యూరప్ ‘బెల్ట్ టైటెనింగ్’ -కార్టూన్


యూరో జోన్ దేశాలన్నీ ఖచ్చితమైన ఫిస్కల్ ఆర్ధిక విధానాలను కఠినంగా అమలు చేయాలని, తద్వారా మాత్రమే యూరోజోన్ సంక్షోభం సమసిపోతుందనీ జర్మనీ గత మూడేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ తొ కలిసి కఠిన మైన పొదుపు ఆర్ధిక విధానాలను యూరో దేశాలపై వారు బలవంతంగా అమలు చేయడమే కాక తమ దేశాల ప్రజలపైన కూడా అమలు చేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఇతర వృత్తులలో ఉన్న అనేక తరగతుల ఆదాయ మార్గాలన్నింటిపైన దాడి చేయడమే వారు ఎంచుకున్నమార్గం. వేతనాల కోత, సంక్షేమ సదుపాయాల రద్దు, ఉద్యోగాల కోత, పన్నుల పెంపు, ఆరోగ్య భీమా సహాయం తగ్గింపు లాంటి చర్యలతో ప్రజలను వారు వేధిస్తున్నారు. మరోవైపు బ్యాంకులు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు బడా ద్రవ్య కంపెనీలకు మాత్రం మరిన్ని పన్ను రాయితీలను కల్పిస్తూ, ఉన్న పన్నులను రద్దు చేస్తున్నారు.

ఈ చర్యల ద్వారా ప్రజల జేబులనుండి కంపెనీల జేబులకు మరిన్ని లాభాల రూపంలొ ఆదాయాలను వారు తరలిస్తున్నారు. గ్రీసు, పోర్చుగల్, ఐర్లండు దేశాల రుణ సంక్షోభాలను చూపి అక్కడ కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేయించడమే కాక, ఆదేశాలను చూపి తమ దేశాల్లో కూడా ప్రజావ్యతిరేక విధానాలను అవి అమలు చేస్తున్నాయి. గ్రీసు, పోర్చుగల్, ఐర్లండు, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ దేశాల్లో ఈ విధానలపై ప్రజలు ఉద్యమిస్తున్నారు కూడా. వీటన్నింటినీ ఆర్ధిక పండితులు, ఆర్ధిక విశ్లేషకులు, పత్రికా సంస్ధలు ‘బెల్ట్ టైటెనింగ్’ గా ప్రస్తావిస్తున్నాయి. అంటే ప్రజల కడుపుల్లోకి ఎక్కువ ఆహారం పోకుండా వారి బెల్ట్ లను టైట్ చేయడం అన్నమాట. ఆకలి తీర్చడానికి బదులు ఆకలినే కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలివి. వారి పొట్టలకు తగిన ఆహారాన్ని సమకూర్చడానికి బదులు కడుపులనే టైట్ చేసే కుటిల ఎత్తుగడ అన్నమాట! తద్వారా ప్రభుత్వ బడ్జెట్లలో మరింత భాగాన్ని ప్రజాపద్దుల నుండి తరలించి కంపెనీలకు ఇచ్చే రాయితీలకు ఖర్చుపెట్టడం వారి విధానం. వీటినే “బెల్టు టైటెనింగ్” విధానాలని పత్రికలు ప్రస్తావిస్తున్నాయి.

Belt tightening

One thought on “యూరప్ ‘బెల్ట్ టైటెనింగ్’ -కార్టూన్

వ్యాఖ్యానించండి