రేపిస్టులను వదిలేస్తున్న భారత న్యాయ, సామాజిక వ్యవస్ధలు


Rape conviction rateరేపిస్టులు భారత దేశంలో కాలరెత్తుకు తిరుగుతున్నారు. అనేక సామాజిక అడ్డంకులు ఎదుర్కొని మరీ రేప్ నేరాలను రిపోర్టు చేస్తున్న బాధితులకు దక్కుతున్నది అవమానాలూ, నిరాశే తప్ప న్యాయం కాదు. 1973 నుండి ఇప్పటి వరకూ శిక్షలు పడిన రేపిస్టుల సంఖ్యలు చూస్తే రేప్ నేరాల్లో నేరం రుజువై శిక్ష పడిన కేసులు ప్రతి దశాబ్దానికి పడిపోతూ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రేప్ నేరాలలో పోలీసులు జరుపుతున్న పరిశోధనల్లో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, తేలిక భావం చోటు చేసుకోవడం వల్ల రేపిస్టులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారనీ ‘ది హిందూ’ పత్రిక విశ్లేషించింది. సామాజిక వ్యవ్యస్ధలు రేప్ నేరాలను తేలిక పాటి నేరాలుగా పరిగణిస్తున్నందువల్ల రేప్ నేరాలపై జరుగుతున్న పరిశోధనల్లో ‘సీరియస్ నెస్’ లోపించిందని ఆ పత్రిక వెల్లడించింది.

1973లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రేప్ నేరాలపై మొదటిసారిగా దేశ వ్యాప్త గణాంకాలను ప్రచురించింది. ఆ సంవత్సరం పోలీసుల దృష్టికి వచ్చిన రేప్ కేసులలో 44.28 శాతం కేసుల్లోనే దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే రేపిస్టుల్లో సగం మంది కంటే తక్కువే శిక్షలు విధించబడ్డారు. 2010 సంవత్సరంలో చూస్తే శిక్షలు పడిన రేపిస్టుల సంఖ్య 26.5 శాతానికి పడిపోయింది. 1983 లో ఈ శాతం 36.83 కాగా, 1993 లో 30.30 శాతానికీ, 2003లో 26.12 శాతానికీ అది పడిపోయింది.  రేప్ నేరాలకు సంబంధించి సుప్రీం కోర్టు అనేక సంచలన తీర్పులు ఇస్తూ మార్గ దర్శకంగా ఉన్న నేపధ్యం లో కూడా ట్రయల్ కోర్టుల్లో రేప్ నేరాలకు శిక్షలు పడడం గగనంగా మారింది.

క్రింది పట్టిక చూస్తే భారత దేశంలో పేరెన్నిక గన్న పట్నాలు ఈ విధంగా స్త్రీలకు ప్రమాదకరంగా మారిందీ తెలుస్తుంది.

How dangerous is your city

ఈ పట్టిక ప్రకారం ఢిల్లీ నగరం మహిళల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలుతోంది. జబల్ పూర్ నగరంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకీ 7.3 రేప్ కేసులు పోలీసుల వద్దకు వస్తుండగా, కోల్ కతా లో అత్యల్పంగా లక్ష మంది జనాభాకు 0.2 రేప్ నేరాలు పోలీసుల వద్దకు రాగలుగుతున్నాయి. కోల్ కతా ను మినహాయిస్తే అభివృద్ధి సాధించిన  మెట్రో పాలిటన్ నగరాలు రేప్ నేరస్ధులకు అడ్డాగా మారుతున్న పరిస్ధితి కూడా కనిపిస్తోంది. నగరాలలో సాధారణంగా జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల లక్ష మంది జనాభాకు రేపిస్టుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. అయితే పోలీసు, న్యాయ వ్యవస్ధలు గానీ, పాలనా వ్యవస్ధలు గానీ అభివృద్ధి చెందిన నగరాలలో మరింత పటిష్టంగా పని చేస్తాయని ఆశిస్తే అది తప్పేనని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

2010 సంవత్సరంలో పోలీసుల దాకా వచ్చిన రేప్ నేరాల గణాంకాలను కింది పట్టిక లో చూడవచ్చు. (పట్టికపైన క్లిక్ చేసి పెద్ద సైజులో పట్టికను చూడవచ్చు)

Rape crisis in India 2010

2010 లో మహా రాష్ట్రలో పోలీసులకు వద్దకు వచ్చిన రేప్ నేరాలలో 13.9 శాతం మందికి శిక్షలు పడగా, ఆంధ్ర ప్రదేశ్ లో 13.7 శాతం మందికీ, కర్ణాటకలో 15.4 శాతం మందికీ రేపిస్టులకు శిక్షలు పడ్డాయి. జమ్ము కాశ్మీరు రాష్ట్రంలోనైతే మరీ ఘోరంగా 2.6 శాతం మందికే శిక్షలు పడ్డాయి. జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో జరిగే నేరాలలో అత్యధికంగా పారా మిలట్రీ బలగాలూ, పోలీసులూ, సి.ఆర్.పి.ఎఫ్, బి.ఎస్.ఎఫ్ లాంటి మిలట్రీ, పారా మిలట్రీ బలగాల చేతిలో ప్రతి సంవత్సరం అనేక మంది స్త్రీలు రేప్ లకు గురవుతూన్న వార్తలు వస్తుంటాయి. ఈ బలగాలకు శిక్షలు పడితే వారి ఆత్మ స్ధైర్యమ్ దెబ్బతి తిండుతుందని ప్రభుత్వాలు తరచూ వాదిస్తుంటాయి. అందువల్లనే అక్కడ శిక్షల శాతం పరమ నాసిగా ఉందని తేలికగా అర్ధం అవుతోంది.

రేప్ నేరాలను రుజువు కావడానికి వీలుగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని మహిళా సంఘాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. 2009 లో ఢిల్లీ ప్రభుత్వం రేప్ నేరాలు జరిగినప్పుడు సేకరించవలసిన సాక్ష్యాధారాల కోసం SAFE (Sexual Assault Forensic Evidence) కిట్లు పంచినప్పటికీ పరిస్ధితి మెరుగు పడలేదు. రేప్ నేరాల పట్ల పోలీసులు నిర్లక్ష్యంతోనూ, తేలిక భావంతోనూ ఉండడంవల్ల కిట్లు పంచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వారి దృష్టిలో రేప్ లు పెద్ద నేరాలు కాదు. ఏదో తొందర పాటులో, క్షణికమైన పరిస్ధితుల్లో చేసిన నేరాలుగానే వారు చూస్తున్నారు తప్ప ఆ నేరాల వల్ల బాధితులు సామాజికంగా, మానసికంగా ఎంత నరకం అనుభవించేదీ వారు పట్టించుకోవడం లేదు.

సేఫ్ కిట్లు పంచినప్పటికి దానికి తగిన ప్రోటోకాల్స్ ను పోలీసులు పాటించడం లేదని సంబంధిత అధికారి చెప్పినట్లు ది హిందూ తెలిపింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం అధిపతిగా ఉన్న పుష్పా సింగ్, ఈ కిట్లు సరిగ్గా ఉపయోగిస్తే రేపిస్టులు తప్పించుకోవడం కష్టమేనని చెప్పింది. అయితే కిట్లు వాడడానికి కూడా కొన్ని పద్ధతులు పాటించవలసి ఉంటుంది. సరైన సమయంలోనో, నిర్ధిష్ట గడువులోపలో సదరు కిట్లు వినియోగిస్తే తప్ప ఫలితం ఉండదు. అయితే రేప్ నేరాల పట్లే నిర్లక్ష్యంతో వ్యవహరించే పోలీసులు నిర్ధిష్ట గడువులను పాటిస్తారని ఆశించలేము. అందుకే కిట్లు విఫలం అయ్యాయి. కిట్లు పంచడమే కాకుండా పోలీసుల్లో రేప్ నేరాల పట్ల వ్యవహరించవలసిన సున్నితత్వాలపైనా, సెన్సిబిలిటీస్ పైనా చైతన్యం పెంచే కృషిని ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ కిట్లు పంచే ప్రక్రియ ఢిల్లీ వరకే పరిమితం అయింది తప్ప ఇతర రాష్ట్రాల్లో ఆ సీరియస్ నెస్ కూడా లేదు.

రేప్ నేరాలు జరిగినపుడు అనుసరించవలసిన పద్ధతులపైనా, బాధితుల పట్ల వ్యవహరించవలసిన విధానంపైనా సుప్రీం కోర్టు కొన్ని సంచల తీర్పులు వెలువరించింది. బాధితురాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని స్వతంత్రంగా పరిశీలించి నిగ్గు తేల్చాల్సిన అవసరం లేదని తీర్పు నివ్వడం, బాధితులతో మహిళా ఆధికారులు మాత్రమే వ్యవహరించాలని చెప్పడం లాంటి తీర్పులు అటువంటివాటిలో కొన్ని. అయినా నేరస్ధులు నిర్దోషులుగా విడుదలవడం కొనసాగుతూనే ఉంది.

సామాజిక వ్యవస్ధలు రేప్ నేరాలను ఏ విధంగా పరిగణిస్తున్నాయన్న దానిపై కూడా ఆధారపడి పోలీసులు, కోర్టుల వ్యవహారం ఉంటోందని రెండవ పట్టికను పరిశీలించినపుడు అర్ధం అవుతుంది. హంతకుల కంటే రేపిస్టులు తేలికగా తప్పించుకోగలుగుతున్నారనీ హత్య తో పోల్చినపుడు రేప్ నేరం పట్ల పోలీసుల పరిశోధన సీరియస్ గా లేకపోవడం దీనికి కారణమని ఈ అంశాన్ని సామాజిక కోణం నుండి చూడాలనీ పట్టిక సూచిస్తోంది. రేప్ నేరాలకు పాల్పడినవారీలో అత్యధికులు బాధితులకు దగ్గరి బంధువులో, తెలిసినవారే ననీ కూడా తెలుస్తోంది. రేప్ నేరాలను స్త్రీల వస్త్ర ధారణకు ఆపాదిస్తున్న పోలీసు అధికారులు తమ దృక్పధాన్ని మార్చుకోవలసిన అవసరం ఈ వాస్తవం తెలియ జేస్తోంది.

