అణ్వాయుధాలను భద్రంగా కాపాడుకోవడంలోనూ, సమర్ధవంతమైన భద్రతా చర్యలను చేపట్టడంలోనూ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలైన ఇండియా, పాకిస్ధాన్, ఇరాన్ లాంటి దేశాలకు పాఠాలు చెప్పే అమెరికా ముందు తన వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా లేని సంగతిని పట్టించుకోవాలని అమెరికా ప్రభుత్వ ఏజన్సీ నివేదిక తలంటింది. పాకిస్ధాన్ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ, భారత దేశానికి అణ్వాయుధాలు భద్రపరుచుకునే పరిజ్ఞానం లేదనీ, అణ్వాయుధాలే లేని ఇరాన్ అణ్వాయుధాల వల్ల ప్రపంచ భద్రతకే ప్రమాదం ఉందనీ చెబుతూ అమెరికా ప్రపంచ భద్రత పైన ఆందోళన వ్యక్తం చేయడం ఒక అలవాటుగా పెట్టుకుంది.
నిజానికి వయసు ఉడిగి పోయిన అమెరికా అణ్వాయుధాల వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచానికి కూడా ప్రమాదం పొంచి ఉందని అమెరికా ప్రభుత్వ ఏజన్సీ ‘గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్’ (జి.ఎ.ఒ) తన నివేదికలో తూర్పారబట్టింది. అణ్వాయుధాల పరిజ్ఞానం గురించీ, వాటిని భద్రంగా అమెరికా మిలట్రీ కేంద్ర కార్యాలయం అయిన పెంటగాన్ అధికారులకి అప్పగించి సంబంధిత జాగ్రత్త చర్యల గురించి ఎప్పటికప్పుడు అమెరికా మిలట్రీకి చెప్పవలసిన బాధ్యత అణ్వాయుధ ఉత్పత్తి, పరిరక్షణ కు బాధ్యత వహించే ‘నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ ఏజన్సీ’ (ఎన్.ఎన్.ఎస్.ఎ) సంస్ధపైన ఉంది. తన బాధ్యతను నిర్వర్తించడంలో ఈ ఏజన్సీ తీవ్రంగా విఫలమవుతోందని జి.ఎ.ఒ నివేదిక పేర్కొంది.
ప్రపంచ అణు భద్రత గురించి అమెరికా తరచూ నివేదికలు వెలువరిస్తుంది. ఆ నివేదికల్లో ఇతర దేశాలను ముఖ్యంగా ఇండియా, పాకిస్ధాన్, ఇరాన్ దేశాలను తిట్టడానికి, సుద్దులు చెప్పడానికి అమెరికా బాగా ఇష్టపడుతుంది. సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదనీ, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల వాటంతట అవే పేలిపోయే పరిస్ధితులు ఏర్పడవచ్చనీ, పాలనా పరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదనీ, ‘పిచ్చివాడి చేతిలో రాయి’ మాదిరిగా మూడో ప్రపంచ దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉన్నాయని కూడా అమెరికా నివేదికలు అహంకార పూరితంగా వ్యాఖ్యానించడం కద్దు. ఇవన్నీ నిజానికి నేరుగా అమెరికాకే వర్తిస్తాయని జి.ఎ.ఒ నివేదిక తేటతెల్లం చేస్తోంది.
