యుద్ధాలు శా(శ్వా)సించేవారు రాజనీతిజ్ఞులు, యుద్ధం చేసే సైనికులు పిచ్చోళ్ళు?!


ఆఫ్ఘనిస్ధాన్ లో అమాయక పౌరుల ఇళ్ళల్లో జొరబడి నిద్రలో ఉన్న 16 మంది ని కాల్చి చంపిన అమెరికా సైనికుడు వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమా వద్దగల ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి వచ్చాడు. ఈ స్ధావరాన్ని ‘లూయిస్ మెక్-కార్డ్’ బేస్ గా పిలుస్తారు. ఈ స్ధావరం నుండి వచ్చిన సైనికులు గతంలో కూడా ఇలాంటి హత్యాకాండలకి పాల్పడ్డారనీ, అసలా స్ధావరంలోనే ఏదో ఉందనీ పశ్చిమ దేశాల పత్రికలు కధనాలు రాస్తున్నాయి.

Kill team

2010 లో కూడా లూయీస్ మెకార్డ్ బేస్ నుండి వచ్చిన సైనికులు యుద్ధ సమయాల్లో ఇలాంటి అత్యాచారాలకి పాల్పడ్డారని రాయిటర్స్ చెపుతోంది. ఈ బేస్ లోనే అనేకమంది సైనికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అది తెలిపింది. ఇరాక్ యుద్ధానికి కూడా ఈ బేస్ సైనికుల్ని మూడు, నాలుగు విడతలుగా పంపిందని తెలిపింది. ఈ మధ్యనే ఈ బేస్ లో ఉన్న ఆసుపత్రిలో 300 మంది సైనికులు యుద్ధానంతర మానసిక ఒత్తిడికి గురయ్యారని డాక్టర్లు నిర్ధారించగా, ఆ తర్వాత ఆ నిర్ధారణలన్నింటినీ డాక్టర్లు వెనక్కి తీసుకున్నారనీ అది తెలిపింది. ఆ విధంగా 300 మంది విషయంలో చేసిన నిర్ధారణలను డాక్టర్లు వెనక్కి తీసుకున్న పరిస్ధితి అసాధారణం అని భావిస్తూ దీని వెనుక కుట్ర ఉందన్న అనుమానంతో విచారణ జరుగుతోందని రాయిటర్స్ తెలిపింది.

స్టార్స్ అండ్ స్ట్రైప్స్ అనే మిలట్రీ పత్రిక డిసెంబరు 2010 లో ఈ సైనిక స్ధావరాన్ని ‘మిలట్రీలో అత్యంత సమస్యలతో కూడిన స్ధావరంగా’ అభివర్ణించిందని రాయిటర్స్ తెలిపింది. ఈ స్ధావరంలో 43,000 మంది సైనికులూ, 14,000 మంది పౌర ఉద్యోగులూ, కాంట్రాక్టర్లూ ఉన్నారని తెలుస్తోంది. ఒక రోగ్ సోల్జర్ మాత్రమే ఆఫ్ఘన్ పౌరులపై హత్యాకాండకి పాల్పడ్డాడని చెప్పడానికి పశ్చిమ దేశాల పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇది రోగ్ సోల్జర్ తప్పు కాదని ‘తీవ్రమైన నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న రోగ్ మిలట్రీ స్ధావరానిదే బాధ్యత’ అని ఒక మిలట్రీ విశ్లేషకుడ్ని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.

2010 లో ఈ బేస్ నుండి వచ్చిన ఐదుగురు సైనికులు కనీసం మూడు సంఘటనలలో ఆఫ్ఘన్ పౌరులపై ఉద్దేశ్య పూర్వకంగా, ముందస్తు పధకంతో దాడి చేసి చంపారని రాయిటర్స్ గుర్తు చేసింది. ఆదివారం హత్యాకాండ జరిగే వరకూ ఆఫ్ఘన్ , ఇరాక్ యుద్ధాల్లో అమెరికా సైనికులు జరిపిన అతిపెద్ద ‘పౌర హత్యాకాండ’ గా పత్రికలు దానిని అభివర్ణించాయి. ఇందులో ముగ్గురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు. చంపేశాక వారి శరీర భాగాలను ట్రోఫీలుగా సైనికులు తమ వద్ద ఉంచుకున్నారు. కాందహార్ రాష్ట్రంలోనే మేవాండ్ జిల్లాలో ఈ హత్యలు జరిగాయి. తమను తాము కిల్ టీం గా వారు అభివర్ణించుకున్నారు.

