఎక్కువ బుద్ధిబలం ఉందని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటె ప్రతిభ తమకే ఉంది కనక తమకే రాజకీయాల్లో ఆధిపత్యం ఇవ్వాలని వారు చెప్పదలిచారు.

    మరి ఇన్నాళ్లూ రాజకీయాల్లో, పరిపాలనలో (బ్యూరోక్రసీ) అధిపత్యం వహించింది ఎవరు? మొదటి నలుగురు ప్రధానులు ఎవరు? వారు ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్ని లేవు? కుట్రలకు, కుతంత్రాలకూ పేరు మోసిన వ్యక్తి ఇందిరా గాంధీ కాదా? ఈ అగ్రకులాల పాలనలోనే కదా కోటి కోట్ల రూపాయల ప్రజాధనం స్విస్ బ్యాంకులకి తరలి వెళ్లింది? వీరి పాలనల పర్యవసానమే కదా నేటికీ 120 కోట్ల జనాభాలో అరవైశాతానికి పైగా దారిద్ర్యంలో బతుకుతున్నది? కోటి కోట్ల సొమ్ము స్విస్ బ్యాంకులకి తరలివెళ్లకుండా ఈ బుద్ధిబలశాలురు ఎందుకని అడ్డుకోలేదు? రాజకీయ అధికారంతో పాటు బ్యూరోక్రట్ అధికారం వీరి చేతుల్లోనే ఇన్నాళ్లూ ఉంది కదా? అయినా దేశం ఇలా తగలడిందేమి?

    నేను ఒక కులంవారినే దేశ దుస్ధితికి కారణంగా ఎంచడం లేదు. ఇన్నాళ్ళూ భూములు, పరిశ్రమలు చేతుల్లో ఉంచుకుని శాసించినవారే ప్రజలు దరిద్రంలో మగ్గడానికి కారణమని చెప్పదలిచాను. వారంతా అగ్ర కులాలకు చెందినవారే. అగ్రకులాలు చెందినవారే అరవైఐదేళ్లు దేశాన్ని ఏలాక ప్రతిభలేమి వల్ల, రిజర్వేషన్లవల్ల దేశం వెనకబడిపోయిందని చెప్పగలరా? (బుద్ధిబలం వాదనను ఉద్దేశిస్తూ ఇలా అంటున్నాను). కాని అలా చెప్పడానికి కొద్ది మంది సాహసిస్తున్నారు.

    భారతదేశంలో పరిశ్రమలపైనా, భూములపైనా ఆధిపత్యం వహిస్తున్న కులాల్లో బ్రాహ్మణులు కూడా ఒకరు. తర తరాలుగా ఉత్పత్తిసాధనాలపైన ఆధిపత్యం వహించినవారిలో వారూ ఉన్నారు. ఆ ఆధిపత్యం వల్లనే వారు ఇప్పటికీ ఉన్నతపదవులను ఆక్రమించి ఉన్నారు. అలాంటి వారు ఒకరి కింద పని చేసేవారుగా, పేదలుగా చెప్పడం సత్యదూరం.

    వ్యవస్ధను కులాలుగా చూడడం మాని ఆర్ధిక వర్గాలుగా చూడగలిగినపుడే అనేకానేక వైరుధ్యాలు పరిష్కరించబడడానికి తగిన దారి కనపడుతుందన్నది నా అభిప్రాయం. కులాలు సామాజిక వాస్తవాలే. కాని అవి ఆర్ధికంగా ఉన్న వర్గాలకు తమ ఆధిపత్యం కొనసాగించడానికి ఉపయోగపడే సాధనాలన్నది అంతే వాస్తవం. కులాలకు అతీతంగా పేదలంతా ఐక్యమై ఉత్పత్తి సాధనాలను వశం చేసుకున్నట్లయితే పేదరికాన్ని పారద్రోలవచ్చు.

  3. విశేఖర్ గారూ,
    మీ వ్యాస సారాంశంతో గాని వ్యాఖ్య సారాంశంతో గాని విభేదించడానికి ఏమీ లేదు కానీ వ్యాఖ్య విశేఖర్ గారూ,
    మీ వ్యాసంతో, మీ వ్యాఖ్య సారాంశంతో గాని విభేదించడానికి ఏమీ లేదు కాని వ్యాఖ్య చివరలో మీరు ఉటంకించిన వాక్యం ఈ దేశంలో 75 సంవత్సరాలుగా వివిధ కమ్యూనిస్టు పార్టీలు చెబుతూ వచ్చిన సాధారణ సూత్రీకరణను మాత్రమే మళ్లీ అదే రూపంలో ప్రతిపాదిస్తున్నదని నా సందేహం.

    “కులాలకు అతీతంగా పేదలంతా ఐక్యమై ఉత్పత్తి సాధనాలను వశం చేసుకున్నట్లయితే… ”

    ‘కూటికి పేదలం గాని కులానికి పేదలమా’ అనే కులాహంకార అభిజాత్యం, బిసి కులాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే కులపెత్తందారీతనం -అగ్రకుల పెత్తనం గురించి ప్రత్యేకించి ప్రస్తావించనవసరం లేదు- వేయి పడగలు చాచి బుసలు కొడుతున్న దేశంలో కులాలకు అతీతంగా పేదలు ఎలా ఐక్యం కాగలరు? దానికి ప్రాతిపదిక ఏమిటసలు? 75 ఏళ్లుగా పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఇదే విషయాన్ని వల్లె వేస్తూ ఒక వర్గంగా కూడా దళితులకు పూర్తిగా దూరమైపోయాయి.

    అంబేద్కర్ రాసిన ‘కులనిర్మూలన’ను చదివిన తర్వాత కూడా కులాలకు అతీతంగా పేదలు ఐక్యం కావడం అనే 50లకు ముందునాటి సూత్రీకరణను హైలెట్ చేయడం సరైంది కాదనుకుంటాను. కులాలకు అతీతంగా పేదలు ఐక్యం కావటం ఈ దేశంలో జరగాలంటే ఊరును వాడను దూరం చేస్తున్న సమస్త సరిహద్దులకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవం దాని నిజమైన రూపంలో ఇప్పటినుంచే ప్రారంభం కావలసిందే. ఇది జరగనంత కాలం కమ్యూనిస్టు పార్టీల ఆచరణ కూడా దళితుల వద్ద దళితుల మాటలు, బిసిల వద్ద బిసిల మాటలు, అగ్రకులాల వద్ద అగ్రకులాల మాటలు చెబుతూ పబ్బం గడుపుకునే చరిత్రను కొనసాగిస్తూనే ఉంటుంది.

    ఈ దేశంలో దాదాపు 20 శాతం పైగా ఉన్న దళితులను తాకడానికి కూడా అంగీకరించనివారు, వారితో సహపంక్తి భోజనాలకు కూర్చోవడానికి కూడా సహించనివారు, వాళ్లు తాగే గ్లాసులతో టీ తాగడానికి కూడా ఇష్టపడనివారు మీరు చెప్పిన కులాల పేదల్లో కోట్లాదిమంది ఈనాటికీ జీవనం సాగిస్తున్నప్పుడు కులాలకు అతీతంగా పేదలు ఐక్యం కావడం ఎలా సాధ్యమవుతుంది?

    మనసా వాచా కర్మేణా దళితుల, గిరిజనుల అభ్యున్నతి కోసం అత్యంత కఠినమార్గం అవలంబించి వారు పెట్టింది తిని ఆ విశ్వాసంతో ప్రాణార్పణలకు కూడా సిద్ధమైన చరిత్ర ఈ దేశంలో ఒక్క నక్సలైటు పార్టీలలో మాత్రమే కనిపిస్తుంది. వీళ్ల పంధాలోని లక్షలోపాలను గురించి మనం చర్చించవచ్చు, విమర్శించవచ్చు, దుమ్మెత్తి పోయవచ్చు కూడా.. కానీ దళితులూ, గిరిజనులూ కూడా మనుషులేననీ వీళ్లకూ గౌరవాభిమానాలుంటాయని నమ్మి, పాటించి గుండె నెత్తురులు చిమ్ముతున్న నిర్మల త్యాగం వీళ్లదే.. పేద కులాల ఐక్యత కులనిర్మూలనతోనే సాధ్యపడుతుందని సూత్రీకరించి కులసంఘాలకు వ్యతిరేకంగా కులనిర్మూలన సంఘాలను స్థాపించిన చరిత్ర కూడా వీరిదే.

