
ప్రజాస్వామిక సంస్కరణల కోసం ప్రజలు గత సంవత్సర కాలంగా ఉద్యమిస్తున్న యెమెన్ దేశంలో ఆల్ ఖైదా ఓ పట్నం వశం చేసుకున్నట్లు వార్తా సంస్ధలు వెల్లడించాయి. యెమెన్ రాజధాని సనా కు దక్షిణాన వంద మైళ్ల దూరంలో ఉన్న రడ్డా పట్నాన్ని ఆల్ ఖైదా మిలిటెంట్లు తమ వశంలోకి తెచ్చుకున్నారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. యెమెన్ ప్రభుత్వ బధ్రతా బలగాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వార్తా సంస్ధలు ప్రచురించాయి.
పట్టణంలో కాపలాగా ఉన్న సైనిక బలగాలపై ఆల్ ఖైదా మిలిటెంట్లు విరుచుకుపడ్డారనీ, అక్కడే ఉన్న జైలు బద్దలు కొట్టి అనేకమంది ఖైదీలను విడుదల చేశారనీ ఫాక్స్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం బలహీనతను ఆసరాగా చేసుకుని ఆల్ ఖైదా తన బలం పెంచుకుంటోందని తెలుస్తోంది. పెద్ద ఎత్తున చెలరేగిన తిరుగుబాటును అణచివేయడంలో యెమెన్ అధ్యక్షుడు విఫలం అవుతున్నాడని ఫాక్స్ న్యూస్ వార్తా సంస్ధ బాధను వ్యక్తం చేస్తోంది. లిబియా, సిరియాల్లో అమెరికా, యూరప్ లు సాయుధంగా సాయపడుతూ తిరుగుబాటు విజయవంతం కావాలని కోరుకుంటున్న ఫాక్స్ న్యూస్ లాంటి వార్తా సంస్ధలు యెమెన్ లో మాత్రం తిరుగుబాటును అణచివేయాలని కోరుతున్నాయి.
ఈ ఘర్షణలో ఇద్దరు సైనికులు చనిపోయారని తెలుస్తోంది.గత వారాంతంలో రడ్డా ను చుట్టుముట్టిన మిలిటెంట్లు ప్రాచీన కోట, బడి, మసీదులతో సహా అనేక మార్గాల ద్వారా పట్నంలోకి చొచ్చుకెళ్ళారని తెలుస్తోంది. 150 నుండి 200 వరకూ ఖైదీలను విడుదల చేశారనీ అందులో ఆల్ ఖైదా మిలిటేంట్లు కూడా ఉన్నారనీ ప్రభుత్వాధికారి ఒకరిని ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ తెలిపింది. విడుదల చేయబడిన ఖైదీల్లో కొంతమందికి మిలిటెంట్లు ఆయుధాలిచ్చి తమలో కలుపుకున్నారని ప్రభుత్వాధికారి చెప్పిన సంగతిని ఫాక్స్ న్యూస్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ అధికారి పేరు చెప్పడానికి నిరాకరించాడని కూడా చెప్పింది.
దక్షీణాన ఉన్న రాష్ట్రాల్లో మిలిటెంట్లు చురుకుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ రాష్ట్రాలకు వెళ్ళడానికి బయ్డా రాష్ట్రంలోని రడ్డా కీలకమైన పట్నమని తెలుస్తోంది. అబ్యాన్ రాష్ట్రం లోని విశాలమైఅన్ భూభాగాన్ని ఇప్పటికే మిలిటెంట్లు వశం చేసుకున్నారని తెలుస్తొంది. మిలిటెంట్లు రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్లు, ఆటోమేటిక్ రైఫిళ్ళు లాంటి ఆయుధాలు ధరించి ఉన్నారని అసొసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఆల్ ఖైదాకి చెందిన నల్ల బ్యానర్ ని మసీదు పైన ఉంచినట్లుగా స్ధానికులు చెప్పారని ఎ.పి విలేఖరి తెలిపాడు. సోమవారం జరిగిన దాడిలో పాల్గొన్న మిలిటెంట్ల సంఖ్య రెండొందల వరకూ ఉండొచ్చని భద్రతా బలగాలను ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ తెలిపింది.
ఆల్ ఖైదా మిలిటెంట్ల విస్తరణకి యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే ని అక్కడి ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. ప్రతిపక్షాలతో కుదిరిన ‘అధికార మార్పిడి ఒప్పందాన్ని’ బలి చేయడానికి అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దక్షీణ యెమెన్ లో తిరుగుబాటు చెలరేగడానికి పరోక్షంగా అనుమతించి తద్వారా తిరుగుబాటు అణచివేయాలంటే తాను అధికారంలో కొనసాగడం తప్పనిసరి అని వాదించడానికి సిద్ధపడుతున్నాడని అవి ఆరోపించాయి. 1978 నుండి సలే యెమెన్ లో అధికారం అనుభవిస్తున్నాడు.
యెమెన్ నియంత అబ్దుల్లా సలే ను అమెరికా తన అనుంగు మిత్రుడుగా చేసుకుంది. ముప్ఫై సంవత్సరాలకు పైగా యెమెన్ ప్రజలు నియంతృత్వ పాలనలో మగ్గినప్పటికీ అమెరికాకి అక్కడ ప్రజలకు ప్రజాస్వామ్యం కావాలని గుర్తుకు రాలేదు. పైగ తన అడుగులకు మడుగులొత్తినందుకు సౌదీ అరేబియా ద్వారా పెద్ద ఎత్తున ధన, ఆయుధ సహాయాలను అందించింది. సో కాల్డ్ టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలోనూ యెమెన్, అమెరికాకి మిత్ర దేశమే. సలే గద్దె దిగాలని గత సంవత్సరం అమెరికా కోరినప్పటికీ అతనికి సహకారం అందించడం ఆపలేదు. సిరియాలో అద్దె విప్లవకారులను దించి సాయుధ కుట్రకు సహాయం చేస్తున్న అమెరికా సలే నియంతృత్వాన్ని కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది.