పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ హంతక దాడులు


Israeli airstrikesఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు కూడా గాజా పై దాడి చేసి 7 గురు అమాయక పౌరులను బలి తీసుకుంది. శనివారం గాజాపై వైమానిక దాడులు జరిపి పది మందిని చంపిన ఇజ్రాయెల్, ఆదివారం మళ్ళీ అత్యాధునిక విమానాలతో జరిపిన బాంబు దాడుల్లో మరో 7 గురుని చంపేసింది. చనిపోయినవారిలో 12 యేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. గత కొద్ది నెలలుగా చెదురు ముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ముఖ్యమైన పాలస్తీనా నాయకుడిని ఇజ్రాయెల్ హత్య చేయడంతో చెల్లా చెదురయ్యింది. రెండు రోజుల నుండీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాపై చక్కర్లు కొడుతూ అనుమానం వచ్చిన చోటల్లా బాంబులు కురిపిస్తుండడంతో గాజా పౌరులు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.

తాజాగా ఘర్షణలు తలెత్తిన నేపధ్యంలో ఇరు పక్షాల మధ్య ‘కాల్పుల విరమణ’ ఒప్పందం కుదర్చడానికి ఈజిప్టు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇజ్రాయెల్ కొన్ని లక్షాలను ఎంకుకుని మరీ బాంబు దాడులు చేస్తోంది. ప్రతిగా గాజాలో ని మిలిటెంట్ గ్రూపు ఒకటి వందకు పైగా రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. అయితే రాకెట్లను అడ్డుకునే సమర్ధవంతమైన ఆయుధాలు (ఐరన్ డోమ్ మిసైల్) ఇజ్రాయెల్ వద్ద ఉండడం వల్ల వాటివల్ల ఇజ్రాయెల్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒక పౌరుడు గాయపడ్డాడని ఇజ్రాయెల్ ప్రకటించింది.

2009 లో ఇజ్రాయెల్, గాజాపైన అమానుషమైన హంతక దాడి జరిపింది. గాజా యుద్ధంగా పేరొందిన ఈ దాడిలో 1400 మందికి పైగా గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, యూరప్ లు సరఫరా చేసిన అధునాతన ఆయుధాలతో ఇజ్రాయెల్ గాజా రోడ్డు, రైలు, కమ్యూనికేషన్ సౌకర్యాలను తీవ్రంగా విధ్వంసం కావించింది. అనేక నివాస భవనాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఇప్పటికీ వారు అరకొర నివాసాలలో బతుకుతున్నారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన ఇళ్ళను పునర్నిర్మాణం చేసుకోవడానికి కూడా ఇజ్రాయెల్ అనుమతించకుండా అడ్డుకుంటోంది. సిమెంటు, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి తో పాలస్తీనీయులు బాంబులు తయారు చేస్తారన్న సాకు చూపుతూ సదరు సరుకులను గాజా దిగుమతి చేసుకోకుండా వాయు, జల, రోడ్డు మార్గాలన్నింటిలోనూ కాపలా కాస్తోంది.

ఏ దేశమైనా, అంతర్జాతీయ సంస్ధలు గానీ, మానవతా దృక్పధంతో గాజాకు సరుకులు పంపినట్లయితే అటువంటి ఓడలపైనా కూడా ఇజ్రాయెల్ దాడులు చేసి చంపేస్తోంది. ఆ విధంగా టర్కీ నుండి గాజాకు మానవతా సాయం తీసుకువస్తున్న ‘మావీ మర్మారా’ ఓడల వరుస పైన ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేసి డజను మందికి పైగా పొట్టన బెట్టుకున్నారు. ఈ ఘటనపై ఉత్తుత్తి విచారణ జరిపి ముగించడమే తప్ప విచారణ జరిపి దోషుల ను శిక్షించే పనికి అంతర్జాతీయ సంస్ధలు గానీ, న్యాయ స్ధానాలు గానీ పూనుకోలేదు. గాజా లో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రబ్బుత్వం నడుపుతున్న హమాస్ పార్టీని అమెరికా ‘టెర్రరిస్టు సంస్ధ’ గా గుర్తిస్తుంది.దానితో అమెరికా, యూరప్ లకు అనుచరులుగా ఉండే దేశాల పాలకులు కూడా గాజా పై ఇజ్రాయెల్ జరుపుతున్న దౌర్జన్యాలను ఖండించడం లేదు.