7 thoughts on “రేపిస్టులను వదిలేస్తున్న భారత న్యాయ, సామాజిక వ్యవస్ధలు

  1. ప్రతి మానభంగ ఫిర్యాదూ యథార్థమేనని మీరు నమ్ముతున్నారా ? వీటిల్లో ఎక్కువభాగం – మానభంగమేమీ జరక్కుండానే, ఆ సదరు ఆరోపితుణ్ణి బెదిరించి, పరువు తీసి డబ్బుగుంజే ఉద్దేశంతో పెడుతున్న కేసులు. నాకు తెలిసిన ఒక భూస్వామితో అతని పొలంలో పనిచేసే కార్మికురాలు సంబంధం పెట్టుకుంది. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆ తరువాత ఆ సంబంధాన్ని ఆసరాగా చేసుకుని ఆ భూస్వామి చేత కొంత పొలం రాయించుకోవాలనుకున్నాడు ఆమె తండ్రి. వెంటనే అతని మీద మానభంగం కేసు పెట్టారు. మానభంగం కేసులన్నీ ఇవే అని నేను అనను. కానీ 60 శాతం దాకా ఇలాంటి బోగస్ కేసులేనని చెప్పగలను. అందుకే ఇవి కోర్టులో నిలబడలేకపోతున్నాయి. ఆ తప్పు జడ్జీలది కాదు. అనవసరంగా న్యాయవ్యవస్థని నిందించకండి. సాక్ష్యాలు బలంగా లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇలా ఫిర్యాదివ్వగానే అలా తీసుకెళ్ళి తలలు నరికేసే వ్యవస్థ కావాలా మీకు ? సారీ, అలాంటిది ప్రజాస్వామ్యంలో లభించదు.

  2. సర్ఫిజెన్ గారూ, భారత దేశంలో ప్రజాస్వామ్యం పని చేస్తోందన్న మీ నమ్మకాన్ని వాస్తవాలతో చెక్ చేసుకోవలసిన అవసరం నాకు కనిపిస్తోంది.

    భూస్వామి పొలంలో పని చేసే కార్మికురాలు భూస్వామిని బెదిరించే పరిస్ధితి భారత దేశంలో ఏ మూలకి వెళ్ళినా కనిపించదు. భూస్వామి ప్రమేయం లేకుండానే కార్మికురాలు సంబంధం పెట్టుకున్నట్లు మీ వ్యాఖ్యలో ధ్వనిస్తోంది. పురుషుడి ప్రమేయం, భరోసా, ఒత్తిడి లేకుండా అక్రమ సంబంధాలు ఏర్పడతాయా? అదీ భూస్వామితో.

    రేప్ కి గురయిన స్త్రీలను గౌరవంగా చూసే వ్యవస్ధా మనది? తేలికగా, సానుభూతితో చూస్తూ ఆమె వ్యక్తిత్వానికి అదొక పెద్ద మచ్చలా చూసే సమాజంలో రేప్ కి గురయ్యానని ఓ ఆడకూతురు చెప్పుకోగలదా? చెప్పుకుని జీవితాంతం లేని మచ్చతో బతగ్గలదా? రేప్ కి గురయిన స్త్రీలు బైటికి చెప్పుకోవడమే వెనకాడే పరిస్ధితుల్లో, ధైర్యంగా, దోషికి శిక్ష పడాలనే నిశ్చయంతో బైటికి వచ్చి పోలీసు రిపోర్టు ఇవ్వడం చాలా తక్కువ. బైటికి రాని కేసులు అనేకం. కనీసం అలాంటి వారికి కూడా న్యాయం జరగడం లేదంటే అది ఖచ్చితంగా లోపమే. లోపం ఎవరిదన్నది చర్చ.