సమన్వయ లోపం
అమెరికా అణ్వాయుధాలు వాస్తవానికి అస్ధిర పరిస్ధితుల్లో ఉన్నాయనీ, ప్రభుత్వంలోని వివిధ ఏజన్సీల మధ్య అణ్వాయుధ భద్రతా చర్యల గురించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో తీవ్రమైన అలసత్వం, వైఫల్యం చోటు చేసుకుంటున్నాయనీ, అసలా ప్రక్రియ మొత్తం అనిర్ధిష్టత (వేగ్) తో కూడుకుని ఉన్నదనీ జి.ఎ.ఒ నివేదిక పేర్కొన్నది. ముఖ్యంగా అణ్వాయుధాల ఉత్పత్తి, భద్రతల విషయాలలో బాధ్యత కలిగి ఉన్న ఎన్.ఎన్.ఎస్.ఎ సంస్ధ తప్పులను నివేదిక ఎత్తి చూపింది. అమెరికా నిల్వ చేసుకున్న అణ్వాయుధాలలో అనేకం తమకు నిర్దేశించిన కాలాన్ని పూర్తి చేసుకున్నాయనీ, ఆ విధంగా వయసుడిగిన అణ్వాయుధాల వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ వాటి భద్రత విషయంలోనూ, భద్రతా చర్యలు తీసుకోవడంలోనూ, భద్రతా చర్యల సమాచారం అమెరికా మిలట్రీకి అందించడంలోనూ ఎన్.ఎన్.ఎస్.ఎ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నివేదిక వెల్లడించింది.
అణ్వాయుధాలు నిల్వ చేయడం, సంవత్సరాల తరబడి భద్రంగా కాపాడడం, తయారు చేసిన అణ్వాయుధాలను భద్రంగా మిలట్రీకి అప్పగించడం, అప్పగించాక తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మిలట్రీకి తగిన మార్గదర్శకాలు జారి చేయడం… ఈ కార్యక్రమాలన్నింటిలోనూ అసాధారణ జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. ఇతర సరుకులమల్లె సాధారణ నిల్వ సౌకర్యాలలో వీటిని నిల్వ చేయడం సాధ్యపడదు. ఇతర సరుకులతో పోల్చితే అణ్వాయుధాల నిల్వలు, నిర్వహణ విషయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను ‘పరిమితులు’ (లిమిటేషన్స్) గా పరిగణిస్తారు. అణ్వాయుధాల విషయంలో పాటించవలసిన 52 ‘పరిమితులు’లో మెజారిటీ పాటించడం లేదని నివేదిక తెలిపింది.
‘పరిమితుల’ ప్రభావాంశాలు
అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి నిర్ధిష్ట మిలట్రీ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసే మొత్తం ప్రక్రియలో కొన్ని అవసరాలను ఆయుధాలు పరిపూర్తి చేయలేకపోవచ్చు. అటువంటి అంశాలను ‘పరిమితులు’ ప్రభావితం చేస్తాయి. ఈ పరిమితులు అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని కీలక ప్రక్రియల (ఫంక్షన్స్) పైన తీవ్ర ప్రభావం కలుగు జేస్తాయి. అటువంటి కీలక ప్రక్రియల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.
- అసాధారణ పరిస్ధితుల్లో పేలుడు భద్రతను కాపాడడం
- అణ్వాయుధాల ఆధారత (రిలయబిలిటీ)
- అణ్వాయుధాల సరఫరా (డెలివరీ)
- పరిమిత విడిభాగాల ప్రతిక్షేపణ (రీప్లేస్‌మెంట్)
- అణ్వాయుధ లబ్ది (యీల్డ్)
- కార్మికుల భద్రత
వీటిని ప్రభావితం చేసే యాభై రెండు పరిమితులను జి.ఎ.ఒ నివేదిక గుర్తించింది. ఈ పరిమితుల ప్రభావాన్ని శూన్యం చేసే జాగ్రత్తలను ఎన్.ఎన్.ఎస్.ఎ సంస్ధ సంబంధిత విభాగాలకు, ముఖ్యంగా మిలట్రీకి ఎప్పటికప్పుడు తెలియజేయవలసి ఉంటుంది. మార్గదర్శకత్వం వహించవహించవలసి ఉంటుంది. కాగా, జి.ఎ.ఒ నిర్వహించిన పరిశోధనలో ‘జాగ్రత్తల సమాచారం అందించడంలోనూ, మార్గదర్శకత్వం వహించడంలోనూ నిర్లక్ష్యంతో కూడిన అనేక లోపాలు సంభవిస్తున్నట్లుగా’ తేలింది. మార్గదర్శకత్వం వహించడంలో భాగంగా ఎన్.ఎన్.ఎస్.ఎ సంస్ధ మిలట్రీకి అందిస్తున్న డాక్యుమెంట్లలో “అత్యధిక స్ధాయికి చెందిన సాంకేతిక సమాచారం, సాంకేతిక పదజాలం, అనిర్ధిష్ట పదజాలం, అణ్వాయుధ నిల్వల నిర్వహణలో ఒక పరిమితి యొక్క వాస్తవ ప్రభావం గురించిన సమాచారం నిర్ధిష్టంగా లేకపోవడం, అణ్వాయుధాల నిర్వహణ పై నిర్ధిష్ట సూచనలు లేకపోవడం, యుద్ధ పధకాలపై కూడా సమాచారం లేకపోవడం” లాంటి తీవ్ర లోపాలు దొర్లాయని జి.ఎ.ఒ కనుగొంది.
విరుద్ధ ధోరణులు
లోపాలకు తగిన ఉదాహరణ కూడా నివేదిక పేర్కొంది. ఒక మిలట్రీ సర్వీసు కి చెందిన నాయకత్వ శ్రేణి లోని ప్రాజెక్టు ఆఫీసరు ని జి.ఎ.ఒ ఇంటర్వూ చేయగా ఎన్.ఎన్.ఎస్.ఎ అందించిన గైడేన్స్ డాక్యుమెంటులో లోపాలు బైటికి వచ్చాయి. ఒక నిర్ధిష్ట పరిమితి వల్ల అణ్వాయుధాల ఆధారత (రిలయబిలిటీ) పై కలగనున్న ప్రభావం గురించి స్పష్టం చేయాలని ఈ అధికారి ఎన్.ఎన్.ఎస్.ఎ లాబొరెటరీ ని కోరగా అతని అందిన నివేదిక “పూర్తిగా లేదనీ (ఇన్ కంక్లూజివ్) ఆ నిర్ధిష్ట పరిమితికి సంబంధించిన అదనపు సమాచారం కూడా ఏమీ ఇవ్వలేదనీ, ఒక నిర్ధిష్ట ప్రయోగంలో ఆయుధం అనుకున్నట్లుగా పని చేయలేకపోవచ్చని తేల్చారనీ, అటువంటి పరిస్ధితుల్లో లేబొరెటరీ సిబ్బంది ‘STARTCOM’ యుద్ధ వ్యాహకర్తలకు సమాచారం అందించడమే లోపాన్ని పరిహరించడానికి ఉన్న మార్గంగా చెప్పారనీ” సదరు అధికారి చెప్పాడని జి.ఎ.ఒ నివేదిక పేర్కొన్నది.
ఎన్.ఎన్.ఎస్.ఎ, యు.ఎస్.లేబొరేటరీల వద్ద ‘ప్రమాదకరమైన సమాచార లోపం’ (లెధల్ డిస్‌కనెక్ట్) ఉన్నదని జి.ఎ.ఒ నివేదిక ఎత్తి చూపింది. మరోవైపు అమెరికా మిలట్రీ యేమో ఫీల్డ్ ఆపరేషన్స్ పైన మాత్రమే కేంద్రీకృతమైన ధోరణి కనిపిస్తోందనీ నివేదిక ఎత్తి చూపింది. ఈ విధంగా అణ్వాయుధాల ఉత్పత్తి విభాగమూ, అణ్వాయుధాలను వినియోగింది మిలట్రీ విభాగమూ రెండూ పరస్పరం విరుద్ధమైన ధోరణులతో ఉండడంతో అణ్వాయుధాల భద్రత అంతిమంగా ప్రమాదంలో పడుతోందని జి.ఎ.ఒ నివేదిక ఎత్తి చూపింది. ఇరు విభాగాలు పరస్పరం సమన్వయంతో తమ ఉత్పత్తి సామర్ద్యాన్నీ అవసరాలను మార్చుకుంటూ, సవరించుకుంటూ ఏకీభావంతో వ్యవహరించవలసి ఉండగా ఆ ధోరణే కనిపించలేదని నివేదిక ఎత్తి చూపింది. ఉత్పత్తి చేసే విభాగం సాంకేతిక పరిజ్ఞానం కేంద్రంగా ఉండే ధోరణితో వ్యవహరిస్తుండగా, వినియోగించే విభాగం వాస్తవ వినియోగం మాత్రమే కేంద్రంగా చేసుకున్న ధోరణితొ వ్యవహరిస్తోందని నివేదిక ఎత్తి చూపింది.
కాలం చెల్లిన డిజైన్లతో ప్రమాదం
అమెరికా వద్ద ప్రస్తుతం నిల్వ ఉన్న అణ్వాయుధ డిజైన్లు ఇరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలానికి పూర్వం నాటివి. అంటే నిల్వ ఉన్న ఆయుధాల్లో అత్యధికం అవి నిర్దేశించబడిన కాలాల కంటే ఎక్కువగా కొనసాగుతున్నాయని జి.ఎ.ఒ నివేదిక పేర్కొంది. వాటి డిజైన్లు కేవలం ఇరవై సంవత్సరాలకు మాత్రమే నిర్దేశించగా అంతకంటే ఎక్కువ కాలంగా ఆ నిల్వలను కొనసాగిస్తున్నారని నిపుణులు గుర్తించినట్లుగా నివేదిక పేర్కొంది. కాలం గడిచే కొద్దీ అణ్వాయుధాల క్వాలిటీ క్షీణిస్తూ ఉంటుందనీ ఆ నేపధ్యంలో అణ్వాయుధాల ‘పరిమితులు’ మునుపటి కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయనీ, పరిమితుల పై దృష్టి పెట్టనట్టయితే అణ్వాయుధాల జారీ ప్రక్రియ (డిప్లాయ్‌మెంట్) అనేక లోపాలు దొర్లడం తద్యమని నివేదిక తెలిపింది. అంటే అణ్వాయుధాల ప్రయోగ సమయంలో స్వపక్షానికే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదంతో పాటు నిల్వ పరిస్ధితుల్లో సైతం ఊహించని ప్రమాదాలు ఎదురు కావచ్చని నివేదిక తెలిపింది.
ఈ నేపధ్యంలో ఎన్.ఎన్.ఎస్.ఎ అణ్వాయుధాల నిల్వల నిర్వహణ, కొనసాగింపు కోసం నిర్ధిష్ట మార్గదర్శక సూత్రాలను క్షుణ్ణంగా రూపొంచుకోవాలనీ, వాటిని ఎప్పటికప్పుడు తరచుగా సమీక్షించుకోవాలనీ, సంబంధిత విభాగాలన్నింటికీ తరచుగా సమాచారం ఇవ్వాలనీ జి.ఎ.ఒ నివేదిక సుద్దులు చెప్పింది.
సొంత అణ్వాయుధాల నిల్వలు, నిర్వహణ విషయంలోనే ఇంత అజాగ్రత్తగా ఉంటూ ప్రపంచ శాంతికీ, భద్రతకూ ప్రమాదం కలుగు జేస్తున్న అమెరికా ఇండియా, పాకిస్ధాన్, ఇరాన్ లాంటి దేశాలకు నీతులు చెప్పబూనుకోవడం ఖండనార్హం. అమెరికా పాలకులకు, వ్యాపార సంస్ధలకు నిజానిని అణ్వాయుధ బద్రతపై ఉన్న దృష్టి చాలా తక్కువని జి.ఎ.ఒ నివేదిక స్పష్టం చేస్తోంది. వారికి ఉన్న ఆసక్తి ప్రధానంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాసాలనూ వినియోగించుకొని మార్కెట్లను విస్తరించుకోవడం, లాభాలను అనేక రెట్లు పెంచుకోవడం పైనె తప్ప మరొకటి కాదు. ప్రపంచ భద్రత కు ప్రమాదం అని పేర్కొంటూ సద్దాం హుస్సేన్ వద్ద లేని ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలను’ సాకుగా చూపి ఇరాక్ ప్రజలను రెండు శతాబ్దాలుగా అమెరికా, యూరప్ లు మానవ విధ్వంసానికి గురి చేశాయి.
మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం అక్కడ తన నమ్మిన బంటుగా ఉన్న ఇజ్రాయెల్ కి ప్రమాదం లేకుందాఅ చేయడానికీ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఇప్పటికి ఐదు సార్లు ఆ దేశంపై వాణిజ్య, వ్యాపార, ఆర్ధిక, ఆంక్షలను అమెరికా, యూరప్ లు విధిస్తూ వచ్చాయి. ఆ విధంగా ఇరాన్ ప్రజలను నరక బాధలకు గురి చేస్తున్నాయి. మొన్న లిబియాలోనూ, ఈరోజు సిరియాలోనూ అద్దె తిరుగుబాటుదారులతో లేని తిరుగుబాట్లను సృష్టించి అక్కడి ప్రజల రోజువారి బ్రతుకులను సైతం ఛిద్ర్రం చేస్తున్నాయి అమెరికా, యూరప్ లు. ఈ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద కంపెనీలు లాభాలు పెంచుకోవడానికీ, మార్కెట్లు విస్తరించుకోవడానికీ ఇంకా ఎన్ని దారుణాలకైనా తెగబడతాయి. అవి ఇరాన్ తోనూ, లిబియాతోనూ, సిరియా తోనూ ఆగిపోతాయనుకుంటే అంతకంటే అజ్ఞానం ఉండబోదు. ఇప్పుడు తమ మిత్రులుగా అమెరికా పేర్కొంటున్న ఇండియా, పాకిస్ధాన్ లపైన కూడా దాడి చేయడానికి అవి ఎన్నడూ వెనకాడవు. ఒకప్పుడు మిత్రుడుగా ఉన్న సద్ధాం హుస్సేన్ ను వెంటాడి వేటాడిన చరిత్ర అమెరికా, యూరప్ ల కు ఉంది. రష్యాకు వ్యతిరేకంగా పని చేసినంతకాలం ఒసామా బిన్ లాడేన్ కు సకల సౌకర్యాలు, అవసరాలు సమకూర్చి పెట్టిన టెర్రరిస్టు చరిత్ర అమెరికా, యూరప్ లది. తనకు ఇరాన్ తో ఉన్న వైరం కోసం ఇండియా, ఇరాన్ ల మధ్య ఆయిల్ పైపు లైన్ నిర్మాణాన్ని నిస్సిగ్గుగా అడ్దుకున్న చరిత్ర అమెరికా, యూరప్ లది. పాకిస్ధాన్ తన మిత్రుడని చెబుతూనే ఆ దేశ అణ్వాయుధాలను దొంగిలించడానికి కుట్రలు పన్నుతున్న నీచ చరిత్ర అమెరికా, యూరప్ లది. ఇండియా తన మిత్రుడని చెబుతూనే ఆ దేశానికి యురేనియం ఇంధనం సరఫరా చేస్తానని ఒప్పుకుని కూడా ఇంతవరకూ ఆ ఒప్పందం సాకారం కావడానికి మోకాలడ్డుతున్న మోసపూరిత చరిత్ర అమెరికా, యూరప్ లది. ఇండియాకు యురేనియం సరఫరా చేస్తామని చెబుతూ ఆ యురేనియం వినియోగంపై నిఘా పెడతామనీ నేరుగా భారత దేశంలోని అణు పరిశ్రమలలోనే తమ సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటానని డిమాండ్ చేస్తున్న ఆధిపత్య చరిత్ర అమెరికా, యూరప్ లది.
ఇన్ని చేసే అమెరికా, యూరప్ లు తమ ప్రయోజనాలను నెరవేర్చకుండా ఇండియా ఏమాత్రం నిరాకరించినా తమకు అందుబాటులో ఉన్న సమస్త కుట్రలను ఇండియా పై వినియోగించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయవు. అలా వినియోగించడానికి అవి ఇండియా అణ్వాయుధాలనే ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా ప్రచారం చేయడానికి కూడా అమెరికా, యూరప్ లు సిద్ధపడతాయి. చరిత్ర ఆ సత్యాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. తస్మాత్ జాగ్రత్త!