ఇప్పటికీ పాతికమంది పౌరులను బలిగొన్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఇంతటితో ముగియలేదని ఆ దేశ రక్షణ మంత్రి యూద్ బారక్ ప్రకటించాడు. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అరబ్ లీగ్ ‘సామూహిక హత్యాకాండ’ గా అభివర్ణించింది. అరబ్ లీగ్ సంస్ధ పూర్తిగా కోరలు లేని సంస్ధ. అరబ్ దేశాలు సభ్యులుగా ఉన్న అరబ్ లీగ్ కు అమెరికా, యూరప్ ప్రయోజనాలను నెరవేర్చడంలో ఉన్న ఆసక్తి అరబ్ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో లేదు. సిరియా లో జొరబడి అమెరికా, యూరప్ దేశాల నుండి దిగుమతి అయిన ప్రత్యేక బలగాలు సృష్టిస్తున్న హత్యా కాండలో పాల్గొనడానికి అరబ్ లీగ్ దేశాలు కూడా కిరాయి సైన్యాలను సరఫరా చేస్తున్నాయి. కతార్, కువైట్ సౌదీ అరేబియా లాంటి దేశాలు సిరియా ప్రజలను చంపుతున్న కిరాయి మూకలకు శిక్షణ ఇవ్వడానికి కేంద్రాలు నడుపుతున్నాయి. అటువంటి అరబ్ లీగ్ పాలస్తీనా పై ఇజ్రాయెల్ జరుపుతున్న హత్యా కాండను వ్యతిరేకిస్తున్నట్లు నటించడం పరువు కోసమో, పేరు కోసమో తప్ప మరొకదానికి కాదు.

గాజాలో పని చేస్తున్న ఒక మిలిటెంట్ సంస్ధ టాప్ కమాండర్ జూహైర్ ఆల్-కైస్సీ ని శుక్రవారం ఇజ్రాయెల్ బాంబుదాడులలో చంపడంతో తాజా ఘర్షణలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా గాజా మిలిటెంట్ సంస్ధ రాకెట్ దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా గాజా మిలిటెంట్లు జరిపిన దాడిని అమెరికా ఖండించింది తప్ప ఇజ్రాయెల్ దాడుల్లో పాటికి మంది పౌరులు చనిపోయినా ఖండించడానికి అమెరికాకి మనసొప్పలేదు. పైగా గాజా మిలిటెంట్లు జరిపిన రాకెట్ దాడులను టెర్రరిస్టు దాడులుగా అభివర్ణించడానికి తెగ ఆసక్తి చూపింది. తాము పెంచి పోషించిన ఆల్-ఖైదా ను టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేసి టెర్రరిజం పై యుద్ధం పేరుతో రెండు దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్న అమెరికా అదే అల్-ఖైదాతో జత కట్టి లిబియా, సిరియా లలో విధ్వంసకాండ జరిపింది. ఆఫ్రికాలో మరి కొన్ని చోట్ల కూడా ఆల్-ఖైదా తో జట్టు కట్టి ప్రభుత్వాలను అస్ధిరపరచడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇటువంటి హంతక దాడులతో, దురాక్రమణ యుద్ధాలతో, ప్రభుత్వాలను అస్ధీరపరిచే కుట్రలతో ప్రపంచంలో నే నెంబరు వన్ టెర్రరిస్టు గా ఉన్న అమెరికా రాజ్యం ఇజ్రాయెల్ జాత్యహంకార ప్రభుత్వంపై పోరాడుతున్న గాజా మిలిటెంట్లను టెర్రరిస్టులని అభివర్ణించడమే పెద్ద కుట్ర.

వ్యాఖ్యానించండి