    సాక్ష్యాలు బలంగా లేని పరిస్ధితి గురించి నేను రాయలేదు. ఒక నేరం జరిగినపుడు, నేరం స్వభావాన్ని బట్టి పోలీసులు కొన్ని పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతుల్ని పాటిస్తేనే నేరం రుజువు చేసే సాక్ష్యాలు పక్కాగా లభ్యం అవుతాయి. రేప్ నేరాలు జరిగినపుడు పోలీసులు ఇంకా సెన్సిబుల్ గా ఉండాలని సుప్రీం కోర్టు అనేకసార్లు చెప్పింది. న్యాయ మూర్తులు వివిధ సదస్సుల్లో మాట్లాడుతూ కూడా రేప్ నేరాన్ని రుజువు చేయడానికి పోలీసులు పాటించవలసిన పద్ధతుల గురించీ, వేగంగా స్పందించి సంఘటనా స్ధలంలో సేకరించవలసిన ఆధారాల గురించీ నొక్కి చెప్పారు. డాక్టర్లు, నేరాలకి సంబంధించిన నిపుణులు రేప్ నేరాలు జరిగినపుడు ఏయే జాగ్రత్తలు తీసుకుంటే సాక్ష్యాలు పక్కాగాసేకరించవచ్చో పరిశోధనా పత్రాలు, అవగాహనా పత్రాలు ప్రకటించారు.

    వీటన్నింటినీ పాటించకపోవడం వల్లనే రేప్ నేరస్ధులకు శిక్షలు పడడం లేదని జస్టిస్ చలమేశ్వర్ లాంటివారు చెప్పారు. అలా పాటించకపోవడానికి వ్యవస్ధాగతమైనవీ, పరిపాలనాపరమైనవీ, స్త్రీ సంబంధిత సెన్సిబిలిటీస్ కి సంబంధిచినవీ కారణాలు పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ అంశాలనే నేను ఆర్టికల్ లో చెప్పాను.

    ఇక ఎన్నో అడ్డంకులని ఎదుర్కొని రేప్ నేరానికి గురయ్యానని బైటికి వచ్చిన స్త్రీలవి బోగస్ ఆరోపణలుగా కొట్టి పారేస్తున్న మీరు ఏ ఆధారాలతో అలా చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పిన ఉదాహరణకి అసలు నమ్మ శక్యంగా లేదు. భూస్వామిని కార్మికురాలు బెదిరించడం ఏంటి? అన్యాయం కాకపోతే. వ్యవస్ధ గురించిన కనీస పరిజ్ఞానం ఉన్నవారెవరూ ఇలాంటి ఉదాహరణ చెప్పలేరు.

    “వీటిల్లో ఎక్కువభాగం – మానభంగమేమీ జరక్కుండానే, ఆ సదరు ఆరోపితుణ్ణి బెదిరించి, పరువు తీసి డబ్బుగుంజే ఉద్దేశంతో పెడుతున్న కేసులు”

    ఆడవాళ్ళ ఉద్దేశ్యాలపైన ఇంత గొప్ప గౌరవ పూరితమైన అభిప్రాయం ఉన్న మీరు భూస్వామిని కార్మికురాలు బెదిరించిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

    జనాభాలో సగభాగం స్త్రీలు. వారు కూడా ప్రజలేనన్న గ్రహింపు మీకు ఉంటే, ‘ప్రజాస్వామ్యం’ గురించి ఈ విధంగా మాట్లాడతారా? ప్రజాస్వామ్యం అంటే సగం జనాభా ఐన స్త్రీల గురించి ఇంత తేలిక భావన ఉండడమా? ప్రజాస్వామ్యం పురుషులకేనా? అది కూడా భూస్వామ్య పురుషులకేనా? అవును. పురుష స్వామ్యంలో స్త్రీలు బోగస్ ఆరోపణలు చేసేవారు. రేప్ జరక్కపోయినా రేప్ జరిగిందని బహిరంగంగా చెప్పి తమను తామే తక్కువ చేసుకునేవారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారేవారు. శారీరక కోరికలు తీర్చుకోవడం కోసమే స్త్రీలు పడుపు వృత్తిలో ఉన్నారని కూడా మీలాంటి వారు అనగలరు.

  3. ఇక్కడ మనం యావత్తు స్త్రీజాతి గురించి గానీ, యావత్తు పురుషజాతి గురించి గానీ మాట్లాడుకోవడం లేదన్న సంగతి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఒక తరహా నేఱం గుఱించి ! పురుషులంతా మంచివారు కారు. కొందరు చెడ్డవారున్నారు. అలాగే స్త్రీలంతా మంచివారు కారు. వారిలోనూ కొందరు చెడ్డవారున్నారు. ఆ చెడ్డస్త్రీలలో సిగ్గుమాలిన కేటగరీ ఒకటుంది. దాని పరిధిలోకి వచ్చే స్త్రీలు కొందరు మానభంగం కంటే వేరైన కారణాలతో బజారుకెక్కుతున్నారు. చాలా సందర్భాలలో వాళ్ళ వెనక వాళ్ళ మగవాళ్ళున్నారు, నేను ఉదాహరించిన కేసులో మాదిరి. కానీ న్యాయవ్యవస్థ ఇంకా సాక్ష్యధారాలనే ప్రాతిపదిక మీద తీర్పులు తీరుస్తూండడం వల్ల వాళ్ళ తప్పుడుకేసులు చెల్లకుండా పోయి, అమాయకులైన మగవాళ్ళు రక్షించబడుతున్నారు. దేశంలో సిగ్గులేని కేటగరీ రోజురోజుకూ పెరిగిపోతోంది. అది పెరిగిపోవడం వల్ల మానభంగం కేసులు కూడా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్నాయి. ఎవరైనా ఎవరిమీదైనా కేసుపెట్టొచ్చు. అంత మాత్రాన అది వాస్తవమేనని ఎలా అనుకుంటాం ? జడ్జీల కంటే మనకెక్కువ తెలుసా ? మరి మీ వ్యాసంలో జడ్జీల్నే తప్పుపట్టుతున్నారు కదా

