రాజీనామాకి సిద్ధపడ్డ పాక్ ప్రధాని గిలాని


న్యాయ వ్యవస్ధ నుండి ఎదురవుతున్న ఒత్తిడితో ప్రధాని పదవికి రాజీనామా చేయడాని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని సిద్ధపడ్డాడు. కోర్టుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించినందుకు గానూ ‘కోర్టు ధిక్కార నేరం’ విచారణ కోసం బుధవారం తన ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు సమన్లు జారీ చెయ్యడంతో పాక్ ప్రధాని తాజా ప్రతిపాదన చేశాడు.

పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ పై నమోదైన అవినీతి కేసులను గత ముషర్రాఫ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణలో పాక్ సహకారం కొనసాగేందుకు వీలుగా తన ప్రయోజనాల కోసం అమెరికా ఈ ఒప్పందం కుదిర్చింది. దాని ప్రకారమ్ అసిఫ్ పైన ఉన్న మనీ లాండరింగ్ కేసుల విషయంలో అప్పటి అధ్యక్షుడు ముషార్రఫ్ క్షమా భిక్ష ప్రసాదించాడు. ఈ క్షమా భిక్ష చెల్లదని పాక్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేసులు తిరిగి తెరవాలంటూ స్విస్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వవలసి ఉండగా ప్రధాని అందుకు నిరాకరించాడు. అధ్యక్షుడికి రాజ్యంగ రీత్యా రక్షణ ఉంటుందని ఆయన వాదించాడు.

దీనిని కోర్టు ధిక్కారంగా సుప్రీం కోర్టు పరిగణీంచింది. ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనీ, ఆయన ప్రజల కంటె ఆయన పార్టీకే ఎక్కువ జవాబుదారీగా ఉన్నాడనీ, ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన హామీకి ఇది విరుద్ధమనీ, కనుక ప్రధాని గిలానీ నిజాయితీపరుడు కాదనీ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కారం కేసులో కోర్టుకు హాజరై వివరణ వివ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ నేరం రుజువైతే గిలానీ ప్రధానీ వదులుకోవడమే కాక మరో ఐదు సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధానికి గురవుతాడు.

కోర్టు సమన్లతో పాక్ లొ రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా పదవికి రాజీనామా చెయ్యడానికి గిలాని సిద్ధపడక తప్పలేదు. గిలానీ రాజీనామా ఖాయం ఐతే, ఆయన పార్టీ కి చెందిన నాయకుడు కమర్ జమన్ కైరా, మత వ్యవహారాల మంత్రి కుర్షీద్ షా, పాలకపార్టీ మిత్ర పార్టీ పి.ఎం.ఎల్-క్యూ నాయకుడు చౌదరి పెర్వేజ్ ఎలాహి లు తదుపరి ప్రధానిగా నియమించబడవచ్చని ‘ది హిందూ’ తెలిపింది.

ప్రభుత్వ హక్కులను, అధికారాన్నీ నొక్కి చెప్పే ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పైన వస్తున్న ఒత్తిడిని అధిగమించడానికి గిలానీ రాజీనామా ఒక మార్గంగా పాలక పార్టీ పి.పి.పి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మిలట్రీతోనూ, ఇటు న్యాయ వ్యవస్ధతోనూ ఘర్షణ తీవ్రమవుతున్న నేపధ్యంలో గిలానీ రాజీనామా పరిస్ధితులను తేలికపరచవచ్చని వారు ఆశిస్తున్నారు.

అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ అమెరికా రాసినట్లుగా చెప్పబడుతున్న మెమో పైన కూడా విచారణ జరపాలని మిలట్రీ సుప్రీం కోర్టును కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. ఒసామా బిన్ లాడెన్ హత్య నేపధ్యంలో పాక్ మిలట్రీ పౌర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడవచ్చనీ, అది జరిగితే అమెరికా తనకు సాయం చేయాలని అసిఫ్ మెమో లో కోరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

వ్యాఖ్యానించండి