    “వ్యవస్ధను కులాలుగా చూడడం మాని ఆర్ధిక వర్గాలుగా చూడగలిగినపుడే అనేకానేక వైరుధ్యాలు పరిష్కరించబడడానికి తగిన దారి కనపడుతుందన్నది నా అభిప్రాయం.”

    ప్రత్యక్షంగా కులం అనే ఘనీభవన దోపిడీ రూపం కళ్ళ ముందు కనిపిస్తూంటే కూడా వ్యవస్థను ఆర్థిక వర్గాలుగా మాత్రమే చూడటం ఎలా సాధ్యం? దళితులు, బీసీలు కాసిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని సంపదను కొద్ది కొద్దిగా కూడబెట్టుకుంటున్న చరిత్రను మనం చూస్తున్నప్పటికీ వీళ్లు కూడా పాలకవర్గ నిచ్చెన మెట్ల కింది వరుసలో భాగమవుతున్నప్పటికీ, మరో వందేళ్ల తర్వాత కూడా వీరు కులంలోపలి వివాహాలే తప్ప కులం బయటి వివాహాలు, కులాంతర సంబంధాలు ఏర్పర్చుకోవటం సాధ్యం కాదు. బెర్లిన్ గోడకన్నా మించిన గట్టి గోడలు ఇలా మన దేశంలోని పేదవర్గాలను దూర దూరం చేస్తున్నప్పుడు కులాల మధ్య ఐక్యత ఎలా సాధ్యమవుతుంది?

    భారతదేశంలో గుర్తింపు పొందిన పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలలో ఏ బడానేత అయినా తన కులం దాటి కులాంతర సంబంధాలలోకి వెళ్లిన చరిత్ర ఉందేమో చూడండి. అలాంటి వారు నూటికి కోటికీ ఒకరున్నా సరే వాళ్లకు సెల్యూట్ చేయాల్సిందే. కులాంతరం అంటే రెడ్డి కమ్యూనిస్టు నేత నాయుడి కమ్యూనిస్టు నేతనో, కార్యకర్తనో చేసుకోవడం కాదు. అగ్ర కుల కమ్యూనిస్టు నేతలు ఏ మేరకు దళిత, బిసి కులాలతో వివాహ సంబంధాల వేపు వెళుతున్నారని చూడాలి. ఇక్కడ కూడా కులానికి ఉన్న సరిహద్దులను చెరిపివేసింది నక్సలైట్ పార్టీనే. వర్ణ సంకరానికి, కుల సంకరానికి, నిజమైన ప్రజాస్వామిక సంబంధాలకు దారులు తీసిందీ తీస్తున్నదీ వీళ్లే.

    “తరాలుగా సమాజంలో ఉన్నత స్ధితిలో ఉన్న బ్రాహ్మణులను పేద కులంగా చెప్పడం”

    ఉన్నత చదువులతో నిచ్చెన మెట్లపై భాగాన్ని చేరినవారు, రాజ్యవ్యవస్థలో భాగమైన వారు… ఆలయాలలో వేతన వ్యవస్థ చట్రంలో సులువుగా ఇమిడిపోయిన వారు మినహాయిస్తే బ్రాహ్మణులలో చాలామంది ఈరోజు ఇతరకులాల్లో మాదిరిగా దారిద్ర్యంలోనే మగ్గుతున్నారు. భారత దేశ గ్రామీణ వ్యవస్థలోని ఉత్పత్తి సాధనాలపై వీరు పూర్తిగా పట్టు కోల్పోయారు. పెళ్ళి తంతు, చావు తంతుకు ఉపయోగపడే అయ్యవారు లేదా స్వామికి తప్పితే మన గ్రామాలు నేడు ఏ ఇతర బ్రాహ్మణులను కూడా పోషించే స్థితిలో లేవు.