    నేను చెప్పిన ఉదంతాన్ని మీరు అబద్ధంలాగా కొట్టిపారెయ్యడం మీ one-sided thinking ని సూచిస్తున్నది. జరిగిన విషయం జరిగినట్లు చెప్పాను. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. జనం అడ్డం తిరగడం వర్గాన్ని బట్టి ఉండదు. వాళ్ళ వాళ్ళ గడుసుదనాల్నీ, మెతకతనాల్నీ బట్టి ఉంటుంది. చట్టాలనేవీ, తీర్పులనేవీ అన్నిసందర్భాల్నీ, అన్నిరకాల మనస్తత్త్వాల్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందించేవై ఉండేవి. Justice regime లో ఆవేశాలూ, ఆవేదనలూ, one-sided థింకింగులూ, వర్గీయ పక్షపాతాలూ పనికిరావు.

  4. సర్ఫిజెన్ గారూ మానభంగం జరిగిందని చెప్పుకోవడానికి సహజంగా స్త్రీలు ఇష్టపడరు. ఈ విషయం ముందు మీరు గుర్తించాలి. దానికి కారణాలు చెప్పాను. సంఘం అలాంటివారిని యధావిధిగా గౌరవంగా చూసే పరిస్ధితి లేకపోవడం, తనపై అత్యాచారం జరిగినట్లు ప్రపంచానికి తెలిశాక తన పరువు ప్రతిష్టలు ఏమైపోతాయోనన్న భయం, సిగ్గు, అవమానం… వీటన్నింటివలన ఆ సంగతిని వారు చెప్పుకోలేరు. అలాంటి పరిస్ధితులను దాటుకుని బైటికి చెప్పుకోగలిగిన స్త్రీలను అబద్ధాలు చెప్పేవారిగానూ, తప్పుడు కేసులు పెట్టేవారిగానూ మీరు చెప్పడం చాలా చాలా అభ్యంతరకరం.

    మీరసలు నేను చెప్పిన అంశాన్ని గమనిస్తున్నారా? మీకొక కేసు తెలుసు కనుక ఆ కేసుపై ఆధారపడి మానభంగం జరిగిందంటూ బైటికి చెప్పుకునే స్త్రీలందరి గుణ గుణాల్ని నిర్ణయిస్తారా? అరవై శాతం మంది దొంగ కేసులే పెడుతున్నారని చెప్పడం తీవ్రంగా ఖండించవలసిన సంగతి. అలా చెప్పడానికి మీకున్న ఆధారం ఏమిటి? అనేక అడ్డంకులను అధిగమించి బైటికి చెప్పుకునే స్త్రీలు అబద్ధాలు చెప్పి, దొంగ కేసులు పెట్టే అవకాశాలు ఉండవని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఉన్నా కోటికొకటి ఉండవచ్చేమో. మొత్తం వ్యవస్ధ గురించిన ధోరణులను చర్చించుకునేటపుడు కోటికొకటి జరిగే ఉదాహరణలను జనరలైజ్ చేసి చూపుతారా? సమాజంలో ఏ ధోరణి ప్రధానంగా ఉందో దానినే జనరలైజ్ చేసి చెబుతారని మీరు గుర్తించాలి.

    రేప్ జరిగిందని చెప్పుకునే స్త్రీ అబద్ధం చెప్పే అవకాశాలు తక్కువ గనకనే వారి స్టేట్ మెంట్ ని సాక్ష్యం కోసం చూడకుండా ట్రయల్ కోర్టులు స్వీకరించాలని సుప్రీం కోర్టు తీర్పు ఉంది. ఆ సంగతి ఆర్టికల్ లో ప్రస్తావించాను. ఆ తీర్పు నేరుగా కోర్టులను ఉద్దేశించేనని గ్రహించారా? మానభంగం జరిగిందని చెప్పుకునే స్త్రీ, అబద్ధం చెప్పే అవకాశం లేదని సుప్రీం కోర్టు గుర్తించింది కనుకనే వారి స్టేట్ మెంట్ నమ్మాలని సుప్రీం కోర్టు క్రింది కోర్టులను ఆదేశించింది. వారి స్టేట్ మెంట్ లో అబద్ధాలు వెతుకుతూ ఆమెను మరింత హింసించవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆమె స్టేట్ మెంట్ ని నిందితుడు వ్యతిరేకిస్తే, తాను అమాయకుడనని చెప్పదలిస్తే ఆ విషయాన్ని రుజువు చేసుకునే బాధ్యత నిందితుడిపై ఉండాలి తప్ప అప్పటికే హింసకు గురయిన బాధితురాలిని అసంబద్ధ ప్రశ్నలతో వేధించవద్దని సుప్రీం కోర్టు చెప్పింది. ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు సుప్రీం కోర్టు కంటే ఎక్కువ తెలుసా?

