కోల్ కతా ఆసుపత్రుల దుర్మార్గం


కోల్ కతా ప్రవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి అనేకమంది రోగులు మరణించిన ఘటన మరవక ముందే మరో దుర్మార్గం జరిగింది. ఈ సారి దుర్మార్గం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వంతయ్యింది. నిండు గర్భిణితో వచ్చిన ఓ స్త్రీని ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో ఆమె ఒక్కో ఆసుపత్రి బయట ఒక్కొక్క బిడ్డను ప్రసవించి ప్రాణాలు విడిచింది.

కోల్ కతా లో ఆసుపత్రుల దుర్మార్గం వెల్లడిస్తూ గత కొద్ది రోజుల్లోనే జరిగిన ఘటనల్లో ఇది రెండవది. తమ వద్దకు ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీని ఒక ఆసుపత్రి తమ వద్ద కాదంటూ మరొక ఆసుపత్రికి వెళ్లమన్నారు. అప్పటికే నొప్పులతో బాధపడుతున్న ఆమె ఆ అసుపత్రి ఎదుటే ఫుట్ పాత్ పైన ఒక బిడ్డను ప్రసవించింది. అక్కడే ఉన్న ఆమె భర్త హడావుడిగా రెండో ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ వారు కూడా తిరిగి మొదటి ఆసుపత్రికే వెళ్లమని తిప్పి పంపారు. నిస్సహాయ స్ధితిలో ఉన్న ఆ మహిళ రెండో ఆసుపత్రి ఎదుట రెండో బిడ్డను ప్రసవించింది.

స్త్రీకి “మొదటి ప్రసవం సవ్యంగా జరిగితే పునర్జన్మ పొందినట్లే” అని చెబుతారు. కాని కోల్ కతా ప్రభుత్వాసుపత్రుల దుర్మార్గానికి ఉషాదేవి కి ఆ ‘పునర్జన్మ’ పత్తా లేకుండా పోయింది. అప్పటికే అలసిపోయి ఉన్న ఉష ప్రాణం అనంతవాయువుల్లో కలిసి పోయింది. పుట్టిన పిల్లలిద్దరూ తల్లిలేని పిల్లలుగా మిగిలారు. పిల్లల పరిస్ధితి కూడా సీరియస్ గానే ఉందని ఎన్.డి.టి.వి తెలిపింది.

ఉషా దేవి కోల్ కతా లో ఒక మురికివాడలో ఉంటోంది. గురువారం రాత్రి నుండే ఆమెకు నెప్పులు మొదలయ్యాయి. ఆమె భర్త ఆమెను చిత్తరంజన్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆ ఆసుపత్రి ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించింది. మరో ప్రభుత్వాసుపత్రి శంభూనాధ్ ఆసుపత్రికి వెళ్ళాల్సిందిగా పంపేసింది. అప్పటికే నెప్పులు తీవ్రమై చిత్తరంజన్ ఆసుపత్రి ముందే ఉష మొదటి బిడ్డను ప్రసవించింది. ఐనా తేరుకున్న భర్త ఆమెను తన భార్యను హడావుడిగా శంభూనాధ ఆసుపత్రికి తీసుకెళ్ళినా అక్కడా డాక్టర్లు యమభటులుగా దర్శనం ఇచ్చారు. తిరిగి మొదటి ఆసుపత్రికె వెళ్లమని తిప్పిపంపడంతో మరో బిడ్డను రెండో ఆసుపత్రి ముందు ప్రసవించి కొద్ది సేపటికి చనిపోయింది.

కవల పిల్లలిద్దరి ఆరోగ్య పరిస్ధితి క్లిష్ణంగా ఉందని తెలుస్తోంది. రెండు ఆసుపత్రులూ దక్షిణ కోల్ కతా నియోజకవర్గంలోనే మూడు కి.మీ దూరంలో ఉన్నాయి. దక్షిణ కోల్ కతా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రాణాలు పోయడానికి ప్రయత్నించవలసిన డాక్టర్లు ఇంత దుర్మార్గంగ ఎలా వ్యవహరించగలరన్నదీ అర్ధం కావడం లేదు. ప్రసవానికి మంత్రసానులపై ఆధారపడకుండా ఆసుపత్రులలో డాక్టర్లను నమ్ముకోండి అని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. డాక్టర్ల దుర్మార్గాలేమో ఇలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఇలాంటివి జరగకుండా చూడగలవన్న నమ్మకం ఉంచగలమా?

వ్యాఖ్యానించండి