అమెరికా, చైనా లు లేకుండా ప్రపంచ సమస్యల పరిష్కారం కుదరదు -హిల్లరీ


clintonచైనాకు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న స్ధాయిని అమెరికా మరొకసారి బహిరంగంగా అంగీకరించింది. ప్రపంచ వ్యవహారాల్లో ప్రతి టేబుల్ వద్దా చైనాకు సీటు ఉందనీ, ప్రపంచ స్ధాయిలో ప్రాముఖ్యం కలిగిన ప్రతి సంస్ధలోనూ చైనాకు పాత్ర ఉందనీ, అమెరికా, చైనాలు లేకుండా ప్రపంచంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావడం అసంభవమనీ అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ చైనా సందర్శించి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మార్చి 8 న జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ ఆమె ఈ మాటలంది.

“చైనా మరింత గొప్ప నాయకత్వ పాత్ర పోషించాలని మాతో పాటు ప్రపంచంలో ఉన్న అనేకులు ఎదురు చూస్తున్నారు. కేవలం చైనా, అమెరికా లు మాత్రమే పూనుకుని ప్రపంచంలోని సమస్యలన్నింటినీ పరిష్కారం చేయలేకపోవచ్చు. కానీ చైనా, అమెరికాలు లేకుండా ప్రపంచ సమస్యలు ఏవైనా పరిష్కారం అవుతాయా అన్నది నాకు అనుమానమే” ఆమె అంది. అమెరికా విదేశాంగ విధానంపై హిల్లరీ క్లింటన్ ఇటీవల ఇచ్చిన విధాన పరమైన ప్రసంగాల్లో ఇది ప్రముఖమైనదిగా పేర్కొనవచ్చు. ‘అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్’ ఈ సదస్సును నిర్వహించింది.

ఇటీవలి వరకూ ప్రపంచంలో రాజకీయంగా, సైనికంగా, ఆర్ధికంగా అమెరికా అగ్ర రాజ్యంగా కొనసాగుతూ వచ్చింది. అమెరికా అగ్ర రాజ్యంగా కొనసాగుతూ ఉన్న పరిస్ధితిలోనే జర్మనీ కేంద్రంగా ఉన్న యూరోపియన్ యూనియన్ ఒక వైపూ, జపాన్ మరొకవైపూ ఆర్ధిక అగ్ర రాజ్యాలుగా కొనసాగుతూ వచ్చాయి. అయితే, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ దేశాలపై అమెరికా సాగించిన దురాక్రమణ యుద్ధాల వల్ల అమెరికా ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులయింది. దురాక్రమణ యుద్ధాలతో పాటు అమెరికా, ఈ.యులలో వాల్ స్ట్రీట్ కంపెనీలు కార్మికులు, ఉద్యోగులు తదితర సాధారణ ప్రజానీకంపై సాగించిన దోపిడీ విధానాల వల్ల 2008 లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించింది. సబ్ ప్రైమ్ రుణాలు ఆర్ధిక సంక్షోభాని తక్షణ కారణంగా కనపడినప్పటికీ, లాభాల పెంపుదల కోసం వాల్ స్ట్రీట్ కంపెనీలు కార్మికవర్గ వేతనాలను దశాబ్దాలుగా కుచింపజేస్తూ వచ్చినందున కొనుగోలు శక్తి నశించి అధిక ఉత్పత్తి సంక్షోభం ఏర్పడి, దురాక్రమణ యుద్ధాలు తోడై ప్రపంచ ఆర్ధికసంక్షోభం ఏర్పడిందన్నది పెట్టుబడిదారీ రాజ్యాలు అంగీకరించని చేదు నిజం.

ఈ సంక్షోభం ప్రపంచ పెట్టుబడిదారీ శక్తులను బాగా బలహీన పరిచింది. ఫలితంగా అమెరికా, జపాన్ లు ఆర్ధికంగా బాగా దెబ్బ తిన్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఆర్ధికంగా బలహీనపడియప్పటికీ అమెరికా తో పోలిస్తే తిరిగి జీడీపీ వృద్ధి సాధిస్తున్న క్రమంలోనే యూరప్ ఋణ సంక్షోభం దాన్ని ఆశనిపాతంలా చుట్టుముట్టింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కొనసాగింపుగానే యూరోపియన్ ఋణ సంక్షోభం తలెత్తిందన్నది అసలు సంగతి. అదే సమయంలో ప్రభుత్వరంగంలో ప్రధానంగా ఆర్ధిక కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిన చైనా ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తట్టుకుని నిలవ గలిగింది. ఇరవై సంవత్సరాలుగా వాణిజ్య మిగులు పోగేస్తూ వచ్చిన చైనా అమెరికా, యూరప్ లకు అప్పులిచ్చి ఆదుకుంది. జపాన్ కూడా వాణిజ్య మిగులు కలిగి ఉన్నప్పటికీ దశాబ్దానికి పైగా ఆ దేశంలో కొనసాగిన ‘ప్రతి ద్రవ్యోల్బణం’ దానిని కోలుకోలేకుండా చేసింది. ఫుకుషిమా అణు ప్రమాదం దానిని మరింత బలహీన పరిచింది.

ప్రస్తుతం సంక్షోభ పరిస్ధితులకు సాపేక్షికంగా దూరంగా ఉన్న ఆర్ధిక శక్తి కేవలం చైనా మాత్రమే. యూరోపియన్ ఋణ సంక్షోభం పరిష్కారానికి ఈ.యు నాయకులు జర్మనీ, ఫ్రాన్సులు సైతం చైనా ముందు జోలే పట్టుకుని నిలబడ్డాయంటే చైనా ఆర్ధిక పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. దానర్ధం చైనా ప్రజలు సమస్యలేవీ లేకుండా సంపదలతో తులతూగుతున్నారని కాదని గ్రహించాలి. మావో నాయకత్వంలో వచ్చిన ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ చైనాలోని భూస్వామ్య శక్తులను అణచివేసింది. పెట్టుబడిదారీ శక్తులు అభివృద్ధి చెందకుండా దేశ సంపందలన్నీ అశేష శ్రామిక జనం సమీపానికి తీసుకు వచ్చింది. దేశ సంపదలన్నింటినీ దేశంలోని ప్రజలందరూ సమానంగా అనుభవించే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కొనసాగుతుండాగానే, చైనా కమ్యూనిస్టు పార్టీలోనే దాగి ఉన్న పెట్టుబడిదారీ శక్తులు మావో మరణానంతరం హత్యలు చేసి, అనేకమందిని అక్రమంగా ఉరి తీసి డెంగ్ జియావో పింగ్ నాయకత్వంలో అధికారాన్ని కైవసం చేసుకుంది.

చైనాలో మూడు దశాబ్దాలపాటు కొనసాగిన సోషలిస్టు నిర్మాణం ఫలితంగా దేశవ్యాపితంగా ఉన్న శ్రామిక ప్రజలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా సౌకర్య వంతమైన స్ధితికి చేరుకున్నారు. ఈ సౌకర్య వంతమైన జీవనాన్ని డేంగ్ ప్రవేశపెట్టిన పెట్టుబడీదారీ సంస్కరణ విధానాలు వారికి అనతికాలంలోనే దూరం చేశాయి. కమ్యూనిస్టు పార్టీ క్రమంగా పెత్తందారులతో, పెట్టుబడిదారులతో నిండిపోయింది. ఇప్పుడు చైనాలో పేరుకు ఉన్న కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు విధానాలను ముప్ఫై యేళ్ళ క్రితమే వదిలి పెట్టింది. పార్టీ పెత్తందార్లూ, ప్రభుత్వ రంగం కంపెనీల్లోని బ్యూరక్రాట్ అధికార వర్గమూ నూతన పెట్టుబడిదారీ వర్గంగా చైనా ను ఏలుతున్నారు. సోషలిస్టు వ్యవస్ధ పునాదులపై ఏర్పడిన చైనా పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు వ్యవస్ధ అందించిన సంపన్న ఆర్ధిక వారసత్వాన్ని తమ ఎదుగుదలకు వినియోగించుకుంటూ తెగబలిశారు.

చైనాకు భిన్నంగా ఇండియాలో నూతన ప్రజాస్వామిక విప్లవం సంభవించలేదు. కనీసం అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాల్లో సంభవించిన ‘ప్రజాస్వామిక విప్లవం’ కూడా భారత ప్రజలు ఎరుగరు. ఫలితంగా భారత దేశంలో విస్తారంగా ఉన్న పంట భూములు ఇంకా భూస్వాముల కబంధ హస్తాల్లోనే ఉన్నాయి. చైనా సోషలిస్టు వ్యవస్ధ లో సోషలిస్టు ప్రభుత్వం విప్లవాత్మక భూసంస్కరణలు చేపట్టగా ఇండియాలో పాలక వర్గాలు ఇప్పటికీ విదేశీ కంపెనీల సేవలో తరిస్తున్నాయి. రైతుల చేతుల్లో కొద్దిపాటిగా ఉన్న పంట భూములను కూడా ‘నూతన ఆర్ధిక విధానాల’ పేరుతో విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నాయి. పచ్చి అభివృద్ధి నిరోధక భూస్వామ్య వ్యవస్ధ నిర్మూలించబడక పోవడంతో భూ సంస్కరణలు ఒక ఫార్సుగా మిగిలాయి. భూ సంసంస్కరణలు జరిగినట్లయితే అశేష శ్రామికజనం చేతికి భూములు దక్కి వారి ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడేది. అలా మెరుగుపడిన ప్రజల ఆర్ధిక స్ధితిగతులే భారత పెట్టుబడిదారీ వర్గానికి ముడి వనరుగా ఉపయోగపడి ఉండేది. ఆ విధంగా భారత పెట్టుబడిదారీ వర్గం కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ వర్గంతో పోటీగా ఎదిగి అగ్ర రాజ్య హోదా కు కృషి చేస్తూ ఉండేది.

కానీ వాస్తవం ఏమిటి? ఇండియాలో భూసంస్కరణలు జరగలేదు. భూమీ భూస్వామ్య వ్యవస్ధ చేతిలో బందీగా కొనసాగుతోంది. భూస్వామ్య వ్యవస్ధ అనుకూలమైన అభివృద్ధి నిరోధక సాంస్కృతిక, సామాజిక వ్యవస్ధే అనివార్యంగా కొనసాగుతోంది. పల్లెల్లో భూస్వాములే తమ సంపదలను పెట్టుబడులుగా పెట్టి పెట్టుబడిదారులుగా మారినప్పటికీ భూస్వామ్య వ్యవస్ధకు పునాదిగా ఉన్న సామాజిక వ్యవస్ధ మాత్రం పై పై మార్పులతో అలాగే ఉండిపోయింది. అరవై యేళ్ళుగా విదేశీ కంపెనీల కోసం సహాయంగా అభివృద్ధి చెందిన కొద్ది పాటి పరిశ్రమల వల్ల నగరాలు, పట్నాలు పెరుగుతున్నప్పటికీ పునాది వ్యవస్ధ మాత్రం భూస్వామ్య సంస్కృతీ విష పరిష్వంగంలో తీసుకుంటోంది. బూస్వామ్య వ్యవస్ధ నాశనం కాకుండా స్వతంత్ర పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి కావడం కల్ల. పైగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వలసగా రెండు వందల యేళ్ళు మగ్గిన ఫలితంగా పశ్చిమ సామ్రాజ్యవాద ప్రయోజనాల అవసరాల కోసమే అన్నట్లుగా భారత పెట్టుబడిదారీవర్గం తయారై ఉంది. వారు తమ కోసం, తమ సంపదల వృద్ధి కోసం పని చేయరు. వారు కేవలం పశ్చిమ సామ్రాజ్యవాద కంపెనీల ప్రయోజనాల కోసమే పని చేస్తూ సదరు ఏజన్సీ గిరీలో వచ్చిన సంపదలతోనే సంతృప్తి చెందుతారు. పోటీ వర్గంగా ఎదిగి లిబియా, ఇరాన్, సిరియా, వెనిజులా, క్యూబా దేశాల తరహాలో పశ్చిమ దేశాల హంతక, దురాక్రమణ దాడులకి నిలవగల స్ధైర్యాన్ని ప్రదర్షించలేరు. అందుకే వారిని దళారీ బూర్జువాలంటున్నది.

