ఇండియా అగ్రరాజ్యం అయ్యే ఛాన్సే లేదు -అధ్యయనం


super power Indiaఅగ్ర రాజ్యంగా అవతరించాలని కలలు కంటున్న భారత దేశానికి ఆ అవకాశాలు కనుచూపు మేరలో లేవని “లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్” (ఎల్.ఎస్.ఇ) జరిపిన అధ్యయన నివేదిక తేల్చింది. అనేకమంది భారతీయ స్కాలర్లు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 2009లో భారత్ సందర్శిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ “ఇండియా కేవలం ప్రాంతీయ శక్తి కాదు, అదొక ప్రపంచ శక్తి” అని ప్రకటించడాన్ని కొట్టి పారేసింది.

ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలోనూ, ఆర్ధిక వృద్ధి సాధించడంలోనూ, సాంస్కృతికంగా చురుకుదనం ప్రదర్శించడంలోనూ భారత దేశం ఆకర్షణీయమైన విజయాలు సాధించినప్పటికీ, దాని వ్యవస్ధాగత బలహీనతలు, సర్వ వ్యాపితమైన అవినీతి, బలహీన నాయకత్వం, తీవ్రమైన సామాజిక విభజనలు, మతపర తీవ్రవాదం, అంతర్గత భద్రతా సవాళ్ళు ఆ విజయాలను ప్రభావహీనం చేశాయని ఎల్.ఎస్.ఇ అధ్యయనం తెలిపింది. దానితో అగ్ర రాజ్యం కావాలన్న భారతీయుల కల, కలగానే మిగిలిపోతుందని అధ్యయనం తేల్చింది.

పశ్చిమ దేశాల్లో కొందరు కోరుతున్నట్లు చైనాకు సీరియస్ ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నా, ‘సూపర్ పవర్’ స్ధాయికి అర్హత సాధించాలన్నా ఇండియా ఇంకా అనేక సవాళ్ళను అధిగమించవలసే ఉందని సదరు అధ్యయనం తెలిపింది. ఇండియా లో నెలకొని ఉన్న వ్యవస్ధాగత బలహీనతలు గానీ, సామాజిక ఆర్ధిక అంతరాలు గాని చూసినట్లయితే అసలా దేశం సూపర్ పవర్ గా ఎదగాలన్న ఆకాంక్షను కలిగి ఉండడానికి కూడా అర్హమైనదేనా అన్న అనుమానాన్ని అధ్యయన రచయితలు వ్యక్తం చేసినట్లు ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.

గ్రేట్ పవర్ కావడం ద్వారా చేకూరే మెరుపులకు సమ్మోహితం అయే బదులు తన సంస్ధలను సంస్కరించుకోవడం పైనా, సామాజిక వ్యవస్ధను బాగు చేసుకోవడం పైనా దృష్టి కేంద్రీకరించడం మంచిదని భారత దేశానికే చెందిన రామ చంద్ర గుహ ఈ అధ్యయన నివేదికలో సలహా ఇచ్చాడు. ఈయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఫిలిప్ రోమన్ చైర్(?) గా ఉన్నాడని తెలుస్తోంది. ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ఈయన ఒక శీర్షిక ను కూడా నిర్వహిస్తున్నాడు. పార్లమెంటులో ‘ఓటుకు నోటు’ కుంభకోణంలో కుట్రకు పాల్పడ్డాడన్న నేరంపై ఈయన అరెస్టు అయి బెయిల్ పై విడుదల అయ్యాడు. బెయిల్ పై విడుదలయ్యాక నేరారోపణనుండి విముక్తమయినట్లుగా పండగ చేసుకున్నవారిలో ఈయన కూడా ఒకరు.

“భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న ఐక్యతను పరిరక్షిస్తూ వచ్చిన మన వ్యవస్ధలను ఒకదాని తర్వాత మరొకదాన్ని బాగు చేసుకుంటూ రావలసిన అవసరం ఉంది. మనకు సాయపడే కొత్త వ్యవస్ధలను నెలకొల్పుకోవలసిన అవసరం కూడా ఉంది. అది కష్టమైన, ఓర్పుతో కూడిన, నెమ్మదిగా సాగే పని” అని రామ చంద్ర గుహ ఎల్.ఎస్.ఇ అధ్యయన నివేదికలో తెలిపాడు. అధ్యయన నివేదిక సారాంశాన్ని బుధవారం విడుదల చేశారు.

“గత పాతికేళ్లుగా ఇండియా గొప్ప ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటిగా ఉంటోంది. మిలియన్ల మందిని దరిద్రం నుండి బైటికి తెచ్చింది. గత పదేళ్ళలో రక్షణ ఖర్చును మూడు రెట్లు పెంచింది. మిలట్రీ ఖర్చులు చేయడంలో ప్రపంచలో మొదటి పది దేశాల్లో స్ధానం పొందింది. అదే సమయంలో సామాజిక, సాంస్కృతిక ‘చురుకుదనం’ (డైనమిజం) లో ప్రపంచంలో ఆకర్షణీయమైన ఇమేజి సంపాధించింది” అని నివేదిక పేర్కొంటూనే అనేక సన్నాయి నొక్కులు నొక్కింది.

“అయినప్పటికీ, భారత్ ప్రాముఖ్యత కలిగిన దేశం అనడంలో అనుమానం లేనప్పటికీ, శక్తి యుక్తులు అనేకం ఉన్నాయనడంలో వివాదమేమీ లేనప్పటికీ, సూపర్ పవర్ స్ధాయి సాధించానన్న ఇండియా కోరికను జాగ్రత్తగా అంచనా వేయవలసి ఉంది. అందుకోసం అనేక పెద్ద సవాళ్ళను ఇండియా అధిగమించవలసి ఉంది. వ్యవస్ధీకృతమై ఉన్న కుల విభజనలకు తోడు ఆర్ధిక విజయాలతో వచ్చి చేరిన సంపదల అసమానతలు దేశ సమస్యలని తీవ్రం చేశాయి. ఊహించని రీతిలో భారత ప్రజాస్వామ్యం వేళ్ళూనుకున్నప్పటికీ, దాని వ్యవవస్ధలు ఆశ్రిత పక్షపాతంతోనూ, అవినీతితోనూ నిండిపోయి భారీ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. భరించడానికి వీలు లేని పర్యావరణ వినాశనం భారత ఆర్ధిక విజయాలతో కలగలిసి పోయి ఉంది” అని ఎల్.ఎస్.ఇ నివేదిక తెలిపింది.

“దేశంలో అనేక చోట్ల తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. తిరుగుబాట్ల హింసతో తలెత్తిన  ‘భద్రతా సమస్యలు’ ఇండియా సమస్యలను తీవ్రం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా నలుగుతున్న సరిహద్దు సమస్యలు ఉండనే ఉన్నాయి. ప్రపంచ వేదిక పైన భారత దేశం నిర్వహించగల గొప్ప పాత్ర ఏమైనా ఉంటే జి-20 గ్రూపు సభ్య దేశంగా ‘ఎకనమిక్ డిప్లొమసీ’ లో నిర్మాణాత్మక అంతర్జాతీయ పాత్ర పోషించడమే” అని ఎల్.ఎస్.ఇ నివేదిక అసలు సంగతి చెప్పింది. “సూపర్ పవర్ చైనా కు ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ శక్తిగా ఇండియా ఎదుగుతుందని భావిస్తున్న పశ్చిమ దేశాల్లోని కొందరి ఆశలు సమీప భవిష్యత్తులో నెరవేరే సూచనలు లేనే లేవు” అని నివేదిక తేల్చేసింది.

“ఎల్.ఎస్.ఇ ఐడియాస్” పేరుతో వెలువడుతున్న వరుస కధనాలలో భాగంగా “పవర్ షిఫ్ట్స్” (Power Shifts) శీర్షికన ఈ నివేదిక వెలువడినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఎల్.ఎస్.ఇ లో పని చేస్తున్న ముకులిక్ బెనర్జీ, రాజీవ్ సిబాల్ ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ’ లో డాక్టరేట్ చేస్తున్న సందీప్ సేన్ గుప్తా లు నివేదిక రచయితలలో కొందరని ఆ పత్రిక తెలిపింది.

