అగ్నిపధ్ సినిమాలో హీరోని స్ఫూర్తిగా తీసుకుని తన టీచర్ ని కత్తితో పొడిచానని చెన్నై లోని ఓ పాఠశాలలో టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి తెలిపినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం విద్యార్ధి ఇటీవలే ‘అగ్నిపధ్’ సినిమా చూశాడు. సినిమాలో హీరో తన తండ్రిపైన తప్పుడు ఆరోపణలు చేసినవారిని కత్తితో పొడిచి చంపి పగ తీర్చుకుంటాడు. ఈ దృశ్యం నుండే తాను స్ఫూర్తి పొందానని విద్యార్ధి పోలీసులకు తెలిపాడు.
విద్యార్ధి లెక్కలు, హిందీ రెండు సబ్జెక్టులలో తప్పాడు. లెక్కలు బోధించే మాస్టారు విద్యార్ధిని ఏమీ అనకపోయినప్పటికీ హిందీ టీచర్ ఉమా మహేశ్వరి మాత్రం విద్యార్ధి డైరీలో రిమార్కులు రాయడం విద్యార్ధికి కోపం తెప్పించింది. తనకు కోపం తెప్పించినవారిని కత్తితో పొడిచి చంపడమే సరైన పరిష్కారంగా ‘అగ్నిపధ్’ సినిమా ద్వారా నేర్చుకున్న విద్యార్ధి టీచర్ ప్రాణాలను బలి తీసుకున్నాడు. విద్యార్ధి తల్లిదండ్రులు ఆర్ధికంగా ఉన్నతులనీ తెలుస్తోంది. పాకెట్ మనీ కింద రోజుకి వంద రూపాయలు తల్లిదండ్రుల వద్ద పొందేవాడనీ తెలుస్తోంది.
తనను ఏమీ చేయవద్దని బతిమాలుకుంటున్నప్పటికీ కరగకుండా టీచర్ ని వెంటాడి మరీ పొడిచి చంపినట్లుగా ‘ఆంధ్ర జ్యోతి’ లాంటి పత్రికలు రాసినప్పటికీ ‘ది హిందూ’ కధనం అందుకు భిన్నంగా ఉంది. టీచర్ క్లాస్ రూం లో కూర్చుని విద్యార్ధుల కోసం ఎదురు చూస్తుండగా అందరి కంటె ముందు జొరబడిన విద్యార్ధి డస్ట్ బిన్ లో కాగితం వేసే నెపంతో టీచర్ ని సమీపించి గొంతు కోసాడనీ ఆ తర్వాత కడుపులో పొడిచాడనీ ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. పత్రికల కధనాల మధ్య ఇంత తేడా ఎందుకు ఉందో అర్ధం కాని విషయం.
సమీపంలో ఉన్న ప్రవేటు ఆసుపత్రికి మొదట టీచర్ ని తీసుకెళ్లగా వారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారనీ, ప్రభుత్వాసుపత్రికి వెళ్తుండగా మార్గ మధ్యంలో టీచర్ మరణించినట్లుగా ‘ది హిందూ’ పత్రిక రాయగా, కళాశాలలో వెంటాడి పదే పదే పొడిచి చంపినట్లుగా ఆంధ్ర జ్యోతి పత్రిక రాసింది. కత్తి పోట్లకు అక్కడికక్కడే టీచర్ మరణించిందని కూడా ఆంధ్ర జ్యోతి పత్రిక మొదటి పేజిలో బాక్స్ కట్టి వార్త ప్రచురించింది. విద్యార్ధిని మరింత రాక్షసీకరించే ప్రయత్నం జ్యోతి పత్రికలో కనిపిస్తోంది.
విద్యార్ధి కేవలం పద్నాలుగు సంవత్సరాలు వయస్కుడు మాత్రమే. సమాజాన్ని పెద్దగా చూడని వయసు కనుక తనను నచ్చిన అంశాన్ని అనుకరించే వయసులోనే అతను ఉన్నాడు. ప్రత్యేకంగా కక్ష గట్టి చంపాలనుకునే వయసు కాదతనిది. అగ్నిపధ్ సినిమా స్ఫూర్తిగా తీసుకున్నానని విద్యార్ధి స్వయం గా చెబుతున్నందున సినిమా ప్రభావంతోనే ఈ చర్యకు ఒడిగట్టాడనడంలో సందేహం అవసరం లేదు.
ఇక్కడే సమాజం పాత్ర ముందుకు వస్తోంది. సినిమాలు ఇప్పుడు విచ్చలవిడి హింసను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. హీరో పూనుకుని విలన్లను బాదిపడేయడమే ఒక విపరీతం కాగా, ఈ విపరీత చర్యలను అభివృద్ధి చెందిన టెక్నాలజీని వినియోగిస్తూ కొత్త కొత్త పద్ధతుల్లో చూపించడానికి నిర్మాతలు, దర్శకులు పోటీ పడుతున్నారు. ఒక సినిమాలో ఒక హీరో చూపించిన హింసా పద్ధతులకు విభిన్నంగా మరొక హీరో మరొక సినిమాలో చూపించడానికి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. గ్రాఫిక్స్ టెక్నాలజీ సాయంతో మరిన్ని కొత్త కొత్త పద్ధతుల్లో ఫైటింగ్స్ సీన్ లను చిత్రీకరిస్తూ వివిధ హీరోల ఫ్యాన్స్ ల మధ్య కూడా అనారోగ్యకరమైన పోటీని సినిమాలు సృష్టిస్తున్నాయి.
హీరోలు సైతం తాను కేవలం నటుడ్ని మాత్రమేననీ, సినిమాను సినిమాలాగే చూడాలనీ చెప్పగల ఔదార్యంతో వ్యవహరించడంలేదు. కలెక్షన్ల విషయంలో కూడా తమ హీరో సినిమాలే రికార్డులు సృష్టించాడని ఫ్యాన్స్ అసోసియేషన్లు పోటీ పడుతూ పత్రికలకెక్కుతున్న పరిస్ధితి కూడా నెలకొని ఉంది. వీరంతా సామాజిక బాధ్యతను గుర్తెరగకుండా డబ్బు సంపాదన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. హీరోల దగ్గర్నుండి, దర్శకులు, నిర్మాతలవరకూ సినిమాలు సమాజంపైన ముఖ్యంగా పసి మనసులపైన పడవేస్తున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం బాగా కనిపిస్తోంది.
సినిమాలలో చూపించేది కేవలం రొమాన్స్, అది నిజం కాదు అని ఓ సారి సినిమా హీరో అజయ్ దేవ్‌గన్ అన్నాడు. దాన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేదు.
cinema prabavam nedu ekkuvaga vundi. idi maroka udaaharana.
http://praveensarma.in/movies-train-criminals