చైనా, ఇండియాల మధ్య ఉన్న ఈ గుణాత్మక తేడాను గమనించకపోతే చైనాలాగానే ఇండియా కూడా ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని ఆశపడుతూనే ఉంటాము. అయితే ఇండియా ప్రపంచ శక్తిగా మారే అవకాశమే లేదా? ఎందుకు లేదు. భేషుగ్గా ఉంది. కానీ అందుకు భారత పెట్టుబడిదారీ వర్గమే సిద్ధంగా లేదు. సిద్ధంగా ఉండడం అంటే ఏమిటి? ముందు భూసంస్కరణలను అమలు చేయాలి. (భూసంస్కరణలు అంటే వందలు, వేలు ఎకరాలను వివిధ పేర్లతో అనుభవిస్తున్న భూస్వాముల భూములను భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుని భూములు లేని అశేష రైతు కూలీలకు పంచడం. దీనివల్ల సమాజంలో మెజారిటీ ప్రజలు తమ భూముల్లో పంటలు పండించి ఉత్పత్తులు తీసి దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఊపందించడమే కాక తాము కూడా సంపదలు కూడబెట్టగలుగుతారు) భూ సంస్కరణలను అమలు చేయడం సామాన్య మైన పని కాదు. భూస్వామ్య వర్గం దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. దేశ వ్యాపితంగా ఉన్న భూస్వామ్య వర్గాన్ని అణచివేస్తే తప్ప వారు బూసంస్కరణలకు అంగీకరించరు. అణచివేయకుండా ఏ వర్గమూ తమ సంపదలను వదులుకోదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పై నుండి కింది వరకూ అధికార స్ధానాల్లో పాతుకుపోయి ఉన్న భూస్వామ్య వర్గాన్ని అణచివేయడం భారత పెట్టుబడిదారుల వల్ల అవుతుందా? కానే కాదు. అందుకే భారత దేశ సామాజిక వ్యవస్ధ మరింతగా కుళ్ళిపోతూనే ఉంది. కుల విభేధాలతో, మహిళలపై అకృత్యాలతో, బాల కార్మికులతో, ఆకలి కేకల కార్మికులతో, అప్పులతో ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులతో మరింతగా కృశించిపోతూ ఉంది.

సోషలిస్టు వ్యవస్ధ భూసంస్కరణలు అమలు పరిచిన ఫలితాలను ఇప్పటి చైనా పెట్టుబడిదారీ వర్గం అనుభవిస్తున్నందునే అది అమెరికా, యూరప్ ల సరసన నిలువ గలిగింది. చైనా ఎదిగుదలను అంగీకరిస్తేనే ఇప్పటి అమెరికా, యూరప్ లకు మనుగడ. అలాగని చైనా అగ్ర రాజ్యంగా ఎదగడానికి అమెరికా, యూరప్ లు సహకరిస్తాయని కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణ స్ధితికి చేరుకున్న యూరప్ ను ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ లతో ఆడుకున్నది అమెరికాయే. అమెరికా ఆదుకోనట్లయితే సోషలిస్టు రష్యా ప్రాబల్యంతో యూరప్ అంతా సోషలిస్టు విప్లవాలు సంభవించి ఉండేవి. సోషలిజం భయంతోనే అమెరికా యూరప్ పెట్టుబడిదారీ దేశాల పెట్టుబడిదారీ వర్గానికి చేయూతనిచ్చి వారు అభివృద్ధి కావడానికి సాయం చేసింది. అలా అభివృద్ధి అయిన యూరప్ పెట్టుబడిదారీ వర్గం ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ ఏర్పరుచుకుని అమెరికాకు పోటీగా ఎదగాలని జర్మనీ నాయకత్వంలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఆ ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాకపోయినప్పటికీ అమెరికాకి ఏదో మేరకు పోటీని వారు ఇస్తున్నారు. జపాన్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో చావు దెబ్బతిన్నా అమెరికా ఆదరువుతో ఆర్ధిక అగ్ర రాజ్య స్ధితిని చేరుకుంది.

