ఎరువుల రేట్ల తగ్గుదల రైతుకి చేరకుండా నోక్కేసిన కేంద్ర ప్రభుత్వం


Fertilizer subsidyఅంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల రైతుకీ చేరకుండా కేంద్ర ప్రభుత్వం నోక్కేసింది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కంపెనీలకు నష్టం వస్తోందంటూ పెంచే ప్రభుత్వం అవి తగ్గినపుడు మాత్రం, ఆ తగ్గుదలను ప్రజలకు అందకుండా తానే నోక్కేస్తుంది. అదే పద్ధతిని ఎరువుల విషయంలో కూడా అనుసరించడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఎరువల ధరలను చాలా కాలం క్రితమే ప్రభుత్వం డీ కంట్రోల్ చేసింది. దానివల్ల ఎరువుల ధరలు సాధారణ రైరులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చాలా స్వల్ప సబ్సిడీని మాత్రమే ఇంకా కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్ధాయిలో ఎరువుల ధరలు 20 శాతంపై గా తగ్గిపోయినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. ఈ తగ్గుదల ద్వారా వచ్చిన ఫలితాన్ని రైతులకు బదలాయించడానికి బదులు కేంద్ర ప్రభుత్వ తన సబ్సిడీని తగ్గించుకోవడానికి ఉపయోగపెట్టుకుంది. రైతుల పై భారాన్ని తగ్గించడానికి బదులు తన సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం మొగ్గు చూపడం అత్యంత దారుణమైన విషయం.

అంతర్జాతీయ ధరల్లో 20 శాతం  తగ్గుదల సంభవించినప్పటికీ సబ్సిడీ భారాన్ని మాత్రం 33 శాతం తగ్గింకుకున్నట్లుగా ప్రభుత్వం గురువారం ప్రకటించుకుంది. దీనివల్ల రైతుల పైన అదనపు భారం పడదనీ, ఎం.ఆర్.పి ధరల్లో మార్పు ఉండదనీ ప్రభుత్వం చెపుతోంది. అయితే ధరల తగ్గుదల కంటే అదనంగా 13 శాతం వరకూ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం తగ్గించుకోవడం వల్ల సమీప భవిష్యత్తులో రైతుల పై భారం పెరగడానికే దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధరల తగ్గుదలను సబ్సిడీ తగ్గించడానికి బదలాయించడం వల్ల ప్రభుత్వంపైన 10,000 కోట్లకు పైగా భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ తగ్గుదలను రైతులకు బదలాయించినట్లయితే వారికి ఎరువులు మరింత తక్కువకు అందుబాటులోకి వచ్చి ఉండేవి. అయితే, జీడీపీ వృద్ధి, బడ్జెట్ లోటు లెక్కల్లో మునిగి తేలే ప్రభుత్వం వచ్చిన మిగులును బడ్జెట్ లోటు తగ్గించడానికే వినియోగించుకోనున్నట్లు అర్ధ మవుతోంది.

గత సంవత్సరం 3 జి స్పెక్ట్రమ్ వేలం ద్వారా వచ్చిన లక్ష కోట్లకు పైగా ఆదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికే వినియోగించింది తప్ప దాన్ని ప్రజలకు బదలాయించాలన్న ఆలోచన చేయలేదు.

2011-12 బడ్జెట్ మొత్తం 12.58 లక్షల కోట్లు కాగా రైతుల సబ్సిడీల కోసం కేటాయించింది కేవలం 65,000 కోట్లు మాత్రమే. వ్యవసాయం నుండి నలభై శాతం పైగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం ఆ రంగం కోసం ఇస్తున్నది కేవలం 5 శాతం మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడే సేవల రంగంలోని ఇన్సూరెన్సు, బ్యాంకింగ్ రంగాలు ప్రధానంగా ఆధారపడి ఉన్న సంగతి దృష్టిలో పెట్టుకుంటే వ్యవసాయ రంగం పైన ప్రభుత్వాలకు ఉన్న దారుణ దృష్టి అర్ధం అవుతుంది.

వ్యాఖ్యానించండి