శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు


సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో ముగిసింది. యుద్ధం ఆఖరి రోజుల్లో శ్రీలంక సైన్యం మానవహక్కులను ఉల్లంఘిస్తూ పౌరులపై అమానుష హత్యాకాండను సాగించిందని ఆరోపణలు వచ్చాయి. అనేక యుద్ధనేరాలకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. ‘క్రైమ్స్ ఎగయినెస్ట్ హ్యూమనిటీ’ అన్న పదజాలం కూడా సరిపోదని పత్రికలు అభివర్ణించాయి. ‘నో ఫైర్ జోన్’ పేరుతో తమిళ పౌరులను శిబిరాల్లోకి రప్పించి సైన్యం ఆ శిబిరాలపైకే కాల్పులు జరిపి వందలవేల మందిని పొట్టనబెట్టుకుందని వీడియో సాక్ష్యాలతో రుజువయింది. పసి పిల్లలు, యువకులు, స్త్రీలు, ముసలివాళ్ళు దారుణ పరిస్ధితుల మధ్య శవాలుగా కనపడుతున్న అనేక దృశ్యాలు బహిరంగం కావించబడ్డాయి. అలా బహిరంగమయిన ఫోటోల్లో కొన్నే ఇవి.

4 thoughts on “శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

  1. పరాయి దేశంలో, మాకో ప్రత్యేక దేశం కావాలని, తీవ్రవాదం తో, వేలాది సైనికులను పొట్టనపెట్టుకున్న, ప్రభాకరన్ మీద జాలేంటి?? అతని అనుచరుల మీద సానుభీతి ఏంటి? జనజీవనానికి అంతరాయం కలిగించి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, తీవ్రవాదం తో అశాంతి రేకెత్తించే వాళ్ళు మృగాలు. మృగాలను వేటాడి, మాటు వేసి చంపడమే రాజనీతి.

  2. చదువరి గారూ, మీరు ఎక్కడ ఏమీ చదివి ఈ అభిప్రాయానికి వచ్చారో తెలియదు. వేలాది సైనికుల్ని పొట్టనబెట్టుకోవడం అన్నది సరైన పరిశీలన కాదేమో.

    శ్రీలంకలో ఉన్న సింహళులు, తమిళులు ఇద్దరూ ఇండియా నుండి వలస వెళ్ళిన జాతులే. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఉన్నవారంతా జాతి వివక్ష లేకుండా కలిసి బతకడం సాధారణ నీతి. జన నీతి కూడా. రాజనీతిలో ‘ఒక జాతి మరొక జాతిని అణచివేయడం, తక్కువ గా చూడడం’ కూడా కలిసి ఉంటుందా? లేక రాజనీతి దానికదే నీతివంతమైనదా? ఏ నీతి అయినా ప్రజలు సుఖ శాంతులతో కలిసి మెలిసి ఉండాలని కోరితేనే సరైన నీతి అవుతుంది. శ్రీలంకలో శతాబ్దాలుగా అలా జరగలేదు. ప్రజాస్వామ్య వ్యవస్ధ ఏర్పడిందని చెప్పాక కూడా తమిళులపైన జాతి వివక్ష కొనసాగుతోంది. అణచివేతకి గురవుతున్న జాతులు అనివార్యంగా తిరుగుబాటుని లేవదీస్తాయి. సమాన అవకాశాలు డిమాండ్ చేస్తాయి. శ్రీలంక తమిళులు కూడా అదే చేశారు. శ్రీలంక పాలకులు జాతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి బదులు అణచివేతనే పరిష్కారంగా ఎంచుకున్నాయి. ఫలితమే అక్కడ జాతుల మద్య ఘర్షణలు.

    తమిళుల ప్రత్యేక ఈలం అంగీకారం కాకపోతే సింహళ పాలకవర్గాలు ఇతర అంగీకార యోగ్యమైన పరిష్కారాలను వెతకవచ్చు. ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఇస్తామనో, రాజ్యాంగ రక్షణలు కల్పిస్తామనో ఇంకా అలాంటివి. ఐర్లండ్ జాతి ప్రజల్ని ఇంగ్లడ్ ఇలాగే అనేక శతాబ్దాలు అణచివేసినా జాతి సమస్యను పరిష్కరించలేకపోయారు. చివరికి ఐర్లండ్ ప్రత్యేక దేశంగా అవిర్భవించాక మాత్రమే సమస్య పరిష్కారం అయింది. యుగోస్లోవియాను ముక్కలు ముక్కలు గా విడగొట్టాక గాని అమెరికా, యూరప్ లు శాంతించలేదు. రష్యా ఎన్ని దేశాలుగా విడిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీలంకకి అది పరిష్కారం ఎందుకు కాకాడదు? అది పరిష్కారం కాకపోతే సరైన పరిష్కారం ఏమిటో శ్రీలంక ప్రభుత్వం చూపగలగాలి. అది కాకుండా ఒక జాతిని పౌరులతో సహా సమూలంగా నాశనం చేయడానికి ప్రభుత్వాలు పరిష్కారంగా ఎంచుకోవచ్చా?

