రాజస్ధాన్ లో రాష్ట్ర మంత్రి చేతుల్లో హత్యకు గురైన నర్సు భన్వరీ దేవి శవం ఆనవాళ్ళు ఎట్టకేలకు లభ్యమైనట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరుడి ఆదేశాల మేరకు భన్వరీ దేవిని చంపిన దుండగులు ఆమెను ముప్ఫై అడుగుల లోతు గల గొయ్యిలో తగులబెట్టారని సి.బి.ఐ కనుగొన్నట్లు తెలుస్తోంది. శవాన్ని దహనం చేసిన అనంతరం మిగిలిన శరీర భాగాలను సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ కెనాల్ లో కలిపినట్లు తెలుస్తోంది. భన్వరీ దేవి సెప్టెంబరు 1 తేదీన బిలాడా నుండి అదృశ్యం అయింది. ఇది జైపూర్ కి రెండొందల కిలో మీటర్ల దూరంలో ఉంది.
భన్వరీ దేవి కేసు సి.బి.ఐ కి అప్పగించాక కేసులో పురోగతి కనిపించింది. భన్వరి దేవి మరణానికి కారకులైన ఇద్దరు కీలక వ్యక్తులను బుధవారం అరెస్టు చేశాక ఆమెను దహనం చేసిన స్ధలం ఎక్కడో తెలిసింది. ముఠా నాయకుడు భిష్ణ రాం, అతని అనుచరుడు కైలాష్ జాఖర్ లు రాజస్ధాన్ రాష్ట్ర మంత్రి అనుచరుడి నుండి ఆదేశాలు అందుకుని హత్యకు పాల్పడ్డారు. హత్యానంతరం భన్వరీ దేవి చనిపోయిన ఆనవాళ్ళేమీ మిగలకుండా వారు జాగ్రత్త తీసుకున్నారు. దాంతో పరిశోధన కష్టంగా మారింది. శవాన్ని దహనం చేసిన స్ధలం తెలిసినప్పటికీ అక్కడే శవదహనం జరిగిందని రుజువు చేయవలసి ఉంది. ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా మాత్రమే ఇది సాధ్యం అయ్యే వీలుంది.
రాజస్ధాన్ రాష్ట్ర మంత్రి మహీపాల్ మాదేర్నా సన్నిహిత సహచరుడు, రాజకీయ నాయకుడు అయిన సాహిరాం విష్ణోయ్ భన్వరీ దేవి హత్యకు పురికొల్పాడు. ఇప్పటివరకూ పన్నెండు మందిని అరెస్టు చేసినప్పటికీ బుధవారం జరిగిన ఇరువురి అరెస్టు తోనే దహన స్ధలం తెలిసింది. మహీపాల్ మాదేర్నాతో అక్రమ సంబంధం ఉన్న భన్వరీ దేవి వారి సంబంధం తాలూకు సి.డి తో మంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ఆమెను హత్య చెయ్యడానికి మాదెర్నా పూనుకున్నాడు. మాదేర్నా, సాహిరాం ఇరువురూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.
మాదేర్నాకు మాల్ఖన్ సింగ్ అనే వ్యక్తి భన్వరీ దేవిని పరిచయం చేసినట్లు తెలుస్తోంది. భన్వరీ దేవి అదృశ్యమయ్యాక మాదెర్నా ఆమెతో ఉన్న సి.డి లు వెల్లడి కావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. భన్వరీ దేవి చివరి సంతానం మాల్ఖన్ సింగ్ వల్ల కలిగినదా కాదా అని సి.బి.ఐ డి.ఎన్.ఎ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. భన్వరీ భర్త అమర్ చంద్ కూడా భన్వరీ హత్యలో భాగస్వామి అని సి.బి.ఐ పరిశోధనలో తేలింది. హత్య జరిగిన రోజున ఆమె ఒంటరిగా ప్రయాణించేలా చూడడంలో ఆమె భర్త పాత్ర ఉందనీ, అందుకు అతనికి డబ్బు ముట్టిందనీ సి.బి.ఐ పరిశోధన తేల్చింది.
గత కొన్ని నెలలుగా భన్వరీ దేవి హత్య రాజస్ధాన్ లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.