ప్రధాని జిలాని గౌరవనీయుడు కాడు, తేల్చేసిన పాక్ సుప్రీం


ఇండియా, పాక్ లలో రాజకీయ నాయకులను కోర్టులు చెడుగుడు ఆడేస్తున్నాయి. ఎ.రాజా, గాలి జనార్ధన్ తదితరులను అవినీతి ఆరోపణలపై జైలుకి పంపిన భారత కోర్టులు ఇంకా జగన్, దయానిధి తదితరులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి విదితమే. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై సుప్రీం కోర్టుకి ఇచ్చిన హామీలను గౌరవించకుండా పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ‘గౌరవనీయుడు కాద’ ని అక్కడి సుప్రీం కోర్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. ప్రధాని జిలానికి ‘నిజాయితీ లేదని’ కోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని ఛెండాడింది.

మాజీ పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త, ఇప్పటి అధ్యక్షుడు, అసిఫ్ అలీ జర్దారీ గతంలో అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. మిలట్రీ ప్రభుత్వాలు అతన్ని ఆ ఆరోపణలపైనె సంవత్సరాల తరబడి జైల్లో ఉంచాయి. ఆయన అవినీతి కేసులపైన విచారణ జరగకుండా ముషార్రఫ్ నేతృత్వంలోని క్షమా భిక్షను ప్రసాదించింది. అప్పట్లో అమెరికా కుదిర్చిన ఒప్పందం ఇది. అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధంలో పాక్ మద్దతు కోసం పాక్ రాజకీయ, సైనిక నాయకుల మధ్య అనేక సర్దుబాట్లు చేసింది. అటువంటి సర్దుబాట్లలో భాగంగా అసిఫ్ ఆలీ జర్దారీ పైన ఉన్న అవినీతి కేసులపైన విచారణ జరగకుండా క్షమా భిక్ష పెడుతున్నట్లుగా ముషార్రఫ్ ప్రకటించింది.

ముషార్రఫ్ సైనిక పాలనలో సుప్రీం కోర్టుకీ సైనిక ప్రభుత్వానికి పెద్ద ఘర్షణ జరిగింది. సుప్రీం కోర్టు జడ్జి ఇఫ్తికార్ జడ్జితో పాటు ఆ సమయంలో ఉన్న సుప్రీం బెంచి మొత్తాన్ని ముషార్రఫ్ రద్దు చేసి కోర్టులతో వైరం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ముషార్రఫ్ ప్రభ ముగిసాక అతని నిర్ణయాలను సుప్రీం కొన్నింటిని తిరగదోడింది. అందులో భాగంగా జర్దారీ కి ఇచ్చిన క్షమా భిక్ష చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ ఆయనపై కేసులను తిరగదోడాలని ఆదేశాలు ఇచ్చింది. జర్దారీపై అవినీతి కేసులు తిరిగి తెరవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గిలాని నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేయనందుకు సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని తూర్పారబడుతోంది.  ఐదుగురు సభ్యుల సుప్రీం బెంచి గిలానీని గౌరవనీయుడు కాని వ్యక్తి గా నిజాయితీ లేని వ్యక్తిగా ప్రకటించి సంచలనం సృష్టించింది. దానితో పాకిస్ధాన్ లొ రాజకీయ వేడి ఒక్కసారిగా రగులుకుంది.

ప్రధాని తన రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు తప్ప తాను రాజ్యాంగ బద్ధంగా చేసిన ప్రమాణానికి బద్ధుడిగా లేడని బెంచి ప్రకటించింది. ‘ప్రాధమిక ఆధారాల ప్రకారం, ప్రధాన మంత్రి నిజాయితీపరుడు కాదు. రాజ్యాంగ ప్రతిజ్ఞను ఆయన ఉల్లంఘించాడు’ అని బెంచి ప్రకటించింది. జర్దారీకి వ్యతిరేకంగా ఉన్న మనీ లాండరింగ్ కేసులను తిరిగి తెరవాలని స్విట్జర్లాండ్ అధికారులకు లేఖ రాయవలసి ఉండగా ప్రధాని గిలాని అందుకు తిరస్కరించాడు. ఈ తిరస్కరణ రాజ్యాంగానికీ, ఖురాన్ కీ వ్యతిరేకమని కోర్టు ప్రకటించింది. బెంచి ప్రభుత్వానికి ఆరు ఆప్షన్ లను ఇచ్చింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ నేరానికి ఆయనపై చర్యలు తీసుకోవడం కూడ అందులో ఒకటి. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని భావిస్తే ఆయన ఐదు సంవత్సరాల పాటు ఎం.పి గా ఉండడానికి అనర్హుడు అవుతాడు. కేసును బెంచి ఛీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి కి సమర్పిస్తూ పెద్ద బెంచికి అప్పగించాలని సిఫారసు చేసింది. తదుపరి హియరింగ్ లో అటార్నీ జనరల్ ప్రభుత్వ అభిప్రాయాలని చెప్పాలని కోరింది.

2009లో పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్, జర్దారీకి మరో ఎనిమిది వేలమందికీ ‘నేషనల్ రీకన్సిలేషన్ ఆర్డినెన్స్’ ద్వారా లబ్ది చేకూర్చింది. ఎన్.ఆర్.ఓ ను రద్దు చేసిన సుప్రీం కోర్టు అప్పటినుండీ స్విస్ అధికారులకు ఉత్తరం రాసి జర్దారీ పైన కేసులు తిరిగి తెరవాలని కోరాలని ఆదేశాలిచ్చింది. ఇది చేయడానికి గిలానీ నిరాకరిస్తూ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడుగా జర్దారీ కి ప్రాసిక్యూషన్ నుండి రక్షణ (ఇమ్యూనిటీ) ఉన్నదని వాదించాడు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతవరకూ ప్రభుత్వం స్విస్ ప్రభుత్వానికి లేఖ రాయదని గత వారమే జర్దారీ ప్రకటించాడు.

ఒసామా బిన్ లాడెన్ ను పాక్ భూభాగంపై దాడి చేసి మరీ అమెరికా కమెండోలు చంపాక పాక్ ప్రజల్లో నిరసనలు రేగాయి. పాక్ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించినా సైన్యం ఏమీ చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పాక్ సైన్యం కుట్ర చేసి జర్దారీ ప్రభుత్వాన్ని కూల్చి వేయవచ్చనీ, అదే జరిగితే అమెరికాయే తమను ఆదుకోవాలని కోరుతూ జర్దారీ అప్పటి అమెరికా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కి మెమో రాశాడని అమెరికా పత్రికలు వెల్లడించడంతో సదరు మెమో వ్యవహారంపై విచారణ జరపాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. మెమో పై విచారణ, అమెరికా పనుపున జర్దారీకి ఇచ్చిన క్షమా భిక్ష రద్దు చేసి తిరిగి కేసుల పెట్టాలని చేస్తున్న ఒత్తిడి రెండూ కూడా పాక్ లో అమెరికా పలుకుబడిని పలచబరిచేవే. అందువలన పాక్ రాజకీయ నాయకుల అవినీతి పై కోర్టులు ప్రకటించిన యుద్ధం, పాక్ లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా కోర్టులు ప్రకటించిన యుద్ధంగా మారిపోయింది. అందుకే పాక్ కోర్టులు అక్కడి రాజకీయ నాయకుల అవినీతి పై తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలవిగా మారాయి.

వ్యాఖ్యానించండి