ఫాలక్ తల్లి మున్నీని కాపాడిన పోలీసులు, తల్లిని చేరనున్న ఫాలక్


వళ్లంతా కొరికిన గాయాలతో, ఎముకలు విరికిన చేతులు కాళ్ళతో, గాయపడిన మెదడుతో ఢిల్లీలోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల ‘ఫాలక్’ తల్లి ‘మున్నీ ఖాటూన్’ ను ఢిల్లీ పోలీసులు రాజస్ధాన్ వ్యభిచార గృహం నుండి రెండు రోజుల క్రితం రక్షించారు. మున్నీ పెద్ద కూతురు మూడేళ్ల పాపను కూడా కాపాడిన పోలీసులు తల్లీ కూతుళ్లను ఒక చోటకి చేర్చగలిగారు. అయితే మున్నీ, తన చిన్న కూతురు ఫాలక్ ను మాత్రం ఇంకా కలవ వలసి ఉంది. ‘ఫాలక్’ కేసును ఛేదించడంలో ఢిల్లీ పోలీసులు చేసిన కృషి బహుధా అభినందనీయం. పోలీసులను వారి మానాన వారి విధులను సక్రమంగా నిర్వర్తించడానికి అనుమతిస్తే, ప్రతి రోజూ అద్భుతాలు సాధించగలరనడానికి ‘ఫాలక్’ కేసు ఒక చక్కటి ఉదాహరణ. ఫాలక్ కేసు వెనుక ఉన్న వ్యభిచార ముఠాకు రాజకీయ నాయకుల మద్దతు, పాత్ర ఉన్నట్లయితే మున్నీకి బహుశా తన ఇద్దరు కూతుళ్లను, కుమారుడిని మళ్ళీ కలుసుకోగల అవకాశం వచ్చి ఉండేది కాదేమో.

మున్నీ ఖాటూన్ బీహార్ లోని ముజఫర్ పూర్ నివాసి. ఇరవై రెండేళ్ల మున్నీ పురుషాధిక్య సమాజం చేత దారుణంగా వంచించబడిన యువతి. ముజఫర్ పూర్ కే చెందిన లక్ష్మి మున్నీని తన కూతురు రోషిణికి పరిచయం చేసింది. తల్లీ కూతుళ్ళిద్దరూ కలిసి మున్నీని వ్యభిచారం చేయవలసిందిగా వత్తిడి చేసారు. మున్నీ వారి ఒత్తిళ్లకు లొంగలేదు. దానితో వారు మరో ఎత్తు వేశారు. యువ పెళ్ళి కూతురు కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి మున్నీని వారు అమ్మి వేశారు. అమ్మకం విషయాన్ని రహస్యంగా ఉంచడం వల్ల పెళ్లికి మున్నీ అంగీకరించింది. గత సెప్టెంబర్ లో మున్నీని పెళ్ళి చేసుకున్న వ్యక్తికి మున్ని గతం గురించి వారు చెప్పలేదు. మున్నీకి అప్పటికే పెళ్లయిందనీ, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారనీ చెప్పకుండా పెళ్లి జరిపించారు. యువతిని పెళ్ళి కూతురు గా సంపాదించిపెట్టినందుకు లక్ష్మి, రోషిణి లకు ఆ వ్యక్తి మూడు లక్షల రూపాయలు చెల్లించాడు.

అయితే, తర్వాత ఏమి జరిగిందో గాని మున్నీ ఢిల్లీ రావడానికి లక్ష్మి, రోషిణిలు ఒప్పించారు. పెళ్ళి కోసమే ఢిల్లీ రావడానికి మున్నీ అంగీకరించిందా లేదా అన్నది పత్రికల నుండి స్పష్టత లేదు. ఢిల్లీ రావడానికి ఒప్పుకున్న మున్నీ తన పెద్ద కూతురుని రోషిణి వద్ద ఉంచాలని కోరింది. రోషిణి వద్ద అప్పటికే మూడేళ్ల మరొక పాప ఉండడంతో మున్నీ ఆ విధంగా కోరినట్లు తెలుస్తోంది. అనంతరం తన ఐదేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు (ఫాలక్) లతో మున్నీ ఢిల్లీ చేరుకుంది. లక్ష్మి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ముజఫర్ పూర్ లో దాడులు చేసి మున్నీ పెద్ద కూతురుని కాపాడారు. అయితే రోషిణి తప్పించుకుపోయిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ చేరుకున్న మున్నీని వ్యభిచార ముఠా రాజస్ధాన్ వ్యభిచార గృహానికి చేర్చినట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది.

మున్నీ పెద్ద కూతురును ముజఫర్ పూర్ నుండి కాపాడిన పోలీసులు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఎంక్లేవ్ లో ఒక షెల్టర్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతకుముందు పోలీసులు మున్నీని రాజస్ధాన్ లోని ఝుంఝును లో ఉన్నట్లు గుర్తించి ఆచూకి పట్ట గలిగారు. ఆమెను ఢిల్లీ లోని సాకేత్ కోర్టు లో హాజరు పరచగా ఆమెను నారీ నికేతన్ లో ఉంచవలసిందిగా కోర్టు ఆదేశించింది. మున్నీ పెద్ద కూతురుని రక్షించిన పోలీసులు ఆ పాపను సఫ్దర్‌జంగ్ ఎంక్లేవ్ నుండి లజ్‌పత్ జగర్ లోని ఛైల్ట్ వెల్ఫేర్ కమిటీ (సి.డబ్ల్యూ.సి) కి అప్పజెప్పారు. ఫిబ్రవరి 8 తేదీన సి.డబ్ల్యూ.సి ముందు మున్నీ, ఆమె పెద్ద కూతురులను పోలీసులు హాజరు పరిచాక మూడేళ్ల పాపను ఆమె తల్లి వద్ద మధ్యంతర కస్టడీ కింద ఉంచడానికి కమిటీ ఆదేశాలు జారీ చేసింది. తల్లీ కూతుళ్లు నారీ నికేతన్ లో ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా సి.డబ్ల్యూ.సి ఆదేశించింది.

