కొత్త పుంతలు తొక్కుతున్న ‘మమత’ ఫాసిస్టు పాలన


పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ఫాసిస్టు పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. భారత దేశంలోని పాలక వర్గ పార్టీలు నామ మాత్రంగా ఏర్పరుచుకున్న నియమాలను, సూత్రాలనూ సైతం ఉల్లంఘిస్తోంది. రేపిస్టులకూ, హంతకులకు మద్దతుగా రావడమే కాకుండా రైతుల ఆత్మహత్యలను బూటకంగా అభివర్ణిస్తూ ‘పచ్చి ప్రజా వ్యతిరేకి’ గా తనను తాను రుజువు చేసుకుంటోంది.

మమత వ్యవహార సరళితో బెంగాల్ లోని వివిధ రంగాల మేధావులు తీవ్రంగా నిరసిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. శుక్రవారం నాడు, ఆర్టిస్టులు, స్కాలర్లు, సామాజిక కార్యకర్తలు అనేకమంది మమత అనుసరిస్తున్న పద్ధతులపై ఆగ్రహం వెళ్ళగక్కారు. సి.పి.ఐ (ఎం) పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర స్ధాయి నాయకులను త్రిణమూల కాంగ్రెస్ పార్టీ గూండాలు అత్యంత దారుణంగా హత్య చేసినప్పటికీ హంతకులను వెనకేసుకురావడానికి ప్రయత్నించడం తాజాగా వీరి ఆగ్రహానికి కారణం అయింది.

“రైతుల ఆత్మహత్యలను బూటకంగా నిరాకరించడం, కోల్ కతాలో జరిగిన దారుణమైన రేప్ నేరాన్ని ‘నాటకం’ (స్టేజ్ మేనేజ్‌డ్) గా అభివర్ణించడం లాంటి చర్యల ద్వారా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దుర్మార్గాలను నిరాకరించడాన్ని ఒక అలవాటుగా మమత చేసుకున్నట్లు అర్ధమవుతోంది. అదే పద్ధతిలోనే ఇప్పుడు కూడా సి.పి.ఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకుల హత్యను ‘అంతర్గత కుమ్ములాట’ గా చెబుతూ నిరకారించడానికి మమత ప్రయత్నిస్తోంది” అని సదరు ఉమ్మడి ప్రకటన పేర్కొంది.

రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బర్ధమాన్ లో సి.పి.ఐ(ఎం) సీనియర్ నాయకులు ప్రదీప్ టాహ్, కమల్ గాయేన్ లను దారుణంగా హత్య చేయడాన్ని వారు ఖండించారు. “ఫిబ్రవరి 28న జరగనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలను కోరుతూ సి.పి.ఐ(ఎం) నాయకులు బర్ధమాన్ లో ఒక ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా హత్యకు గురయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ వెంటనే ప్రకటన జారీ చేస్తూ హంతకులను కాపాడేలా హత్యలను సి.పి.ఐ(ఎం) పార్టీ అంతర్గత కుమ్మూలాటల ఫలితంగా ఏర్పడ్డవని ప్రకటించడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తద్వారా నేరస్ధులను శిక్షించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు విశ్వసనీయత లేకుండా చేశారు. రైతుల ఆత్మహత్యల లాంటి విషాధాలను నిరాకరించడం, రేప్ నేరాలను క్షమించేయడం లాంటివాటిని ముఖ్యమంత్రి మమత ఒక అలవాటు గా చేసుకున్నట్లు కనిపిస్తోంది” అని మేధావుల ప్రకటన పేర్కొంది.

“బహిరంగంగానే భయభ్రాంతులను చేసే పద్ధతులను అనుసరిస్తూ తన దుష్టపాలనుకు వ్యతిరేకంగా వచ్చే అసమ్మతిని, వ్యతిరేకతను అణచివేయడానికి మమత బెనర్జీ ప్రయత్నిస్తోంది. వాస్తవాలను అబద్ధాలుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది” అని ప్రకటన పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవడంలో ఎప్పటిలాగానే ముందుంటారన్న ఆశాభావాన్ని ప్రకటన వ్యక్తం చేసింది. ప్రఖ్యాత చరిత్రకారులు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, ప్రొ.సి.పి.చంద్ర శేఖర్, సయీద్ మీర్జా, తీస్తా సెతల్వాద్, ప్రొ.జయతి ఘోష్ ప్రకటనపై సంతకం చేసినవారిలో ఉన్నారు.

