‘లోకాయుక్త’పై సుప్రీంకి మోడి ప్రభుత్వం


గుజరాత్ రాష్ట్ర లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని త్వరలో సుప్రీం కోర్టు తలుపు తడతామని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గుజరాత్ హై కోర్టు తన మెజారిటీ తీర్పు ద్వారా లోకా యుక్త నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. గుజరాత్ గవర్నర్ కమ్లా బేనివాల్ గత సంవత్సరం ఆగష్టులో రిటైర్డ్ జడ్జి ఆర్.ఎ.మెహతాను లోకాయుక్తగా నియమించింది. ఈ నియామకం చెల్లదంటూ నరేంద్ర మోడి ప్రభుత్వం మరుసటి రోజే హై కొర్టుని ఆశ్రయించింది. ఇద్దరు జడ్జిల డివిజన్ బెంచిలో డివిజన్ తీర్పు రావడంతో మూడవ జడ్జికి పిటిషన్ ను రిఫర్ చేశారు. మూడవ జడ్జి గవర్నర్ నియామకాన్ని సమర్ధించడంతో అంతిమ తీర్పు వెలువడింది.

హై కోర్టు తీర్పును గుజరాత్ ప్రభుత్వం స్వాగతిస్తూనె తాను లేవనెత్తిన రెండు ప్రధాన అంశాలకు సమాధానం రాలేదని వ్యాఖ్యానించింది. “హై కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. కాని మేము లేవనెత్తిన అంశాలు అలాగే ఉన్నాయి. న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీం కోర్టుకి వెళ్తాము” అని గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధి ఆరోగ్య మంత్రి జై నారాయణ్ వ్యాస్ తెలిపాడు.

“మేము హై కోర్టు ముందు రెండు అంశాలు లేవనెత్తాం. ఒకటి: ముఖ్యమంత్రి, ఛీఫ్ జస్టిస్ ల మధ్య సంప్రతింపుల ప్రక్రియ అప్పటికింకా ముగియలేదు. ముఖ్యమంత్రి ఈ అంశంపైన ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. రెండవ అంశం: రాజ్యాంగం అందించిన అవకాశాలను ఈ అంశం తడుముతోంది. రాజ్యాంగ అవకాశాలకు బైట పని చేయడానికి గవర్నర్ లను అనుమతించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయడం కష్టంగా మారుతుంది” అని వ్యాస్ తెలిపాడు.

“ఫెడరల్ నిర్మాణం భద్రంగా కాపాడడంలో మా అప్పీలు మౌలికమైనది. గవర్నరు కార్యాలయం పైన రాజ్యాంగం విధించిన నిబంధనలను, కట్టుబాట్లను గవర్నరు నిర్ణయం ఉల్లంఘించింది కనుక భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలకు ఇది కేంద్ర అంశం కూడా” అని వ్యాస్ తెలిపాడు. తామెన్నడూ లోకాయుక్త నియామకాన్ని వ్యతిరేకించలేదని వ్యాస్ గుర్తు చేశాడు. ఎనిమిది సంవత్సరాల పాటు లోకాయుక్త ను నియమించకుండా, గవర్నరు నియమించాక, ఆ నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టుకి వెళ్ళినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం లోకాయుక్త నియామకాన్ని వ్యతిరేకించలేదని చెప్పడం ఆశ్చర్యం. 

గవర్నరుకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన రాజకీయ ప్రచారానికి హై కోర్టు తీర్పు ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఐతే గవర్నర్ పాల్పడిన ఇతర చర్యలు కూడా తమ ప్రచారంలో ఉన్న విషయం గుర్తించాలని వ్యాస్ కోరాడు. లోకాయుక్త నియామకంతో పాటు తమ రాజకీయ ప్రచారంలో ఇతర అంశాలు ఇమిడి ఉన్నాయని వ్యాస్ తెలిపాడు. రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపడం,  గవర్నర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యాలయంగా మార్చడం కూడా తమ ప్రచారంలో ఉన్నాయని వ్యాస్ తెలిపాడు. ఐతే బిల్లులను వెనక్కి పంపే అధికారం గవర్నర్ కి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. గవర్నర్ కార్యాలయానికి అన్ని పార్టీల వారూ వచ్చే అవకాశం ఉన్నందున అది కాంగ్రెస్ కార్యాలయంగా మారిపోయిందన్న ఆరోపణ కూడా రాజకీయ ఆరోపణలాగే చూడవలసి ఉంటుంది.

భారత పాలకవర్గాల కుళ్ళు రాజకీయాల మసి అంటని పవిత్ర కార్యక్రమం ఈ దేశంలో ఏముంది గనక?

2 thoughts on “‘లోకాయుక్త’పై సుప్రీంకి మోడి ప్రభుత్వం

  1. రాజ్యాంగం మీద అంత ప్రేమున్నోల్లు, రాజ్యాంగ పదవైన లోకాయుక్తను నియమించకుండా ఇన్నేల్లు ఎందుకు ఖాలీగా ఉంచినట్లో. మోడీని మించిన నిజాయితీపరులు ఎవరూ ఆ పదవికి దొరకలేదేమో..

  2. మోడీ నిజాయితీపరుడనేది కోర్పరేట్ మీడియా సృష్టించిన పుకారే తప్ప ఇంకొకటి కాదు. మోడీ గ్లోబలైజేషన్‌ని బలంగా సమర్థిస్తున్నాడు కాబట్టి కోర్పరేట్ మీడియా మోడీని నిజాయితీపరుడిగానే ప్రచారం చేస్తుంది. అలాగే మన్మోహన్ సింగ్ నిజాయితీపరుడనీ, అతని వెనుకాల పని చేసే మంత్రులు మాత్రమే అతనికి చెడ్డ పేరు తెచ్చారనీ ప్రచారం చేసే మీడియా కూడా ఉంది. కోర్పరేట్ మీడియా దృష్టిలో ఒక నాయకుడు గ్లోబలైజేషన్‌ని ఎంత బలంగా సమర్థిస్తే అతను అంత తక్కువ అవినీతిపరుడు అవుతాడు. విచిత్రమేమిటంటే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించే అన్నా హజారే మోడీని నిజాయితీపరుడిగా నమ్మెయ్యడం.

వ్యాఖ్యానించండి