ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని తెలిపింది.
ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన సోనియా, ధరలను ఎందుకు నియంత్రించలేకపోయిందీ చెప్పలేదు. అభ్యర్ధులను నిర్ణయించడంలో వివిధ స్ధాయిలలో అనేక సంప్రదింపులు జరిపే కాంగ్రెస్ పార్టీ, చివరికి అభ్యర్ధుల మీదికి ఓటమి నేపాన్ని నెట్టివేయడానికే నిర్ణయించుకున్నదన్నమాట! అదే పార్టీకి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లయితే గెలుపు ప్రతిష్ట నిస్సందేహంగా రాహుల్ గాంధీకో, ప్రియాంకాకో వెళ్ళి ఉండేది. అప్పుడిక అభ్యర్ధుల గుణ గణాలు, కృషి లెక్కలోకి రావు. ఓటమి చెందారు గనక, ఏడు సంవత్సరాల నుండి దీక్షతో కృషి చేసిన రాహుల్ ప్రయత్నాలు ఫలించలేదు గనక అర్జెంటుగా అభ్యర్ధుల గుణ గుణాలు లెక్కలోకి వచ్చాయి.
నాయకత్వ లోపం కంటే “నాయకులు మరీ ఎక్కువయ్యారని” సోనియా చెప్పింది. ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు నష్ట పోయారని సోనియా అంగీకరిచింది. సిటింగ్ ఎమ్మేల్యేలు ఓడిపోయారనీ, కొత్త అభ్యర్ధులు గెలిచారనీ ఆమె తెలిపింది.
ఉత్తరా ఖండ్ లో బి.జె.పి కంటే ఒక సీటు ఎక్కువ గెలుచుకున్న కాంగ్రెస్ నే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఆమె కోరింది. అంటే ఉత్తరా ఖండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదని చెప్పవచ్చు. 70 సీట్లున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కి 32, బి.జె.పి కి 31, బి.ఎస్.పి కి 3, ఇతరులకి 4 సీట్లు దక్కాయి. బి.ఎస్.పి మద్దతు ఇచ్చినా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. బి.జె.పియేతర ఎమ్మెల్యేలంతా మద్దతు ఇస్తేనే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం. అయితే ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నదీ తేలవలసి ఉంది.
పంజాలో అకాలీ దళ్ నుండి చీలిపోయిన తిరుగుబాటు దారుడు మన్ ప్రీత్ సింగ్ బాదల్ పార్టీ పి.పి.పి వల్ల తమ విజయావకాశాలకు గండి పడిందని ఆమె తెలిపింది. 23 సీట్లలో పి.పి.పి వల్ల దెబ్బతిన్నామని తెలిపింది. గోవాలో ఓటర్లు తమ పట్ల అసంతృప్తి ఉన్నారని ఆమె అంగీకరించింది. అవినీతి వల్ల గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని దాదాపు పత్రికలు, ఛానెళ్ళన్నీ ముక్తకంఠంతో చెపుతుండగా “వాస్తవానికి కాంగ్రెస్ ఒక్కటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ” అని సోనియా చెప్పుకుంది. లోక్ సభలో మేము లోక్ పాల్ బిల్లు పాస్ చేయించాము. కానీ రాజ్య సభలో దాన్ని అడ్డుకున్నదేవరు?” అని ఆమె గుర్తు చేసింది.
యు.పి.ఏ – 2 ప్రభుత్వంలో బైట పడినన్ని కుంభకోణాలు గతంలో ఎన్నడూ బైటపడలేదు. రాశిలో చూసినా, వాసిలో చూసినా కుంభ కోణాలలో యు.పి.ఏ ప్రభుత్వం గత ప్రభుత్వాలన్నింటినీ తలదన్నినా తామే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి సోనియాకి ధైర్యం ఎలా వచ్చిందో మరి! ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాక దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాలలోనూ అన్నీ పార్టీల ప్రభుత్వాలూ అవినీతిలో కూరుకుపోయిన పరిస్ధితి గనకనే, సోనియా గాంధీకి ఆ ధైర్యం వచ్చి ఉండొచ్చు.
భూస్వామ్య వర్గాలకూ, పెట్టుబడి దారీ వర్గాలకూ కొమ్ము కాసే పార్టీలే తప్ప అశేష శ్రామిక జనానికి మద్దతు వచ్చే పార్టీలేవీ భారత దేశంలో కనపడడం లేదు. అలాంటి పార్టీలు వచ్చేవరకూ సోనియా గాంధీ లాంటి వారు ఏ విధంగా నైనా మాట్లాడగలరు.
సొనియా అమ్మ నే విమర్సించడమా!!! ఎంత ధైర్యం? జీరొ స్టార్ చిరు!!!.
Just kidding. Sarcastic comment.