ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్ళరాదని హజారే నిర్ణయం


ఉత్తర ప్రదేశ్ తో సహా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి వెళ్లరాదని అన్నా హజారే నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అన్నా బృందం కోర్ గ్రూపు సభ్యురాలు కిరణ్ బేడీ గురువారం ప్రకటించింది. అన్నా అనారోగ్యంగా కారణంగా ముందు అనుకున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఆమె తెలిపింది.

“రాష్ట్రాల ఎన్నికల్లో అన్నా ప్రచారం చేయడం లేదు. అన్నా ప్రయాణాలు చెయ్యరు. ఆయన ప్రయాణాలు చెయ్యవద్దని మేమూ కోరాము. ఆయన మళ్ళీ నిరాహార దీక్ష చేయడానికి డాక్టర్లు అంగీకరించడం లేదు. ప్రయాణాల ద్వారా ఆయన శ్రమకు గురికాకూడదని వారు చెబుతున్నారు” అని కిరణ్ బేడి పత్రికలకు తెలిపింది. అన్నా ఆరోగ్యం తమకు ముఖ్యమని ఆమె తెలిపింది. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారే పరిస్ధితులకు ఆయన గురికాకూడదు అని ఆమె తెలిపింది.

పటిష్టమైన లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే మూడవసారి ముంబైలో ప్రారంభించిన నిరాహార దీక్షను రెండవ రోజుకి ముగించిన విషయం తెలిసిందే. దీక్ష ముగిస్తూ అన్నా, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. లోక్ పాల్ బిల్లు తేవడంలో విఫలమైనందుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అన్నా ప్రకటించాడు. జ్వరంతో బాధపడుతుండడం వల్ల మూడు రోజుల దీక్షను రెండవ రోజే ముగించవలసి వచ్చిందని అన్నా బృందం తెలిపింది. అయితే అన్నా దీక్షకు జ్వరం అడ్డు కాదని పత్రికలు అభిభాషించాయి.

అనారోగ్య పరిస్ధితుల రీత్యా ఎన్నికల ప్రచారం లో పాల్గొనరాదని డాక్టర్లు చెప్పడంతో తన కార్యక్రమాలన్నీ అన్నా రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. జనవరి 28 మార్చి 3 మధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తర ఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అన్నా ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ ఆయనకి ఇంకా విశ్రాంతి అవసరమని అన్నా బృందం చెబుతోంది.

అన్నా తన ఆలోచనలను, భావాలను తనకు చెప్పాడనీ, వాటిని త్వరలో అన్నా బృందానికి చెబుతాననీ కిరణ్ బేడీ తెలిపింది. ఆ తర్వాత భవిష్యత్ కార్యక్రమం నిర్ణయిస్తామని ఆమె తెలిపింది.

వ్యాఖ్యానించండి