చనిపోయిన ఆఫ్ఘన్లలో 15 సంవత్సరాల బాలుడు (గుల్ ముదీన్) ఉన్నాడు. పొలంలో పని చేసుకుంటున్న బాలుడిపైన గ్రేనేడ్ విసిరి, రైఫిల్ తో కాల్చి చంపారు. బాలుడిని చంపి, అవమానకరంగా శవం తలని జుట్టుపట్టుకుని పైకి లేపి ఫోటోకి ఫోజులిచ్చారు. శవంపైన మిలట్రీ చొక్కా కప్పి తాలిబాన్ మిలిటెంట్ గా చెప్పడానికి సైనికులు ప్రయత్నించారు. మరొక పౌరుడు మరాచ్ ఆఘా కి మతి స్ధిమితం లేదు. చెవిటివాడు కూడా. అతన్ని కాల్చి చంపి బంతిలో కుక్కి రోడ్డు పక్కన పడేశారు. చనిపోయిన అఘా కపాలంలో ఒక భాగాన్ని అమెరికా సైనికులు ట్రోఫీగా తమ వద్ద ఉంచుకున్నట్లు బైటపడింది. మసీదు పూజారి ముల్లా ఆదాహద్ ను అమెరికా సైనికులు గ్రేనేడ్ విసిరి, అనంతరం రైఫిల్ తో కాల్చి చంపారు. పౌరుల్ని చంపిన సైనికులకి ఏడు నెలల నుండి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడిందని పత్రికలు చెప్పాయి. వీరిలో ఒకరైన జెరేమీ మోర్లాక్ ను విచారిస్తున్న సందర్భంగా జడ్జి “పౌరుల్ని భయపెట్టడానికి తుపాకి ఎత్తి ఆ తర్వాత అదుపు కోల్పోయావా?” అని అడిగాడు. దానికతను “పౌరులను చంపాలన్నదే అసలు పధకం” అని సమాధానం చెప్పాడు.

లూయీస్ మెకార్డ్ స్ధావరంలో 2008లో మిలట్రీ జరిపిన అధ్యయనంలో మూడు నాలుగుసార్లు యుద్ధానికి వెళ్లివచ్చిన సైనికులలో మానసిక సమస్యలతో బాధపడినట్లు వెళ్లడయిందని రాయిటర్స్ తెలిపింది. అయితే, 2010 ఆఫ్ఘన్ల హత్యలకు పాల్పడిన సైనికుల ప్రవర్తనకు వారి పై అధికారులు కూడా బాధ్యులేనని ఇతరులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. ‘చైన్ ఆఫ్ కమాండ్’ ఏర్పడిన అస్తవ్యస్త పరిస్ధితులు (బ్రేక్ డౌన్) ఈ ఘటనకు కారణమని వారు భావించినట్లు తెలిపింది. కానీ అధికారులేవరూ శిక్షలకు గురికాలేదు.

