యూరోపియన్ యూనియన్, యూరోజోన్: ఎన్నడూ కలవలేని పట్టాలు -కార్టూన్


యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న రుణ సంక్షోభం ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్ధితిని ఈ కార్టూన్ సూచిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) దాని సభ్య దేశాల మధ్య రాజకీయ ఐక్యతను సూచించే సంస్ధ కాగా, యూరో జోన్ (ఇ.జెడ్) సంస్ధ దాని సభ్య దేశాల కోశాగార ఐక్యత (ఫిస్కల్ యూనిటీ) ని సూచించే సంస్ధ. ఇ.యులో 27 సభ దేశాలు ఉన్నాయి. వీటిలో 17 దేశాలు మాత్రమే ‘యూరో’ ను తమ ఉమ్మడి కరెన్సీగా అంగీకరించాయి. ‘యూరో’ను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించిన దేశాలను కలిపి ‘యూరో జోన్’ గా పిలుస్తున్నారు.

European Union -Tracks never meet

యూరో ను ఉమ్మడికరెన్సీగా చేసుకోవడం అంటే సభ్య దేశాలు అనేక ఆర్ధిక, ద్రవ్య అంశాల్లో ‘ఏకత’ ను సాధించవలసి ఉంటుంది. అలా ఏకత సాధిస్తేనే ఫిస్కల్ యూనిటీ ఉన్నట్లు అర్ధం. అంటే ద్రవ్య లోటు -ఫిస్కల్ డెఫిసిట్- (గరిష్టంగా 3%), ద్రవ్యోల్బణం (గరిష్టంగా 1%), సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు (గరిష్టంగా 6%), జిడిపిలో అప్పు శాతం (గరిష్టంగా 60%) అన్నీ ఒకే స్ధాయిలో గానీ, గరిష్ట స్ధాయిలో గానీ ఉండాలి. అయితే ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదు. ఆయా దేశాల ప్రజలకు వారి వారి అవసరాలు, దేశ పరిస్ధితులకు అనుగుణంగా అవసరాలు ఉంటాయి కనుక ఒకే విధమైన విధానాలు అమలు చేయడం సాధ్యం కావడం లేదు.

యూరో జోన్ గానీ, ఇ.యు గానీ ప్రధానంగా కంపెనీల ప్రయోజనాలకు ఉద్దేశించిందే. ప్రజల ప్రయోజనాలు అందులో లేవు. పెత్తందారీ దేశాలైన జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ లాంటి దేశాల బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ద్రవ్య కంపెనీలు ఈ దేశాల విధానాలను శాసిస్తుంటాయి. ఇతర మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలు కూడా వాటితో ఉన్నా, ఉత్పత్తి కంపెనీలపైన ద్రవ్య వ్యవస్ధ ఆధిక్యత సాధించాక ద్రవ్య కంపెనీలదే పెత్తనం చేస్తున్నాయి. మూడేళ్ల క్రితం సంభవించిన ద్రవ్య సంక్షోభంలో ఈ ద్రవ్య కంపెనీలన్నీ కూలబడ్డాయి. ప్రభుత్వాలనుండి బెయిలౌట్లు మేసి మళ్లీ కోలుకున్నాయి. కాని బెయిలౌట్లు అప్పుల రూపంలో ప్రభుత్వానికి భారంగా మారాయి.

బెయిలౌట్లు మేసిన కంపెనీల వద్ద అప్పులు వసూలు చేయాల్సి ఉండగా ప్రజల నుండి వసూలు చేయడానికే యూరప్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. కంపెనీల సి.ఇ.ఒ లు యాజమాన్యాలు యధావిధిగా మిలియన్ల కొద్దీ డాలర్లను బోనస్ లుగా, వేతనాలుగా మింగేస్తుండగా ఉద్యోగుల జీతాలు కత్తిరిస్తూ, వారి పెన్షన్, బోనస్ తదితర సౌకర్యాలను రద్దు చేయడమో కత్తిరించడమో చేస్తున్నారు. దానితో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఉత్పత్తులు పేరుకుపోయి అధిక ఉత్పత్తి సంక్షోభం పెరుగుతోంది. దాని భారం మళ్ళీ ప్రజలపై నే వేస్తున్నారు. ఇదొక విషవలయంగా మారి ప్రజలు మరింతగా ఆర్ధిక బాధలకూ, తద్వారా తలెత్తే సామాజిక సంక్షోభానికీ గురవుతున్నారు.

ప్రజల బాధలు పూర్తిగా విస్మరించిన యూరప్ ప్రభుత్వాలు, ముఖ్యంగా యూరో జోన్ ప్రభుత్వాలు ఫిస్కల్ యూనియన్ సాధించడానిని తద్వారా కంపెనీల ను సంతృప్తి పరచడానికి నానా పాట్లు పడుతున్నాయి. సంక్షోభం పరిష్కారం కావాలంటె ఉత్పత్తులు అమ్ముడుపోయి ఆదాయాలు, లాభాలు పెరగాలి. అది జరగాలంటే వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగాలి. కాని అది కాస్తా కంపెనీల దోపిడీ వల్ల నానాటికి తరుగుతోందే గానీ పెరగడం లేదు. కంపెనీల దోపిడీని అరికట్ట గలిగితే వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయి. ఆ దోపిడీని ఆపే దమ్ము పాలకులకు ఉండదు. ఫలితంగా ఫిస్కల్ యూనిటీ కూడా ఒక కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాల చేతులో ఆర్ధిక పగ్గాలు ఉన్నట్లయితే ఫిస్కల్ యూనిటీ సాధ్యమవుతుంది. కాని అవి ఉన్నది కంపెనీల చేతుల్లో.

ఫిస్కల్ యూనిటీ లేనిదే ఆర్ధిక సమానత రాదు. కనుక రాజకీయ ఐక్యత కూడా రాదు. అందుకే యూరో జోన్ విచ్చిన్నం కావడం తధ్యమని రెండు, మూడేళ్లుగా విశ్లేషణలు ఊపందుకున్నాయి.

వ్యాఖ్యానించండి