కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం


తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి పంపేశారు.

కుదంకుళం అణు కర్మాగారం ప్రారంభం కాకుండా అక్కడి ప్రజలు తీవ్రంగా ఆందోళను చేస్తున్నారు. ఈ ఆందోళనల వెనుక అమెరికా, స్కాండినేవియన్ దేశాల హస్తం ఉండని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించిన రెండు రోజులకే ఈ సంఘటన చోటు చేసుకుంది.

అమెరికా, ఇండియా ల మధ్య ‘పౌర అణు ఒప్పందం’ కుదిరినప్పటికీ అమెరికా ఇంతవరకూ ఒక్క అణు రియాక్టర్ ని కూడా ఇండియాకి అమ్మలేకపోయింది. భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద నష్ట పరిహార బిల్లు’ తమ కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందనీ, ఆ చట్టం నుండి తమ కంపెనీలను మినహాయించాలనీ అమెరికా డిమాండ్ చేస్తోంది. అమెరికా కంపెనీలు లాభపడకుండానే రష్యా సహకారంతో నిర్మితమైన అణు కర్మాగారం ప్రారంభానికి నోచుకోవడం అమెరికా, యూరప్ లకు నచ్చలేదనీ, అందుకే ఆ కర్మాగారం ప్రారంభం కాకుండా అమెరికా, యూరప్ లు నిధులు అంధించి ఆందోళనలు రెచ్చగొడుతున్నాయని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లుగా భారత పత్రికలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో జరిగిన జర్మనీ దేశస్ధుడి అరెస్టు, గెంటివేత పత్రికల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్.సోన్నాతి పేరుతో లాడ్జిలో దిగిన జర్మనీ దేశస్ధుడి నుండి స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఆయనకు కుదంకుళం వ్యతిరేక ఆందోళనతో సంభంధం ఉన్నట్లు సూచిస్తున్నాయని రహస్య వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. ఫిబ్రవరి పన్నెండున లాడ్జిలో దిగిన జర్మన్ వ్యక్తి అంతగా ప్రాచుర్యం లేని లాడ్జిలో దిగడం పోలీసులలో ప్రశ్నలను రేకెత్తించిందట. అయితే పోలీసులు సంఘటన పైన వివరాలు చెప్పడానికి మొదట నిరాకరిమ్చారు. అర్ధరాత్రి అరెస్టు జరిగిందని మాత్రం వారు ధృవీకరించారు.

ఇదిలా ఉండగా, కుదంకుళం ఆందోళనకు కన్వీనర్ గా ఉన్న ఎస్.పి.ఉదయ కుమార్ ఈ ఘటనపై స్పంధించాడు. పద్దెనిమిది నెలల క్రితం తనను జర్మనీ దేశీయుడొకరు కలిశాడని ఆయన తెలిపాడు. ఆయన పేరు తనకి గుర్తులేదని ఉదయ కుమార్ తెలిపాడు. దేశమంతా అక్కడక్కడా జరుగుతున్నా అణు వ్యతిరేక ఉద్యమాల గురించి ఆయన తనతో చర్చించాడని తెలిపాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నలభై తొమ్మిదేళ్ల ‘సాంటేగ్ రీనర్ హెర్మన్’ అనే పేరుగల జర్మన్ దేశీయుడిని దేశం నుండి పంపామని పోలీసులు తర్వాత తెలిపారని ది హిందూ పత్రిక తెలిపింది. కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై నిఘా పెట్టిన ‘Q’ బ్రాంచి పోలీసు అధికారులు ఈ చర్యలో పాల్గొన్నారని వారు తెలిపారు. కేంద్ర నిఘా సంస్ధలు హెచ్చరించాక ‘క్యూ’ బ్రాంచి అధికారులు లాఢి పైన దాడికి దిగారు.

నాగర్ కోయిల్ లో అరెస్టు చేసిన హెర్మన్ ను చెన్నై తీసుకొచ్చి మంగళవారం తెల్లవారు ఝాము ఒంటిగంటకు చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వెనక్కి పంపేశామని పోలీసులు తెలిపారు.

అమెరికా, స్కాండినేవియా దేశాల హస్తం సంగతి ఎలా ఉన్నప్పటికీ అత్యంత ఖరీదైన అణు విద్యుత్ ను భారత ప్రజల ప్రయోజనాలను తిరస్కరిస్తూ కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధపడడం అత్యంత గర్హనీయం. ఇందులో విదేశీ కంపెనీల ప్రయోజనంతో పాటు, భారత పాలకుల దళారీ ప్రయోజనాలే తప్ప భారత ప్రజల ప్రయోజనాలు ఏమాత్రమ్ లేవు.

వ్యాఖ్యానించండి