ఆఫ్ఘన్ స్త్రీలు, చిన్నారులను ఊచకోత కోసిన అమెరికా సైన్యం -ఫొటోలు


ఆఫ్ఘన్ లో తిష్ట వేసిన అమెరికా సైనికులు అర్ధరాత్రి దాటాక తమ కాందహార్ సైనిక స్ధావరం నుండి బైటికి వచ్చి 16 మంది పౌరులను ఊచకోత కోసాడు. మరొ ఐదుగురు ఊచకోతలో తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన ఈ ఘటన లో మరణించినవారిలో 9 మంది చిన్నారులు కాగా 4 గురు స్త్రీలు. కేవలం ఒకే ఒక అమెరికా సైనికుడు ఈ ఊచకోతకు తెగబడ్డాడని కొన్ని పత్రికలు చెబుతున్నప్పటికీ అనేకమంది సైనికులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యాకాండకు పాల్పడ్డారని బిబిసి తెలిపింది. ఆఫ్ఘన్ పౌరులకు, అమెరికా సైన్యానికి మధ్య ఘర్షణ పెంచడానికి ఉద్దేశ్య పూర్వకంగానే అమెరికా సైనికులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అజ్ఞాతవర్గాలను ఉటంకిస్తూ సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా సైనికులు జరిపిన హత్యాకాండ “ఉద్దేశ్యపూర్వకంగా చేసిన సామూహిక ఊచకోత” అని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభివర్ణించాడు. అమెరికా ప్రభుత్వం ఈ హత్యాకాండకు ‘వివరణ ఇవ్వాలని’ ఆయన కోరాడు.

‘నెర్వస్ బ్రేక్ డౌన్’ అయిన అమెరికా సైనికుడొకరు తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్ధితిలో చేసిన మారణకాండగా అమెరికా, నాటో కమాండర్లు హత్యాకాండను అభివర్ణిస్తున్నారు. నాటో బలగాల సంస్కృతికి ఈ ఘటన ఏ మాత్రం అద్ధం పట్టదనీ, నాటో బలగాలు ఇలాంటి పని తలపెట్టవనీ, ఈ విధంగా జరిగిన మొట్టమొదటి దారుణం ఇదేననీ వారు పేర్కొన్నారు. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆఫ్ఘన్ పౌరులపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేసి ఊచకోత కోసారన్న ఆరోపణలపై గత సంవత్సరమే ఒక అమెరికా సైనికుడిపై అమెరికా కోర్టులు నేరం రుజువు అయినట్లు ప్రకటించాయి. ఇదే పద్ధతిలో ఆఫ్ఘన్ పౌరులను చంపిన ఒక అమెరికా సైనికుల గుంపుకు అతను నాయకత్వం వహించాడని అమెరికా కోర్టులు నిర్ధారించాయి. తాజా ఘటన జరిగాక అమెరికా కోర్టులు నిర్ధారించిన ‘హత్యాకాండ’ నేరాన్ని మర్చిపోవాలని నాటో కమాండర్లు కోరుకుంటున్నారన్నమాట. కొద్ది రోజుల తత్వాత మరో ఘటన జరిగితే అప్పుడు తాజా ఘటన మాసిపోతుందన్నమాట!

నిజానికి ఆఫ్ఘన్ గడ్డపై తిష్టవేసిన అమెరికా సైన్యం ఈ విధమైన ఊచకోతలకు దిగడం ఇదే కొత్తకాదు. అది వారికి నిత్య కృత్యం. తాలిబాన్ కు సహకరిస్తున్నారన్న అనుమానంతో అర్ధరాత్రి దాటాక పౌరుల ఆవాసాలపై మూకుమ్మడిగా దాడులు చేసి చంపడం, తాలిబాన్ కు సహకరిస్తున్న అనుమానంతో కనపడిన యువకులను పట్టుకెళ్ళి అదృశ్యం చెయ్యడం ఆఫ్ఘనిస్ధాన్ లో తరచుగా జరిగే సంఘటనలు. దశాబ్దకాలంగా జరుగుతున్న ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో మిలియన్ల మంది పౌరులు ఊచకోతల్లో హత్యకావించబడ్డారని వికీలీక్స్ వెల్లడి చేసిన అమెరికా రాయబారుల లేఖల ద్వారా వెల్లడయింది కూడా. ఇప్పుడు సిరియాలో కూడా అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, కతార్, సౌదీ అరేబియా, యెమెన్ తదితర దేశాలకు చెందిన కిరాయి మూకలు సిరియా ప్రజలపైన హత్యాకాండ అమలు చేస్తున్నాయి. తాము జరుపుతున్న హత్యాకాండలో హతులైనవారిని అధ్యక్షుడు బషర్ సైనికులు చేస్తున హత్యాకాండగా అవి పచ్చి అబద్ధాలను తమ తైనాతీ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాయి.

వ్యాఖ్యానించండి