కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం తమకు ఆమోదనీయం కాదంటూ ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది. ఇటలీ మెరైన్లను ఇండియా పోలీసులు కష్టడీలోకి తీసుకోవడమే పెద్ద ‘రాయబార పరాజయం’ గా ఇటలీ ప్రతిపక్షాలు, విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఫిబ్రవరి 15 తేదీన కేరళ సమీపాన సముద్ర జలాల్లో ఇటలీకి చెందిన ‘ఎనృకా లేక్సీ’ ఓడ నుండి ఇద్దరు మెరైన్లు సమీపంలో పడవలో వెళ్తున్న ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారు. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్ర దొంగలు అంతర్జాతీయ నౌకాలపై దాడి చేసి దోచుకుంటున్న నేపధ్యంలో భారతీయ పడవను కూడా సముద్ర దొంగలుగా ఇటలీ సైనికులు భావించారు. తమ వైపుకు వేగంగా వస్తుండడంతో దొంగలని భావించామనీ, హెచ్చరిక కాల్పులు జరిపినప్పటికీ ఆగకపోవడంతో కాల్చామనీ ఇటలీ చెపుతోంది. తమ జాలర్ల వద్ద మారణాయుద్ధాలేవీ లేవనీ, అలాంటప్పుడు కాల్చవలసిన అవసరం ఎందుకొచ్చిందనీ ఇండియా ప్రశ్నిస్తోంది.
తమ ఓడ అంతర్జాతీయ జలాల్లో ఇటలీ జెండా ధరించి ఉందనీ కనుక అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం కేసు విచారణ తమ కోర్టుల్లోనే జరగాలనీ ఇటలీ డిమాండ్ చేసినప్పటికీ ఇండియా అంగీకరించలేదు. భారత సముద్ర జలాల్లోనే సంఘటన జరిగింది కనుక తామే విచారణ జరుపుతామని చెప్పి ఇటలీ మెరైన్లను అరెస్టు చేసిన ఇండియా వారిని జైలుకి కూడా పంపింది. ఇటలీ సైనికులిద్దరూ భారత జైళ్ళలో ఉండడంతో ఇటాలియన్ ప్రతిపక్షాల చేతికి గొప్ప అస్త్రం దొరికినట్లయింది. ఇటలీ పార్లమెంటులో ప్రతిపక్షాలు పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేస్తుండడంతో అర్జెంటుగా భారత రాయబారిని పిలిపించుకుని హెచ్చరిక జారీ చేశారు.
ఇటలీ తనంత తానుగా భారత దేశంతో నేరుగా వ్యహరించడానికి బదులు యూరోపియన్ యూనియన్ ను రంగంలోకి దించవలసిందని
ఇటలీ ప్రభుత్వ విమర్శకులు ఎట్టి చూపుతున్నారు. ఇండియా ఈ మధ్య కాలంలో ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ గా ప్రపంచ వ్యాపిత మన్ననలు అందుకుంటున్న పరిస్ధితుల్లో అది తన ‘స్ధాయి’ గురించిన పట్టింపులో ఉందనీ, అందువల్లనే చర్చలతో ఇండియాపై ఒత్తిడి తీసుకురావడం సాధ్యం కాలేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇండియాపై పట్టు సడలని విధంగా నిరంతరాయంగా ఒత్తిడి తేవడానికి బదులు, కుంటుతూ దేకుతూ వెళ్ళిన పద్ధతిలో చర్చలు జర్పిందనీ, ఈ లోపు ఇండియా తన పట్టు బిగించిందనీ వారు చెబుతున్నారు. ఇండియాతో జరిగిన రాయబార చర్చలను బలహీన పద్ధతుల్లో జరపడంతో ఇటలీ ఇప్పుడు తల పట్టుకోవలసి వచ్చిందనీ వారు చెబుతున్నారు.