    చిత్రం ఏమిటంటె మీరు చెప్పిన టెర్రరిస్టు కారణాలతోనే ఈ దేశాలను విడగొట్టడానికి మీలాంటివారు సమర్ధిస్తారు. అదే టెర్రరిస్టు కారణాలతో జాతుల అనచివేతను కూడా సమర్ధిస్తున్నారు. సైన్యం చేస్తే రాజనీతి, అణచివేతకు గురవుతున్న జాతులు తిరగబడితే టెర్రరిజమా?

    శ్రీలంక సైన్యానికీ, అణచివేతకి వ్యతిరేకంగా ఆయుధం పట్టిన తమిళులకీ మధ్య జరిగింది యుద్ధం. ఇందులో శ్రీలంక పౌరులు, తమిళ పౌరులు భాగస్వాములు కారు. యుద్ధంలో సైనికులే చావాలన్నది యుద్ధనీతి. శత్రువు సైన్యంతోనే యుద్ధం చేయాలన్నది కూడా యుద్ధనీతే. శతృవు సైన్యం పై కాకుండా పౌరులపై హత్యాకాండ అమలు జరిపితే ‘యుద్ధ నేరాలు’ గా పరిగణించాలని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. యుద్ధంలో శత్రువును ఓడించడానికి పౌరులపై హత్యాకాండ జరపడాన్ని జెనీవా కన్వేన్షన్ నిషేధించింది. జెనీవా కన్వెన్షన్ కి శ్రీలంక కూడా అంగీకరించింది. దానికి భిన్నంగా, యుద్ధనీతి, రాజనీతి, జననీతి… అన్ని నీతిలనూ ఉల్లంఘిస్తూ శ్రీలంక ప్రభుత్వం తమిళ పౌరులపై హత్యాకాండ జరిపింది.

    తమిళులంతా టెర్రరిస్టులే అన్నట్లుంది మీ ధోరణి. లేక తమిళుల్లో కొందరు ఆయుధాలు పట్టినందుకు తమిళులందర్నీ దోషులుగా చేయాల్సిందేననీ, తమిళజాతినంతటినీ రూపుమాపాలనీ మీరు చెప్పదలిచారా? టెర్రర్ కోసమే టెర్రర్ పుట్టదు. దానివెనుక అనేక రాజకీయ, సామాజిక, ఆర్ధిక కారణాలు ఉంటాయి. టెర్రరిజాన్ని అంతం చేయాలంటే ముందు ఆ కారణాలని పరిష్కరించాలి. లేకుంటే ఆ కారణాలతో పుట్టిన టేర్రరిజం తాత్కాలికంగా సద్దుమణిగినా మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. అందుకు ప్రపంచంలో అనేక ఉదాహరణలున్నాయి.

    శ్రీలంక తమిళులనందరినీ మృగాలుగా చెబుతున్న మీ అభిప్రాయం చాలా దారుణం. తమిళజాతి ఎదుర్కొంటున్న వివక్ష ను ఏ మాత్రం గుర్తించని మీ పరిశీలన ఏక పక్షం, మానవతా రాహిత్యం. నిస్సహాయులైన పసిపిల్లలు, స్త్రీలు, వృద్ధులను మృగాలుగా ఎంచి వేటాడి, మాటు వేసి చంపాలంటున్న మీ హృదయం మానవ సమాజంలో మనుషుల మధ్య ఉండవలసింది కాదు. ఇలా అంటున్నందుకు అన్యధా భావించవలదు.

  3. అమాయక, నిస్సహాయ శ్రిలంక తమిళులపైన జరిగిన ఈ మారణ కాండ అత్యంత గర్హనీయార్హము. మాటల కందని మారణహోమమిది.

  4. 1.
    “సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము.”
    2.

    “జనజీవనానికి అంతరాయం కలిగించి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, తీవ్రవాదంతో అశాంతి రేకెత్తించే వాళ్ళు మృగాలు. మృగాలను వేటాడి, మాటు వేసి చంపడమే రాజనీతి.”

    విశేఖర్ గారూ,
    యుద్ధం ఆయుధాలతో మాత్రమే జరగదని భావజాలాల మధ్య కూడా తీవ్రస్థాయిలో జరుగుతుందని చిరకాలం నుంచి ప్రపంచానికి ఎరుకలో ఉన్న విషయమే.. పైన ఉల్లేఖించిన వాక్యాలు కేవలం వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలుగా లేవు. వ్యక్తుల భావజాలానికి సంబంధించిన అద్భుత వ్యక్తీకరణలు. ఎవరు ఏ పక్షం వహిస్తున్నారన్నది వారి వారి దృక్పథానికి సంబంధించిన సమస్య.

    “సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు.”

    యుద్ధంలో అనివార్యంగా సంభవించే సైనిక మరణాలను పక్కన బెడితే మనిషి పట్ల కరుణాంతరంగ దృష్టి లేకపోతే ఈ వాక్యం పుట్టేదే కాదు. భాషలోని వ్యక్తీకరణ సామర్థ్యం పరాకాష్టకు ఇది ప్రతీక.

    మీ కథనం సారాంశంతో ఏకీభవిస్తున్నాను.

వ్యాఖ్యానించండి