లూయీస్ మెకార్డ్ స్ధావారానికి చెందిన మరొక సైనికుడు బెంజిమన్ కఆటన్ బార్న్స్ నేషనల్ పార్క్ సర్వీస్ రేంజర్ ని కాల్చి చంపిన ఘటనను కూడా రాయిటర్స్ ఎత్తి చూపింది. అతను దుష్ప్రవర్తనకు గాను 2009 లో ఆర్మీ నుండి బైటికి పంపించబడిన సైనికుడు. రేంజర్ ను చంపిన తర్వారా రోజే బెంజిమన్ పార్కులోనే నీటి గుంటలో దూకి చనిపోయాడని పత్రికలు తెలిపాయి. మానసిక పరిస్ధితి బాగాలేకనే అతనా పని చేశాడని రాయిటర్స్ నిర్ధారించింది. ఆసుపత్రిలో రికార్డులు మార్చిన విషయం కూడా సైనిక స్ధావరం పరిస్ధూలపై అనుమానం కలిగిస్తోందని రాయిటర్స్ చెబుతోంది. 285 మంది సైనికులు మరొకసారి యుద్ధ విధులకు వెళ్లవలసి ఉండగా స్క్రీనింగ్ జరుగుతున్నపుడు వారి మెడికల్ రికార్డుల్లో అంతా బాగున్నట్లు మార్పు చేశారని అమెరికా సెనేటర్ పాటీ ముర్రే చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. యుద్ధ విధులకు మళ్ళీ పంపించడానికి వీలుగా వారి మెడికల్ రికార్డులను అధికారులే తారుమారు చేశారన్న సూచన ఇందులో ధ్వనిస్తోంది. గత నెల స్క్రీనింగ్ జరిపిన వారిని విధులను తొలగించి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2011 లోనే మానసిక సమస్యలతో బాధపడిన 12 కేసులు లూయిస్ మెకార్డ్ స్ధావరంలో బైటపడ్డాయని ఒక మిలట్రీ విశ్లేషకుడిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.

ఈ విశ్లేషణలతో రాయిటర్స్ గానీ మరొక వార్తా సంస్ధ గాని చెప్పదలుచుకున్నది ఒక్కటే. అమెరికా సాగిస్తున్న యుద్ధాలలో సైనికులు చేస్తున్న పౌరుల హత్యాకాండలకు సైనికులుగానీ, అమెరికా రాజ్యాంగానీ బాధ్యులు కారు. అదంతా యుద్ధంలో భాగం. యుద్ధ పరిస్ధితుల వల్ల సైనికుల్లో అసాధారణ మానసిక పరిస్ధితులు ఏర్పడతాయి. ఆ విధంగా మానసిక పరిస్ధితి చెడిపోయిన పరిస్ధితుల్లో సైనికులు చేస్తున్న హత్యలకు అమెరికా కాంగ్రెస్ నో, సెనేట్ నో, ప్రభుత్వాన్నో తప్పు పట్టలేము. ఈ పత్రికల దృష్టిలో అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలు చాలా న్యాయమైనవి. ఇరాక్ యుద్ధమేమో సామూహిక విధ్వంసక మారణాయుధాలను ఏరివేసే పవిత్ర కర్తవ్యంతో చేసినది. ఒసామా బిన్ లాడెన్ లాంటి టెర్రరిస్టు యోధుడిని చంపాలంటే 11 సంవత్సరాలేం ఖర్మ. ఇంకో పదేళ్లయినా యుద్ధం చేయాలి. లాడేన్ చనిపోయినా ఇంకేదో చెప్పలేని కర్తవ్యం అమెరికా రాజ్యానికి మిగిలే ఉంటుంది. ఈ పత్రికలు ఎంతవరకు వెళ్తాయంటే ఆల్-ఖైదా టెర్రరిజంకి వ్యతిరేకంగా 2001 లో ‘టెర్రరిజం వ్యతిరేక ప్రపంచ యుద్ధం’ ప్రారంభించిన అమెరికా, 2011 లో అదే ఆల్-ఖైదా తో జట్టు కట్టి దేశాధ్యక్షుడిని చంపి లిబియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, సిరియాలో కూడా అదే ఆల్-ఖైదా తో జట్టు కట్టి అక్కడి ప్రభుత్వాన్ని కూడా కోలాదోయడానికి పౌరులపై మారణకాండ జరపడాన్ని కూడా సమర్ధించేంతవరకూ వెళ్తాయి. అలా చేయడానికి అవేమీ సిగ్గుపడవు. ఓ వైపు ప్రజాస్వామ్య విలువల గురించి పెద్ద ఎత్తున కధనాలు రాస్తాయి మరొకవైపు దేశాలను కబళించి రాజ్యాలనూ, ప్రభుత్వాలనూ కూల్చి ఆక్రమించడాన్ని సమర్ధిస్తాయి. పశ్చిమ దేశాల దురాక్రమణలు విజయవంతం కావడానికి తగిన అబద్ధపు ప్రచారాలని ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి నిమిషమూ చేయడానికి వెనకాడవు. దానికి కారణం ఈ పత్రికలన్నీ సామ్రాజ్యవాద కంపెనీల పత్రికలు స్ధాపించడమే. తమ బాసుల ప్రయోజనాల కోసమే వీరు పచ్చి అబద్ధాలు దురాక్రమణలను న్యాయ బద్ధం చేసే కృషిని తెంపులేకుండా సాగిస్తాయి.