ఇండియాతో జరిగిన చర్చలలో ముఖ్యంగా బ్రిటన్ సేవలను వినియోగించినట్లయితే ఇండియా త్వరలోనే దారికి వచ్చి ఉండేదని ఇటలీ ప్రభుత్వ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాతో పోలిస్తే ‘బలమైన స్ధానం’ నుండి ఒత్తిడి తేగలిగే స్ధాయి ఇటలీకి లేకపోయిందనీ, అందుకే ఇండియా తో వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు కలిగిన యూరోపియన్ యూనియన్ ను రంగంలోకి దించవలసి ఉండిందన్నది వారి అభిప్రాయం. మెత్తగా, సాఫ్ట్ పద్దతుల్లో తమ సైనికులకు నష్టం జరుగుతుందేమోనన్నట్లుగా ఇటలీ ప్రభుత్వం వ్యవహరించిందన్నది వారి విమర్శ.
ఇటలీ జూనియర్ విదేశీ మంత్రి స్టాఫ్ఫాన్ డి మిస్తురా ఫిబ్రవరి 21 నుండీ భారత దేశంలోనే తిష్ట వేసి ఇటలీ సైనికుల విడుదల కోసం లాబీయింగ్ జరుపుతున్నాడు. ఇటలీ సార్వభౌమాధికారాన్ని ఇండియా ఉల్లంఘించిందని ఇటలీ విదేశీ మంత్రి గిలియో తెర్జీ గత శనివారం ప్రకటించాడు. ఇటలీలో మితవాద పార్టీలకు చెందిన కార్యకర్తలు భారత రాయబార కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. భారత దేశ సరుకుల దిగుమతులను అడ్డుకోవాల్నీ, వాణిజ్య బహిష్కరణ విధించాలనీ కూడా ఇంటర్నెట్ లో ఇటాలియన్లు పిలుపులు ఇస్తున్న పరిస్ధితి నెలకొని ఉంది. ఇండియా పైన ఐక్యరాజ్యసమితి కి చెందిన ‘ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ’ సంస్ధకు ఫిర్యాదు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా, బుధవారం బాగా పొద్దు పోయాక ఇటలీ ప్రధాని మేరియో మోంటి భారత ప్రధాని మన్మోహన్ కి ఫోన్ చేసి జాలర్ల మరణానికి చింతిస్తున్నట్లుగా చెప్పాడు. జాలర్ల కుటుంబానికి సానుభూతి చెప్పాడు. చట్టం ప్రకారం, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల స్ఫూర్తి తో సంఘటనను పరిష్కరించుకోవాలని ఇరువురూ అంగీకరించారని ది హిందూ తెలిపింది. ఇటలీ ప్రధాని ఫోన్ చేసి చింతిస్తున్నట్లు చెప్పడం అంటే ఆపాలజీ చెప్పడమేననీ, కనుక భారత ప్రధాని సమస్య పరిష్కారం వైపుగా కృషి చేయవలసి ఉందనీ భారత అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే పరిస్ధితి ఇప్పటికే కోర్టుల పరిస్ధిలోకి వెళ్ళినందున కోర్టు ప్రక్రియలను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేనందున భారత ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్ధితేనని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్ధితులను గమనించినపుడు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత దేశం రాయబార పరంగా పై చేయి సాధించిన విషయం అర్ధమవుతోంది. అయితే కొందరు ఇటలీ విమర్శకులు సూచిస్తున్నట్లూ యూరోపియన్ యూనియనే రంగంలోకి దిగినట్లయితే భారత దేశానికి ఈ పరిస్ధితి వచ్చి ఉండేదా అన్నది అనుమానమే. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆర్ధిక కేంద్రంగా ఉన్న ఈ.యు తో భారత దేశం వ్యవహారం పెట్టుబడులను అడుక్కునే పరిస్ధితిలోనే కొనసాగుతోంది. ఈ.యు లో పెత్తందార్లుగా ఉన్న జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ల ఒత్తిడికి భారత దేశ పాలకులు తేలికగా లొంగిపోయే పరిస్ధితి కూడా కొట్టిపారేయలేము.