చైనా మాత్రం సోషలిస్టు వ్యవస్ధ పునాదులపైనా ఎదిగి అగ్ర రాజ్య హోదాను సంపాధించింది. గతంలో లాగా ఇప్పుడు అమెరికా తన చిత్తం వచ్చినట్లు ప్రపంచ దేశాలపై పెత్తనం చేయలేకపోతోంది. ఆర్ధిక వ్యవస్ధ కూలిపోయే స్ధితికి చేరడంతో చైనాను మచ్చిక చేసుకుని మళ్ళీ కోలుకోవడానికి అది ప్రయత్నిస్తోంది. చైనాను మచ్చిక చేసుకుని ఋణ సంక్షోభం నుండి బైటికి రావాడనైకి యూరోపియన్ యూనియన్ కూడా ప్రయత్నిస్తోంది. అమెరికా, యూరప్ లు చేస్తున్న ఈ ప్రయత్నాలు చైనా ను అగ్ర రాజ్యంగా పూర్తిగా అంగీకరిస్తున్నట్లుగా అభిప్రాయం కలుగ జేస్తాయి. వాస్తవం అది కాదు. సంక్షోభ పరిస్ధితుల నుండి గట్టెక్కడానికే అమెరికా, యూరప్ లు చైనాను కాకా పడుతున్నాయి తప్ప అవకాశం వస్తే చైనాను తొక్కి పారేయడానికి అవి ఏ మాత్రం వెనకాడవు.

అందుకే పశ్చిమ దేశాలు చైనాకి పోటీగా ఇండియాను ప్రోత్సహించడానికి తంటాలు పడుతున్నాయి. ఇండియా పాలకవర్గాలు స్వతంత్రంగా ఎదిగి తమకు పోటీ ఇచ్చేవి కాదని పశ్చిమ దేశాలకు బాగానే తెలుసు. కనుక ఇండియా ఎదిగినా తమ ప్రయోజనాలకు లోంగే ఉంటుందని అవి విశ్వసిస్తున్నాయి. లొంగనట్లయితే ఇరాన్, సిరియా, వెనిజులా లాంటి దేశాలు ఎదుర్కొంటున్నట్లుగా అమెరికా, యూరప్ ల బెదిరింపులను ఇండియా పాలకులు కూడా ఎదుర్కోవలసిందే. కానీ ఇండియా పాలకులు (ఇండియా ధనిక వర్గాలైన భూస్వామ్య్లు, పెట్టుబడిదారులు) అంత సాహసం చేయరు. ఇండియా కి చైనా  కు పోటీగా ఎదిగే తాహతు లేదనీ, అనవసరంగా ఇండియాపై ఆశలు పెట్టుకోవద్దనీ ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ వెలువరించిన నివేదిక తేల్చడం చూస్తే ఆ నివేదిక యాదృచ్ఛికంగా తయారు కాలేదనీ, పశ్చిమ దేశాల అవసరం రీత్యానే ఆ నివేదిక వెలువడిందనీ ఈ సందర్భంగా అర్ధమవుతోంది.

ఈ విశ్లేషణ నేపధ్యంలో నే హిల్లరీ క్లింటన్ చేసిన ప్రకటనను పరిశీలించవలసి ఉంటుంది. ప్రపంచ శక్తులుగా ఇండియా, చైనాల ఎదుగుదలను కూడా ఈ నేపధ్యంలోనే పరిశీలించవల్సి ఉంటుంది.