రెండు గ్రూపులుగా వచ్చిన అమెరికా సైనికులు ఆఫ్గానిస్ధాన్ లో రెండు గ్రామాల్లోని మూడు ఇళ్ళల్లో దూరి నిద్రిస్తున్నవారిని చంపారని కొన్ని పత్రికలు (బీబీసి, రాయిటర్స్, రష్యా టైమ్స్) వెల్లడించాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ళలో దూరి చంపడం, తగలబెట్టడం కేవలం ఒక సైనికుడి వల్ల అయ్యే పని కాదని ఆఫ్ఘన్ పార్లమెంటు సభ్యులే చెబుతున్నారు. ఈ పత్రికలు మాత్రం ‘కాదు కాదు ఒక్కడే చేశాడ’ని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ‘ఒక్కడే చేశాడని’ పదే పదే ప్రచారం చేయడం ద్వారా అబద్ధాన్ని నిజం చేసే పనికి అవి పూనుకుంటున్నాయి.   ప్రత్యక్ష సాక్షుల కధనాన్ని, హత్యాకాండ జరిగిన ఇల్లు పక్క ఇంటివారు చెప్పిన సాక్ష్యాలనీ పూర్వ పక్షం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజం చెప్పేవారికి అదే పని కాదు. నిజం చెప్పి తమ పనిలో తాను మునిగిపోతారు. కానీ అబద్ధాలను ప్రచారం చేయదలుచుకునవారికీ అదే పని. అబద్ధాలులు చెబితే తప్ప  వారికీ, వారి బాసులైన కంపెనీలకీ మనుగడ లేదు. నిజాలు చెబితే, ప్రజలకు నిజాలు తెలిస్తే వారు తిరుగుబాట్లు ఎదుర్కోవలసిందే. అప్పుడిక వారి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. అందుకే బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి, తెంపు లేకుండా దుష్ప్రచారాలని నిర్వహిస్తున్నారు.

దురాక్రమణ యుద్ధాల్లో ప్రత్యక్షంగా నష్ట పోయేది అమెరికా కి చెందిన సాధారణ సైనికులే. ప్రాణాలు కోల్పోయినవారు పోగా, బతికున్నవారు అనేక సమస్యలతో బతుకుతున్నారు. మానసిక సమస్యలు ఎంతటి దారుణానికి గురిచేస్తున్నదీ బార్న్స్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. రేంజర్ ని చంపి, ఒక వ్యక్తిని చంపానన్నఆలోచనతో తన ప్రాణాల్ని కూడా అతను తీసుకున్నాడు. ఇది కాక పైకి చెప్పని, బైట పడని సమస్యలు అనేకం ఉంటాయి. యుద్ధం అన్నదే ఒక విధ్వంసక వ్యవస్ధ. అది సర్వ వ్యవస్ధలనూ నాశనం చేస్తోంది. దేశాలతో పాటు, సమాజాలనీ, మొత్తం వ్యవస్ధలనూ అది నాశనం చేస్తోంది. అనేక కుటుంబాలలో కొన్ని తరాల తరబడి విధ్వంసాన్ని అది సృష్టిస్తుంది. అటువంటి యుద్ధానికి దిగడానికి అమెరికా రాజ్యం ఏ మాత్రం వెనుకంజ వేయలేదు.