    సుప్రీం కోర్టు కూడా వర్గీయ పక్షపాతాలు, ఒన్ సైడెడ్ ధింకింగ్ తో ఉందని చెబుతారా?

    మన సమాజం శీలం గురించిన నిబంధన స్త్రీలపై విధిస్తుంది గాని, పురుషులపై గాదు. పురుషుడు ఎన్ని నీచమైన పనులు చేసినా, ఎంతమందితో వ్యభిచారం చేసినా అది మగ కృత్యాలలో భాగం. స్త్రీలపైన సమాజం అనేక నిబంధనలు, నియమాలు, పతివ్రతగా జీవించవలసిన సూత్రాలూ విధించినందున వారిక బతకడానికే అనర్హులుగా మారతారు. మీ ద్రుష్టిలో కూడా స్త్రీలపై ఉన్న తేలిక భావన మీ మాటల్లోనే స్పష్టం అవుతోంది.

    “ఆ చెడ్డస్త్రీలలో సిగ్గుమాలిన కేటగరీ ఒకటుంది. దాని పరిధిలోకి వచ్చే స్త్రీలు కొందరు మానభంగం కంటే వేరైన కారణాలతో బజారుకెక్కుతున్నారు” ఈ వర్ణన చాలా అభ్యంతరకరం. స్త్రీలలో చెడ్డవారిని “సిగ్గుమాలిన కేటగిరి” అని అభివర్ణించే మీరు వారి వెనుక ఉన్న పురుషులను మాత్రం “వాళ్ల వెనక వాళ్ల మగవాళ్ళు” అని గౌరవంగా సంబోధించగలుగుతున్నారు. ఎక్కడినుండి వచ్చింది తేడా. చెడ్డ స్త్రీలను సిగ్గుమాలినవారుగా వర్ణించగలిగిన మీరు, వారి వెనుక ప్రధాన పాత్రం వహిస్తున్న మగవాళ్లను అలా ఎందుకు వర్ణించలేకపోయారు. ఎందుకంటే పురుషాధిక్య భావజాలం మీ ఆలోచనల్లో బాగా జీర్ణించుకుపోవడం వల్ల. నేనిలా అనడం మిమ్మల్ని హర్ట్ చేస్తుంది గానీ నిజం చెప్పాలని భావిస్తున్నందున అనక తప్పడం లేదు.

    “ప్రజాస్వామ్యం” అంటూ ప్రస్తావించిన మీరు ప్రజల్లో సగభాగంగా ఉండే స్త్రీల సెన్సిబిలిటీస్ ని, ఆలోచనలనూ, వ్యక్తిత్వాలనూ గౌరవించడం కూడా నేర్చుకోవాలి. మానభంగం జరిగిందని చెప్పుకుంటున్న స్త్రీలలో అరవై శాతం మందిని అత్యంత తేలికగా బజారు వారనీ, సిగ్గుమాలినవారనీ చెప్పడం అస్సలు సరైంది కాదు. అరవై శాతం అన్న సంఖ్య ఎక్కడి నుండి తెచ్చారో చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే అది అవాస్తవం గనుక. మీ బుర్రలో పుట్టిన ఒక అవాస్తవాన్ని అధారిటేటివ్ గా చెప్పడంలోనే ప్రజాస్వామ్యం పట్ల మీకున్న గౌరవం ఏ పాటిదో చెప్పడం లేదా?

  5. మీరనుకుంటున్నట్లుగా నాకు స్త్రీజాతి మీద ఏ విధమైన చులకనభావమూ లేదు. నాకు చులకనభావం ఉన్నది సిగ్గులేని కేటగరీ మీద మాత్రమే. ఆధారాల్లేని స్తేట్‌మెంట్లని నిజాలుగా నమ్మాలని సుప్ర్తీం కోర్టు ఆదేశిస్తే అది న్యాయమా ? ఆటవిక న్యాయమా ? మన వ్యక్తిగత జీవితాల్లో గానీ, పబ్లిక్ జీవితంలో గానీ విద్యావ్యవస్థలో గానీ ఆధారాలు లేని విషయాల్ని నముతున్నామా? అలా నమ్మాలని శాసిస్తున్నామా ? ఎక్కడా లేనిది స్త్రీల విషయంలో మాత్రం ఎందుకలా చేయాలి ? దయచేసి కాస్త విశదీకరిస్తారా ? ఎందుకీ ద్వంద్వప్రమాణాలు, స్త్రీలకొకలా ? మిగతా సమాజానికి ఇంకొకలా ? స్త్రీల కేసుల్లో ఒకలా ? మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ మరోలా ?