హిల్లరీ క్లింటన్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలను ఇక్కడ పరిశీలించాలి.  “అంతర్జాతీయ వ్యవస్ధను బలోపేతం చేయడానికి, ప్రధాన ప్రపంచ శక్తిగా చైనా తన పూర్తి బాధ్యతను నెత్తికెత్తుకోవాలని అమెరికా కోరుతోంది. చైనాకి ఉన్న శక్తి, సంపద, ప్రభావం అన్నీ కలిసి ఆ దేశాన్ని అంతర్జాతీయ వ్యవస్ధలో కొత్త శక్తిగా వేగంగా నెట్టాయి. చైనా ఏం చేపినా అది ప్రపంచ వ్యాపితంగా ప్రతిధ్వనిస్తోంది. అది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. అదే సమయంలో అది మిలియన్ల కొద్దీ ఉన్న చైనీయుల చెంతకు అభివృద్ధిని చేర్చే తన గొప్ప ఆర్ధిక బాధ్యతను పరిపూర్తి చేసే కృషిలో నిమగ్నమై ఉంది” అని క్లింటన్ వ్యాఖ్యానించింది. 

చైనా పైన క్లింటన్ కురిపిస్తున్న ప్రశంసల వర్షం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో చూసినపుడు అవేమీ అంత ఆశ్చర్యం కలిగించవు. ఆఫ్రికాలో కోరకరాని కొయ్యగా ఉన్న గడ్డాఫీని విజయవంతంగా అంతం చేసిన పశ్చిమ రాజ్యాలు పశ్చిమాసియాలో మరొక కొరకరాని కొయ్యగా ఉన్న సిరియా పాలకుడిని లొంగదీసుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. తిరుగుబాటు పేరుతో సిరియాలో తమ ప్రత్యేక బలగాలను దింపి అక్కడి పౌరులపైనా, ఆవాసాలపైనా, బాంబు దాడులు చేస్తూ విధ్వంసం సాగిస్తున్నప్పటికీ సిరియా నేత లొంగిరావడం లేదు. తమ ప్రత్యేక బలగాలు, తాము మేపిన సిరియా దేశ ద్రోహులూ సాగిస్తున్న విధ్వంసాన్ని, అత్యాచారాలనీ, హత్యలనూ, సిరియా పాలకుడు చేస్తున్నవిగా విస్తృత గోబెల్ ప్రచారం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.

తాము దింపిన ప్రత్యేక బలగాలు గానీ, తాము మేపీన దేశ ద్రోహులు కానీ అద్దె తిరుగుబాటు రేపడంలో విఫలం అయితే పశ్చిమ దేశాలు అంతర్జాతీయ వేదికలపైన రాజకీయ ప్రయత్నాలు చేయడం ద్వారా అనుకున్న పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాయి. లిబియాలో అదే జరిగింది. లిబియా తిరుగుబాటు పేరుతో తమ ప్రత్యేక బలగాలను దింపి గడ్డాఫీ వ్యతిరేకులను మేపి ఆయుధాలు సరఫరా చేసాయి. ఐక్యరాజ్య శాంతి తీర్మానం ప్రకారం ‘నిషిద్ధ గగనతలం’ అమలు చేస్తున్నామన్న పేరుతో తామే లిబియా బలగాలపై విమాన దాడులు చేశాయి. దేశంలోని సమస్త రోడ్డు, రైలు, కమ్యూనికేషన్ల సౌకర్యాలను నాశనం చేసి ప్రభుత్వ వ్యవస్ధలను విధ్వంసం కావించి అంతిమంగా గడ్డాఫీని అంతం చేసి మరీ లిబియాని తమ వసం చేసుకున్నాయి. కానీ సిరియాపై అవే ఎత్తుగడలను అమలు చేయడానికి చైనా, రష్యాలు తీవ్ర అడ్డంకిగా మారాయి. సిరియాపై దాడి చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితి చేత తీర్మానం చేయిద్దామని ప్రయత్నించినా చైనా, రష్యాలు వీటో చేశాయి.

నయానా, భయానా రష్యాను పశ్చిమ దేశాలు తమ దారికి తెచ్చుకోగలవని లిబియా అనుభవం రుజువు చేసింది. మిగిలింది చైనాయే. చైనా ఇంకా ప్రపంచంలోతన ప్రభావిత దేశాలని విస్తరించుకోవలసి ఉంది. అందుకు సిరియా ఒక పరీక్షగా చైనాకు నిలిచినట్లు కనిపిస్తోంది. ఈ పరీక్షలో చైనా నెగ్గి సిరియా విషయంలో పశ్చిమా దేశాల ని విజయవంతంగా నిలువరించినట్లయితే అది చైనాకు అనేకమంది అభిమానులను సమకూర్చవచ్చు. చైనాను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు క్లింటన్ ప్రసంగంలో మనం చూడవచ్చు.

ప్రపంచ శక్తిగా పూర్తి బాధ్యతను చైనా నెత్తికెత్తుకోవడం అంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడానికి అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులు చేస్తున్న ప్రయత్నాలలో భాగం పంచుకోవాలని పరోక్షంగా చైనాకు సూచిస్తున్నట్లు అర్ధం చేసుకోవలసి ఉంది. సమితి తీర్మానాన్ని వీటో చేసి తమకు ప్రత్యర్ధులుగా నిలిచే బదులు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లిబియాల విషయంలో తమకు సహకరించిన యూరప్ వలెనే చైనా కూడా తమ సరసన జేరాలనీ, తద్వారా సిరియా వనరులలో చైనా కూడా భాగం పొందవచ్చనీ హిల్లరీ క్లింటన్ ఆఫర్ ఇస్తున్నట్లుగా అర్ధం చేసుకోవాలి. చైనా కూడా తమ సరసన చేరితే ప్రపంచ సామ్రాజ్యవాద గొలుసుకట్టులో చైనా పెట్టుబడిదారీ వర్గానికి కూడా సముచిత భాగస్వామ్యం అంధిస్తామనీ హిల్లరీ చైనాకు స్నేహ హస్తం అందిస్తోంది. అందుకే “అంతర్జాతీయ వ్యవస్ధ (ఇంటెర్నేషనల్ ఆర్డర్) ను బలోపేతం చేయడానికి చైనా తన పూర్తి బాధ్యతను నెత్తికెట్టుకోవాలని” హిల్లరీ కోరుతోంది.

“కొన్ని వేదికలపై కొన్ని అంశాలపై గొప్ప శక్తిగా తనను గుర్తించాలని చైనా కోరుతూ మరికొన్ని అంశాలపై తాను అభివృద్ధి చెందుతున్న దేశాన్నేనని చెపుతోంది. ఇరువైపులా ప్రయోజనాలు పొందడానికి చైనా ప్రయత్నిస్తోంది. రెండు లక్షణాలూ (గొప్ప శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశం) ఉన్నందున చైనా కోరికను అర్ధం చేసుకోవచ్చు. కానీ చైనా సాధించిన కొత్త స్ధానానికి దీటుగా బాధ్యతలను చేపట్టాలని ప్రపంచం కోరుతోందని గ్రహించాలి. ఇక ఎంత మాత్రం తనకు వీలయిన పాత్రలో (సెలక్టివ్ స్టేక్ హోల్డర్) చైనా వ్యవహరించడానికి వీలు లేదు” అని హిల్లరీ తన ప్రసంగంలో పేర్కొన్నది. “పైరసీ ని ఎదుర్కోవడం లోనూ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడం లోనూ చైనా ఇప్పటికే తన నాయకత్వాన్ని రుజువు చేసుకుంది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న సమితి శాంతి స్ధాపనా కార్యక్రమాల్లో కూడా చైనా భాగం పంచుకుంది. ఈ చర్యలను మేము అభినందిస్తున్నాము” అని హిల్లరీ క్లింటన్ పేర్కొన్నది. “కానీ చైనా మరింత ముందుకెళ్లి ప్రపంచం వేదికపై తన పూర్తి బాధ్యతను స్వీకరిస్తుందని మేము నమ్ముతున్నాము. ఈరోజూ వరకో, ఒక అంశం మీదనో కాక దీర్ఘకాలంలో కూడా చైనా ఈ బాధ్యతను స్వీకరించాలి” అని హిల్లరీ ప్రకటించింది.