    ‘బాపన సేద్యం’ అంటూ గ్రామీణ సమాజం హేతుపూర్వకంగానే పరిహసించిన తరహా వ్యవసాయంలో కూడా బ్రాహ్మణుల పాత్ర ఇవ్వాళ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈకోణంలోంచి చూస్తే అటూ ఇటూ కాకుండా పోయిన బ్రాహ్మణ పేదలను మనం సానుభూతితోనే పరిశీలించవలసి ఉంటుందని నా సూచన. కూటికి పేదలం కాని కులానికి పేదలం కాము అనే అభిజాత్యం వీరిలోనూ ఉన్నప్పటికీ అగ్రకులాల్లోని దారిద్ర్యాన్ని, కులం కూడా కాపాడలేకపోతున్న వారి జీవన వేదనను మనం అర్థం చేసుకోక తప్పదు.

    మీ వ్యాస నేపథ్యం నుంచి నా వ్యాఖ్య పక్కకు పోయినట్లు ఉందేమో.. క్షమించాలి.

  4. రాజ శేఖరరాజు గారు,
    మీరు దీనికి ముందరి వ్యాఖ్యలో ‘సారాంశంతో ఏకీభవిస్తున్నాను’ అని రాసినపుడే మీకు అభ్యంతరమైనది ఏదో ఉందని అర్ధమయింది. ఆ సంగతి మీరే చెబుతారని ఎదురు చూశాను. అనుకున్నట్లుగానే మీ అభ్యంతరం రాసారు.

    మీ వ్యాఖ్య రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో కుల వ్యవస్ధ ఎంతగా ఘనీభవించిందో చక్కగా మీరు వివరించారు. కాని రెండోభాగంలో బ్రాహ్మణ కులం గురించి సానుభూతితో చూడాలని మీరు చేసిన సూచన మొదటి భాగంతో విభేదిస్తున్న సంగతి మీరు గమనించారా? పూర్తిగా భిన్న ధృవంగా ఉందని చెప్పనుగానీ, మొదటి భాగం సారాంశానికి రెండవ భాగం ఒకానొక చోట పంటికింద రాయిలా తగులుతోంది.

    కులాలకు అతీతంగా పేదలు ఎలా ఐక్యం కాగలరు? అన్నది మీ ప్రశ్న. ఇప్పటి ప్రధాన స్రవంతి రాజకీయాల ద్వారా వారు ఐక్యం అయ్యే సమస్యే లేదు. మీరు సూచించినట్లు విప్లవరాజకీయాలు మాత్రమే వారి ఐక్యం చేస్తాయి. ఆ సంగతి నా వ్యాఖ్యలో లేదు. నేను సమాధానం చెప్పిన వ్యాఖ్యాతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ సమాధానం రాసాను తప్ప కుల సమస్యకు పరిష్కారం నేనా వ్యాఖ్యలో రాయలేదు. సాధారణ పాఠకులతో విప్లవ కార్యాచరణ గురించి చెప్పడం భావ్యం కాదు గనక నా సమాధానాన్ని కొన్ని పరిమితులలో రాసాను.

    విప్లవకారులు వర్గ రాజకీయాలలో భాగంగా ‘అన్ని కులాల్లోని పేదలంతా వర్గంగా ఐక్యం కావాలి. అప్పుడే కుల నిర్మూలన సాధ్యం’ అని ఎన్ని సంవత్సరాలు చెప్పినా అది జరగదు. విప్లవకారులు చేయవలసింది రాజకీయ కార్యాచరణ. అందులో సామాజిక కార్యాచరణ కూడా ఇమిడి ఉంటుంది.

    సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ప్రతి సందర్భంలో విప్లవకారులు కుల సమస్యను పరిష్కరించే కార్యాచరణను కూడా జోడించాలి. అది కుల సమస్యను చేపట్టినట్లుగా ‘స్ట్రైకింగ్’ గా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఉండకూడదు కూడా. విప్లవ కార్యాచరణలో పాల్గొంటున్నపుడే కమ్యూనిస్టు విప్లవకారులు భవిష్యత్తులో సాధ్యం అని తాము చెప్పే సోషలిస్టు సంస్కృతిని ఆచరణలో చూపించే కృషి చేపట్టవలసి ఉంటుంది.

    శ్రమకి అగ్రపీఠం వేస్తూ శ్రమ చేస్తున్నవర్గాలను గౌరవించే సంస్కృతిని ఆచరణలో శ్రామిక వర్గాలకు చూపగలగాలి. పుస్తక జ్ఞానం ఉన్నవారే మేధావులు కారనీ, ఏ చదువూ లేకపోయినా శ్రమ చేస్తూ నిర్ధిష్ట శ్రమలో నైపుణ్యం సంపాదించేవారు కూడా మేధావులేననీ ఆచరణలో శ్రామికవర్గాలకు ఇచ్చే గౌరవం ద్వారా చూపగలగాలి. గ్రంధ పూజ తో మార్క్సిస్టు పరిజ్ఞానం సంపాదించినంత మాత్రాన మార్క్సిస్టులు కారనీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలవారే నిజమైన మేధావులనీ తోటి కార్యకర్తలకు ఆచరణలో చూపగలగాలి.

    రాజకీయ కార్యకర్తగా ఎదురయ్యే ప్రతి దశలోనూ, ప్రతి అనుభవంలోనూ, ప్రతి సంబంధంలోనూ, ప్రతి మనిషితోనూ సోషలిస్టు సంస్కృతికి సంబంధించిన కార్యాచరణను చూపగలిగాలి. ఈ కృషిలోనే కుల సంస్కృతిని రూపుమాపే ప్రాధమిక కృషిని జోడించాలి. విప్లవకారులు తమ దైనందిన జీవితాలను ఒక గొప్ప ఉదాహరణగా సమాజానికి చూపగలిగితే వారు సోషలిజం గురించి చెప్పే కబుర్లు ఆచరణ సాధ్యం అని నమ్మడానికి కొంతయినా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కులవ్యతిరేక కబుర్లు చెప్పేటపుడు ఈ అంశం బాగా పరీక్షకు గురి కాబడుతుంది. రాజకీయాలు చెప్పేటపుడు విప్లవ రాజకీయాలు చెబుతూ తమ జీవితాలను విప్లవ సంస్కృతినుండి తమను తామే మినహాయించుకునే వారు వాగాడంబరులుగానే మిగిలిపోతారు. వారి వల్ల ఒరిగేదేమీ ఉండదు. కాకపోతే అభిప్రాయాలు కలిసినందుకో, వాదనల్లో తోడు దొరికినందుకో సంతోషించవచ్చునేమో.

    విప్లవకారుడు అగ్రకులానికి చెందినవాడయితే అతనిపైన కులనిర్మూలనా కృషి బాధ్యత ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుందని నాకనిపిస్తుంది. ఎందుకంటె అగ్ర కులస్దుడు కులాతీత చైతన్యాన్ని తన ఆచరణ ద్వారా అగ్ర, నిమ్న కులస్ధులిద్దరికీ చెప్పగలుగుతాడు. కాని నిమ్నకుల విప్లవకారుడు తోటి కులస్ధులకి చెప్పగలడెమో గానీ అగ్రకులస్ధులకి చెప్పగల సామాజిక స్ధితి కలిగి ఉండడు. నిమ్న కుల విప్లవకారుడు అగ్రకుల విప్లవకారులను కులాతీత చైతన్యానికి ప్రతీకగా చూపగలడు గానీ తనను తాను చూపగల లగ్జరీ అతనికి ఉండదు. అందుకే అగ్రకుల విప్లవకారులకు కుల నిర్మూలనా కృషికి సంబంధించినంతవరకూ అదనపు బాధ్యత ఉంటుందని నాకు తోస్తుంది.