నివేదికలో తెలిపిన పై విషయాలని బట్టి చూస్తే ఇండియా సూపర్ పవర్ గా ఎదుగుతుందా లేదా అన్న విషయం కంటే పశ్చిమ దేశాల (కంపెనీల) అవసరాలకు అనుగుణంగా భారత దేశ వ్యవ్యస్ధ రూపు దిద్దు కుంటుందా లేదా అన్న సంగతే ప్రధానంగా చర్చించబడినట్లు అర్ధం అవుతోంది. నిజానికి నివేదికలోనే చెప్పినట్లు భారత దేశం సూపర్ పవర్ గా ఎదగాలన్న ఆకాంక్ష పశ్చిమ దేశాల్లోని కొందరికి చెందినదేననీ అది భారత ప్రజల ఆకాంక్ష కాదనీ స్పష్టమవుతోంది. ఆసియా లో ఆర్ధికంగానూ, మిలట్రీ పరంగానూ ఎదుగుతున్న చైనాను నిలవరించాలన్న పశ్చిమ దేశాల కోరికనుండే ఈ ఆకాంక్ష బయలుదేరినట్లు కూడా స్పష్టమవుతోంది.

చైనాను నిలవరించగల శక్తిని భారత దేశం సంతరించుకుంటుందా లేదా అన్న సమస్య వెలుగులోనే భారత దేశ సూపర్ పవర్ ఆకాంక్ష ను ఈ నివేదిక చర్చించింది. అంతేగానీ భారత్ సూపర్ పవర్ గా ఎదగాలన్న పశ్చిమ దేశాల కోరికలో అశేష భారత ప్రజానీకం ఎదుగుదల కలిసి లేదు. అసలు చైనాను నిలవరించవలసిన అవసరం భారత దేశానికి లేదు. ఆ అవసరం పశ్చిమ దేశాలదే తప్ప భారత దేశానిది, ముఖ్యంగా భారత ప్రజలది కాదు. మరి కొన్ని సంవత్సరాలలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధను కూడా దాటి పోగల శక్తి చైనాకు ఉన్నదని అనేక విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం చైనా మిలట్రీ బడ్జెట్ 100 బిలియన్ డాలర్లు (5 లక్షల కోట్ల రూపాయలు) దాటనుందని కొద్ది రోజుల క్రితమే పత్రికలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ దేశాల సామ్రాజ్యాధిపత్యానికి చైనా సవాలుగా నిలుస్తుందన్న భయాలు అమెరికా, యూరప్ లను కలవరపెడుతున్నాయి.

సూపర్ పవర్ గా ఎదిగిన చైనా ఎదిగితే అది తమ ప్రపంచాధిపత్యానికి సవాలుగా పరిణమిస్తుందన్న భయాలు వ్యక్తం చేస్తున్న పశ్చిమదేశాలు భారత్ సూపర్ పవర్ గా ఎదిగినప్పటికీ తమకు సవాలు కాబోదనే నమ్ముతున్నట్లుగా ఎల్.ఎస్.ఇ నివేదిక స్పష్టం చేస్తోంది. అలా నమ్మ బట్టే చైనాకు పోటీగా ఇండియా ‘ప్రజాస్వామిక ప్రత్యామ్నాయంగా’ ఎదగాలని అవి కోరుకోగలుగుతున్నాయి. అంటే భారత పాలకులు పశ్చిమ దేశాలకు పోటీగా ఎదగడానికి బదులు వారికి నమ్మిన బంట్లుగా ఉంటారనే పశ్చిమ దేశాలు నమ్ముతున్నాయన్నమాట!

భారత దేశంలో కమ్యూనిష్టు విప్లవ పార్టీలు గత నలభై యేండ్లుగా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చాయి. భారత దేశంలోని పెట్టుబడిదారీ వర్గం పుట్టడంతోనే దళారీ వర్గంగా పుట్టిందని వారు చెప్పారు. సామ్రాజ్య వాద దేశాలతో పోరాడయినా సరే భారత దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే నిబద్ధత వారికి లేదనీ వారు చెబుతూ వచ్చారు. అందువల్లనే బ్రిటిష్ సామ్రాజ్యవాదంపైన నిర్ణయాతకమైన పోరాటం చేసి సర్వ స్వతంత్రను సాధించి భారత దేశ ఆర్ధిక, మానవ వనరులను తమ అభివృద్ధి కోసమే పూర్తిగా వినియోగించుకుని పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ వర్గానికి పోటీ వర్గంగా ఎదిగే తెగింపు వారికి లేదని చెప్పారు. దానికి బదులు బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో వారు రాజీ పడిపోయారనీ, నామ మాత్ర స్వాతంత్రంతో సంతృప్తి పడ్డారనీ కమ్యూనిస్టు విప్లవకారులు చెపుతూ వచ్చారు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి చేకూరిన స్వాతంత్రం భారత ప్రజలకు చేకూరిన నిజమైన స్వాతంత్ర్యం కాదనీ వారు చెప్పారు. కమ్యూనిస్టు విప్లవకారుల అంచనాలు వాస్తవమేనని ఎల్.ఎస్.ఇ నివేదిక స్పష్టం చేస్తోంది.