అభివృద్ధి చెందుతున్న దేశమే అయినప్పటికీ చైనా ఆర్ధిక శక్తి దృష్ట్యా, సమితిలో వీటో హక్కు కలిగిన దేశంగా అంతర్జాతీయ బాధ్యతలను నిర్వహించాలని హిల్లరీ చైనాకు చెపుతోంది. అంతర్జాతీయ బాధ్యతలు అంటే పైన చెప్పినట్లు ప్రపంచ సామ్రాజ్యవాద గొలుసుకట్టుగా ఏర్పడిన సామ్రాజ్యవాద గ్రూపు దేశాలలో చైనా కూడా కలిసి పోయి సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలను ప్రతిఘటిస్తున్న సిరియా, ఇరాన్, ఉత్తర కొరియా, వెనిజులా, సూడాన్, జింబాబ్వే లాంటి దేశాలను లొంగదీయడంలో తమతో కలిసి రావాలని హిల్లరీ చైనాను కోరుతోంది. సిరియాని లొంగదీసుకోవడంతోనే తమ ప్రయత్నాలు పూర్తి కావనీ, ఆ తర్వాత తమకు లొంగని ఇతర దేశాలను కూడా తాము ఇలాగే దౌర్జన్య పద్ధతుల్లోనే లొంగ దీసుకుంటామనీ, తమ అంతర్జాతీయ కుట్రలు ఎల్లకాలం ఇలాగే కొనసాగుతాయనీ కనుక చైనా ప్రతిఘటించడమో లేక తన ప్రయోజనాల వరకే పరిమితం కావడమో చేయకుండా తమ అంతర్జాతీయ దోపిడీ ముఠాలో చేరిపోయి దోపిడీ సొమ్ములో భాగం పంచుకోవాలనీ అమెరికా చైనా కోరుతోంది.

అదండీ సంగతి! చైనా ఆర్ధిక శక్తిని సాధించిన నేపధ్యంలో చైనాలో అమెరికా, యూరప్ కంపెనీలు వేళ్లూకున్న నేపధ్యంలో ఆ దేశాన్ని కూడా తమలో చేర్చుకోవాలని అమెరికా కోరుకుంటోదన్నమాట. చైనా లేకుండా అమెరికా, యూరప్ ల ఆర్ధిక వ్యవస్ధలు బతికి బట్టకట్టడం అసాధ్యం కనుక దాన్ని కూడా తమ ముఠా లో చేర్చుకోవడానికే అవి నిర్ణయించుకున్నాయన్నమాట! అయితే సామ్రాజ్యవాద దేశాలు తమలో తాము కలహించుకోకుండా ఎల్లకాలం ఐక్యతతో ఉండడం అసాధ్యం. అది ప్రకృతి విరుద్ధం. పది మంది దోపిడీ దారులు ఉన్న చోట ఎవరో ఒకరో, కొందరో అంతా తన(మ)కే చెందాలనో, ఇతరులను తోక్కేసి అంతా తనకిందికే తెచ్చుకోవాలనో ప్రయత్నించడమో చేయడమే ప్రకృతి. వారి కలహాలే వారికి మరణ శాసనం లిఖించడంలో సహాయకారిగా పని చేస్తాయి.

One thought on “అమెరికా, చైనా లు లేకుండా ప్రపంచ సమస్యల పరిష్కారం కుదరదు -హిల్లరీ

వ్యాఖ్యానించండి