హత్యకు గురైన సి.పి.ఐ(ఎం) నాయైకుల్లో ఒకరు మాజీ ఎం.ఎల్.ఎ అని తెలుస్తోంది. హత్యలపై ప్రశ్నించిన జర్నలిస్టులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమత “వారిని ఎవరూ నరకలేదు. అంతర్గత కుమ్ములాటల్ల వల్లనే ఆ సంఘటన జరిగింది” అని వ్యాఖ్యానించింది. కోల్ కతా నగరంలో 37 ఏళ్ల స్త్రీ మాన భంగానికి గురైనపుడు కూడా మమత ఇదే విధంగా వ్యాఖ్యానించింది. తన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏర్పాటు చేయబడిన ఘటనగా ఆమె రేప్ నేరాన్ని అభివర్ణించింది. బెంగాల్ లో 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఆ సంఖ్యను మమత నిరాకరించింది. కేవలం ఒక్కరు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారనీ, మిగిలినవన్నీ బూటకమేననీ మమత వ్యాఖ్యానించింది.

రైతుల ఆత్మహత్యలు దేశంలో లెక్కకు మిక్కిలిగా జరుగుతున్నప్పటికీ భారత దేశంలో ఏ ప్రభుత్వమూ వాటికి బాధ్యత వహించిన పాపాన పోలేదు. తెలుగు దేశం పాలనలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కాలంలో అవన్నీ తమ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల నష్టపరిహారం కోసమే జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు, అతని మంత్రులు వ్యాఖ్యానించిన ఉదాహరణలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో సైతం అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, వారి అత్మహత్యలకు కారణమైన దుర్మార్గమైన వ్యవసాయ విధానాలను ప్రభుత్వాలు ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనె ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ లో సో కాల్డ్ వామ పక్షాలు పాలిస్తున్నపుడు సైతం రైతులు కష్టాలు అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం కంటె ముందుగానే నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొంచుకున్న జ్యోతి బసు ప్రభుత్వం నూతన ఆర్ధిక విధానాలను పక్కాగా అమలు చేసిన ఘనత పొందింది. విదేశీ పెట్టుబడుల కోసం అమెరికా, యూరప్ లు కాలికి బలపం కట్టుకుని మరీ పర్యటించిన చరిత్ర సి.పి.ఐ(ఎం) నాయకులది. స్పెషల్ ఎకనమిక్ జోన్ కోసం రైతుల వద్ద నుండి భూములను బలవంతంగా లాక్కోవడానికి కూడా వామ పక్ష ప్రభుత్వాలు వెనకాడలేదు. స్పెషల్ ఎకనమిక్ జోన్ లను వ్యతిరెకించిన పాపానికి, తమ పార్తీ కార్యకర్తలచేత నందిగ్రామ్ లాంటి చోట్ల రైతుల పైన హంతక దాడులు జరిపించిన చరిత్ర వామపక్ష పార్టీలది. అటువంటి వీరు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అని చెబుతూ ఫిబ్రవరి 28 న సార్వత్రిక సమ్మె కు పూనుకోవడం కార్మికవర్గాన్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు.

4 thoughts on “కొత్త పుంతలు తొక్కుతున్న ‘మమత’ ఫాసిస్టు పాలన

  1. ఎన్నికలకు ముందు మమతను సమర్థించిన వారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అనవసరంగా గత వామపక్ష ప్రభుత్వాన్ని నిందించడం ఇకనైనా మానాలి.
    దేశ వ్యాపితంగా 11 కార్మిక సంఘాలు ఐక్యంగా చేస్తున్న ఫిబ్రవరి 28 సమ్మె దేశంలోని 99శాతం ప్రజల డిమాండ్లతో 1శాతం కూడా కాని పెట్టుబడిదారులకు వ్యతరేకంగా జరుగుతున్న దేశభక్తి పూర్వకమైనదిగా భావించడమే సరియైన నిర్ణయం కాగలదు.
    వామపక్ష ప్రభుత్వ పరిపాలనలో ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వివరిస్తే బాగుంటుంది. మమత పరిపాలనలో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
    జ్యోతిబసుని విమర్షించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
    నందిగ్రాంలో వాస్తవాలు ఏంటనేది ఎంతమందికి తెలుసు. దయచేసి వాస్తవాలు రాస్తే బాగుంటుంది.