ఆఫ్ఘనిస్ధాన్ లో మానసిక పరిస్ధితి బాగాలేని సానికుడు హత్యాకాండకి దిగాడని చెప్పిన పశ్చిమ పత్రికలు ఇపుడు ఆ నేరాన్ని మొత్తం బేస్ పైన నెట్టేయడానికి కూడా సిద్ధపడ్డాయి. అయితే ఆ బేస్ లో ఉన్న సైనికులంతా సమస్యలు స్ఱుష్టించేవారేనా? అదే ప్రశ్న లూయిస్ మెకార్డ్ స్ధావరం ప్రతినిధి లేఫ్టీనెంట్ కల్నల్ గ్యారీ డేంజర్ ఫీల్డ్ ని రాయిటర్స్ అడిగింది. దానికతను తీవ్రంగా వ్యతిరేకించాడు. తమ స్ధావరం ప్రత్యేకంగా మానసిక సమస్యలతో సతమవుతోందని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. “ఆర్మీలో ఇతర సైనిక స్ధావరాల కంటే మా స్ధావరం భిన్నమైనదేమీ కాదు. గత పది సంవత్సరాలుగా అనేక ఆటంకాలను అధిగమించి యుద్ధ వీధుల్లో అనేక వత్తిడులు ఎదుర్కొన్న వారిలో మా స్ధావరం కూడా ఒక భాగం. యుద్ధం వల్ల అందరూ ఎదుర్కొనే సమస్యలనే మేమూ ఎదుర్కొంటున్నాం” అని ఆయన చెప్పాడు.

కనుక లూయిస్ మెకార్డ్ ఒక్కటే యుద్ధానంతర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని అర్ధమవుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే యుద్ధం వల్ల నే సమస్యలు వస్తున్నాయని. వరుసగా నాలుగైదు సంఘటనలు జరిగాయి కనుక లూయిస్ మెకార్డ్ స్ధావరం వార్తల్లోకి వచ్చింది. అంతమాత్రాన మొత్తం యుద్ధం విపరిణామాలనే ఒక సైనిక స్ధావరంపైకి నెట్టివేయడం ద్వారా అమెరికా ప్రభుత్వం తన సైనికులను తానే అవమాన పరుస్తోంది. యుద్ధం చేసి పిచ్చి వాళ్ళుగా మారేవారు గానూ, పిచ్చివారై విదేశీ పౌరుల్ని చిత్తం వచ్చినట్లు కాల్చి చంపేవారుగానూ ప్రచారం చేస్తోంది. ముగ్గురో లేదా, పాతికమందినో పౌరుల్ని కాల్చి చంపినవారు పిచ్చివారైతే, అసలు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లపైకి అబద్ధాలు చెప్పి యుద్ధానికి దిగిన జార్జి బుష్, బారక్ ఒబామా లు ఎవరు కావాలి? ఒకరు రెండు దేశాలపైకి దురాక్రమణ యుద్ధాలకి దిగితే మరొకరు సైనికుల సంఖ్య పెంచి మరింతమంది సైనికులతో పాటు మరిన్ని వేల మంది, లక్షల మంది చనిపోవడానికీ, యుద్ధం మరిన్ని సంవత్సరాలు కొనసాగడానికి నిర్ణయాలు తీసుకున్నాడు. వీరు తీసుకున్న నిర్ణయాలకు సెనేట్, కాంగ్రెస్ లలోని సభ్యులు మూకుమ్మడిగా ఒట్లేసి మద్దసు ఇచ్చారు. వీరంతా ఏమి కావాలి? యుద్ధాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నవారేమో రాజనీతిజ్ఞులు, ఆ యుద్ధాలలో పాల్గొని ప్రాణాలు కోల్పోయే సైనికులు, ఆరోగ్యం చెడిపోయిన సైనికులు పిచ్చివారా? కంపెనీల ప్రయోజనాల కోసమని తెలియకుండా ఊహల్లో నిర్మించుకున్న ఆదర్శాల కోసమో, బలవంతపు సర్వీసు నిర్వహిస్తూనో యుద్ధాల్లో పాల్గొని జీవితాలను బలి చేసినవారిని ఆ కంపెనీలకు మద్దతు ఇస్తున్న ప్రబుత్వాలు ఇచ్చే గౌరవం ఇదేనా?

