మరో హత్యా కాండ, ఈ సారి సిరియాలో


Syria massacre 01ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోసిన రెండవ రోజే సిరియాలో పౌరుల ఊచకోత జరిగింది. సిరియాలో జొరబడి సంవత్సర కాలంగా అద్దె తిరుగుబాటు నడుపుతున్న పశ్చిమ దేశాల కిరాయి మూకలు తాజాగా ఈ హత్యా కాండకు పాల్పడ్డాయని సిరియా ప్రభూత్వ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ సిరియా సందర్శిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభావితం చేయడానికే విదేశీ కిరాయి మూకలు ఈ హత్యాకాండకి దిగాయని సిరియా ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి సమావేశాలను ప్రభావితం చేసే దుర్మార్గం ఇందులో ఉందని తెలిపింది.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు లకు చెందిన ప్రత్యేక బలగాలు సిరియాలో తిష్ట వేసి లిబియా తరహాలో అక్కడ అద్దె తిరుగుబాటు కి తెర లేపాలని సంవత్సర కాలంగా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆల్-ఖైదాకి చెందిన విదేశీ మిలిటెంట్లతో కలిసి పశ్చిమ దేశాల బలగాలు సిరియాలో సామూహిక హత్యలు సాగిస్తూ వాటిని సిరియా ప్రభుత్వం జరిపిన హత్యలుగా ప్రచారం చేస్తున్నాయి. పశ్చిమ బలగాలు, ఆల్-ఖైదా ల చేతుల్లో రెండున్నర వేల మందికి పైగా సిరియా ప్రభుత్వ సైనికులు, పోలీసులు హతులైనప్పటికీ ఆ విషయం పశ్చిమ దేశాల పత్రికలు చెప్పవు. అమెరికాకి చెందిన ప్రవేటు డిటెక్టివ్ సంస్ధ స్ట్రాట్ ఫర్ డిటెక్టివ్ లు రాసిన ఐదు మిలియన్ల ఈ-మెయిళ్ళు (వికీ లీక్స్ ద్వారా వెల్లడయ్యాయి) సిరియాలో ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ లతో పాటు ముస్లిం మత ఛాందస కతార్, సౌదీ అరేబియా, యెమెన్ లాంటి దేశాల నుండి కూడా ప్రత్యేక బలగాలు, కిరాయి మూకలు సిరియాలో ప్రారంభం నుండి తిష్ట వేసుకుని ఉన్నాయని వెల్లడించాయి. గ్లోబల్ ఇంటలిజెన్స్ ఫైల్స్ పేరుతో వికీలీక్స్ ప్రచురిస్తున్న స్ట్రాట్ ఫర్ ‘ఈ మెయిళ్ల’లో ఒకదాన్నిఇక్కడ చూడవచ్చు.

సిరియా హత్యాకాండలో 50 మంది పౌరులు హతులైనట్లుగా కిరాయి తిరుగుబాటుదారులను ఉటంకిస్తూ  రాయిటర్స్ తెలిపింది. సిరియాలో ఎవరు ఎవర్ని చంపినా వారు సిరియా బలగాల చేతిలో చనిపోయినట్లుగానో, సిరియా ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు చంపినవారుగానో పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. సిరియా బలగాలు సాగిస్తున్న హత్యాకాండాలంటూ తాము ప్రకటిస్తున్న వార్తలకు ఆధారాలు లేవని కూడా అవి ప్రకటిస్తాయి. సిరియా ప్రభుత్వం మీడియా విలేక్షారులన్ను అనుమతించడం లేదని దానికి కారణం చూపుతాయి. అయితే సిరియాలో గాయపడిన బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాల విలేఖరులు అక్కడికి ఎలా వెళ్లిందీ అవి చెప్పవు.

గత జనవరిలో ఫ్రాన్సుకి చెందిన 100 మంది ప్రత్యేక బలగాలను అరెస్టు చేసినట్లు సిరియా ప్రకటించినప్పటికీ ఏ అంతర్జాతీయ పత్రికా ఆ విషయం ప్రకటించలేదు. 13 మంది ఫ్రాన్సు గూఢచార సైనికాధికారులను ఈ మార్చి నెలలోనే సిరియా ప్రభుత్వం అరెస్టు చేసినట్లుగా టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. లెబనాన్ పత్రిక స్టార్ న్యూస్ ఈ వార్త బైట పెట్టేవరకూ పశ్చిమ దేశాల అంతర్జాతీయ పత్రికలు ఈ విషయం వెల్లడి చేయలేదు. వీరిని విడుదల చేయడానికి సిరియా ప్రభుత్వం ఓ వైపు చర్చలు జరుపుతూ కూడా ఫ్రాన్సు ప్రభుత్వం తమ సైనికులు సిరియాలో ఉన్నారని బహిరంగంగా అంగీకరించడానికి తిరస్కరించింది. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారుల వశంలో ఉన్నట్లు చెబుతున్నా హోమ్స్ పట్నంలో 120 మంది ఫ్రెంచి బలగాలు పట్టుబడ్డాయని సిరియా ప్రభుత్వం మార్చి 1 న కొన్ని స్వంతంత్ర వార్తా సంస్ధలు, రష్యా టైమ్స్ వెల్లడించాయి. ఈజిప్టులో అతి పెద్ద వార్తా సంస్ధ అల్-ఆహరామ్ ఈ వార్తలను ధృవీకరించింది. లెబనాన్ పార్లమెంటు సభ్యుడు అసెమ్ కాన్సో కూడా ఈ వార్తను ధృవీకరించాడని ఆ సంస్ధ తెలిపింది.

ఇలా పట్టుబడింది ఫ్రాన్సు సైనికులే అయినప్పటికీ సిరియాలో అమెరికా, బ్రిటన్ ల ప్రత్యేక బలగాలు కూడా పని చేస్తున్నాయి. లిబియా లో కూడా బ్రిటిష్, ఫ్రాస్ను, అమెరికా లకు చెందిన బలగాలు పట్టుబడినప్పటికీ ఆ వార్తలను పశ్చిమ పత్రికలు తొక్కి పెట్టాయి. సిరియాలో జొరబడి హత్యాకాండ జరపడానికి వీలుగా టర్కీ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ లాంటి దేశాలలో పశ్చిమ దేశాలు శిక్షణా శిబిరాలు నడుపుతున్నాయి. ఈ వార్తలను రష్యా, చైనా వార్తా సంస్ధలుగానీ, ఇతర స్వంతంత్ర వార్తా సంస్ధలుగానీ చేప్పడమే తప్ప బీబీసి, రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ వార్తా సంస్ధలు తమకు తెలియనట్లే వ్యవహరిస్తాయి.

సిరియా లో ప్రభుత్వం జరుపుతున్న హత్యాకాండలో చనిపోతున్నారంటూ పశ్చిమ దేశాలు చూపించే వనరు ఒకే ఒకటి. అది సిరియన్ అబ్జర్వేటారీ ఫోర్ హ్యూమన్ రైట్స్ (ఎస్.ఓ.హెచ్.ఆర్). ఇంకా రెండు ఉన్నప్పటికీ అవి అంత ప్రాముఖ్యం పొందలేదు. పశ్చిమ దేశాల పత్రికలు చూపించే మరొక వనరు “యాక్టివిస్టులు”. వీరి లెక్కలకు ఆధారాలు లేవని చెబుతూనే పశ్చిమ పత్రికలు వాటిని విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి కూడా ఇవే లెక్కలను ప్రచారం చేస్తోంది. సమితి ప్రకటించిన లెక్కల్లో ఇజ్రాయెల్, సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్ సైనికుల చేతిలో హతులైన పాలస్తీనీయులు కూడా కలిసి ఉండడాన్ని బట్టి ఆ జాబితాలు ఎంత బూటకమైనవో గ్రహించవచ్చు. పైగా ఆ జాబితాలో కిరాయి మూకల చేతిలో బలయిన సిరియా ప్రభుత్వ బలగాలు (పోలీసులు, సైనికులు) కూడా కలిసి ఉన్నాయి. దానిని బట్టి పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎంతటి పచ్చి అబద్ధాలనైనా ప్రచారం చేస్తాయనీ, వారు గోబెల్స్ ను ఎన్నడో మించిపోయారనీ అర్ధమవుతుంది.

యాక్టివిస్టులు పశ్చిమ దేశాల పత్రికలకు టెలిఫోన్ ధ్వారా ఇంతమంది చనిపోయారని చెబితే వాటిని పట్టుకుని సిరియాలో ప్రభుత్వ హత్యాకాండ అంటూ పశ్చిమ పత్రికలు ఊదర గొడుతున్నాయి. సిరియా బలగాల చేతిలో చనిపోతున్న ఆల్-ఖైదా మూకలను, కిరాయి సైనికులనూ, అలాగే కిరాయి మూకల చేతిలో చనిపోతున్న సిరియా బలగాలనూ అందరినీ సిరియా ప్రభుత్వ హత్యలుగా సో కాల్డ్ ‘యాక్టివిస్టులు’ చెబుతున్నట్లుగా అనేక మంది జర్నలిస్టులు పరిశోధనా రిపోర్టులు ప్రచురించాయి.  శర్మైన్ నర్వాణి రాసిన అలాంటి విశ్లేషణాత్మక రిపోర్టుని ఇక్కడ చూడవచ్చు.

సిరియాలో అసలైన ప్రజా ప్రతినిధ్య సంస్ధ గా పశ్చిమ దేశాలు గుర్తించిన సిరియా నేషనల్ కౌన్సిల్ (ఎస్.ఎన్.సి) నిజానికి పశ్చిమ దేశాల పనుపున ఏర్పాటయిన సంస్ధ అని కూడా వెల్లడయింది. సిరియాలో దేశ ద్రోహానికి పాల్పడి పారిపోయిన వాళ్ళను ఒకటిగా చేయడానికి, తిరుగుబాటు పేరుతో హత్యాకాండలు జరపడానికీ దీనిని పశ్చిమ దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ నేపధ్యంలో సిరియాలో జరిగిన హత్యాకాండలో మరణించిన 50 మంది పౌరులు పశ్చిమ దేశాల కిరాయి మూకల చేతుల్లో హతులైనవారేనని నిస్సందేహంగా స్పష్టమవుతోంది.

వ్యాఖ్యానించండి