  2. అశోక్ గారూ, మీ వ్యాఖ్య స్పాం లోకి వెళ్లిపోయింది. చూడకపోవడం వల్ల ప్రచురణ ఆలస్యం అయింది.

    జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే పశ్చిమ బెంగాల్ లో నూతన పారిశ్రామిక విధానం రూపొందించారు. నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడమే ఈ విధానం లక్ష్యం అని ఆ తర్వాత జరిగిన పరిణామాలు రుజువు చేశాయి. టాటా కంపెనీ కోసం సంవత్సరానికి మూడు పంటలు తీసే పొలాల్ని బీడు భూములుగా కొన్నాళ్ళు, ఒక పంట మాత్రమే పండే భూములుగా మరి కొన్నాళ్లు వామ పక్ష ప్రభుత్వం ప్రచారం చేసింది. నానో కంపెనీ కోసం రైతుల భూముల్ని వశం చేసుకున్నారు. నష్టపరిహారం ఇచ్చామని ప్రభుత్వం చెప్పినా ఉద్యమించిన రైతులపైన ఫాసిస్టు నిర్భందం ఎందుకు అమలు చేయవలసి వచ్చిందో అది చెప్పలేదు. ప్రజలు ఉద్యమాలకి దిగిన చోటల్లా మావోయిస్టులు ఉద్యమంలోకి జొరబడ్డారని ప్రచారం చేసి ఆ పేరుతో నిర్భందం అమలు చేయడం బూర్జువా, బూస్వామ్య పార్టీలు అమలు చేస్తున్న ఎత్తుగడ. అదే ఎత్తుగడని వామ పక్ష ప్రభుత్వం కూడా అమలు చేసి ప్రజా ఉద్యమాలని అణచివేయడంలో తామూ తీసిపోమని పశ్చిమ బెంగాల్ వామ పక్ష ప్రభుత్వం రుజువు చేసుకుంది. అలాంటి ప్రభుత్వం వామ పక్ష ప్రభుత్వం ఎలా అవుతుంది?

    నందిగ్రామ్ లో వామ పక్షాల కార్యకర్తలు అమలు చేసిన పాశవిక హత్యాకాండని ఎలా సమర్ధించగలరు? తుపాకులు, ఇతర ఆయుధాలు ధరించి రైతుల పైన హత్యాకాండని అమలు చేయడం ఏ వామ పక్ష సిద్ధాంతం? విద్యుత్ ఉద్యమంలో గాయపడినవారికీ, చనిపోయినవారికీ నష్టపరిహారం డిమాండ్ చేసే సి.పి.యం, బెంగాల్ లో మాత్రం అదే ప్రజల ఉద్యమంపైన కాల్పులకు, హత్యలకు ఎలా దిగుతుంది? అవే నూతన ఆర్ధిక విధానాలు చంద్రబాబు, రాజశేఖర్ అమలు చేస్తే నెగిటివ్ గానూ, వామ పక్షం అమలు చేస్తే పాజిటివ్ గానూ ఫలితాలు వస్తాయని చెప్పడం బూటకం కాదా? మొత్తంగా తిరస్కరించవలసిన నూతన ఆర్ధిక విధానాలు షరతులతో అమలు చేస్తున్నామని వామ పక్ష ప్రభుత్వాలు చెప్పడమే పెద్ద బూటకం. బూర్జువా, బూస్వామ్య పాలక వర్గాలకు సేవ చేసే దోపిడి రాజ్యాంగ యంత్రం వామ పక్షాలు చేతిలో ప్రజలకు అనుకూలంగా మారిపోతుందా? బల ప్రయోగంతో తప్ప కార్మికవర్గం రాజ్యాధికారం చేజిక్కించుకోలేదన్న మార్క్సు, లెనిన్ సిద్ధాంతాలని సి.పి.ఐ, సి.పి.ఎం లు వదిలేశాక ప్రజా ఉద్యమాలని అణచివెయ్యడం ఆ పార్టీలు నడిపిన ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు.

వ్యాఖ్యానించండి