పోలీసులు లక్ష్మితో పాటు ఆమె సహచరి కాంత చౌదరిని అరెస్టు చేశారు. కాంత అనే స్త్రీ అంతకు ముందు రాజస్ధాన్ లో ఇదే విధమైన ఐదు కేసుల్లో నిందితురాలుగా ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. స్త్రీలను వ్యభిచారులుగా మార్చి రవాణా చేసే ముఠాలో లక్ష్మి, కాంత లతో పాటు సరోజ్ అనే మరొక వ్యక్తి కూడా సభ్యులుగా పోలీసులు కనుగొన్నారు. సరోజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు అందించిన సమాచారం. లక్ష్మి, కాంత ల మధ్య సరోజ్ కామన్ లింకు గా పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురూ కలిసి మున్నీని వ్యభిచారం చేయవలసిందిగా బలవంతపెట్టగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత పెళ్లి పేరుతో మరొకరికి అమ్మిశారు. భర్త వద్ద నున్న విలువైన వస్తువులు దొంగిలించి ఢిల్లీ రావలసిందిగా లక్ష్మి మున్నీకి సలహా కూడా ఇచ్చింది. ఆ సలహాను మున్నీ పాటించలేదు. మున్నీ తన రెండవ భర్తను వదిలి లక్ష్మితో ఢిల్లీ ఎందుకు వచ్చిందీ పోలీసుల సమాచారంలో స్పష్టత లేదు. మున్నీ ఇప్పటికీ తన రెండవ భర్త వద్దకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

మున్నీ కొడుకుని లక్ష్మి గుడ్డు అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా పోలీసులు కనుగొన్నారు. గుడ్డు కోసం వారు వెతుకుతున్నారు. మరో ఇద్దరు నిందితులు మనోజ్, ప్రతిమ ల కోసం పోలీసులు వెతికి ప్రతిమ ను పట్టుకున్నట్లు ప్రకటించారు. ప్రతిమ కూడా మున్నీ వ్యభిచారంలోకి దించడానికి కృషి చేసిన వారిలో ఒకరని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఫాలక్ ని ఆసుపత్రికి తెచ్చిన పద్నాలుగేళ్ల బాలిక మహిని లైంగికంగా హింసించిన కేసులో పోలీసులు ఇద్దరు పురుషులను అరెస్టు చేశారని ‘ది హిందూ’ ఫిబ్రవరి 8 న తెలిపింది. ఫిబ్రవరి 10 తేదీన మహి బాయ్ ఫ్రెండ్ గా అనుమానిస్తున్న రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. ఫాలక్ ని మహి వద్దకు చేర్చింది రాజ్ కుమారే.

మున్నీని వ్యభిచార గృహాలకు అమ్మివేయడంతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లకు కూడా భవిష్యత్తులో అదే గతి పట్టించడానికి లక్ష్మి, ప్రతిమ, రోషిణి, కాంత ల ముఠా పధక రచన చేసుకున్నట్లు గా అర్ధం చేసుకోవచ్చు. రోషిణి వద్ద పెద్ద కూతురు, మహి వద్ద చిన్న కూతురుని ఉంచి పోషించడానికి వారు నిర్ణయించుకున్నారని భావించవచ్చు. అయితే మహి చేతిలో గాయపడిన ఫాలక్ ని ఆసుపత్రిలో చేర్చడం, ఆ వార్త పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం పొందడం, విషయం ఢిల్లీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి పాపకు అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇవ్వడంతో డొంకంతా కదిలింది. ఈ వ్యభిచార ముఠాల వెనుక రాజకీయ హస్తం ఉన్నదీ లేనిదీ పూర్తిగా తెలియదు. సాధారణంగా రాజకీయ అండ లేనిదే వ్యభిచార ముఠాలు, స్త్రీల రవాణా ముఠాలు చెల్లుబాటు కావడం కష్టతరమైన విషయం. పత్రికలు అందించిన ప్రచారం ఫాలక్ కు బాగా సహాయపడిందని ఈ సందర్భంగా గుర్తించవలసిన విషయం. ఫాలక్ ను ఆసుపత్రికి తెచ్చిన మహి కూడా ఫాలక్ కుటుంబాన్ని ఒక దగ్గరకు చేర్చడానికి ముఖ్య కారణంగా గుర్తించవచ్చు.

ఫాలక్ ఆరోగ్యం కుదుటపడ్డాక పాపను తల్లి మున్నీ వద్దకు చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాలక్ ను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆ పాప భవిష్యత్తు పూర్తిగా అగమ్య గోచరంగా కనిపించింది. పోలీసులు సమర్ధవంతంగా కృషి చేయడంతో పాప మళ్ళీ తల్లి వద్దకు చేరనున్నది.

వ్యాఖ్యానించండి