అవును ఇదే. కంపెనీలు లాభాలు పెంచుకోవడానికి విదేశీ వనరులను స్వాధీనం చేసుకోవడానికీ యుద్ధాలు కావాలి. అలాంటి యుద్ధాలు దేశ భక్తి యుద్ధాలు కావు. జాతీయ విముక్తి పోరాటాలు అసలే కావు. లేదా అమెరికా ప్రజలను కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధాలు కావు. ఈ యుద్ధాలకు భిన్నంగా అమెరికా సైనికులు జాతీయ విముక్తి యుద్ధాలు నడుపుతున్న వీరులపై యుద్ధం చేస్తున్నారు. స్వతంత్ర దేశాలను ఆక్రమించుకునేందుకు యుద్ధాలు చేస్తున్నారు. జాతీయ దురాక్రమణ యుద్ధాలు వారు చేస్తున్నారు. ఏ మాత్రం గౌరవనీయం కానీ యుద్ధాలవి. దురాక్రమణకు దిగిన దేశాల తరపున యుద్ధం చేసేవారు ఎదుర్కొనేది జాతీయ విముక్తి పోరాటయోధుల్నే. దేశం తరపున దేశ భక్తితో వట్టి చేతులతోనో, చేతికి దొరికిన ఆయుధంతోనో నిస్సహాయ పరిస్ధితులనుండి ప్రతిఘటనకి దిగే పౌరులతో వారు యుద్ధాలు చేస్తున్నారు. దానితో వారికి పౌరులంతా ఏ మిలిటెంట్లులాగానో, జాతీయ విముక్తి పోరాట యోధుడిలాగానో, లేదా అలాంటి యోధులకు తమ రాజ్యం పెట్టిన మరో పేరు “టెర్రరిస్టు”గానో వారికీ కనిపిస్తారు. వారికిక పౌరులకీ, యోధులకీ తేడా తెలియదు. అలాంటి పరిస్ధితుల్లో ఉన్న వారికి పౌరులని గౌరవించాలన్న స్పృహ ఉండదు. గౌరవించే బోధనలు వారెన్నడూ తమ పాలకుల నుండి వినరు. వారు విన్నావన్నీ అబద్ధాలు. ఆఫ్ఘన్ ప్రజలకు విముక్తి, టెర్రరిస్టులపై యుద్ధం, ప్రజాస్వామ్య సంస్ధాపన ఇలాంటి అబద్ధాలనే వారు విన్నది.