  6. సర్ఫిజెన్ గారు చూడబోతే సుప్రీం కోర్టు కంటే మీకు ఎక్కువ నాలెడ్జి (సామాజిక పరిస్ధితులపైన) ఉన్నట్లు తోస్తోంది.

    సుప్రీం కోర్టు వద్దకు నిత్యం అనేక కేసులు వస్తుంటాయి. తన వద్దకు వచ్చే కేసులే కాకుండా క్రింది కోర్టులన్నింటిలోకి వచ్చే కేసుల్ని కూడా అది పరిగణలలోకి తీసుకుంటుంది. ఆరు దశాబ్దాలుగా వస్తున్న కేసుల్ని అది పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే నేను చెప్పిన తీర్పు నిచ్చిందని మీరు గమనించాలి. తన వద్ద వస్తున్న కేసుల్ని బట్టి భారత దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక, నైతిక వ్యవస్ధలన్నింటిపైనా దానికి అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఉత్తుత్తి అవగాహనగా ఉండదు. ఆరు దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న పరిణామాలు అందులో ఇమిడి ఉంటాయి. దేశంలోని ప్రజల ఆర్ధిక పరిస్ధితులతో పాటు, రాజకీయంగా, సామాజికంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్ధితులు అందులో ఇమిడి ఉంటాయి. స్త్రీ పురుషుల సంబంధాలు, కుటుంబ సంబంధాలు, నైతిక వర్తనకు సంబంధించిన సంబంధాలు, విలువలు, వాటి అభివృద్ధి లేదా పతనం, అన్నీ అందులో ఇమిడి ఉంటాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నది గనకనే సుప్రీం కోర్టు ఆ తీర్పు ఇవ్వగలిగిందని మీగు గుర్తించాలి.

    ఆధారాల్లేని స్టేట్ మెంట్లను ఆమోదించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని నేను చెప్పలేదు. నేను చెప్పిన విషయాన్ని మీకున్న అవగాహనకి అనుగుణంగా మీరు అర్ధం తీస్తున్నారు. దేశం ఇంకా పురుషస్వామ్య వ్యవస్ధగానే ఉంది. స్త్రీలకు సమాన అవకాశాలు ఇంకా రాలేదు. ప్రబుత్వమే అనేక వ్యవస్ధలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడం లేదు. శారీరక దారుఢ్యం అవసరం ఉన్న ఉద్యోగాల్లో కూడా స్త్రీలు తమ శక్తిని నిరూపించుకుంటున్నప్పటికీ వారికి అన్ని రంగాల్లో అవకాశాలు ప్రభుత్వమే ఇవ్వడం లేదు. ఇక పురుషుల కిందనే స్త్రీలు లొంగి ఉండాలనీ, భర్తకి భార్య లోబడి ఉండాలనీ భావించే సమాజం ఉండనే ఉంది. మహిళలు పుట్టినప్పటినుండి ఎవరో ఒక పురుషుడి సంరక్షణలోనే (తండ్రి, భర్త, కొడుకు…ఇలా) ఉండాలని సమాజం బోధిస్తుందిగానీ అమె తనను తాను వ్యక్తిగా నిలవగల పరిస్ధితులు సమాజంలో ఏర్పడాలన్న అవగాహన మన సామాజిక నియమాలు ఇవ్వడం లేదు. అటువంటి నియామాలు ఉన్నపుడు ఆ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించే పురుషుల ప్రవర్తనలు ఆటోమేటిగ్గా నేరంగా పరిగణించే పరిస్ధితి వస్తుంది. అది లేదు గనక పోలిసులు, ప్రభుత్వం, కోర్టులు, అధికార పాలనా వ్యవస్ధలు స్త్రీల పట్ల కొన్ని అదనపు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవలసిన అవసరం వస్తోంది. అందులో భాగంగానే సుప్రీం కోర్టు తీర్పుని చూడాలి.