    మీరన్నట్లు కులాలకు అతీతంగా పేదలను ఐక్యం చేయగల రాజకీయాలు విప్లవరాజకీయాలే. విప్లవ రాజకీయాలు ఉన్నవారు మాత్రమే కులాతీత ఆచరణను వాస్తవంగా చూపగలరు. అలాగని విప్లవకారులుగా చెప్పుకుంటున్నవారంతా ఆ పని చేయగలరని కాదు. వారిలో ఆచరణాత్మక విప్లవ రాజకీయాలు ఎంత లోతుగా వేళ్లూనుకున్నాయన్న దానిపై ఆధారపడి వారు నిమ్నకులాల్లో ఒకరిగా కలిసిపోయి కులాతీత చైతన్యాన్ని బోధనల ద్వారా కాక ఆచరణ ద్వారా ఇవ్వగలరు.

    ప్రభుత్వాలు నిమ్నకులాల కోసం రిజర్వేషన్లు పెట్టినట్లు విప్లవ పార్టీలు కూడా కుల సంఘాలు పెట్టడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. శ్రమ సంస్కృతి రీత్యా ప్రతి విప్లవకారుడూ నిమ్న కులస్ధుడుగా మారిపోతే తప్ప నిమ్న కులాలను విప్లవరాజకీయాల్లోకి ఆకర్షించలేము. అగ్రకులంలో పుట్టి నిమ్న కులాల ప్రయోజనాల కోసం పని చేయడం అంటే అదేదో ఉద్ధరిస్తున్నట్లుగా ఫోజులు పెట్టడం చాలామంది చేస్తున్న పొరబాటు. విప్లవ పార్టీలు కూడా ‘నిమ్నకులాలను ఆకర్షించడానికి అదనపు కృషి చేయాలి’ అని రాసుకుంటూ ఉంటారు. అది కూడా సరికాదని నా అభిప్రాయం. విప్లవకారుడిగా ఏ కృషి అవసరమో అది చేస్తే ప్రత్యేక కృషి చేయవలసిన అవసరం ఎందుకుంటుంది? దళితులకోసం కొన్ని తీర్మానాలు చేసి, కొన్ని కార్యక్రమాలు చేసి, కొన్ని సంఘాలు పెట్టి తామూ కుల నిర్మూలన కోసం పని చేస్తున్నట్లు ప్రత్యేకంగా చూపబూనడం కుల నిర్మూలన కృషి కాదని నేను భావిస్తాను. విప్లవ కృషి అంటేనే శ్రామిక ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి తగిన అన్ని కార్యక్రమాలూ ఆటోమేటిక్ గా చేపట్టడం. అది నిమ్నకులాలలో పని కావచ్చు. మహిళలలో పని కావచ్చు. విద్యార్ధులలో పని కావచ్చు. మరొక రంగంలో పని కావచ్చు. కుల నిర్మూలనా కృషి అన్ని రకాల సంఘాలలోనూ, సర్వకాల సర్వావస్ధలయందూ సాగవలసిన కృషి. దానిని ఒక సంఘం పనిగా, కొద్ది/చాలా మందిని కేటాయించి చేయవలసిన కృషిగా, ప్రత్యేకంగా చేయవలసిన కృషిగా చూడడమే ఒక వైఫల్యం అని నేను భావిస్తాను.