తనదికాని దేశంలో తుపాకి ధరించి నిలబడ్డ అమెరికా సైనికుడు తనది కానీ దేశంలో ఏం చేయడానికి వచ్చానన్న సాధారణ ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్నించుకుని దానికి తగిన సమాధానం ఆత్మ సాక్షిగా చెప్పుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో అతనికి తన ప్రభుత్వం చేతనే పిచ్చివాడుగా ముద్ర వేయించుకునే పరిస్ధితి తప్పుతుంది. అలా ప్రశ్నించుకుని సమాధానం చెప్పుకుని అమెరికా యుద్ధాలను అన్యాయమైన యుద్ధాలుగా తిరస్కరించిన అమెరికా సైనికులు గతంలో అనేక మంది ఉన్నారు. జెస్సికా లించ్, ఇరాక్ యుద్ధంలో ఇరాక్ దళాల చేత చిక్కి ‘ఇరాకీయులు దుర్మార్గులని తమ ప్రభుత్వం చెప్పిన కధాలకు భిన్నంగా అత్యంత దయతో కూడిన ట్రీట్ మెంట్ ని శత్రు సైనికుల వద్ద అనుభవించి’ నిజాలు తెలుసుకుంది. ఆమెను రక్షించడానికి అమెరికా బలగాలు హాలీవుడ్ సినిమా స్ధాయిలో తీసిన బూటకపు వీడియోలను చూసి ఆమె అసహ్యించుకుంది. సెప్టెంబరు 11 దాడులకు ఆఫ్ఘన్లే కారణమన్న అమెరికా అబద్ధాలు నమ్మి యుద్ధానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన అమెరికా ఫుట్ బాల్ క్రీడాకారుడు పేట్ టిల్ మేన్ కూడా నిజం తెలుసుకున్నవారిలో ఒకరు. అమెరికా అధ్యక్షుడు బుష్, ఇరాక్ ప్రజలపైన “చట్టవిరుద్ధమైన, అన్యాయమైన యుద్ధానికి దేశాన్ని నడిపించాడని’ టిల్ మేన్ ఆటో బయోగ్రఫీలో రాశారు. అతను ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల చేతుల్లోనే చనిపోయినా శత్రువు కాల్పుల్లో మరణించిన గొప్పవీరుడని అమెరికా ప్రభుత్వం కీర్తించి సిల్వర్ స్టార్, పర్పుల్ హార్డ్ లను బహూకరించింది. ఆయన బయోగ్రఫీ వెలువడ్డాకగానీ యుద్ధం లో అతను తెలుసుకున్న నిజాలు వెల్లడికాలేదు. జెస్సికా లించ్ గురించి అమెరికా ప్రభుత్వం చెప్పిన కధనం కేవలం కల్పితమని టిల్ మెన్ ముందే గ్రహించినట్లు అతని బయోగ్రఫీ తెలిపింది. ఈ అంశాల గురించి మరిన్ని వివరాలు ఈ బ్లాగ్ లోనే ఉన్న మరొక పోస్టు లో చూడవచ్చు.

అమెరికా సైనికులు ఈ పరిస్ధితిని గుర్తెరగాలి. లేదంటే అమెరికా పాలకులు నిరంతరం సాగించే దురాక్రమణ యుద్ధాలలో సమిధాలుగానే వారు మిగిలిపోతారు. వారు నిజాలు తెలుసుకున్నట్లయితే, తెలుసుకుని యుద్ధాలకు వ్యతిరేకంగా నిర్ణయించుకున్నట్లయితే ప్రపంచ మానవ నాగరికతను పరిరక్షించినవారవుతారు. లేదంటే తమను యుద్ధాలకు పురికొల్పిన తమ ప్రభుత్వాల చేతనే పిచ్చివారుగా, విలువలు లేనివారుగా గుర్తింపు పొందుతారు.

2 thoughts on “యుద్ధాలు శా(శ్వా)సించేవారు రాజనీతిజ్ఞులు, యుద్ధం చేసే సైనికులు పిచ్చోళ్ళు?!

  1. విశెఖర్ గారు
    అమెరికా గాని మరేదెశం గాని ఆ దెశాల ద్రురాక్రమణ గురించి తెలుసుకొని కొంతమంది వ్యెక్తిగతంగా మానితె మానవచ్చుగాని మొత్తం సైనికవ్యెవస్తె అలా మారేదానికి అవకాశం లేదు కదా? ఎదైనా గొప్ప విప్లవం సంభవిస్తెతప్ప పెట్టుబడిదారీ సమాజం వుండగా అది సాద్యం కాదు . మీవిశ్లెషణ భాగుంటుంది మార్కిజం గురించి చాలామంది అపొహాలతొ దానిపైన గుడ్డి ద్వెషం కనపరుస్తున్నారు . దానికి కొంతకారణం ఈ కమ్యునిస్టు ముసుగు పార్టీలే కారణం అని నా అభిప్రాయం మీరు అలాంటి వాటిగురించి రాస్తె భగుంటుందని మా అభిప్రాయం.

