భారత ప్రయాణీకుల ఉమ్మడి ఆత్మ ‘భారత రైల్వే’ -ఫొటోలు


‘ఇండియన్ రైల్వేస్’ కి భారత దేశ ప్రయాణీకుల అంతరంగంలో ఉత్కృష్ట స్ధానం ఉంది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ లక్షల కొద్దీ పల్లెలనూ, పట్నాలనూ కలుపుతూ వ్యాపించిన భారత రైల్వేలు లేకుండా భారతీయుడికి రోజు గడవదు. భారత దేశంలో ప్రజలకు జీవనాడిగా ఉన్న వేల కొద్దీ వృత్తులూ, ఉద్యోగాలూ ఏదో ఒక రూపంలో రైల్వేలతో సంబంధం లేకుండా లేవు. అది ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం ఐనా, ప్రవేటు కంపెనీ సమకూర్చిన ఉద్యోగం అయినా, స్వయం ఉపాధి అయినా… దాన్ని మోసే భారతీయుడు రైలు ఎక్కిదిగనిదే ఒక రూపం సంతరించుకుని ఉండదు.

చదువుకోసం సుదూరం తరలివెళ్ళే విద్యార్ధీ, ఉద్యోగార్ధియై ఇంటర్వ్యూకి వెళ్ళే నిరుద్యోగీ, ఉద్యోగం పొంది మేఘాలపై తేలే కొత్త ఉద్యోగీ, పెళ్లి చూపులకి తరలివేళ్ళే మగపెళ్లి బృందం, పెళ్ళై హానీమూన్ కి తరలివెళ్లే కొత్త జంటా, సంక్రాంతి సంబరాల్ని మోసుకెళ్ళే కొత్త అల్లుడూ, ప్రయాణాల్లోనే చూపులు కలిపే కొత్త ప్రేమికులూ… అందరి ఆశలనూ, బాధ్యతలనూ, సంతోషాలనూ, లేలేత భావాలనూ, సంరంభాల్నీ, ఊసుల్నీ, ఉత్సుకుతల్నీ రైల్వేలు మోసుకెళ్తాయి.

స్టేట్స్ నుండి పిలుపొచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీరూ, పల్లె నీడ కొడిగట్టి పట్నానికి బయలెల్లిన వలస కూలి, నొయిడా కంపెనీ కొలువులో జేరే ఆంధ్రా వర్కరూ, ఉందో లేదో తెలియని గల్ఫ్ జాబ్ కోసం ఉన్నదంతా ఊడ్చుకునే అమాయకులూ, ఢిల్లీ గల్లీలో బతుకుదామనుకునే ఆశావహులూ… ఇందరి బరువైన ఆశల్నీ మౌనంగానే లాక్కెళ్తున్నాయి భారత రైల్వేలు.

అంతేనా? కొడుకు యాక్సిడెంట్ కబురు విన్న తండ్రి ఆదుర్దా, చట్టుబండలవుతున్న కూతురు కాపురాన్ని నోట్ల కట్టలతో నిలుపుదామనుకునే తల్లి ఆందోళనా, తండ్రి గుండె జబ్బుని నయం చేసే దారి దొరకని కొడుకు నిస్సహాయతా, చెల్లి భారం మోయలేని అన్న నిర్వేదం, అక్క కష్టం తీర్చలేని తమ్ముడి భార హృదయం… అన్నింటికీ తానున్నానంటూ తోడు నిలుస్తాయి భారత రైల్వేలు.

కాశ్మీరు చలికి వణికిపోతుంది. ఢిల్లీ చరిత్రకు పులకరిస్తుంది. నొయిడా నరకానికి సానుభూతిస్తుంది. బెంగాల్ చైతన్యంతో ఉరకలేస్తుంది. కొహిమా నాగాల తోడు వెళ్తుంది. ఇంఫాల్ అణచివేతకి కన్నిరు పెడుతుంది. బొంబాయి మెరుపులకి మోహపడుతుంది.  హైద్రాబాద్ సామరస్యంతో కలిసిపోతుంది. చెన్నై సాంబారుతో సేద తీరుతుంది. తిరుపతి భక్తితో నెమ్మళిస్తుంది భారత రైల్వే.

భారత రైల్వేలు భారతీయుల ఉమ్మడి ఆత్మ. ఉమ్మడి ఆస్తి కూడా.

ఈ ఫొటోల్ని రాయిటర్స్ వార్తా సంస్ధ అందించింది.

3 thoughts on “భారత ప్రయాణీకుల ఉమ్మడి ఆత్మ ‘భారత రైల్వే’ -ఫొటోలు

వ్యాఖ్యానించండి