తొమ్మిది మంది పిల్లలతో సహా 16 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న అమెరికా సైనికులు శుభ్రంగా తాగి వచ్చి ఆఫ్ఘన్ ప్రజల ఇళ్ళలో చొరబడ్డారనీ, కనపడినవారినందరినీ కాల్చి చంపారనీ ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “వాళ్ళంతా బాగా తాగి ఉన్నారు. నవ్వుకుంటూ, కేకలు వేసుకుంటూ కనపడిన ఆఫ్ఘన్లను కాల్చి చంపారు” అని అమెరికా సైనికుల కాల్పుల్లో పదకొండు మందిని కోల్పోయిన కుటుంబానికి పక్కనే నివశిస్తున్న ‘ఆఘా లాలా’ చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. “వాళ్ళ శరీరాల నిండా బుల్లెట్లే” అని లాలా తెలిపాడు.
అమెరికా సైనికులు గుంపుగా వచ్చి ఆఫ్ఘన్ ప్రజలపై కాల్పులు జరిపారని చనిపోయినవారి కుటుంబాల పొరుగువారు, బంధువులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. రెండు గ్రూపులుగా వచ్చిన అమెరికా సైనికులు ఇళ్లలో జొరబడ్డారని గ్రామస్ధులు చెప్పినట్లుగా డెయిలీ మెయిల్ తెలిపింది. పంజ్వాయ్ జిల్లాలోని రెండు గ్రామాల్లోకి ఉదయం రెండు గంటల ప్రాంతంలో అమెరికా సైనికులు చొరబడ్డారని గ్రామస్దులు తెలిపారు. గ్రామస్ధులు రెండు గంటలకు సైనికులను చూశామని చెబుతుండగా నాటో అధిపతి జాన్ అలెన్ తమ సైనికుడోకరు మూడు గంటలకు తమ స్ధావరం నుండి బైటికి వెళ్ళీనట్లు తెలిసిందని తెలివిగా మాట్లాడుతున్నాడు. తాను అబద్ధాలు చెబుతూ ఆఫ్ఘన్ పౌరులను అబద్ధాలు చెబుతున్నవారుగా చూపడానికి ఆయన చావు తెలివి ప్రదర్శిస్తున్నాడు.
కాల్చి చంపడమే కాక తమ బంధువులపై రసాయనాలు జల్లి నిప్పంటించారని చెబుతూ, అమెరికా సైనికులను, చనిపోయినవారి బంధువులు తిట్టిపోశారు. “అమెరికా సైనికులు నా కుటుంబాన్ని నిద్రలేపి వారి మొఖం పైనే కాల్పులు జరిపి చంపేశారు” అని మరొక కుటుంబానికి చెందిన బాధితుడిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
తాము చుట్టుపక్కలనుండి కాల్పులు విన్నామని గ్రామస్ధులు చెప్పినట్లుగా ఆఫ్ఘన్ అధికారులు చెప్పారని బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్ తెలిపింది. కాల్పుల్లో చనిపోయిన వారి ఇళ్ళు ఒకదాని కొకటి చాలా దూరంలో ఉన్నాయనీ, ఒకే సైనికుడు రెండు గ్రామాలు తిరిగి మూడు ఇళ్లలో దూరి గ్రామస్ధులను చంపడం సాధ్యం కాదని కాందహార్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుడొకరు తెలిపాడు.
“ఒకే ఒక అమెరికా సైనికుడు తమ స్ధావరం నుండి బైటికి వచ్చి ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్న ఇళ్లలో జొరబడి అంతమందిని చంపడం సాధ్యం కాదు. ఒక ఇంటిలో జొరబడి నిద్రపోతున్నవారిని లేపి కాల్చి చంపి తగలబెట్టడం, ఆ తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలోని మరొక గ్రామంలోని ఇంటిలో దూరి మరి కొందరిని తుపాకితో కాల్చి చంపి తగలబెట్టడం… ఇదంతా ఒక సైనికుడే చేయడం సాధ్యం కాదు” అని చెప్పాడని డెయిలీ మెయిల్ తెలిపింది.