    శ్రామికవర్గం ప్రధానంగా ఉన్నది నిమ్నకులాలలోనే. కాని నిమ్నకులాలకు శ్రమ దోపిడీయే కాక సామాజిక దోపిడీ కూడా ఎదుర్కొంటున్నారన్న సంగతి విప్లవకారులు దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. సంఘాలలో పని చేస్తున్న సమయంలో కూడా కుల సమస్యపైన పని చేయగల అవకాశాలు బోల్డన్ని వస్తాయి. వాటిని వెనువెంటనే చేపట్టి తదనుగుణమైన కృషి చేయగలిగితే కులసమస్యను అనుభవించేవారు మనస్ఫూర్తిగా వర్గ సంఘాల కిందికి చేరతారు. కాని ఈ కృషిని ఎంతో చైతన్యవంతంగా చేయవలసిన కృషి. ఈ చైతన్యాన్ని విప్లవ పార్టీలు కార్యకర్తలకి అందించడంలో వైఫల్యం ఉందని నాకు తోస్తుంది. అందువల్లే కమ్యూనిస్టులు, విప్లవ పార్టీలతో సహా నిమ్న కులాల మేధావులను గానీ, కుల సంఘాల కింద ఆర్గనైజ్ అవుతున్న కేస్ట్ కాన్షియస్ కార్యకర్తలను గానీ ఆకర్షించలేకపోతున్నారు. చాలా చోట్ల నిరసనలు కూడా ఎదుర్కొంటున్నారు. లేదా పొందవలసిన ఆదరన నిమ్నకులాల నుండి పొందలేకపోతున్నారు. కులనిర్మూలనా కృషిని విప్లవానికి ముందూ తర్వాత కూడా చేయాలని చెబుతున్నప్పటికీ విప్లవకారులు ఆ విషయంలో వెనకబడే ఉన్నారు. వర్గ చైతన్యమా? కుల చైతన్యమా ఏది ముందు అన్న మిలియన్ డాలర్ల ప్రశ్నను విప్లవకారులు వేసుకుని చర్చోప చర్చలు సాగిస్తున్నారు. కాని అదసలు సమస్యా? అన్న అనుమానం నాకు కలుగుతుంది. వర్గ చైతన్యంలో కుల వ్యతిరేక చైతన్యం అనివార్యంగా కలిసే ఉంటుందని వారు గుర్తించడం లేదన్న అనుమానం నాకు కలుగుతుంది. వర్గ చైతన్యంలో భాగంగా కుల వ్యతిరేక చైతన్యాన్ని వారు త్రికరణ శుద్ధిగా కలిగిలేనందునే ఆ సమస్య మిలియన్ డాలర్ల సమస్యగా వారికి తోస్తున్నదని నా అభిప్రాయం. అయితే, అది కాన్షియస్ గా ఉందని నేను భావించను. అదొక కన్ఫ్యూజన్. కుల వ్యతిరేక చైతన్యాన్ని వర్గ చైతన్యంతో మిళితం చేయడం ఎలా అన్న సమస్యని పరిష్కరించలేకపోవడం నుండి ఉద్భవించిన కన్ఫ్యూజన్ అది. ఆ కన్యూఫజన్ తోలగినట్లయితే విప్లవ కార్యాచరణలో కుల నిర్మూలనా కృషి భేషుగ్గా జోడించబడుతుంది. ఆ విషయంలో విప్లవకారులు ఇంకా అనుభవం సంపాదించవలసే ఉంది. అయితే అనుభవం కూడా కార్యాచరణ ద్వారానే రావాలి గనుక విప్లవకారులు సీరియస్ దృష్టి పెట్టవలసే ఉంది. ఏది ముందన్న ప్రశ్న ఉండనే ఉంది కదా.

    పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు విప్లవ కార్యాచరణ నుండే పక్కకు వెళ్లాయి. ఇక వారి కుల నిర్మూలనా చైతన్యం గురించి మాట్లాడుకుని ఏం ప్రయోజనం?