  2. రామ్మోహన్ గారు, మీరు చెప్పింది నిజమే. అమెరికా సైనిక వ్యవస్ధ మొత్తం అలా మారేదానికి అవకాశం లేదు. తెలుగులో ఉన్న నా ఆర్టికల్ చదివి కొందరైనా మారే అవకాశం అసలే లేదు. ఐతే, ఆ అవసరం ఉన్నదని చెప్పడానికే ఆ సూచన చేశాను. తమ ఆదేశాల ప్రకారం వ్యవహరించిన సైనికులను పిచ్చోళ్లుగా చెప్పడానికి కూడా ప్రభుత్వం, సైనికాధికారులు వెనకాడరన్న విషయం కూడా నేను చెప్పదలిచాను.

    అమెరికా సైనికుల్లో ప్రచారాల్ని నమ్మి నిజాయితీగా యుద్ధాలకు వస్తున్నవారు ఉన్నారు. వీరి సంఖ్యం తక్కువేమీ కాదు. ఇరాక్ యుద్ధంలో మిలట్రీ ఇంటలిజెన్స్ ఎనలిస్టుగా ఉన్న బ్రాడ్లీ మేనింగ్ అలాగే నిజాయితీగా యుద్ధంలోకి దిగి అక్కడి వాస్తవాలు చూసి నిర్ఘాంతపోయాడు. వాస్తవాలు చెప్పాలని భావించి తనకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు లీక్ చేశాడు. అతనే అందించాడో, మరొకరు అందించారో తెలియదు గానీ అలా అందిన డాక్యుమెంట్లనే ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ గా వికీలీక్స్ వెల్లడి చేసింది. అవి వెల్లడి కావడంవల్ల అమెరికా చేసిన దారుణాలు చాలా బైటికి వచ్చాయి. వాటివల్ల సత్వరం మార్పు లేకపోవచ్చు. కాని ఆ సమాచారం పునాదిగా ప్రపంచ వ్యాపితంగా ప్రతిఘటన పెరిగే అవకాశాలు కూడా తక్కువేమీ కాదు. ఆ ప్రతిఘటన నిర్మితమయ్యే క్రమంలో వికీలీక్స్ సమాచారం కొన్ని ఇటుకలుగా పనికి వచ్చే అవకాశాల్నీ కాదనలేము.

    సైనికులు నిజాలు తెలుసుకుని తమ అధికారులపై తిరగబడే అవకాశాలు ప్రస్తుతం లేకపోయినా, మీరన్నట్లు విప్లవాల సమయంలొ అలా జరుగుతుంది. రష్యా, చైనాల విప్లవాలలో అలా జరిగింది. చైనాలో విప్లవం వచ్చాక సర్వ సైనాధ్యక్షుడుగా మారిన చూటే అలా వచ్చిన వ్యక్తే. జపాన్ తో కుమ్మక్కైన చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు సైనికాధికారులు సైన్యంతో సహా వచ్చి కమ్యూనిస్టు పార్టీ జరిపిన జపాన్ వ్యతిరేక యుద్ధంలో చేరారు. అలాంటి పరిణామాలు జరిగే అవకాశం విప్లవ పోరాటాలు ఉన్నత స్ధాయిలో ఉన్నపుడే ఎక్కువగా ఉంటుంది. కాని విశ్లేషణల్లో వీలయినపుడల్లా గుర్తు చేసుకోవడం అవసరమే. అదే కాక కాన్సెప్ట్ ని కూడా చర్చించడం ఇక్కడ ఉద్దేశం.

    అవును. ఎర్రజెండా ముసుగులో ఉన్న ప్రతీఘాతక శక్తుల వల్ల నష్టం భారీగానే ఉంది. సందర్భం వచ్చినపుడు ఆ విషయాలు కూడా రాస్తున్నాను. ఇకముందు కూడా రాస్తాను. మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి