జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు


జగన్ వర్గానికి చెందిన రౌడీల బాధ పడలేకున్నామని పులివెందుల డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వృత్తిని చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై రౌడీయజానికి పాల్పడిన జగన్ వర్గ రౌడీలపై చర్యలు తీసుకోవాలనీ లేదంటే తమని అక్కడి ఆసుపత్రినుండి బదిలీ చేయాలనీ వారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కడప ప్రెస్ క్లబ్ లో పత్రిల సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్లు వృత్తి నిర్వహించడంలో తమ అసహాయతను వ్యక్తం చేసారు. పులివెందుల పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన దివాకర్ అనే వ్యక్తిని కొనఊపిరితో 108 సేవల ద్వారా చేర్చారనీ, వైద్యం చేస్తుండగానే అతను మరణించాడనీ వారు తెలిపారు. అయితే, జగన్ వర్గ గూండాలు దివాకర్ మృతికి తామే బాధ్యులమని ఆరోపిస్తూ దాడికి దిగారనీ, బూతులు తిడుతూ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారనీ ఆరోపించారు. ఒ.పి విభాగంలో ఆద్దాలు ధ్వంసం చేశారనీ, సిబ్బందిని బెదిరించి భయ భ్రాంతులకు గురి చేశారనీ ఆరోపించారు.

రోగికి మెరుగైన చికిత్స చేయడానికే తాము ప్రయత్నిస్తామనీ, కాని ప్రాణాలు కాపాడడం పూర్తిగా డాక్టర్ల చేతిలో ఉండదన్న విషయాన్ని గుర్తించాలని వారు కోరారు. సుధాకర్ మృతి విషయంలో విచారణ జరిపించుకోవచ్చుననీ, తమ తప్పు ఉన్నట్లు తేలితే తాము వైద్య వృత్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు ప్రకటించారు. తమపై దాడులకు పాల్పడినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పులివెందుల లో వైద్య వృత్తి చేయాలంటే భయంగా ఉందనీ, తమను బదిలీ చేసి, విముక్తి చేయాలనీ డాక్టర్లు పత్రికల సమావేశంలో కోరారు.

తండ్రి మరణానికి తట్టుకోలేక మరణించినవారిని ఓదార్చే పేరుతో రాష్ట్రం అంతటా ఎడతెగని పర్యటనలు చేస్తున్న జగన్మోహన రెడ్డి తన అనుచరగణం వల్ల బాధితులైన వారిని కూడా ఓదార్చడానికి మరొక యాత్ర తలపెడితే బాగుంటుంది. ఆ యాత్ర పులివెందుల నుండే ప్రారంభించవలసిన అవసరాన్ని పులివెందుల ఆసుపత్రి డాక్టర్లు ఎత్తి చూపారు. హృదయ విదారకమైన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటున్న జగన్ పుత్ర హృదయం సంగతి రాష్ట్ర ప్రజలకు ఓ భారంగా పరిణమించగా, ఆయన ఇలాకాలోని రౌడీలు పులివెందుల ఉన్నది ప్రజాస్వామ్యం కాదనీ, రౌడీ రాజ్యం మాత్రమేననీ చాటి చెబుతున్నారన్నమాట!

One thought on “జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు

వ్యాఖ్యానించండి