పంజ్వాయ్ జిల్లాలో కౌన్సిల్ సభ్యుడుగా ఉన్న అబ్దుల్ ఘనీ స్ధానిక గ్రామస్ధులు రెండు గ్రూపుల అమెరికా సైనికులను తాము చూశామని చెప్పినట్లు తెలిపాడు. “వివిధ దిశల నుండి మెషిన్ గన్ కాల్పులు, పిస్టల్ కాల్పులు తాము విన్నామని గ్రామస్ధులు నాతో చెప్పారు” అని ఆయన తెలిపాడు. ఇతర గ్రామస్ధులు, బాధితులు చెప్పిన వివరాలు ఇక్కడ చూడవచ్చు.
పశ్చిమ దేశాల పత్రికలన్నీ కాల్పులు జరిపింది ఒక్కరేనని చెప్పడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. జరిగిన ఘాతుకానికంతటికీ ఒక్క సైనికుడే కారణమనీ, అతను కూడా నెర్వస్ బ్రేక్ డౌన్ తో బాధపడుతున్నాడనీ చెప్పేందుకు అనేక కట్టుకధలు అల్లుతున్నాయి. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే గోబెల్ పద్ధతులను పాటిస్తున్నాయి. తద్వారా పౌరులను చంపి రాక్షానందం పొందే సంస్కృతి తమది కాదని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వాస్తవాలు వారు చెప్పేవన్నీ అబద్ధాలని తేల్చేస్తున్నాయి.
నెర్వస్ బ్రేక్ డౌన్ అయితే తప్ప ఏ అమెరికా సైనికుడూ ఇలాంటి పని చేయడాని పరోక్షంగా అవి చెబుతున్నాయి. ఈ లెక్కన అమెరికా పాలకులూ, కాంగ్రెస్ సెనేట్ల సభ్యులూ, నాటో బలగాలూ, సి.ఐ.ఏ బలగాలూ అంతా నేర్వస్ బ్రేక్ డౌన్ తో బాధపడుతున్నట్లు భావించాలేమో. పదేళ్ళుగా ఆఫ్ఘన్ దేశాన్ని దురాక్రమించి ప్రజల ధన, మాన, ప్రాణాల్ని హరిస్తూ, నిత్య హత్యాకాండలతో లక్షల మందిని చంపేసిన వీరంతా నెర్వస్ బ్రేక్ డౌన్ వల్లే అలా చేశారని భావించాలి.
సద్ధామ్ వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు లేవని అమెరికా, యూరప్ లే నియమించిన సమితి ఇన్స్పెక్టర్లు అనేకసార్లు చెప్పారు. అయినా ఇరాక్ పై యుద్ధానికి తెగబడిన జార్జి బుష్ నెర్వస్ బ్రేక్ డౌన్ తో బాధపడి ఉండాలి. పది సంవత్సరాల పాటు ఇరాక్ పైన అమానుషమైన వాణిజ్య ఆంశాలను విధించడానికి నిర్ణయించిన అమెరికా, యూరప్ దేశాల పాలకులూ, ఆయా దేశాల చట్ట సభల సభ్యులూ అంతా నెర్వస్ బ్రేక్ డౌన్ తో బాధపడుతూ ఉండాలి. ఇరాక్ పసి పిల్లలకు పాలడబ్బాలు కూడా అందకుండా చేసి ఐదు లక్షల మంది పిల్లల ఉసురు తీసుకున్న అమెరికా, యూరప్ ల పాలకులు తీవ్రమైన మానసిక బాధలతో సతమవుతూ ఉండాలి.
అప్ డేట్
14.03.2012 తేదీన ఈ వార్తా కధనంలో రాయిటర్స్ మరో వాస్తవం వెల్లడించింది. అది ఇలా ఉంది.
A cleric, Neda Mohammad Akhond, said he believed the shootings may have been retaliation for an insurgent landmine attack on a U.S. convoy in the days before the massacre.
“They asked people to come out of their homes and warned them they would avenge this,” Akhond said.
There was no independent verification of an earlier attack.