    ఆధారాలు లేకుండా ఒక స్త్రీ స్టేట్ మెంట్ ఇస్తుంది అన్న మీ నమ్మకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. మొదటినుండీ నేను చెబుతున్న విషయాన్ని మీరెందుకు పరిగణించరు? మానభంగానికి గురయిన స్త్రీ సామాజికంగా, నైతికంగా, వ్యక్తిగతంగా/కుటుంబపరంగా అనేక అననుకూల పరిస్ధితులను అధిగమించి పోలీసులకు రిపోర్టు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అధిగమించి ఒక స్త్రీ తాను మానభంగానికి గురయ్యానని చెప్పుకోవడమే ఆ కేసులో న్యాయం ఉందన్న అవగాహన మనకు ఉండాలి. ప్రతికూల పరిస్ధితుల మధ్య పోలీసులవరకూ, కోర్టులవరకూ వచ్చిన స్త్రీ ఆధారాలు లేకుండా మానభంగ జరిగిందని అబద్ధం చెప్పే పరిస్ధితి చాలా రేర్ కేసుల్లో మాత్రమే సంభవమని మీకు అర్ధం కావడం లేదా? అసలా పరిస్ధితిని లేదా సామాజిక వాస్తవాలను గుర్తిస్తున్న పరిస్ధితే మీ వాదనల్లో నాకు కనిపించడం లేదు. నేను చెబుతున్నది మొత్తం సామాజిక పరిస్ధితులను గురించి గనుక సామాజిక వాస్తవాలనే పరిగణీంచాలి తప్ప మీకు తెలిసిన ఒక కేసు నేపధ్యంలో మొత్తం పరిస్ధితిని అంచనా వేయడం సరికాదు.

    ప్రతికూల పరిస్ధితుల్లో వ్యక్తిగతంగా అవమానాలకు గురయ్యే పరిస్ధితులు ఎదురవుతాయని తెలిసి కూడా రిపోర్టు చేసే స్త్రీలు అబద్ధం చెప్పడానికి అవకాశాలు చాలా తక్కువ గనక ఆమెను ప్రశ్నలతో వేధించి మరింత హింసించకుండా ఆమే స్టేట్ మెంట్ ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు అంతరార్ధం. ఆ అర్ధాన్ని వదిలేసి మరొక కొసకు పోయి అబద్ధాలు చెప్పినా నిజాలుగా నమ్మాలని కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా లేని అర్ధం ఎందుకు తీస్తున్నారు? రేప్ జరిగినట్లు స్త్రీలు అబద్ధాలు చెబితే దాదాపు ప్రాధమిక పరిశీలనలోనే అది తెలిసిపోతుంది. రేప్ నేరం యొక్క స్వభావం అలాంటిది.

    అసలు రేప్ అంటే ఏమిటి? కేవలం శారీరకంగా బలవంతంగా కలిస్తేనే రేప్ అని మీరు భావిస్తున్నారేమో? అనేక దేశాల్లో రేప్ నేరం శారీరక కలయిక లేకుండానే నిర్వచించబడింది. స్త్రీల అంగీకారం లేకుండా భర్త చేసిన బలవంతం కూడా రేప్ గా పరిగణిస్తున్న దేశాలున్నాయి. స్త్రీలు తమంతట తాము నిర్ణయం తీసుకోలేని బలహీన పరిస్ధితుల్లో ఉన్నప్పటికీ అది రేప్ గా పరిగణించే దేశాలున్నాయి. స్కాండినేవియన్ దేశాల్లో స్త్రీల పక్షాన పటిష్ట మైన చట్టాలు అమలు చేస్తున్నాయి. యూరోపియన్ దేశాల్లో కూడా స్త్రీల రక్షణ కోసం అనేక సున్నితమైన చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఆయా సామాజిక వ్యవస్ధలు అత్యున్నత స్ధాయికి అభివృద్ధి చెందిన చోట్ల అనివార్యంగా ఇటువంటి చట్టాలు రూపొందుతాయి.

    భారత దేశంలో శతాబ్ధాల నాటి భూస్వామ్య వ్యవస్ధ ఇంకా పెత్తనం చేయడం వల్ల భాస్వాములే పార్లమెంటు, అసెంబ్లీల్లో కూర్చోవడం వల్ల స్త్రీ సంబంధిత రక్షణ చట్టాలు భారత దేశంలో శక్తివంతంగా లేవు. ఒక సుప్రీం కోర్టు తీర్పునే ‘అబద్ధాలు నమ్మాలని శాసిస్తున్నట్లుగా’ అభివర్ణిస్తున్న మీకు భారత దేశ సామాజిక పరిస్ధితులపై ఎలాంటి అవగాహన ఉందో అర్ధం కావడం లేదు.

    సమాజమే స్త్రీల పట్ల ఆధిక్యతా పూర్వకంగానూ, అణచివేసే పద్ధతుల్లోనూ వ్యవహరిస్తున్నది. అటువంటి పరిస్ధితుల్లో స్త్రీలకు సరైన న్యాయం జరగాలంటే అదనపు చట్టాలూ, రక్షణలూ తప్పనిసరి.

    ఒకటి రెండు వాక్యాలను కాకుండా నేను చెబుతున్న అంశాలను మొత్తంగా పరిగణించి వ్యాఖ్యానించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.

  7. చర్చ బాగుంది!
    ‘సిగ్గు లేని కేటగరీ’ స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు. ఆ కేటగరీ పురుషులు కొల్లలు. కానీ వారికి మాత్రం సామాజికంగా, వ్యవస్థాపరంగా చాలా రక్షణలు దొరుకుతున్నాయి!

వ్యాఖ్యానించండి