    బ్రాహ్మణుల గురించి. పేద బ్రాహ్మణులు పేదలే? కాని బ్రాహ్మణ కులం పేదదా? పేద బ్రాహ్మణులు అన్న పదజాలం ప్రాచుర్యంలో ఉంది తప్ప పేద దళితులు అన్న పదజాలం ప్రాచుర్యంలో ఉన్నదా? లేదు. ఎందుకంటె దళిత కులాలే పేద కులాలు గనక. భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధకి ఉన్న ప్రధాన రూపాల్లొ ఒకటి కుల వ్యవస్ధ. కుల వ్యవస్ధ ద్వారానే భూస్వామ్య వ్యవస్ధ తన ఉనికిని ప్రధానంగా కొనసాగిస్తోంది. ఇతర అన్ని దేశాల్లో భూస్వామ్య వ్యవస్ధ నేరుగా విశ్లేషణలకు దొరికిపోయింది. పోరాటాలకు అదునుగా కూడా దొరికింది. భారత దేశంలో మాత్రం భూస్వామ్య వ్యవస్ధ కుల వ్యవస్ధ రూపంలో తన ఉనికిని నేటికీ కొనసాగించగలుగుతోంది. దైవత్వం ఆపాదించబడిన కుల వ్యవస్ధలో అగ్రజులైన బ్రాహ్మణ పేదలను ‘పేద బ్రాహ్మణులు’ గా ప్రత్యేకంగా చెప్పడం సరికాదని నా అభిప్రాయం. అగ్రకుల పేదలను పేదలుగా చెప్పాలి తప్ప పేద అగ్రకులస్ధులుగా చెప్పడం అంటే కుల వ్యవస్ధను పరోక్షంగా అంగీకరిస్తునట్లు కాదా? లేదా సానుభూతి చూపిస్తున్నట్లు కాదా? పేద బ్రాహ్మలకు సానుభూతి చూపడం అంటే భ్రాహ్మణ కులానికి సానుభూతి చూపడం కాదా? దళితుల దోపిడీని వర్గ పోరాటంతో పరిష్కరించాలని చెబుతూ, పేద బ్రాహ్మలని కులంతో ఎత్తి చూపడం ఎందుకు? పేదలని చెబితే సరిపోదా? దళిత కులాలే పేదవి కనుక, తర తరాల సామాజిక ఆర్ధిక దోపిడికి గురయిన కులాలు గనక ప్రత్యేక ప్రస్తావన అవసరం అవుతుంది. పేద బ్రాహ్మలన్న ప్రస్తావన ప్రత్యేకంగా ఎందుకు?

    పేద బ్రాహ్మలు పేదలు కావడానికి కులం కారణమా? కాదు కదా? కాని పేద దళితులు పేదలుగా కొనసాగడానికి కారణం సహస్రాబ్దాలుగా వారు దళితులు కావడం. ఈ తేడాని తప్పనిసరిగా గుర్తించాలి. పేద అగ్ర కులస్ధుడు ధనికుడుగా మారడానికి ఉన్న అవకాశాలు పేద దళితుడికి లేవు. పేద అగ్రకులస్ధులకి బంధువుల ద్వారా, వివాహం ద్వారా, రికమండేషన్ల ద్వారా, కులం ద్వారా ఉన్నత స్ధితికి (కనీసం ఎగువ మధ్యతరగతికి) చేరగల అవకాశాలున్నాయి, అవి ఎంత తక్కువైనా. కాని పేద దళితుడికి అవి లేవు. వారికి ఉన్న ఒకే ఒక్క ఆధారం శ్రమ మాత్రమే. ఒకరిద్దరికి ధనిక బంధువులున్నా, ధనికవివాహాలు జరిగినా అవి మరింతమందికి విస్తరించడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. కుల వ్యవస్ధ వల్ల పేద దళితులు ఉన్నారు గానీ, పేద అగ్రకులస్ధులు ఉండడం అసాధ్యం. పేద అగ్రకులస్ధులు ఏర్పడడానికి వర్గ దోపిడీయే ఏకైక కారణం. కాని పేద దళితులు ఏర్పడడానికి ముందు చెప్పినట్లు సహస్రాబ్దాల నాటి కులం కారణం. అందుకే పేద దళితులంటూ ఎవరూ లేరు. ఉన్నది దళితులే. వారంతా పేదలే (ఒకరిద్దరు మినహా).

    ఈ చర్చను ఎకడమిక్ చర్చగా, ఆచరణాత్మక చర్చగానే స్వీకరించండి.

వ్యాఖ్యానించండి