భారత్ సూపర్ పవర్ గా ఎదిగినప్పటికీ తమకు లోంగే ఉంటుందన్న నమ్మకం ఉండబట్టే పశ్చిమ దేశాలు నిర్భయంగా భారత్ ఎదగాలన్న ఆకాంక్షతో ఉన్నారు. పశ్చిమ దేశాలకు లొంగి ఉన్నంతకాలం భారత పాలకవర్గాలు తమ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండలేరు. కనుక భారత్ సూపర్ పవర్ గా ఎదిగినా భారత ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఒరిగేదేమన్నా ఉంటే అది పశ్చిమ దేశాల కంపెనీలకే తప్ప భారత ప్రజలకు కాదు. పశ్చిమ దేశాల ఆకాంక్షల మేరకు చైనాకు పోటీగా భారత దేశం ఎదగడంలో ఎదురయ్యే సమస్యలను పశ్చిమ దేశాల కంపెనీలకు గుర్తు చేయడానికే లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్ ఈ నివేదికను తయారు చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ తనను స్ధాపించిన పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలకు కట్టుబడి నివేదికలు తయారు చేస్తుంది తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు ఎందుకు కట్టుబడి ఉంటుంది?

2 thoughts on “ఇండియా అగ్రరాజ్యం అయ్యే ఛాన్సే లేదు -అధ్యయనం

  1. చైనా సూపర్ పవర్ గా ఎదుగుతే చైనా ప్రజలకు లాభమైతే భారత్ సూపర్ పవర్ ఐతే కూడా భారత్ ప్రజలకు కూడా అలాగే లాభమే.అసలు సూపర్ పవర్ అంటే అర్థమేమిటి?ఆర్థిక,సాంకేతిక,సైనిక ,మొదలైన రంగాల్లో అతి బలీయమైన ,శక్తి గా అవతరించడమే కదా. అలా కాగలదో లేదో ,ఇప్పుడే చెప్పలేము గాని, ప్రయత్నిస్తే తప్పు లేదు.కమ్యూనిస్టుల వాదన ఎప్పుడూ చైనాకి అనుకూలంగానే ఉంటుంది.దానిని లెక్క చేయ నక్కర లేదు.

  2. రమణారావు గారూ, చైనాని సమర్ధించేట్లుగా ఈ ఆర్టికల్ లో నేనేమీ రాయలేదు. ఎల్.ఎస్.ఇ నివేదికలో చైనాకి మద్దతుగా ఉన్న వాక్యాలు నావి కాదన్న సంగతి మీకెందుకు అర్ధం కాలేదు?

    సూపర్ పవర్ అంటే అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్ లాంటి దేశాల స్ధాయి అని అర్ధం. మూడో ప్రపంచ దేశాల వనరుల్ని దోపిడీ చేయకుండా ఈ దేశాలేవీ ఆ స్ధితికి చేరుకోలేదని గ్రహిస్తే ఇండియాకి అది అవసరం లేదని అర్ధం అవుతుంది. భారత దేశంలోని వనరుల్ని సూపర్ పవర్ దేశాలు దోచుకెళ్లకుండా కాపాడుకుంటే భారత దేశ ప్రజలకు చాలు.

    చైనా సాధించిన ఆర్ధిక వృద్ధి అక్కడి శ్రామిక ప్రజలకు అందడం లేదు. అక్కడ కూడా కోట్లమంది ప్రజలు దరిద్రంలో బతుకుతున్నారు. వారలా దరిద్రంలో ఉండగానే చైనా సూపర్ పవర్ గా ఎదుగుతోంది. దాన్ని బట్టే సూపర్ పవర్ గా ఎదిగినంత మాత్రాన సామాన్య జనానికి ఒరిగేదేమీ లేదని చెప్పవచ్చు.

    ఇంతకీ చైనా కమ్యూనిస్టు దేశం కాదని మీలాంటివారికి ఎప్పటికి అర్ధం అవుతుందో కదా!

వ్యాఖ్యానించండి